Items To Donate In Kartika Masam Their Benefits

కార్తీకమాసంలో చేయవలసిన దానాలు? వాటి ఫలం?

 

కార్తీకమాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభిస్తుంది. శివాలయ గోపురద్వారా, శిఖరాలలో గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్నిపాపాలూ అంతరించిపోతాయి. ఎవరయితే కార్తీకమాసంలో శివాలయంలో ఆవునేతితో, విప్ప నారింజ నూనెలతో దీప సమర్పణ చేస్తేవాళ్ళు ధర్మాత్ములు అవుతారు. ఆముదపు దీపాన్ని సమర్పించినవాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు. శివుడికి కార్తీకమాసం రోజులలో అభిషేకం చేస్తే అశ్వమేథయాగంతో సమాన ఫలితం లభిస్తుంది. సాయంత్రం సమయాలలో ఆలయంలో భగవంతుని కీర్తనలు గానం చేస్తే వేయి గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది.

 

దీపదాన మంత్రం

 

మంత్రం:          సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చు భావాహం !

                      దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ !!

 

'జ్ఞానమునూ, సంపదలనూ, శుభములనూ కలిగించేది ఏదైనా దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరమూ శాంతి - సుఖం ఏర్పడుగాక' అని చెబుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా చేసినవారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, జ్ఞానం, ఆయువు వృద్ధి, తరువాత స్వర్గభోగాలూ కలుగుతాయి. మ్కనోవాక్కాయ కృత పాపాలు అన్నీ సమసిపోతాయి.

ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలంలో కూర్చునే లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్ళలో స్థిరవాసం ఏర్పరచుకుంటుంది. తులసీదళాలతోకానీ, జాజిపువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకమాసంలో భక్తితో పండ్లు దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లలా చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తిరిగి చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారిని మించిన ధన్యులు ఎవరూ ఉండరు అనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతుడై, ఉసిరిచెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టికలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామ పూజ చేసేవాళ్ళు వైకుంఠాన్ని పొంది, విష్ణువులా ఆనందిస్తారు.

ఎవరైతే కార్తీకమాసంలో నిష్ణువు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపం కట్టినవాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామం చేసినవాళ్ళు అశ్వమేథ పుణ్యం లబ్దిపొందే వారు అవుతారు. విష్ణువుకి ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడిబట్టతో ఉన్నవాడికి వస్త్రదానం చేసినవాడు పదివేల ఆశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి ఎగిరిపోతాయి. నల్లని, లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజ చేసినవారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీకమాసంలో ఏ స్త్రీ అయితే బృందావనంలో గోమయంతో (ఆవుపేడ) అలికి, పంచరంగులతోనూ, శంఖ, పద్మ-స్వస్తిక్ వంటి రంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకి ప్రియురాలు అవుతుంది. విష్ణుసన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయినోళ్ళ ఆదిశేషుడైనా పొగడలేడు.

ఈ కార్తీకమాసంలో శివుణ్ణి జిల్లెడుపూలతో పూజించినవాడు దీర్ఘాయుష్మంతుడై చివరికి మోక్షాన్ని పొందుతాడు. విష్ణు ఆలయమండపాన్ని అలంకరించినవాడు హరిమందిరంలో స్థాయి అవుతారు. హరిని మల్లెపూలతో పూజించినవారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ, గంధంతో సాలగ్రామ పూజ చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు. విష్ణుసన్నిధిలో నాట్యం చేసినవారి యొక్క పూర్వసంచిత పాపలు అన్నీ పూజ్యం అయిపోతాయి. భక్తితో అన్నదానం చేసేవాడి పాపాలు గాలికి మబ్బుతునకలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీకమాసంలో నువ్వులదానం, మహానదీ స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం ఈ నాలుగూ ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ వుంది. కార్తీకమాసంలో శ్రీహరిని కదంబపుష్పాలతో పూజించినవాడు సూర్యమండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి వెడతాడు. పద్మాలతో పూజించినవాడు చిరకాలం సూర్యమండలంలోనే నివసిస్తాడు. ఓ జనక మహారాజా! కార్తీకమాసంలో ఎవడైతే అవిసెపువ్వుల మాలను తాను ధరించి తరువాత అవిసెపువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తాడో వాడు స్వర్గాధిపతి అవుతాడు. మల్యాలతో, తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను - ఆశక్తులు అయినవాళ్ళు -

 

 

శ్లో           కార్తీక భానువరేతు స్నానకర్మ నమాచరేత్ !

