Karthika Masam Day 6 Parayanam

కార్తీక పురాణము ఆరవరోజు పారాయణము 
                    పదకొండవ అధ్యాయము 
 

వశిష్ట ఉవాచఓ మహారాజా! కార్తీకమాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ, కుశలతోనూ పూజించేవాళ్ళు పాపవిముక్తులై వైకుంఠం పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారు. కార్తీక స్నానం ఆచరించి విష్ణుసన్నిధిలో దీపమాలికలు ఉంచే వాళ్ళూ, పురాణ పాఠకులూ, శ్రోతలూ కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వపాపాలనూ నశింపచేసేదీ, ఆయురారోగ్యదాయినీ అయిన ఒక కథను వినిపిస్తాను విను. 
                    మంధరోపాఖ్యానము 
కళింగ దేశీయుడు అయిన మంధరుడు అనే ఒకానొక బ్రాహ్మణుడు స్నానసంధ్యా వందనాలు అన్నింటినీ వదిలేసి, పరులకు కూలిపనులు చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికా శుభలక్షణ సంపన్నురాలు, సద్గుణంతో ఉండటం చేత 'సుశీల' అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా, అతనిపట్ల రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్టాపరురాలు అయి ఉండేది. కొన్నాళ్ళ తరువాత, కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు అరణ్యంలో ఉంటూ, ఖడ్గం చేతపట్టి దారులు కాసి బాటసారులను కొట్టి వారినుండి ధనం అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగసొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబపోషణ చేసేవాడు.
ఒకసారి దొంగతనం కోసం దారికాసి ఉన్న మంధరుడు, బాటసారి అయిన ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని అక్కడి మర్రిచెట్టుకి కట్టివేసి ఆ బ్రాహ్మణుడి డబ్బులన్నీ అపహరించాడు. ఇంతలోనే అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు, దోచుకోనిన మంధరుడినీ, దోచుకోబడి బంధితుడై వున్న బ్రాహ్మణుడినీ ఇద్దరినీ కూడా చంపేసి, అ ద్రవ్యాన్ని తాను అహరించుకుని వెళ్ళబోయాడు. కాని, అదే సమయానికి అక్కడి కిరాత, మంధర, బ్రాహ్మణులనుండి వచ్చే నరవాసనను పసిగట్టిన దగ్గరలోని గుహలో ఉన్న పెద్దపులి గాండ్రుమంటూ వచ్చి, కిరాతకునిపై పడింది. పులి తన పంజాతోనూ, కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ జగడంలో పులీ, కిరాతకుడు కూడా ఏకకాలంలోనే మరణించారు. ఆ విధంగా మరణించిన బ్రాహ్మణ, మంధర, పులి, కిరాతకుల జీవులు నలుగురూ యమలోకం చేరి, కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురినీ, పురుగులూ, అమేథ్యమూతో నిండివున్న రక్తకూపంలో పడేశారు. 
ఇక భూలోకంలో, భర్త మరణవార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రం, నిత్యం భర్త ధ్యానం చేస్తూ, ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఒకనాడు- నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, అందరిలోనూ భగవంతుణ్ణి దర్శించువాడూ, నిత్యానంద నర్తకుడు అయిన ఒకానొక యతీశ్వరుడు - ఈ సుశీల యింటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్షవేసి 'అయ్యీ! నా భర్త కార్యార్థియై వెళ్ళి ఉన్నాడు. ఇంట్లో లేడు. నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను' అని విన్నవించుకుంది. అందుకు ఆ యతీశ్వరుడు 'అమ్మాయీ! ఆవేదన పడకు. ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. ఈ రోజు సాయంకాలం నీ యింట పురాణపఠనం, శ్రవణం మొదలైనవి ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గర వుంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చును' అని సలహా ఇచ్చాడు. 
ఆ యతిశ్రేష్టుని మాటలను అంగీకరించి, సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా పరిశుభ్రం చేసి, రెండువత్తులను చేసి, యతీశ్వరుని దగ్గర నూనెతో వాటినే వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి, ఆ దీపసహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధికోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల యిండ్లకు వెళ్ళి, వారినందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమా తాను కూడా ఏకాగ్రచిత్త అయి ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులను అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి, తరువాత కాలధర్మం చెందింది. 
తక్షణమే శంకు చక్రాలు కలిగిన, చతుర్భాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ, రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబర ఆభరణాలు అలంకరించుకుని వున్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకుని వెళ్ళసాగారు. అలా వైకుంఠానికి వెళుతున్న సుశీల, మార్గమధ్యంలోని నరకంలో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి, విమానాన్ని ఆపించి, దానికి కారణం ఏమిటో తెలుపవలసిందిగా విష్ణుదూతలను కోరింది. అందుకు వారు 'అమ్మా! నీ భర్త అయిన ఆ మంధరుడు బ్రాహ్మణ కులంలో జన్మించినా కూడా వేద ఆచారాలను వదిలేసి, కూలీ అయి, మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే వున్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడు ఒకడిని చంపి, అతని ధనంతో పరదేశాలకు పారిపోయి వెళ్తూ నీభర్త చేత బందితుడు అయ్యాడు. అతగాడి పాపానికిగాను, ఇతను నరకం చేరవలసి వచ్చింది. ఇక నాలుగవ జీవి ఒక పులి. ఆ పులి అంతకు పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడు అయి ఉండీ ద్వాదశి రోజున భక్ష్యాభక్ష్య విచక్షణ లేకుండా ఆచరించిన తైలంతో చేసిన భోజనం తినడం వలన నరకం పొంది - పులిగా పుట్టి - ఈ కిరాతకునితో దెబ్బలాటలో అతనితో పాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకూ కారణాలు ఇవే తల్లీ' అని చెప్పారు.
ఆ తరువాత సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకు ఆ నరకం తప్పుతుందో చెప్పమని కోరగా, వైష్ణవులు 'కార్తీకమాసంలో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వలన నీ భర్తా -పురాణ శ్రవణార్థమై నువ్వు యింటికి వెళ్ళి ప్రజలను పిలిచినా పుణ్యం ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు, ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని చెరిసగం ధారపోయడం వలన కిరాత, వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తిని పొందుతారు' అని పలికారు. అలా వాళ్ళు చెప్పిందే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారివారికి ధారబోయడంతో ఆ నలుగురూ నరకం నుండి విముక్తులై దివ్యవిమాన అధిరోహులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తిపదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జానక మహారాజా! కార్తీకమాసంలో చేసే పురాణ శ్రవణంవలన హరిలోకం తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. 
                  

