What is the significance of Mahalaya Paksha?

 What is the significance of Mahalaya Paksha?

శ్రీ గురుభ్యోన్నమః


భాద్రపద మాసంలో వినాయక చవితి మహాపర్వ దినమును నవరాత్రుల ఉత్సవంగా జరుపుకుంటాము కదా! అలాగే బహుళ పక్షంలో వచ్చే విశేషములు గురించి తెలుసుకుందాం.

భాద్రపద శుక్ల పక్షం శుభకార్యములు, పండుగలకు విశేషమైతే ! కృష్ణ పక్షం పితృ కార్యములకు విశేషంగా చెప్పవచ్చు. భాద్రపదమాసంలో వచ్చే అమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు. అమావాస్యలు సంవత్సరమునకు 12 ఉంటాయి ,


మరి భాద్రపద అమావాస్యకు ఇంత విశిష్టత ఎందుకంటే....


పురాణాల ప్రకారం మహాభారతం లోని కర్ణుడి గురించి మనకందరికీ తెలుసు. అతని దాన గుణము గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, అందుకే అతనిని దానవీరసూరకర్ణ అంటారు. అలాంటి కర్ణుడు చనిపోయిన తరువాత .. ఇన్ని దానములు చేసిన పుణ్యాత్ముడు కాబట్టి స్వర్గ లోకమునకు తీసుకెళ్లడానికి దేవదూతలు వచ్చారు, వారితో పాటు కర్ణుడు బయలుదేరాడు. మార్గ మధ్యమమునకర్ణుడికి విపరీతమైన దాహం వేసింది, అటుగా వస్తున్న వర్షపు నీటిని చేతితో పట్టి తాగబోయాడు! అయితే అంతలో ఆనీరు దోసిలిలో బంగారమైపోయింది. ఆశ్చర్యం వేసింది కర్ణుడికి. అలాగే ఆకలి వేసింది.. అటుగా ఉన్న ఫల వృక్షముల దగ్గరకు వెళ్లి పండును కోయగా అది బంగారు పండుగా మారిపోయింది. అలా మార్గ మధ్యమమున ఏది తినడానికి గాని, త్రాగడానికి కానీ వీలులేక ఏది ముట్టుకుంటే అది

బంగారమైపోయింది.

అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్య దేవుని ప్రార్ధించగా సూర్య భగవానుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు కర్ణుడు తన భాధను చెప్పగా అప్పుడు సూర్యుడు ఇలా వివరించాడు. ఓ దానవీరసూరకర్ణా!! నీవు చేతికి ఎముక లేకుండా అష్టైశ్వరములతో సహా, కవచ కుండలాలతో సహా అన్నింటినీ ఎడమచేతితో బాగానే దానం చేసావు. కానీ ఒక్కరోజైనా నీ పితృదేవతలకు తర్పణములు ఇచ్చావా!

ఆబ్దికములు పెట్టావా! అలాగే అన్నసంతర్పణ చేసావా!

భూలోకంలో మనుషులందరూ పిల్లలను కనడానికి కారణం, వారిచే పితృ కార్యములు చేయించుకోవడానికి తద్వారా ముక్తి పొందడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అని చెప్పాడు.

అప్పుడు కర్ణుడు చాలా విపరీతమైన భాధ పడి దేవలోకం చేరుకోగానే ఇంద్రుడిని ఆశ్రయించాడు. ఓ ఇంద్రదేవా నాతప్పు నేను తెలుసుకున్నాను, నన్ను తక్షణమే భూలోకమునకు పంపించండి. నా పితృ వంశస్థులందరికి తర్పణములు, ఆబ్దికములు నిర్వహించుకుని ప్రశాంతంగా మళ్ళీ వస్తాను అని వేడుకొన్నాడు.


స్వర్గం అంటేనే సంతోషం, అంతే గాని సంతోషంగా లేనివాడు స్వర్గంలో ఉన్న నరకమే అని భావించి ఇంద్రుడు కర్ణునికి భూలోకానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే కర్ణుడు భూలోకాన్ని చేరుకున్న రోజు ఈ భాద్రపద బహుళ పాడ్యమి. ఈ భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు తర్పణములు, ఆబ్దికములు, అన్న సంతర్పణలు నిర్వహించి మరల స్వర్గలోకమునకు వెళ్ళిపోతాడు.


సంతోషంగా స్వర్గమునకు వెళ్లినవాడికి ఆకలి, దప్పులు ఉండవు. ఆ మహాదేవుని అనుగ్రహంతో సంతోషంగా స్వర్గమునకు వెళ్ళిపోయాడు. అందువలన అప్పటి నుండి ఈ పదిహేను రోజులు పితృపక్షంగా, మహాలయ పక్షంగా నిర్వహిస్తారు. అందుకే ఎంతదానధర్మములు చేసినప్పటికీ పితృ తర్పణములు, పితృకార్యక్రమములు చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి , సుఖసంతోషములు ఏర్పడతాయి.


అయితే ఇంకొక సందేహం రావచ్చు మీకు .... మేము ప్రతీ సంవత్సరం మా మాతృదేవతలకు, పితృదేవతలకు ఆబ్దికములునిర్వహిస్తామండి. మేము ఇంక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేయాలా!! అనే ప్రశ్న తలెత్తవచ్చు.. తప్పకుండా పెట్టాలి.


ఎందుకంటే మీరు ఆబ్దికం పెట్టినపుడు తండ్రి, తాతగారు, ముత్తాత గారు మూడు తరాలు మాత్రమే వస్తారు. కానీ ఈ మహాలయ పక్షంలో తర్పణములు, ఆబ్దికములు పితృ వంశములో వారందరికీ, అలాగే గురువర్యులకు, సన్నిహితులతో సహా అందరికి పెట్టవచ్చు. దీనివలన వంశస్థులు అందరు సంతృప్తి చెందుతారు. దీనివలన వంశాభివృద్ధి జరుగుతుంది. వివాహం ఆలస్యం అవ్వడం, సంతాన పరమైనదోషములు తొలగుతాయి. గయలో శ్రాద్ధం నిర్వహించినంత ఫలితం సంప్రాప్తిస్తుందని పెద్దల, పండితుల నిర్వచనం.


అందువలన ఈ మహాలయ పక్షంలో పితృకార్యక్రమములు, తర్పణములు చేసుకుని అలా వీలుకాని వారు కనీసం పెద్దవాళ్ళ పేరుతోస్వయంపాకం అయినా ఇచ్చుకుని శక్తీ మేరకు దానధర్మములు నిర్వహించి పితృదేవతలను సంతృప్తి పరచి వారి అనుగ్రహమునకు పాత్రులై పుత్ర, పాత్రాభివృద్ధులై సంతోషంగా జీవించండి.- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121