Karthika Masam Day 1 Parayanam

కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము 

శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన:

 

శ్లో     వాగీశాద్యా సుమనస్స స్సర్వార్థానా ముపక్రమే !

    య న్న త్వా కృతకృత్యాస్సుస్తం  నమామి గజాననమ్ !!

శునకాడులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట

శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిశారణ్యానికి  విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి,, సంతుష్టుడిని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి 'సకల పురాణగాథ అయిన, నూతమునీ కలికల్మశ నాశానకం అయిన కైవల్య దాయకమయిన కార్తీకమాస మహత్యము విన్పించి మమ్మల్ని ధన్యులను చేయమని అడిగారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిస్యుడు అయిన సూతమహర్షి 'శౌనకాదురాలా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మపురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్టులవారిచే , రాజ మహర్షి ఆయన జనకుడికి స్కాంద పురాణంలోనూ, హేలా విలాసాల బాలామణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మచేత పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహత్యం సవిస్తరంగా చెప్పబడింది. మన అదృష్టంవలన నేటినుంచే కార్తీకమాసం ప్రారంభం కాబట్టి, ప్రతిరోజూ నిత్యపారాయనగా ఈ మాసం అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట మహర్షిచే కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి' అని చెప్పడం మొదలుపెట్టాడు.

జనకుడు వశిష్టుని కార్తీక వ్రత ధర్మము గురించి అడగడం

పూర్వం ఒకసారి సిద్దాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమయిన ద్రవ్యాల కోసం వశిష్ట మహర్షి, జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి "మహర్షీ! మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ, సర్వపాపహరమయిన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలోని సర్వ మాసాల కంటే కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదనీ చెబుతూ ఉంటారు కదా! ఆ నెలకి అంతటి ప్రాముఖ్యత ఎలా కలిగింది? ఆ వ్రతం ఉత్కృష్ట ధర్మం ఏవిధంగా అయింది?' అని అడిగాడు. దానికి వశిష్టుడు జ్ఞానహాసం చేస్తూ ఇలా తెలిపాడు. “జనకమహారాజా! పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్వశుద్ధి కలగిన నీవంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమం అయినది, విన్నంత మాత్రమే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహత్యం వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, నీవు అడిగిన సంగతులను చెబుతాను, విను. కార్తీకమాసంలో సూర్యుడు తులాసంక్రమణంలో ఉండగా, సహృదయంతో ఆచరించే స్నానం, దానం, జప, పూజలు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులసంక్రమణాదిగా కాని, శుద్ధ పాడ్యమినుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా 

శ్లో         నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే 

'ఓ దామోదరా! నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తిచేయి' అని నమస్కార పూర్వకంగా సంకల్పించుకుని, కార్తీక స్నానం ప్రారంభించాలి. కార్తీకంలో సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం చేసినవారి పుణ్యం చెప్పలేనిది. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలలో చేరుతుంది. సరస్సులు, సెలయేర్లు, చెరువులు, జలాశయాల్లో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడు అయినవాడు కార్తీకమాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానం చేస్తూ, కాళ్ళూ, చేతులూ కడుక్కుని, ఆచమనం చేసి,  శుద్దాత్ముడై, మంత్రయుక్తంగా భైరవ ఆజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. తరువాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. తరువాత మంత్రజపంతో, బొటన వ్రేలి కొనతో నీటిని కెలికి, మూడు దోసిళ్ళ నీళ్ళు గట్టుమీదకి చిమ్మి, తీరం చేరుకోవాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీన్నే యక్ష్ముతర్పణం అంటారు. తరువాత ఒళ్ళు తుడుచుకుని, పొడివీ, మడివీ తెల్లబట్టలు వేసుకుని హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్థ్వ ఉండ్రాళ్ళు ధరించి, సంధ్యావందన గాయత్రీ జపం ఆచరించాలి. ఆ తరువాత ఔపాసన చేసి, బ్రహ్మయజ్ఞం ఆచరించి, తన తోటలోనుంచి చక్కటి పువ్వులను తెచ్చి శంఖ-చక్రధారి అయిన విష్ణువును, సాలగ్రామంలో భక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. అటు తరువాత కార్తీకపురాణం చదవటం కానీ, వినటం కానీ ఆచరించే వాడై, ఇంటికి చేరి దేవతార్చన, దీపార్చన చేసి, భోజనం చేసి,  ఆచమనం చేసి తిరిగి పురాణ కాలక్షేపం చేయాలి. 

