Karthika Masam Day 7 Parayanam

కార్తీక పురాణము - ఏడవరోజు పారాయణ 
వశిష్ట ఉవాచ :

రాజా! ఎంత చెపినా తరగని ఈ కార్తీక మహాత్య మహాపురాణంలో కార్తీకమాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను, ఏకాగ్రత చిత్తంతో విను. తప్పనిసరిగా చేయవలసినవీ, చేయకపోవడం వలన పాపం కలిగించేవీ అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన  బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను. 
జనక రాజేంద్రా! ఈ కార్తీకమాసంలో కన్యాదాన, ప్రాతఃస్నానాలు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానాలు ఇవి చాలా ప్రధానమైనవి. ధనంచేత పేదవాడూ, గుణం చేత యోగ్యుడూ ఆయిన బ్రాహ్మణ కుమారుడికి కార్తీక మాసంలో వడుగు వేయించి దక్షణ సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వాడు చేసే గాయత్రీ జపం వల్ల దాతయోక్క పంచమహా పాతకాలూ నశించిపోతాయి. వంద రావిచెట్లు నాటించినా వంద తోటలను వేయించినా, వంద నూతులనూ దిగుడుబావులనూ నిర్మించినా, పదివేల చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యం ఎంతయితే వుంటుందో, అది పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారో వంతు కూడా సమానం కాదు. ముఖ్యమైన విషయం గుర్తుంచుకో ..


శ్లో     మాఘ్యాం వై మాధవేమాసి చోత్తమం మౌంజి బంధనం !
    కారయిష్యంతి తే రాజః దానం తత్వాతు కార్తికే !! 


కార్తీకంలో ఉపనయన దానం చేసి తరువాత వచ్చే మాఘంలోగాని, వైశాఖంలోగాని ఉపనయనం చేయించాలి. సాధువులూ, పేద బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంతపుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు అందరూ కూడా చెప్పారు. అటువంటి ఉపనయనానికి కార్తీకమాసంలో సంకల్పం చెప్పుకుని ఫలానావవారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యంకాదని తెలుసుకో


జనక నరపాలా:

ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవబ్రాహ్మణ సమారాధనలూ వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది అన్న విషయం జగమంతా తెలిసినదే కదా! కార్తీకంలో, తమ ధనంతో ఒక బ్రాహ్మణ బాలకుడికి ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించడం వలన దాని పుణ్యం మరింతగా ఇనుమడిస్తుంది.


శ్లో     కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్భక్తితో నఘ !
    స్వయంపాపై ర్వినిర్ముక్తః పితౄణాం బ్రాహ్మణః పదం !! 
కార్తీకంలో కన్యాదానం ఆచరించినవాడు స్వయంగా వాడు తరించడమే కాక, వాడి పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించినవాడు అవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసం చెబుతాను విను.


