Karthika Masam Day 17 Parayanam

కార్తీక పురాణము - పదిహేడవ రోజు పారాయణం

మూడవ అధ్యాయము


మళ్ళా చెబుతున్నాడు సూతుడు: పూర్వ అధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ, శ్రీకృష్ణుడికి నమస్కరించి "ప్రాణేశ్వరా! కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలూ అవయవాలై అలరారుతుండగా - 
తిథులలో ఏకాదశి, నెలలో కార్తీకము మాత్రమే అంతటి యిష్టం అవడానికి కారణం ఏమిటో శలవీయండ'ని కోరగా. నువ్వు రాజిల్లెడు మోమువాడైన నవనీతచోరుడిలా చెప్పసాగాడు ... 'సత్యా! చక్కటి 
ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో వృథు చక్రవర్తి, నారదుడిని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను 
విను'. 
నారద ఉవాచ : వృథు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు ... సముద్ర నందనుడైన శంకుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతా అధికారాలను హస్తగతం చేసుకుని, వారిని స్వర్గం నుంచి 
తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమతమ భార్యా బంధువులతో సహా మేరు పర్వతగుహలలో తలదాచుకున్నారు. అయినా శంకుడికి తృప్తి కలగలేదు. 'పదవులు పోయినంత మాత్రాన 
పటుత్వాలు పోతాయా? పదివిలేనప్పుడే తిరిగి దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవాతలు శక్తిమతులు అయ్యే అవకాశం ఉంది గనుక, 
వేదాలను కూడా తాను కైవశం చేసుకోవాలని అనుకున్నాడు. విష్ణువు యోగ నిద్రాగతుడైన ఒకానొక వేళలో బ్రహ్మనుండి వేదాలను లాక్కున్నాడు. కాని, యజ్ఞమంత్రం బీజాలతో కూడి వేదాలు శంకుడి 
చేతినుండి, తప్పించుకుని ఉదకాలలో తల దాచుకున్నాయి. అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెదికాడు గాని, వాటిని పసిగట్టలేక పోయాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలను 
సమకూర్చుకుని, మేరు గుహలలో నివసిస్తున్న దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరుకున్నాడు. సమస్త దేవతలందరూ కలిసి వివిధ నృత్య, వాద్య, గీత, నామస్మరణాలతోను, ధూపదీప 
సుగంధ ద్రవ్యాలతోను కోలాహలం చేస్తూ యోగనిద్రలో ఉన్న శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. చివరికి నిద్రలేచిన ఆ ఇందిరా రమణుడిని షోడశోపచారాలతో పూజించి, శరణు కోరుకున్నారు, 
దేవతలు. శరణాగతులైన దేవతలను చూసి రమాపతి ఇలా అన్నాడు.  
'మీరు చేసిన సర్వోపచారాలకూ సంతోషించినవాడినై మీ పట్ల వరదుడిని అవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశీ రోజు తెల్లవారు ఝామున, నేను మేలుకునేవరకూ మీరు ఏ విధంగా అయితే 
సేవించారో అదే విధంగా ధూపదీప సుగంధద్రవ్యాలు, నృత్యగీత వాద్య నామస్మరణాలతోను, షోడశోపచారాలతోనూ, కార్తీక శుద్ధ ఏకాదశీ ప్రాతః వేళలో నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా 
సాన్నిధ్యాన్ని పొందెదరు గాక! వాళ్ళ చేత నాకు ఇవ్వబడిన అర్ఘ్యపాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖాలకే కారణం అగుగాక! ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే, ప్రతీ 
కార్తీకమాసంలోను కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక! నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంకుడిని సంహరించి వేదాలను కాపాడెదనుగాక! ఇకనుంచి కార్తీకమాస ప్రాతఃవేళలో 
మానవులచే చేయబడిన నదీస్నానం - ఆవభృథ స్నానతుల్య మగుగాక! మరియు, ఓ మహేంద్రా! కార్తీక వ్రతాచరిత మానవులు అంతా కూడా నాచే నువ్వు వైకుంఠాన్ని వలె నీచే స్వర్గాన్ని పొందదగి 
వున్నారు. ఓ వరుణదేవా! కార్తీక వ్రతనిష్టుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి, పుత్రపౌత్ర ధనకనక వస్తువాహనాది సమస్త సంపదలనూ అందించు. ఓ కుబేరా! ఏ కార్తీక వ్రతాచరణం వల్ల 
మానవులు నాయొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులు అవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞను సారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా! ఎవడీ 
కార్తీకవ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తాడో వాడు మీ అందరిచేతా కూడా పూజించతగిన వాడుగా తెలుస్కోండి. మేళతాళాలతో, మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన 
ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతివంతమైనది. అందువలన కార్తీక వ్రత, ఏకాదశీ వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడంకన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారిలేదని తెలుసుకోవాలి. 
తపోదానా యజ్ఞ, తీర్థాదులన్నీ  సర్గఫలాన్నీ ఇవ్వగలవే కానీ నా వైకుంఠ పదాన్ని ఇవ్వలేవు సుమా'


