Karthika Masam Day 27 Parayanam

కార్తీక పురాణము - ఇరవై ఏడవ రోజు పారాయణ


                    ఇరవై మూడవ అధ్యాయం


విష్ణుగణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథ తరువాత, ధర్మదత్తుడు మళ్ళీ వారిని 'ఓ గణాధిపతులారా! జయ-విజయులు వైకుంఠంలో విష్ణుద్వారపాలకులని విని వున్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి' అని అడగడంతో, ఆ గణాధిపతులు చెప్పడం ప్రారంభించారు.


                    జయ-విజయుల పూర్వజన్మలు


తృణబిందుడి కూతురు దేవహుతి. ఆమెపట్ల కర్దమ ప్రజాపతి యొక్క దృష్టి స్ఖలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండవవాడు విజయుడు. వాళ్ళు ఇద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. తరువాత అష్టాక్షరీమంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేదవిదులు అయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలిగినవారిగా ప్రసిద్ధిచెందారు. అందువలన, మరుత్తుడు అనే రాజు వీరి దగ్గరికి వచ్చి, తనచేత యజ్ఞం చేయించవలసిందిగా వాంచించాడు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసివెళ్ళి, ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకులుగా వుండి, ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్ఠుడు అయిన మరుత్తుడు వారికి లెక్కలేనంత దక్షణలు ఇచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికివారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తించాలని తలిచారు. దాని వల్ల మరుత్తుడు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికీ తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుని వాదం కాగా, తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోథంతో జయుడు అలిగి 'నువ్వు మోసలివై'పో అని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోకుండా 'అహంకారంతో శపించిన నువ్వు, స్వాహంకారి అయిన సామజమై (ఏనుగు) పుడతావులే' అని ప్రతి శాపం ఇచ్చాడు. ఇలా పరస్పర శాపగ్రస్తులైన ఆ సోదరులు ఇద్దరూ విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్నవాళ్ళై, తమ శాపాలను అందుకు పూర్వపరాలను విన్నవించుకుని శాపవిముక్తికోసం ఆ శ్రీహరిని ఆశ్రయించారు. 'హే భగవాన్! నీకు ఇంతటి చేరువ భక్తులమైన మేము మొసలిగానూ, ఏనుగుగానూ పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాలనుంచి మమ్మల్ని మళ్ళించు' అని మనవి చేశారు.
అందుకు మందహాసం చేస్తూ శ్రీమహావిష్ణువు 'జయ-విజయులారా! నా భక్తులమాటలు పొల్లుపోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భావించాను. అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పనివారై, మీమీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి' అని ఆదేశించడంతో, విష్ణువు ఆదేశాన్ని శిరసావహించి ఆ జయవిజయులు ఇద్దరూ గండకీ నదీ ప్రాంతాన మకర, మాతంగాలుగా జన్మించి, పూర్వజన్మ జ్ఞానంకలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. అలా వుండగా ఒకానొక కార్తీకమాసం ప్రవేశించింది. 
ఆ కార్తీకమాసంలో కార్తీకస్నానం చేయాలనే కోరికతో ఏనుగు అయిన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా, అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటపట్టాడు. విడిపించుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహం కలవాడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. తలచినదే తడవుగా ప్రత్యక్షమైన గరుడవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడివలన ఆ గండకీ నదిలోని శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవి అయ్యాయి. ఓ ధర్మదత్తా! నీచే ప్రశ్నించబడిన విష్ణు ద్వారపాలకులైన జయవిజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా దంభామాత్సర్యాలను దిగనాడి, సదర్శనుడివై, సుదర్శనాయుధుడి చరణసేవలను ఆచరించు. తులా, మకర, మేష సంక్రమణాలలో ప్రాతఃస్నానాలను ఆచరించు. తులసీవన సంరక్షణలోనూ, ఏకాదశీ వ్రతంలోనూ, నిష్ఠగలవాడివై ప్రవర్తించు. గోబ్రాహ్మణులనూ, విష్ణుభక్తులనూ సర్వదా సేవించు. కొర్రధ్యానము, పులికడుగునీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రభృతిగా నీవు చేస్తున్న ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే ఏ దాన, తపో, యజ్ఞ, తీర్థాలు కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విపృడా! దైవప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వల్ల నీవూ, నీ పుణ్యంలో సగభాం అందుకోవడం వలన ఈ కలహ కూడా ధన్యులు అయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము' అని విష్ణుగణాలు ధర్మదత్తునికి హితవు పలికి, అతనిని తిరిగి విష్ణువ్రత విశిష్టతలు తెలిపి కలహ సమేతంగా విమానంపై వైకుంఠానికి ప్రయాణమయ్యారు. 
నారదుడు చెబుతున్నాడు: ఓ పృథురాజా! అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడు అయితే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో, వాడు శ్రీమహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు.