పదకొండవ అధ్యాయం సమాప్తం 

పన్నెండవ అధ్యాయం


మళ్ళీ వశిష్టుడు జనకునికి ఇలా చెప్పసాగాడు 'ఓ రాజా! కార్తీకమాసంలో వచ్చే సోమవార మహత్యం వినివున్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి వందరెట్లు, కార్తీకపూర్ణిమ వెయ్యిరెట్లు, శుక్లపాడ్యమి లక్షరెట్లు, శుక్ల ఏకాదశి కోటిరెట్లు, ద్వాదశి లెక్కలేనంత, అనంతమైన ఫలాలనూ అదనంగా ప్రసాదిస్తాయి. మోహంచేత అయినా సరే శుక్ల ఏకాదశినాడు ఉపవాసం ఉండి, మరుసటిరోజు (ద్వాదశి) బ్రాహ్మణులతో కలిసి పారణ చేసేవాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు అన్నదానం చేసినవారికి సమస్త సంపదలూ అభివృద్ధి చెందుతాయి. రాజా! సూర్యగ్రహణ సమయంలో గంగాతీరంలో కోటిమంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యమూ కూడా కేవలం కార్తీక ద్వాదశినాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. వేయి గ్రహణపర్వాలు, పదివేల వ్యతీపాతయోగులూ, లక్ష అమావాస్యా పర్వాలూ ఏకమైన కూడా ఒక్క కార్తీక ద్వాదాశిలో పదహారవవంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్య ప్రదాలైన తిథులెన్ని అయినా ఉండవచ్చునుగాక. కాని వాటన్నింటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదం అని మరిచిపోకు.    


                    ద్వాదశీ దానములు


ఏకాదశినాడు రాత్రి సమయంలో కార్తీకశుద్ధ ద్వాదశినాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువల్లనే దీనికి హరిబోధినీ ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధినినాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికి అయినా అన్నదానం చేస్తారో, వాళ్ళు ఇహంలో  భోగసేవలను, పరంలో భోగిశయన సేవలను పొందుతారు. కార్తీక ద్వాదశినాడు పెరుగూ, అన్నం దానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశినాడు పాలు ఇచ్చే ఆవును వెండి రెక్కలూ, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో, వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలు అయితే ఉంటాయో, అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈ రోజు వస్త్రదానం చేసినవాళ్ళు సంచితార్థాలు అన్నీ సమసిపోయి వైకుంఠాన్ని వెళతారు అనడంలో ఎటువంటి వివాదమూ లేదు. పండ్లు, తాంబూలం, యజ్ఞోపవీతాలను సదక్షిణంగా దానం చేసేవాళ్ళు సమస్త భోగాలనూ అనుభవించి అంత్యంలో ఆ శ్రీహరిని చేరుతారు. ఓ మహారాజా! ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశినాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసివృక్షాన్ని, దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతాను విను.


