karthika puranam day 29 parayanam

కార్తీక పురాణము - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ


                    ఇరవై ఏడవ అధ్యాయం


నారదుడి హితవుపై రవ్వంత చింతించిన యముడు, ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత, ధనేశ్వరుడిని తనతో తీసుకొనివెడుతూ మార్గమధ్యంలో నరక భేదాలను చూపిస్తూ, వాటి గురించి ఇలా వినిపించసాగాడు ...


                    తపవాలుకము


'ఓ ధనేశ్వరా! మరణించిన వెంటనే, పాపకర్మలు ఇక్కడే కాల్చబడిన శరీరములు కలవారై - దిక్కులు వ్రకల్లయ్యేలా రోదిస్తూ వుంటారు. దీనినే 'తప్తవాలుక నరకము' అంటారు. వైశ్యదేవవరులైన అతిథులను పూజించనివారూ, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేదవిధులను, యజమానిని కాళ్ళతో తన్నినవారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు!


                    క్రకచము


అనే పేరుగల ఈ నరకం మూడవది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగానూ, నిలువుగానూ, ఏటవాలుగానూ, సమూలముగానూ, అంగాంగములుగానూ రంపములతో కోస్తూ ఉంటారు.


                    అసిపత్రవనం


నాలుగవ నరకధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు. భార్యా-భర్తలను, తల్లి-దండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులు అంతా ఈ నరకానికి చేరి, నిలువెల్లా బాణాలతో గ్రుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి, ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటపడి తరిమే తోడేళ్ళ గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులుతీసి, పారిపోయే దిక్కులేక పరితపిస్తూ వుంటారు. చంపుట, భేదించుట మొదలైన విధులతో ఈ నరకం ఆరు రకాలుగా వుంటుంది. 


                    కూటశాల్మలి


పదహారు రకాలుగా దండించేదీ, పరస్త్రీలనూ, ద్రవ్యాన్నీ హరించేవాళ్ళూ, పరాపకారులూ అయిన పాపులు వుండేది 'కూటశాల్మలీ' నరకం.


                    రక్తపూయం


'రక్తపూయ'మనే ఈ విభాగం ఆరవ నరకం. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వ్రేలాడుతూ యమకింకరులచేత దండించబడుతూ వుంటారు. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పేర్లను నిందిస్తారో, చాడీలు చెబుతుంటారో వారు అంతా ఈ నరకంలోనే వుంటారు.


                    కుంభీపాకం


మొట్టమొదట నీకు విధించబడినదీ, ఘోరాతి ఘోరమైన నరకాలన్నిటిలోకీ నికృష్టమైనదీ అయిన ఈ 'కుంభీపాక'మే ఏడవ నరకం. దుష్టద్రవ్యములు, దుర్భారాగ్నికీలలు, దుస్సహదుర్గంధాలతో కూడి వుంటుంది.


                    రౌరవం


నరకాలలో ఎనిమిదవదైన ఈ 'రౌరవం' దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరములదాకా బైట పడలేరు.


ధనేశ్వరా! మన ప్రమేయం లేకుండా మనకంటినపాపాన్ని శుష్కమనీ, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ధ్రమనీ అంటారు. ఆ రెండు రకాల పాపాలూ కలిపి ఏడు విధాలుగా వున్నాయి.

(1) అపకీర్ణం

(2) పాంక్తేయం

(3) మలినీకరణం

(4) జాతిభ్రంశం

(5) ఉపవీతకం

(6) అతిపాతకం

(7) మహాపాతకం.

ఈ పరిదృశ్యమానులైన నరులచేత ఉపరి ఏడు రకాల నరకాలూ వరుసగా అనుభవింపబడుతూ వున్నాయి. కాని, నువ్వు కార్తీక వ్రతస్థులైన సజ్జనుల సాంగత్యం ద్వారా పొందిన అమితపుణ్యం కలిగినవాడివి కావడం వలన ఈ నరకాలను కేవల దర్శనమాత్రంగా 
తరించగలిగావు.


పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి, అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ తను యక్షరూపుడై, కుబేరుడికి ఆప్తుడై, ధనయక్షుడు అనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు ఆ మధ్యలో ఏర్పరచిన 'ధనయక్షుతీర్థం' ఇతని పేరుమీదనే సుమా! అందువలన, సత్యభామా! పాపహారిణీ, శోకనాశినీ అయిన ఈ కార్తీక వ్రత ప్రభావంవల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. అని సత్యభామకు చెప్పినవాడై, శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్టార్థమై స్వీయగృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు.


                    ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం


                    ఇరవై ఎనిమిదవ అధ్యాయం


సూత ఉవాచ: ఈ కార్తీకమాసము పాపనాశని విష్ణువుకు ప్రియకరి, వ్రతస్థులకు భుక్తి, ముక్తిదాయినీ అయి వుంది. కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతఃస్నానము, తులసి సేవ ఉద్యాపనం, దీపదానం అనే ఈ అయిదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించినవారు ఇహానుభుక్తిని, పరానముక్తినీ పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీకవ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్థ కామమోక్షాలు నాలుగింటికోసమూ కూడా ఈ కార్తీకవ్రతం ఆచరించవలసి వుంది.


కష్టుడయినా, దుర్గారణ్యగతుడు అయినా, రోగి అయినా సరే విడువకుండా ఈ వ్రతాన్ని పాటించాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనో, విష్ణువు ఆలయంలోనో హరిజాగారాన్ని ఆచరించాలి. శివవిష్ణు దేవాలయాలు చేరువలో లేనప్పుడు రావిచెట్టువద్దగానీ, తులసీవనంలోగాని వ్రతం చేసుకొనవచ్చును. విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్నీ, వాద్యాలను వాయించేవాళ్ళు అశ్వమేథఫలాన్నీ, నర్తకులు సర్వతీర్థాల స్నానఫలాన్నీ పొందుతారు. ఆపదలలో ఉన్నవాడు, రోగీ, మంచినీరు దొరకనివాడు, వీళ్ళు కేశవ నామములతో లాంచన మార్జన ఆచరించితే చాలు, వ్రతోద్యాపనకు శక్తిలేనివాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది.


శ్లో     ''అవ్యక్తరూపిణో విష్ణో స్వరూపో బ్రాహ్మణోభువీ'' 


శీమహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు, కావున ఈ కార్తీకమందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. 
అందుకు కూడా శక్తిలేనివాళ్ళు గో పూజ చేసినా చాలును, ఆ పాటి శక్తయినా లేనివాళ్ళు రావి-మఱ్ఱి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు. 
దీపదానం చేసే స్తోమత లేనివారు, దీపారాధన అయినా తాహతు లేనివారు ఇతరులచే వేలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి, గాలి మొదలైన వాటివలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేని వారు తులసి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణున్ని పూజించాలి.


                    రావి - మఱ్ఱి


సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నిటి కంటే కూడా రావి, మఱ్ఱి వృక్షాలు మాత్రమే గో, బ్రాహ్మణతుల్య పావిత్ర్యత నెలా పొందాయి అని అడిగాడు సూతుడు.


పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహా సురతభాగంలో వుండగా కార్యాంతరం వలన దేవతలు, అగ్నీ కలిసి బ్రాహ్మణ వేషదారులై వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు కినిసిన పార్వతీదేవి 'సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లయి పడివుండండి' అని శపించింది. దాని కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసివచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలాశవృక్షంగానూ, విష్ణువు అశ్వత్థంగానూ, శివుడు వటముగానూ మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవరూపాలు గనుకనే రావి-మఱ్ఱి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శనిదృష్టి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావిచెట్టును తాకరాదు సుమా! అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు.


                    ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది అధ్యాయాలు సమాప్తం


                    ఇరవై తొమ్మిదవ (బహుళ చతుర్థి)రోజు పారాయణ సమాప్తం 

0 Comments To "karthika puranam day 29 parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!