Karthika Masam Day 10 Parayanam

కార్తీక పురాణము -పదవ రోజు పారాయణం 


                    పంతొమ్మిదొవ అధ్యాయము


జ్ఞాన సిద్ధి ఉవాచ: వేదవేత్తల చేత - వేదవిద్యునిగానూ, వేదాంత స్థితునిగానూ, రహస్యమైన వానిగానూ, అద్వితీయునిగానూ కీర్తించబడేవాడా! సూర్యచంద్ర శివబ్రహ్మాదుల చేతా - మహారాజాది రాజులచేతా స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా! నీకు నమస్కారం. పంచాభూతాలూ, సృష్టిసంభూతాలైజ్న సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణాః నువ్వు పరమముకంటే కూడా పరముడవు. నువ్వే సర్వాదికారివి. స్థావరజంగరూపమైన సమస్త ప్రపంచమూ కూడా దాని కారణ బీజమైన మాయలో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్ట్యాదినీ, నడుమతోనూ, త దంతానాకూడా ప్రపంచమంతా నువ్వే నిండివుంటావు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యరూప చతుర్విధాన్న రూపుడవూ, యజ్ఞస్వరూపుడవూ కూడా నీవే. అమృతమయమూ, పరమ సుఖప్రదమూ అయిన ణీ సచ్చిదానందరూప సంస్మరణ మాత్రము చేతనే - ఈ సంసారం సమస్తమూ "వెన్నట్లో సముద్రంలా'' భాసిస్తోంది. హే ఆనందసాగారా ! ఈశ్వరా ! జ్ఞానస్వరూపా! సమస్తానికీ ఆధారమూ, సకల పురాణసారమూ కూడా నీవే అయివున్నావు. ఈ విశ్వం సమస్తం నీవల్లనే జనించి తిరిగి నీయందె లయిస్తూ వుంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివీ, ఆత్మవాచ్యుడవూ, అఖిలవంద్యుడవూ, మనోవా గగోచరుడవూ అయిన నువ్వు - కేవల మాంసయమయాలైన భౌతికనేత్రాలకు కనిపించవు గదా తండ్రీ ! ఓ కృష్ణా! ఈశ్వరా! నారాయణా! నీకు నమస్కారం. నీ ఈ దర్శనఫలంతో నన్ను ధన్యుడిని చెయ్యి. దయామతివై నన్ను నిత్యమూ పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మ్రోక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు. దాతవు, నేతవు, కృపాసముద్రుడవూ అయిన నీవు సంసారసాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్దరించు. హే శుద్ధచరితా! ముకుందా! త్రిలోకనాథా! త్రిలోకవసీ! అనంతా! ఆదికారణా! పరమాత్మా! పరమహంసపతీ, పూర్నాత్మా! గుణాతీతా! గురవే! దయామయా! విష్ణో! నీకు నమస్కారం. నిత్యానందసుధాబ్దివాసీ! స్వరగాపవర్గ ప్రదా! అభేదా! తేజోమయా! సాధుహృ త్పద్మస్థితా! ఆత్మారామా! దేవదేవేశా! గోవిందా! నీకిదే నమస్కారం. సృష్టిస్థితి లయంకారా! వైకుంఠవాసా! బుద్దిమంతులైనవారు నీ పాదాలయందలి భక్తీ అనే పడవచేత సంసారసాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తెజోస్వరూపాలైన ణీ పాదాల కివే నా ప్రమాణాలు. వేదాల చేతగాని, శాస్త్రతర్క పురాణ నీతివాక్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవా, భక్తీ అనే అన్జనాలను దరించగలిగినవాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి, ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధృవ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రంచేతనే సమస్త పాపాలూ నశించిపోతున్నాయి. ఓ కేశవా! నారాయణా! గోవిందా! విష్ణూ! మధుసూదనా! త్రివిక్రమా! వామనా! శ్రీధరా! హృషీకేశా! పద్మనాభా! దామోదరా! సంకర్షణా! వాసుదేవా! నీకు నమస్కారం నాన్ను రక్షించు'' ఈ విధంగా తెరిపిలేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ 'జ్ఞానసిద్ధా! నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడినయ్యాను. ఏం వరం కావాలో కోరుకో'' అన్నాడు విష్ణుమూర్తి. "హే జగన్నాథా! నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే, నాకు సాలోక్యాన్ని (వైకుంఠం) ప్రసాదించు''మని కోరాడు జ్ఞానసిద్ధుడు. "తథాస్తు'' అని దీవించి తార్క్ష్యవాహనుడు అయిన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. "జ్ఞానసిద్ధా! నీ కోరిక నెరవేరుతుంది. కాని, అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను. సత్పురుషా! నేను ప్రతీ ఆషాఢశుద్ధ ద్వాదశినాకు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్ని ఇచ్చే ఈ నాలుగునేలలూ ఎవరైతే  సద్వ్రతాలను ఆచరిస్తారో, వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులూ, వైష్ణవులూ అయిన నీవూ, నీ సహవ్రతులూ కూడా నేను చెప్పిన చాతుర్మాస్యవ్రతాన్ని పాటించండి. ఎవరైతే ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేయరో వాళ్ళు బ్రహ్మహత్యాపాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర-మెలకువ-కల అనే అవస్థాత్రయ మేదీ కూడా లేదు. నేను వాటికి అతీతుడిని. అయినా నా భక్తులను పరీక్షించడానికే నేను అలా నిద్ర ,మిషతో జగన్నాటకాన్ని రచిస్తూ ఉంటానని గుర్తించు. హాతుర్మస్యానే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాలా పఠించేవాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు'' ఈ విధంగా చెప్పి, ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. 
అంగీరస ఉవాచ: ఓయీ! నీవు అడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇదే. దుర్మాతులైనా, పాపులైనా సరే హరిహరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీజాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయనివాళ్ళు గో, గోత్రా హత్యాఫలాన్నీ, కోటిజన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవాళ్ళు వందయజ్ఞాలు చేసిన ఫలాన్నీ, అంత్యంలో విష్ణులోకాన్నీ పొందుతారు.   