                    మూడవ అధ్యాయము సమాప్త

                    నాలుగవ అధ్యాయము


                    మత్స్య అవతారము 


భగవానుడు అయిన శ్రీమహావిష్ణువు దేవతలకు అలా ఉపదేశించినవాడై తక్షణమే మహా మత్సశాబకమై వింధ్యపర్వతంలోని కష్యపుడిపు దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడు ఆ చేపపిల్లను తన 
కమండలంలో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవడం వలన, దాన్ని ఒక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలోనే ఆ శఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన, కశ్యపుడు 
దాన్ని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కాని, విష్ణు మీనం సరస్సును కూడా అధిగమించడంతో దాన్ని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహా సముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి - 
శంఖుడిని వధించి, వాడిని తన చేతి శంఖంగా ధరించి, బదరీవనానికి చేరి, అక్కడ ఎప్పటిలాగానే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి 'ఓ మునులారా! వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా 
దాక్కున్నాయి. మీరు వెళ్ళి జలాంతరాలైన ఆ వేదాలను వెదకి తీసుకుని రండి. నేను దేవగణ సమాయుక్తుడినై ప్రయాగలో ఉంటాను' అని చెప్పాడు. విష్ణు ఆజ్ఞను శిరసావహించిన ఋషులు 
సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేద అన్వేషణ కోసం బయలుదేరాఋ., ఓ పృథు మహారాజ! ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికీ ఎంత లభ్యమయిందో అది వారి శాఖ అయి 
తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. తరువాత వేదయుతులై ప్రయాగలో ఉన్న విష్ణువును చేరి 'వేదాలను తెచ్చా'మని చెప్పారు. విష్ణు ఆజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన 
బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని, దేవతలతోనూ, ఋషులతోనూ కూడినవాడై అశ్వమేథ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞం తరువాత సమస్త దేవగంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులు అందరూ 
కలిసి శ్రీహరిని ఇలా ప్రార్థించారు. 'ఓ దేవాధిదేవా! జగన్నాయకా! మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథా! నీ 
అనుగ్రహం వల్లనే బ్రహ్మ తను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేము అందరమూ యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము. కాబట్టి, నీ దయవలన ఈ చోటు 
భూలోకంలో సర్వ శ్రేష్ఠమైనదీ, నిత్యమూ పుణ్యవర్ధకమైనదీ, ఇహపర సాధకమైనదిగానూ, అగుగాక! అదే విధంగా ఈ కాలం మహా పుణ్యవంతమైనదీ, బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేదీ, 
అక్షయ ఫలకరమైనదీ అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు''
దేవతల ప్రార్థనను వింటూనే దివ్య మందహాసాన్ని చేశాడు. 'దేవతలారా! మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అగుగాక! ఇకనుంచి బ్రహ్మక్షేత్రం అనే పేరు 
ప్రఖ్యాతి వహించుగాక! అనతికాలంలోనే సూర్యవంశీయుడు అయిన భగీరథుడీ క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు. ఆ గంగా సూర్యసుత అయిన కాళిందీ ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. 
బ్రహ్మాదులైన మీరందరూ నాతొ కూడుకున్న వారి ఈ చోటనే సుస్థితులయ్యెదరు గాక! ఇది తీర్థరాజంగా ఖ్యాతి వహించునుగాక! ఈ స్థలంలో సంచరించే దాన తపో వ్రతయజ్ఞ హోమార్చనాదులు అనంత 
పుణ్యఫలదాలై నాసాన్నిధ్యంలోనే కాకుండా అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోర పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో 
మరణించినవాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేనివాళ్ళు అవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో, వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా 
పుణ్యఫలాన్ని ఇస్తుంది. సూర్యుడు మకర సంక్రమణంలో ఉండగా ప్రాతఃకాల స్నానం ఆచరించేవాళ్ళు పాపాలన్నీ హరించుకుపోతాయి. మాఘమాసంలో సూర్యుడు మకరంలో ఉండగా ప్రాతఃస్నానం 
చేసినవాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలు అన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య, సామీప, సారూప్య, సాయుజ్యాలను ప్రసాదిస్తాను. ఓ ఋషులారా! శ్రద్ధగా వినండి - 
నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిదిచేసి వుంటాను. ఇతరేతర క్షేత్రాలలో వంద సంవత్సరాలు తపస్సు చేయడంవల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో 
ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే సర్వులూ (అందరూ) తమ పాపాలను పోగొట్టుకున్నవాళ్ళై జీవన్ముక్తులు అవుతారు' శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు 
వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అదృశ్యులయ్యారు. ఓ పృథురాజా! ఆ బదరీవన యాత్రా దర్శనం చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్నీ కూడా ఈ కథా శ్రవణ (వినటం) 
మాత్రం చేతనే పొందగలరు' అని చెప్పి ఆగాడు నారదుడు.


                    మూడవ నాలుగవ అధ్యాయాలు సమాప్తం


                    పడుహేడవ (బహుళ విదియ) రోజు పారాయణము సమాప్తం

 

Products related to this article

Lava Bracelet

Lava Bracelet

Lava Braceletit is used for calming the emotions. Note : For this bracelet pour 2 drops of essential oil on this bracelet leave it for overnight and then use it...

$14.60

0 Comments To "Karthika Masam Day 17 Parayanam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!