                    ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం


                    ఇరవై నాలుగవ అధ్యాయం


నారదుడు చెప్పినది అంతా విని, ఆశ్చర్యచికితుడైన పృథు చక్రవర్తి 'హే దేవర్షీ! ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీనదులు లాగానే గతంలో కృష్ణా, సరస్వతీ మొదలైన నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలు అన్నీ ఆ నదులకు చెందినవా? లేక ఏ క్షేత్రాలకు చెందినవో విశదపరచవే' అని కోరగా, మరలా నారదుడు చెప్పసాగాడు. 'శ్రద్దగా విను. కృష్ణానది సాక్షాత్తూ విష్ణుస్వరూపం. సరస్వతీనది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది.


                    కృష్ణా - సరస్వతీ నదుల ప్రాదుర్భావము


ఒకానొక చాక్షుష మన్వంతరంలో, బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై యజ్ఞం చేయడానికి సమాయత్తం అయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలూ, మునులు కూడా యజ్ఞానికి విచ్చేశారు. భృగువు మొదలైన మునులు అందరూ కలిసి ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష ఇవ్వడానికి నిర్ణయించి, కర్త యొక్క కలత్రమయిన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు. 
దీక్షా ముహూర్తం అతిక్రమించకూడదనే నియమం వలన భృగుమహర్షి 'హే విష్ణూ! సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు. ముహూర్తం దాటిపోతోంది. ఇప్పడు ఏమిటి గతి?' అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ 'సరస్వతి రానిపక్షంలో, బ్రహ్మకు మరియొక భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా విధించండి' అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగుమహర్షి గాయత్రిని రప్పించి, బ్రహ్మ యొక్క దక్షిణభాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులు అందరూ పూర్తిచేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలు అయి ఉన్న తన సవతి గాయత్రిని చూసి కోపంతో


సరస్వతి ఉవాచ :


శ్లో     అపూజ్యాయత్ర పూజ్యంతే, పూజ్యనాంచ వ్యతిక్రమః 
    త్రీణి త్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం!!


'ఎక్కడ అయితే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో, మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణభాగాన నా స్థానంలో ఉపవిష్టురాలిన ప్రజలకు కనిపించనటువంటి రహస్య నదీరూపాన్ని పొందుగాక! ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా! మీరందరూ ఈ యజ్ఞవాటికలో వుండికూడా, నా సింహాసనంలో, నాకన్నా చిన్నదాన్ని ఆసీనురాలిని చేశారు కాబట్టి, మీరు కూడా జడీభూత నదీరూపాలను పొందండి' అని శపించింది.  
ఆ సరస్వతీదేవి కృద్ధ  మాటలను వింటూనే, చివ్వున లేచిన గాయత్రి, దేవతలు వారించుతున్నా సరే వినకుండా 'ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో, అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు కాబట్టి నువ్వు కూడా నదీరూపాన్ని పొందు' అని ప్రతిశాపం ఇచ్చింది. 
ఈ లోపల హరిహరులు వారిని సమీపించి, 'మేము నదీమయులం అయినట్లయితే లోకాలు అన్నీ అతలాకుతలమయి పోతాయి. గనుక, అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్ళించుకో' అన్నారు. కాని, ఆమె వినలేదు. 'యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వరపూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది. పలుకుల పడతినైన నా మాట తప్పదు, మీరందరూ నదీరూపాలను ధరించి, మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే. సవతులమైన నేనూ, గాయత్రీ కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నము' అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలూ జడాలుగానూ, రూపాలు నదులుగానూ పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగానూ, శివుడు సరస్వతీనదిగానూ, బ్రహ్మ పద్మినీ నదిగానూ, ఇతరేతర దేవతలు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు.
దేవతలందరూ నదులై తూర్పుముఖంగానూ, వారివారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు. గాయత్రీ, సరస్వతీ నదీరూపాలు 'సావిత్రీ' అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్టితులైన శివకేశవులు, మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహరమైన ఈ కృష్ణానదీ ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివిన, వినినా, వినిపించినా, వారి వంశం అంతా కూడా నదీదర్శన స్నానపుణ్య ఫలవంతమై తరించిపోతారు.


                    ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు సమాప్తం


                    ఇరవై ఏడవ (బహుళ ద్వాదశి)రోజు పారాయణ సమాప్తము 

Products related to this article

Upanayanam Muhurtham

Upanayanam Muhurtham

Upanayanam Muhurtham ..

$40.00

Navadhanyalu (250 Grams)

Navadhanyalu (250 Grams)

Navadhanyalu..

$3.62

Jeera (250 Grams)

Jeera (250 Grams)

Jeera (250 Grams)..

$2.76

Crystal Diyas(Big)

Crystal Diyas(Big)

Crystal Diyas (Big)lamp is an integral part of every puja in the Hindu method of worship. In fact, lighting of the lamp is the very first ritual that marks the beginning of every sacred act in Hinduis..

$8.16

0 Comments To "Karthika Masam Day 27 Parayanam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!