                    పంతొమ్మిదొవ అధ్యాయము  సమాప్తం


                    ఇరవైవ ధ్యాయము


జనకుని కోరికపై వశిష్టుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలరాజ్య దౌరేయా! ఈ కార్తీక మహత్యం గురించి అత్ర్యగస్త్య మునుల మధ్య జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రిమహాముని, అగస్త్యుడిని చూసి "కుంభసంభవా! లోకత్రయోపకారం కోసం కార్తీక మహాత్యబోధకమైన ఒకానొక హరికథను వినిపిస్తాను, విను. వేదంతో సమానమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను విను. వేదంతో సమానమైన శాస్త్రంగాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందంగాని, హరికి సాటి అయిన దైవంగాని, కార్తీకంతో సమానమైన నెలకాని లేవయ్యా! కార్తీకస్నాన, దీపదానాలూ, విష్ణు అర్చనల వలన సమస్త వాంఛలూ సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తివలన మాత్రమే విజయవివేక విజ్ఞానయశోధన ప్రతిష్ఠాసంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షిభూతంగా పురంజయుడి ఇతిహాసాన్ని చెబుతారు.


                    పురంజయ పాఖ్యానము


త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడు అయిన ఉరంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్ర విదుడు, ధర్మజ్ఞుడు అయిన రాజు. అత్యధిక ఐశ్వర్యం కలగడం అహంకారం కలవాడై, బ్రాహ్మణ ద్వేషి, దేవా బ్రాహ్మణ భూహర్త, సత్యషౌచత్యకుడు, దుష్ట పరాక్రమ యుక్తుడు, దుర్మార్గావర్తనుడై ప్రవర్తించసాగాడు. దానిద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేకమంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి, ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదంతో శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్దపెద్ద చక్రాలున్నదీ, ప్రకాశించేదీ, జెండాతో అలంకరించబదినదీ, అనేక యుద్ధాలలో విజయం సాధించినదీ, చక్కటి గుర్రాలు పూన్చినదీ, తమ సూర్యవంశ అన్యవమైనదీ అయిన రధాన్ని అధిరోహించి సాది, విషాది, రథి, పత్తి అనబడే నాలుగు రకాల సేనాబలగంతో నగరం నుంచి వెలువడి చుట్టుముట్టిన శతృమూకలపై విరుచుకుపడ్డాడు.


                    పందొమ్మిది - ఇరవై అధ్యాయాలు సమాప్తం 
              
   
 పదవరోజు పారాయణ సమాప్తము 

0 Comments To "Karthika Masam Day 10 Parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!