సాయంకాలం అవగానే ఇతర పనులు అన్నీ ముగించుకుని, విష్ణు ఆలయంలో కానీ, శివాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి, అక్కడి స్వామిని ఆరాధించి, భక్షభోజ్యాదులు నివేదించిన తరువాత శుద్ధమైన మాటలతో వారిని స్తుతించి నమస్కారం చేయాలి. ఈ కార్తీకమాసం అంతా ఈ విధంగా వ్రతాన్ని చేసినవారు పునర్జన్మ లేకుండా వైకుంఠంలో స్థిరనివాసం పొందుతారు. ప్రస్తుత, పూర్వ జన్మలలో చేసిన పాపాలు అన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించిపోతాయి. వర్ణం, లింగభేదం, వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించినవారు ఎవరైనా మోక్షం పొందటానికి అర్హులు అవుతారు అనడంలో ఎటువంటి సంకోచం లేదు. జనకరాజా! తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేక పోయినా ఇతరులు చేస్తుండగా చూసి, అసూయలేకుండా ఆనందించేవాడికి అ రోజున చేసిన పాపాలు అన్నీ విష్ణుకృప అగ్నిలో ఆహుతి అయిపోతాయి. 
                      

మొదటి అధ్యాయం సమాప్తం

రెండవ అధ్యాయం - కార్తీక సోమవార వ్రతం 

వశిష్ట ఉవాచ:

ఓ జనక మహారాజా! విన్నంత మాత్రంతోనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలనూ హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను. అందులోనూ ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవారం వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసం చేరుకుంటాడు. కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారం రోజయినా సరే స్నానం, జపాలు ఆచరించేవాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది. ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలాదానం.

ఉపవాసం:

శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలు అంతా భోజనం చేయకుండా (ఉపవాసం) తో గడిపి, సాయంత్రం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసీతీర్థం మాత్రమే సేవించాలి. 

ఏకభుక్తం:

సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానం, దానం, జపాలు యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థమో, తులసీతీర్థమో మాత్రమే తీసుకోవాలి. 

నక్తం:

పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయవచ్చు.
అయాచితం: భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం 'అయాచితం' 

స్నానం:

పైవాటికి వేటికీ శక్తి లేనివాళ్ళు సమంత్రక స్నానం, జపం చేసినా చాలు. 

తిలాదానం:

మంత్రం, జపం విధాలు కూడా తెలియనివాళ్ళు, కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది.

పై ఆరు పద్ధతులలో దేన్నీ ఆచరించినా 'కార్తీక సోమవారవ్రతం' చేసినట్లే అవుతుంది. కానీ తెలిసి కూడా ఏ ఒక్కదాన్నీ ఆచరించనివాళ్ళు ఎనిమిది యుగాలపాటు కుంభీపాతర మొదలైన నరకాలను పొందుతారని అర్షవాక్యం. ఈ వ్రతం ఆచరణ వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యం పొందుతారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజూ కూడా పగలు ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమకచమక సహితంగా శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను.

నిష్టురి కథ 

పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి 'నిష్టరి' అనే కూతురు ఉండేది. పుష్టిగానూ, అందంగానూ, అత్యంత విలాసంగానూ ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు. దుష్టగుణ భూయిష్టమైన గయ్యాళిగానూ, కాముకురాలిగానూ తిరిగే ఈ 'నిష్టరి'ని ఆమె గుణాల వల్ల 'కర్కశ' అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వాడికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు.  ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడంతో మోజు చంపుకోలేక కొంతా, భార్యను వదిలివేయడం తన వంశానికి పరువుతక్కువ అనే ఆలోచన కొంత వలన మిత్రశర్మ, కర్కశ పెట్టే కఠినమైన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. కాని, ఏనాడూ ఆమెను శిక్షంచలేదు. ఆమె ఎందఱో పరపురుషులతో అక్రమసంబంధం పెట్టుకుని భర్త, అత్తా, మామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకరోజు ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ ... 'నీ మొగుడు బ్రతికి ఉండటం వలన మనం తరచూ కలుసుకోలేక పోతున్నా'మని రెచ్చగొట్టడంతో, కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రలో వున్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి, ఆ శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుపడిన నూతిలోకి విసిరి వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకి ఆమె విటుల బలం ఎక్కువ కావడం వల్ల, అత్తమామలు ఆమెను ఏమీ అనలేక, తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ, కన్నుమిన్ను కానని కామావేశంతో అనేకమంది పురుషులతో సంపర్కం పెట్టుకుని నిత్యసురత క్రీడలలో తేలియాడసాగింది. తాను చెడింది కాకుండా ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింప చేసి తన విటులకు తార్చి దానిద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనం పోయింది, శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బుపడింది. ఎంతోమంది పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని, అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేని పుళ్ళు పడిపోయింది. జిగీబిగీ తగ్గిన కర్కశ దగ్గరికి విటులు రావడం తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. చివరికి అక్రమపతులకే కానీ, సుతులకు నోచుకోని ఆ నిష్టర, తినడానికి తిండీ, ఉండడానికి యింత ఇల్లూ, వంటినిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి. కొనవూపిరితో ప్రాణలతో నడివీధినపడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్దను చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. 
                      