                    సువీరోపాఖ్యానము


ద్వాపరయుగంలో వంగదేశంలో దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. లేడి కన్నులవంటి సోగకన్నులు గల సుందరాంగి ఒకరు అతని భార్యగా ఉండేది. దైవయోగం వలన సువీరుడు, దాయాదులచే ఓడింపబడి, రాజ్యభ్రష్టుడు అయి, అర్థాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి, కందమూలాలతో కాలం గడుపుకోసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాల నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలూ శత్రువులపాలై పోవడం, తను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతూ ఉన్న ఈ రోజులలో కడుపుపండి సంతానం కలగడం, సంతాన పోషణకు చేతిలో చిల్లిగవ్వ అయినా లేని దరిద్రం, వీటన్నిటినీ పదేపదే తలచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురును పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు కూడా చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాలతో చూసేవారి నేత్రాలకు అందంగా పరిణమించింది. ఎనమిది సంవత్సరాల ప్రాయంతో ఎంతో మనోహరంగా వున్న ఆమెని చూసి, మోహితుడు అయిన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుడిని కోరాడు. అందుకు రాజు 'ఋషిపుత్రా! ప్రస్తుతం నేను ఘోరదరిద్రంతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ ఈ కోరిక తీరుస్తాను' అన్నాడు. ఆ పిల్లమీద మక్కువ మరిచిపోలేక ముని బాలకుడు 'రాజా! నేను కేవలం మునికుమారుడినైన కారణంగా నీవు అడిగినంత ధనం తక్షణమే ఇవ్వలేను తపస్సు చేసి, దానిద్వారా ధనం సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకూ ఆ బాలికను నా కోసం భద్రపరచి వుంచు'అని చెప్పి, అందుకు సువీరుడు అంగీకరించడంతో, ఆ నర్మదా తీరంలోనే తపోనిష్టుడై, దాని ఫలితంగా అనూహ్య ధనరాశి సాధించి,దాన్ని తెచ్చి సువీరుడికి ఇచ్చాడు. ఆ సొమ్ముకి సంతృప్తి చెందిన రాజు తమ యింటి ఆచారం ప్రకారంగా తన కూతురుని ఆ మునియువకుడికి ఇచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణం జరిపించేశాడు. ఆ బాలిక, భర్తతో కలసి వెళ్ళిపోయింది. కన్యాశుల్కం ద్వారా లభించిన సొమ్ముతో, రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. దాని ఫలితంగా సువీరుడి భార్య గర్భిని అయి మళ్ళీ ఒక ఆడపిల్లను ప్రసవించింది. దానికి రాజు చాలా ఆనందించాడు. పెద్దపిల్లను అమ్మి ధనం రాబట్టినట్టే, ఈ పిల్ల ద్వారా కూడా మరింత ధనాన్ని సంపాదించవచ్చు అని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇలా ఉండగా ...
ఒక యతీశ్వరుడు నర్మదానదిలో స్నానం చేయడానికి వచ్చి, అక్కడి పర్ణశాలలో వున్న సువీరుడినీ, అతని భార్యనూ, కుమార్తెనూ చూసి 'ఓయీ! నేను కౌండిన్య గోత్రం కలిగిన యతిని .. ఈ అరణ్యప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వు ఎవరివి?' అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నకు జవాబుగా ... 'అయ్యా! నేను వంగదేశాధీశుడినైన సువీరుడిని. దాయాదుల వలన రాజ్య భ్రష్టుడినై ఇలా అడవిలో జీవిస్తున్నాను.


శ్లో     న దారిద్ర్య స్సమం దుఃఖం! నశోకః పుత్రమారణాత్ 
    న చ వ్య ధానుగమనేన వియోగః ప్రియావహాత్ !!


దరిద్రంకన్నా ఏడిపించేది -కొడుకు, చావు (లేకపోవడం) కంటే ఏడవవలసినదీ-భార్య (రాజ్యం, భార్యా, రాజానాం) వియోగంకన్నా బయటకు ఏడవలేని, అంతశ్శల్యలాంటి దుఃఖం-ఇంకమీ ఉండవని తమకు తెలిసినదే గదా! ప్రస్తుతం నేనా విధంగా కందమూల ఆహారం తినడంతో ఈ అరణ్యమే శరణ్యంగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకో కూతురు పుట్టింది. ఆమెను ఒక మునికుమారుడికి అమ్మి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను. ఇది నా రెండవ కూతురు, ఈమె నా భార్య, నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను' అన్నాడు సువీరుడు.
సువేరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు 'ఓ రాజా! ఎంత పనిచేశావు? మూర్ఖుడివి అనంతమైన పాపాన్ని ప్రోగుచేసి పెట్టుకున్నావు.


శ్లో     కన్యా ద్రవ్యేణ యో జీవే దసిపత్రం సగచ్చతి 
    దేవాఋషిన పితౄన్ క్వాపి కన్యా ద్రవ్యేణ తర్పయేత్ 
    శాపం దాస్యంతి తే సర్వ జన్మ జన్మ న్యపుత్రతాం !!


ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు, మరణం తరువాత 'అసిపత్రం' అనే నరకం పాలవుతాడు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పనాదులవలన ఆ దేవ, ఋషి, పితరులు అందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు - కర్తకు జన్మ జన్మలకూ కూడా పుత్రసంతానం కలగకూడదని శపిస్తారు. ఇక, అలా ఆడపిల్లలను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు - ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు - రాజా!


శ్లో     సర్వేషా మేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్భుధాః !
    కన్యావిక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం న చోదితం !!


అన్ని రకాల పాపలకూ ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయిగాని, ఈ కన్యాశుల్కం అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఏటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు.  
కాబట్టి, సువీరా! ఈ కార్తీకమాసంలో శుక్లపక్షంలో, నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీకమాసంలో విద్యా తేజశ్శీల యువకుడు అయిన వరుడికి కన్యాదానం చేసినవాడు - గంగానది సమస్త తీర్థాలలోనూ స్నాన, దానాలు చేయడంవలన కలిగే పూజ్యాన్ని, తోచిన దక్షిణా సమేతంగా ఆశ్వమేథలాంటి యాగాలు చేసినవాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు' అని హితబోధ చేశాడు.
కాని, నీచబుద్ధితో కూడుకొన్న ఆ సువీరుడు, అ సజ్జనుడి భోధనలను కొట్టి పారేస్తూ 'బాగా చెప్పావయ్యా బాపడా! పుట్టినందుగాను పుత్రదారా గృహ, క్షేత్ర వాసోవాసు (బంగార్యా) లంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిగా ఉంచి సుఖించాలేగాని, ధర్మం, ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగ? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలు అంటే ఏమిటి? అయ్యా ఋషి గారూ! ఏదోరకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్దపిల్ల విషయంలో కంటే అధికంగా ధనం ఇచ్చేవాడికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేసి - నేను కోరుకునే సుఖభోగాలు అన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలు అన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు' అని కసిరికొట్టాడు. అంతటితో ఆ యతీంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. 


                    శృత కీర్త్యోపాఖ్యానము


ఈ సువీరుడి పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడు ఉన్నాడు. సమస్త ధర్మంగా ప్రవర్తించిన, వందకుపైగా యాగాలు చేసినవాడు అయిన శృతకీర్తి తన పుణ్య కార్యాలవలన స్వర్గంలో ఇంద్రుడు, మిగిలినవారిచే గౌరవించబడుతూ, సమస్త సుఖాలనూ అనుభవిస్తున్నాడు. సువీరుడికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరుకొని అక్కడ సుఖపడుతున్న శృతకీర్తి యొక్క జీవుడిని పాశబద్ధుడిని చేసి నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకి ఆశ్చర్యపడిన శృతకీర్తి యముడి ముందు నిలబడి 'స్వర్గంలో వున్న నన్ను - ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపం ఏమిటి?' అని నిలదీసి అడిగాడు. మందహాసం చేశాడు ఆ మహాధర్ముడు. ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. 'శృతకీర్తీ! నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గ అర్హుడివే. కానీ నీ వంశీకుడు అయిన సువీరుడు అనే వాడు - కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన, అతని వంశీకులైన మీరు అంతా నరకానికి రావలసి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడివి అయినందువలన నీకొక అవకాశం ఇస్తున్నాను. పరమ పాపకృత్యం చేసిన, సువీరుడి రెండవ కుమార్తె - నర్మదా నదీతీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహి (భూలోకవాసులు గుర్తించే శరీరి [శరీరం]) వై, అక్కడకు వెళ్ళి, అక్కడ మునులకు ఈ విషయాన్ని చెప్పి, కార్తీకమాసంలో ఆ బాలికను యోగ్యుడైన వరుడికి ఇచ్చి, కన్యాదాన విధానంగా పెళ్ళి జరిపించు. శృతకీర్తీ! ఎవడైతే కార్తీకమాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతికి అర్హుడు అవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండికూడా, సంతానం లేనివాడు, బ్రాహ్మణ కన్యాదానానికి, కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి కానీ ధనసహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్ష ఆశించకుండా రెండు పాడి ఆవులను చెల్లించి, కన్యను కొని, ఆ కన్యను చక్కటి వరుడికి ఇచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్నే పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తీ! నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కన్యామూల్యంగా దానం చేసినట్లయితే దానిద్వారా నువ్వూ, నీ పూర్వీకులూ, ఈ సువీరుడు ఇతరులు నరకం నుండి విముక్తి పొందుతారు' అని చెప్పాడు.
యమధర్మరాజు అనుగ్రహం వలన శరీరం పొంది శృతకీర్తి, వెంటనే భూలోకంలోని నర్మదా నదీతీరాన్ని చేరుకొని అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి, వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణ ఆభరణాలతో అలంకారణ చేసి, శివప్రీతిగా, 'శివార్పణమస్తు' అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానంగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు, నరకపీడా విముక్తుడు అయి, స్వర్గం చేరి సుఖించసాగాడు. తరువాత శృతకీర్తి, పదిమంది బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని ధారపోయడం వలన వారివారి పితృపితామహ వర్గాల వారంతా కూడా విగత పాపులై, స్వర్గాన్ని పొందారు. తరువాత శృతకీర్తీ కూడా యధాపూర్వకంగా స్వర్గం చేరుకొని తనవారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనకమహారాజా! కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు సర్వపాపాలనూ నశింప చేసుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా! కన్యా మూల్యాన్ని చెల్లించలేనివారు, వివాహం కోసం మాటసహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా! ఎవరైతే కార్తీకమాసంలో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్నీ, ఆచరించనివాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు.