                    ధర్మవీరోపాఖ్యానము  

పూర్వం గోదావరీతీరంలో దురాచారవంతుడూ, పరమ పిసినిగొట్టూ అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు, ఈ పిసినిగొట్టు దానధర్మాలు చేయకపోవడమే కాక, తాను కూడా తినకుండా ధనం ప్రోగుచేసేవాడు. దానధర్మాలే కాదు కనీసం ఎవరికీ మాటసాయమైనా చేసేవాడు కాదు. నిత్యం ఇతరులను నిందిస్తూ ఇతరుల డబ్బులపై ఆసక్తి చూపే ఈ పిసినిగొట్టు ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకూ డబ్బును పెంచుకోసాగాడు. 
ఒకానొక సారి ఈ పిసినిగొట్టు బ్రాహ్మణుడికి ఇచ్చిన అప్పు రాబట్టుకోవడం కోసం, అతని గ్రామానికి వెళ్ళి తాను ఇచ్చిన బాకీని వడ్డీతో సహా వెంటనే చెల్లించాల్సిందిగా పట్టుబట్టాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు 'ఓ ఋణదాతా! నేను నీ బాకీ ఎగవేసే వాడిని కాదు. ఎందుకంటావేమో


శ్లో     యో జీవతి ఋనిణీత్యం నియమం కల్పమశ్నుతే !
    పశ్చాత్తస్యసుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి !!