భర్తద్రోహికి భయంకర నరకం

భర్తను మరచిపోయి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి, ఆమె చేత మండుతున్న యినుప స్తంభాలను కౌగిలించుకునేలా చేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముళ్ళగదతో ఆమె తల చిట్లిపోయేలా కొట్టించాడు. భర్తను తిట్టినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు కర్కశ పాదాలను పట్టుకొని కఠినమైన శిలలపై వేసి బాదించాడు. సీసం కాచి చెవులలో పోయించాడు. కుంషీపాత నరకానికి పంపాడు. ఆమె పాపాలకుగాను ఆమె ముందు పదితరాలవారూ, తరువాత పదితరాలవారూ ఆమెతో కలిపి మొత్తం 21 తరాలవారిని కుంభీపాతంలో కుమిలిపోసాగారు. నరక అనుభవం తరువాత ఆమె పదిహేనుసార్లు భూమిపై కుక్కగా జన్మించింది. పదిహేనవ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి, ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది.

సోమవార వ్రత ఫలంతో కుక్క కైలాసం పొందటం 

ఇలా ఉండగా, ఒక కార్తీక సోమవారం రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి, నక్షత్ర దర్శనం తరువాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి, ఇంటిబయట బలివి విడిచిపెట్టాడు. ఆరోజంతా ఆహారం దొరకక ఉపవాసం (పస్తు) పడుకుని ఉన్న కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిన్నది. బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి 'ఓ బ్రాహ్మణా! రక్షంచు' అని కుయ్యి కుయ్యి అని అరిచింది. దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాటలాడటం చూసి ఆశ్చర్యపోతూనే 'ఏం తప్పు చేశావు? నిన్ను నేను ఎలా రక్షించగలను?' అని అడిగాడు. 
అందుకు ఆ కుక్క 'ఓ బ్రాహ్మణుడా! పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. కామంతో కళ్ళు మూసుకుపోయి, కాముకురాలిని అయి చేయకూడని పనులు చేశాను. భర్త హత్యకూ, వర్ణ సంకరానికి కారకురాలినైన పతితను. ఆ పాపాలకు అనుగుణంగా అనేకకాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి, ఈ భూమిపై ఇప్పటికి 14సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి వివరించు' అని కోరుకుంది.

బ్రాహ్మణుడు అంతా జ్ఞానదృష్టితో తెలుసుకుని 'ఓ శునకమా! ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకూ పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బాలి తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది' అని చెప్పాడు. దాంతో ఆ కుక్క 'కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా! నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు' అని కోరిన తరువాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా, వెంటనే ఆ కుక్క తన కుక్క దేహాన్ని విడిచిపెట్టి దివ్యస్త్రీ శరీరంతో, ప్రకాశవంతమైన వస్త్రాలతో, పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది. కాబట్టి ఓ జనకరాజా! నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్టుడు చెప్పడం ఆపాడు. 
                 

 ద్వితీయ అధ్యాయం సమాప్తం 
                  

మొదటిరోజు పారాయణం సమాప్తం 

 

 

 

 

 

Products related to this article

Simhasanam (Red Colour)

Simhasanam (Red Colour)

Simhasanam..

$25.00

Designed Tamboolam (10 Pieces)

Designed Tamboolam (10 Pieces)

Designed Tamboolam..

$6.00

0 Comments To "Karthika Masam Day 1 Parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!