                    పదమూడవ అధ్యాయం సమాప్తం


                    పదనాలుగవ అధ్యాయం ప్రారంభం


వశిష్టుడు చెబుతున్నాడు: మిథిలాధీశా! కార్తీకమాసం అంతా భక్తితో సర్వధర్మ యుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీకపౌర్ణమి నాడు వృషోత్పర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి.


                    వృషోత్పర్గం


జనక మహీపాలా! ఆవుయొక్క కోడెదూడను - అచ్చువేసి ఆబోతుగా స్వేచ్చగా విడిచిపెట్టడాన్నే వృషోత్పర్గం అంటారు. ఈ మానవలోకంలో ఏ యితర కర్మాచారణలవలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే, కార్తీకపౌర్ణమినాడు పితృదేవతా ప్రీత్యర్థం ఒక కోడె (ఆవు) దూడను అచ్చువేసి ఆబోతుగా స్వేచ్చగా వదలాలి. అలా చేయడం వలన గయా క్షేత్రంలో, పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది.


శ్లో     యః కోవా నస్మత్కులే జాతః పౌర్ణమాస్యాంతు కార్తికే !
    ఉత్సృజే ద్వ్రుషభేనీలం తేన తృప్తా వయం తితి !!
    కాంక్షంతి నృవశార్దూల - పుణ్యలోకస్థితా అపి ..


'పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టినవాడు ఎవడయినా కార్తీక పౌర్ణమినాడు నల్లని గిత్తను అచ్చువేసి వదిలినట్లయితే మనకు అమిత ఆనందం కలుగుతుంది కదా' అని చింతిస్తూ ఉంటడు. రాజా! ధనికుడు అయినా, దరిద్రుడు అయినా సరే, జీవితంలో ఒక్కసారయినా కార్తీకపౌర్ణమినాడు వృషోత్సర్గం చేయనివాడు 'అంధతామిశ్రం' అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రార్థం వలనగానీ, ప్రీతివర్ష ఆబ్దికాలుగాని, తీర్థస్థలాలలో తర్పణం వల్లగాని, ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరనీ, గయా శ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా, వృషోత్సర్గమే ఉత్తమమైనది అనీ తెలుసుకో.


                    వివిధదానములు


ఇక కార్తీకమాసంలో పండ్లు దానం చేసేవాడు - దేవర్షి పితృఋణాలు మూడింటినుంచి కూడా విముక్తుడు అయిపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రీ (ఉసిరిక) ఫలాన్ని దానం ఇచ్చేవాడు సార్వభౌముడు అవుతాడు. కార్తీక పౌర్ణమినాడు దీపదానం వలన త్రికరణ కృతపాపాలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు. కార్తీక పౌర్ణమినాడు లింగదానం సమస్త పాపహారకం, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి, మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు.