ఎవడైతే ఋణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో ఋణదాతకు సంతానం రూపంగా జన్మించి ఆ ఋణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఎదో విధంగా సంపాదించి ఈ మాసం చివరిలో నీ ఋణం చెల్లుచేస్తాను. అంతవరకూ ఓర్పు వహించి ఉండు' అని చెప్పాడు. 
ఆ బ్రాహ్మణుని మాటలను పరాభవం మాటలుగా భావించిన పిసినిగొట్టు కోపంగా 'నీ కబుర్లు నా దగ్గర కాదు నీబాకీ వసూలు కోసం నెల్లాళ్ళు ఆగే సమయం నాకు లేదు. మర్యాదగా యిప్పుడే ఇవ్వు లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను' అన్నాడు. యదార్థంగానే ఆ సమయంలో దానం లేదనీ, అప్పటికప్పుడు తాను ఆ అప్పు తీర్చలేననీ చెప్పాడు బ్రాహ్మణుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి, నేలమీద పడద్రోసి, కాలితో తన్ని, అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వ్రేటు వేశాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా, కోపంతో, ఆవేశంతో ఆ కోమటి కొట్టిన కత్తిదెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడు అనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా! అదే విధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతిచెందాడు. తక్షణమే యమకింకరులు వచ్చి ఆ జీవుడిని నరకానికి తీసుకుని పోయారు. జనక భూపతీ! 'రురువు'లనే మృగాల చేతా, వాటి శృంగాలచేతా పీడింపచేసే ఒకానొక యాతననే 'రౌరవం' అంటారు. ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. యమకింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. 
ఇక భూలోకంలో ఆ పిసినిగొట్టు వైశ్యుడి కుమారుడు ధర్మవీరుడు అనే వాడు మహాదాత, పరోపకారీ అయి, పిత్రార్జితం అయిన ఆ అఖండ ధనరాశులతో ప్రజాశ్రేయస్సు కోసం చెరువులు, నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహ ఉపనయనాలు వంటివి చేయిస్తూ యజ్ఞాలు, యాగాలు మొదలైనవి, ఆకలితో అలమటించే వారిని తరతమ భేదం లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేరుపొందాడు. ఒకానొక రోజున ధర్మవీరుడు విష్ణుపూజ చేసే సమయంలో త్రిలోక సంచారి అయిన నారదమహర్షి యమలోకం నుండి బయలుదేరి, హరినామ స్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుడిని దగ్గరకు వచ్చాడు. ముందుకు వచ్చిన మునిరాజు నారదుడిని చూసి, ధర్మవీరుడు భక్తీప్రవత్తులతో ప్రణమిల్లాడు. ఆర్ఘ్యపానాది వివిధ ఉపచారాలతోనూ నారదుడిని పూజించి 'నారదా! దేవర్షులైన మీరు ఇలా మా భూమండలానికి అందులోనూ నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్య ప్రభువా! నేను నీ దాసుడినే. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేం చెబితే అది చేస్తాను' అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడై 'ధర్మవీరా! నాకోసం నువ్వు ఏమే చేయనక్కరలేదు. నీ శ్రేయస్సు కోసం చెబుతున్న నా ఈ మాటలని శ్రద్ధగా విను ... కార్తీక ద్వాదశీ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నానదాన జపతపాలు వాటి కార్యాలు అన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి. ధర్మవీరా! సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశినాడు ప్రాతఃస్నానం చేసి సాలగ్రామ దానం చేసే వారు దరిద్రులుకానీ, ధనికులుకానీ, యతులుకానీ, వానప్రస్థులుకానీ, బ్రాహ్మణులుకానీ, క్షత్రియులుకానీ, వైశ్యులుకానీ, శూద్రులూ, స్త్రీలేకానీ వాళ్ళు ఎవరైనా సరే జన్మజన్మాంతరాలలో చేసిన పాపాలను దహింపచేసుకున్న వాళ్ళే అవుతారు. మరో ముఖ్య విషయం చెబుతాను విను. నీ తండ్రి మరణించి, యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. అతణ్ణి నరకబాధా విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశినాడు సాలగ్రామ దానం చెయ్యి'.
నారదుడు చెప్పినది అంతా విని నవ్వేశాడు. ధర్మవీరుడు ఇలా అడిగాడు 'నారదమునీంద్రా! నా తండ్రి పేరున గో, భూ, తిల, సువర్ణ మొదలైన దానాలు ఎన్నో చేశాను. వాటివల్ల వెలువరింపబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యం అవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికి పనికిరాదు, అలంకారానికా నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి? రాతి దాతకు కీర్తీ వుండదు. ఆ దానం పట్టినవాడికి సుఖమూ వుండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానం నేను చేయ్యనుగాక చెయ్యను' అన్నాడు. 
నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా, ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు వెళ్ళిపోయాడు. మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులూ, సర్వహితాత్ములూ అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామం దానం చేయకపోవడం వలన నరకానికి చేరుకున్నాడు. తరువాత మూడుసార్లు పులిగాను, మూడుసార్లు కోతిగానూ. అయిదు సార్లు ఆంబోతుగానూ, పది ఆర్లు స్త్రీగానూ జన్మించి వైధవ్య పీడ పొందడం జరిగింది. మళ్ళీ పదకొండవ జన్మలో కూడా ఒకానొక యాచకుడికి పుత్రికగా పుట్టవలసి వచ్చింది. పూర్వకర్మల వలన పెండ్లికుమారుడు తొందరగా మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టితో తన కూతురి పూర్వజన్మల పాపఫలాన్ని తెలుసుకున్నాడు. ఆ విషయాలు అన్నీ ఆమెకు వివరంగా చెప్పి కార్తీక సోమవారం రోజున వేదోక్తంగా, జన్మ జన్మార్జిత పాపనాశనం కోసం సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలాల వ్యాప్తి వల్ల మరణించిన పెండ్లికొడుకు పునర్జీవితుడు అయ్యాడు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి, కాలాంతరం తరురువాత స్వర్గం చేరి, పుణ్యఫలాలను అనుభవించే అర్హులు అయ్యారు. తరువాత ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణ ఇంట్లో శిశువుగా పుట్టి, పూర్వజన్మలో చేసిన మహాత్వపూర్వకమైన సాలగ్రామా దాన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయి ప్రతి సంవత్సరం ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలం వల్ల 'రౌరవ' గతుడు అయిన ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడు అయ్యాడు. కాబట్టి జనక మహారాజా! కార్తీకమాసంలో సాలగ్రామ దానం చేత ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తం. 'ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు' అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు.


            పదకొండు పన్నెండు అధ్యాయాలు సమాప్తం


                    ఆరవరోజు పారాయణం సమాప్తం.

 

 

Products related to this article

Ganesha Car Hanging (Green)

0 Comments To "Karthika Masam Day 6 Parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!