             మాసస్నా నేన యత్పుణ్యం తత్పుణ్యం లభతేనృప !!

శ్లో          ఆద్యే తిమే మధ్య మే చ దినే యః స్నానమాచరేత్ !

            మాసస్నాన ఫలం తేన లభతే నాత్ర సంశయః !!

 

'కార్తీకమాసం'లో ఆదివారంనాడుగాని లేదా శుక్ల పాడ్యమినాడు గాని, పూర్ణిమనాడు గాని, అమావాస్యనాడు గాని సంకల్ప సహితంగా ప్రాతఃస్నాన మాచరించడం వలన ఆ మాసం అంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది' ఆపాటి శక్తి కూడా లేనివాళ్ళు కార్తీకమాసం నెలరోజులూ ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, విన్నా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా!. మహీశా! కార్తీకమాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాడి పాపాలు నశించిపోతాయి, కారీకమాసంలో విష్ణుపూజ కోసం ఇతరులకు సహకరించేవాడు స్వర్గాన్ని పొందుతాడు. తాము స్వయంగా సంకల్ప పూర్వకంగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయపదాన్ని పొందుతారు. కార్తీకమాసం సాయంకాలాలలో దేవాలయాలలో శివ-విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో వుండి తరువాత ధృవలోకాన్ని పొందుతారు.

 

కార్తీకమాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ, కుశలతోనూ పూజించేవాళ్ళు పాపవిముక్తులై వైకుంఠం పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారు. కార్తీకస్నానం ఆచరించి విష్ణుసన్నిధిలో దీపమాలికలు ఉంచే వాళ్ళు పురాణ పాఠకులూ, శ్రోతలూ కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి వందరెట్లు, కార్తీకపూర్ణిమ వెయ్యిరెట్లు, శుక్లపాడ్యమి లక్షరెట్లు, శుక్ల ఏకాదశి కోటిరెట్లు, ద్వాదశి లెక్కలేనంత, అనంతమైన ఫలాలనూ అదనంగా ప్రసాదిస్తాయి. మోహంచేత అయినా సరే శుక్ల ఏకాదశినాడు ఉపవాసం ఉండి, మరుసటిరోజు (ద్వాదశి) బ్రాహ్మణులతో కలిసి పారణ చేసేవాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు.

ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు అన్నదానం చేసినవారికి సమస్త సంపదలూ అభివృద్ధి చెందుతాయి. రాజా! సూర్యగ్రహణ సమయంలో గంగాతీరంలో కోటిమంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యమూ కూడా కేవలం కార్తీక ద్వాదశినాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. వేయి గ్రహణపర్వాలు, పదివేల వ్యతీపాతయోగులూ, లక్ష అమావాస్యా పర్వాలూ ఏకమైన కూడా ఒక్క కార్తీక ద్వాదాశిలో పదహారవవంతు కూడా చేయవు.

 

 

Related Articles

కార్తీక మాస విశిష్టతలు

 

విష్ణుదేవుడితో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని మహర్షులు చెపుతున్నారు. కార్తీకమాసం శివకేశవులకు ఇష్టమైంది ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం, మహిమాన్వితమైనది. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీకం నెల రోజులూ ఎంతో పవిత్రమైనవి. కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి నుండి కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఎంతో పవిత్రంగా వ్రతాలను చేస్తుంటారు 

కార్తీకమాసంలో చేయవలసిన దానాలు వాటి ఫలం

 

కార్తీకమాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభిస్తుందిశివాలయ గోపురద్వారాశిఖరాలలో గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్నిపాపాలూ అంతరించిపోతాయిఎవరయితే కార్తీకమాసంలో శివాలయంలో ఆవునేతితోవిప్ప నారింజ నూనెలతో దీప సమర్పణ చేస్తే వాళ్ళు ధర్మాత్ములు అవుతారు.