                    నిషిద్ధ ఆహారాలు


అనంత ఫలదాయకమయిన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశం అందరికీ తేలికగా లభ్యం కాదు. అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీకమాసంలో ఇతరుల అన్నం, పితృశేషం, తినకూడనివి తినడం, శ్రాద్ధాలకు భోజనానికి వెళ్ళడం, నువ్వులును దానం పట్టడం అనే అయిదూ మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నం, శూద్రాన్నం, దేవార్చకాన్నం, అపరిశుద్దాన్నం, త్యక్తకర్ముడి అన్నం, విధవా అన్నం అనేవి తినకూడదు. కార్తీకపూర్ణిమా అమావాస్యలలోనూ, పితృదివసంనాడు, ఆదివారం నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతీపాతవిదృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం. ఈ నెలలో వచ్చే ఏకాదశినాడు రాత్రింబవళ్ళు రెండు పూజలు కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తం (అనగా తమ నీడ-శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు  భోజనం చేయడం) ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమపవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించేవారి పాపాలు లెక్కలేకుండా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలంతో స్నానం, పగటిపూట నిద్ర, కంచుపాత్రలో భోజనం, పాఠాన్న భోజనం, గృహస్నానం, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం, వేదశాస్త్ర నింద అనే ఈ ఏడూ జరపకూడదు. సమర్థులై ఉండికూడా కార్తీకంలో నదీస్నానం చేయకుండా, ఇంటిదగ్గరనే వేడినీటి స్నానం చేసినట్లయితే అం-కల్లుతో చేసిన స్నానానికి సమానం అవుతుందని బ్రహ్మశాసనం-సూర్యుడు తులలో ఉండగా నదీస్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు మాత్రం చేరువులోగాని, కాలువలలోగాని, నూతివద్దగానీ - గంగా గోదావర్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతఃకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయనివాళ్ళు, నరకాన్ని పొంది, తరువాత ఛండాలపు జన్మ ఎత్తుతారు. గంగాది నదీస్మరణం చేసి, స్నానం చేసి, సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి, ఆ విష్ణు కథాపురాణం విని, ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని, సాయంత్రం మరొకసారి స్నానం చేసి, ఆచమం చేసి, పూజాస్థానంలో పీఠంవేసి, దానిమీద ఈశ్వరుణ్ణి ప్రతిష్టించి పంచామృత, ఫలోదక, కుశోదకాలతో మహాస్నానం చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి.


                    పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం


ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. తరువాత : 
ఓం వృషధ్వజాయనమః - ధ్యానం సమర్పయామి (పుష్పాక్షతలు) 
ఓం గౌరీప్రియాయనమః పాద్యం సమర్పయామి (నీటిచుక్క) 
ఓం లోకేశ్వరాయనమః ఆర్ఘ్యం సమర్పయామి (నీటిచుక్క)
ఓం రుద్రాయనమః ఆచమనీయం సమర్పయామి (నీటిచుక్క)
ఓం గంగాధరాయనమః స్నానం సమర్పయామి (నీళ్ళు విడిచిపెట్టాలి లేదా ..


మంత్రం :


ఆపోహిష్టామయోభువః  తాన ఊర్జేదధతాస మహేరణాయ చక్షసే !
యో వశ్శి తమోరసః తస్య భాజయితే హనః ఊశతీరవ మాతరః   
తస్మాదరంగమామవో - యస్యక్షయాయ జి న్వథ అపోజనయథాచనః !!
(అను మంత్రము పఠిస్తూ) నీతితో అభిషేకించవచ్చు. 
ఓం ఆశాంబరాయనమః వస్త్రం సమర్పయామి (వస్త్రయుగ్మం)      
ఓం జగన్నాథాయనమః ఉపవీతం సమర్పయామి (ఉపవీతం)  
ఓం కపాలదారిణే నమః గంధం సమర్పయామి (కుడిచేతి అనామికతో గంధం చిలకరించాలి) 
ఓం ఈశ్వరాయనమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు)
ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి (పువ్వులు)  
ఓం ధూమ్రాక్షాయ నమః దూపమాఘ్రవయామి (అగరువత్తులు లేదా సాంబ్రాణి ధూపం ఇవ్వాలి)
ఓం తెజోరూపాయనమః దీపం సమర్పయామి (ఒక వత్తితో ఆవునేతి దీపాన్ని వెలిగించి చూపించాలి) 
ఓం లోకరక్షాయనమః నైవేద్యం సమర్పయామి (యథాశక్తి నివేదన ఇవ్వాలి)  
'ఓం భూర్భువస్సువః తత్ వితుర్వరేణ్యం భర్గోరేవస్య ధీమహి-ధియోయోనః ప్రచోదయాత్' అనుకుంటూ ఒక ఒకపువ్వుతో నివేదిస్తూ పదార్థాల చుట్టూ నీటిని ప్రోక్షించి 
ఓం ఉదానాయ స్వాహ 
అపానాయస్వాహా 
ఓం వ్యానాయ స్వాహా 
ఓం శ్రీ మహాదేవాయ శివశివశివశివ శంభవే స్వాహా - అంటూ స్వాహా అన్నప్పుడల్లా - ప్రభువుకి నివేదనం చూపించి, ఫలానా పదార్థాన్ని నివేదించాము అనుకుని - అమృతమస్తు, అమృతోపస్తరణ మసి బుతం సత్యేన పరిశికచామి - ఉత్తరాపోషణం సమర్పయామి 'అనుకుని పదార్థాల కుడిపక్కన ఒక చుక్క నీళ్ళను వదిలిపెట్టిన తరువాత ...
ఓం లో - సాక్షిణేనమః తాంబూలాది సమర్పయామి (ఐదు తమలపాకులు, రెండు పోకచేక్కలు సమర్పించాలి) 
ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి (ప్రదక్షిణం)
ఓం కపాలినేనమః నమస్కారం సమర్పయామి (సాష్టాంగ నమస్కారం చేయాలి) 
జనక మహారాజా! పైన చెప్పిన విధంగా షోడశ (పదహారు) ఉపచారాలతోనూ కానీ, నెల పొడుగునా ప్రతిరోజూ సహస్ర నాయయతంగా కానీ శివపూజ చేసి, పూజ చివరిలో మంత్రం     
    పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘ్రి పంకజ !
    అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తంచేద ముమాపతే !!
అనే మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. తరువాత యథాశక్తి దీపమాలలను సమర్పించి, శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకం నెల్లాళ్ళూ కూడా బ్రాహ్మణసమేతుడై నక్తవ్రతాన్ని ఆచరించేవాడు - వంద వాజసేయాలు, వెయ్యేసి సోమేశ్వమేథాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణాధిక్యత - పాపనాశనం అవలీలగా ఏర్పతాయి అనడంలో ఎటువంటి సంకోచమూ లేదు. కార్తీక చతుర్థశినాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడంవల్ల వాళ్ళ యొక్క పితాళ్ళందారు కూడా సంతృప్తులు అవుతారు. కార్తీకశుద్ధ చతుర్థశినాడు ఔరపపుత్రుడు చేసే తిలాతర్పణం వలన పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది. ఈ చతుర్థశినాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి, తిలలు దానం చేసినవాడు కైలాసంకి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతం ఆచరించనివాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్నవాళ్లై - మోక్షంగాములు అవుతారు. జనక మహారాజా ! కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా, వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు.


        పదమూడు - పద్నాలుగు అధ్యాయాలు సమాప్తం


         ఏడవ రోజు పారాయణ సమాప్తము 

 

 

Products related to this article

Decorative Round Tray (Silver Colour)

Decorative Round Tray (Silver Colour)

Decorative Round Bowl(Silver Colour)..

$2.00

0 Comments To "Karthika Masam Day 7 Parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!