Significance of Kartika Pournami

కార్తీక పౌర్ణమి విశిష్టత?

పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీకపౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికీ ఉండదు. కార్తీకశుద్ధ పౌర్ణమి లేదా కార్తీకపౌర్ణమి అంటే కార్తీకమాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏడాది మొత్తం మీద చంద్రుడు కార్తీకపౌర్ణమి రోజున ఉన్నంత ప్రకాశంగా మరే రోజూ ఉండడు. పౌర్ణమి రోజున ముత్తైదువులు రెండురకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ళ నోము అంటే కార్తీక పౌర్ణమి రోజున చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకు, రెండవ సంవత్సరం పదిమందికి, మూడవ సంవత్సరం పదిహేనుమందికి వాయినాలు ఇస్తారు.

 

రెండవ నోము కృత్తికాదీపాల నోము అంటే కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో మొదటి సంవత్సరం 120 దీపాలు, రెండవ సంవత్సరం 240 దీపాలు, మూడవ సంవత్సరం 360 దీపాలను వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం.
కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి. దేవ దీపావళి అని కూడా అంటారు. త్రిపుర పౌర్ణమి, దేవ దీపావళి అని పిలవడానికి గల కారణం వెనుక ఒక కథ వుంది. పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుడు అంతరిక్షంలో మూడు పట్టణాలను నిర్మించుకుని సర్వసుఖాలు అనుభవించేవాడు. బలగర్వంతో  దేవతలను, ఋషులను, మునులను హింసిస్తూ ఉండేవాడు. దేవతలు మునులు ఋషులు అంతా కలిసి పరమశివుడికి మొరపెట్టుకోగా, పరమశివుడు మూడు రోజులపాటు త్రిపురాసురుడితో యుద్ధం చేసి సంహరించాడు. త్రిపుర సంహారం తరువాత దేవతలు అందరూ దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు మత్స్యఅవతారం ఎత్తింది. వృందాదేవి తులసి మొక్కగా అవతరించింది, దత్తాత్రేయుడు పుట్టింది, సిక్కుల మతగురువు గురునానక్ పుట్టింది ఈరోజునే. ఈ రోజు సిక్కులకు మహాపర్వదినం. గురునానక్ జయంతిని గురుపూరబ్ అని అంటారు.

 

జ్వాలాతోరణం

దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా హాలాహలం ఉద్భవించింది. ఇది లోకాలను సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నందున, బ్రహ్మాదులు ఈ ఉత్పాదం నుండి రక్షించమని పరమశివుడిని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన పరమశివుడు ఆ హాలాహలాన్ని మ్రింగడానికి సిద్ధపడ్డాడు. ఆ హాలాహలం బయట ఉంటే పైలోకాలకు, కడుపులోపలికి వెళితే అధో (కడుపులోని) లోకాలను దహించివేస్తుందని అనే ఉద్దేశ్యంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠం మధ్యలోనే నిక్షేపించాడు. అందుకే పరమశివుడు గరళకంఠుడు/నీలకంఠుడు అయ్యాడు. ఇది చూసిన పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి, శివుడికి ప్రమాద నివారణ కోసం ప్రతిసంవత్సరం అగిజ్వాల క్రిందనుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుంది. మహాశివుడికి ప్రమాదం జరగలేదు కాబట్టి పార్వతీదేవి ప్రతిసంవత్సరము కార్తీకశుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయాలలో ఎండుగడ్డితో చేసిన తోరణము రెండు కర్ర స్తంభాల మధ్య కట్టి,దానికి అగ్నిని ముట్టించి, ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే, ఆ జ్వాల క్రిందనుంచి శివపార్వతుల పల్లకిని మూడుసార్లు మోసుకుని వెడతారు. జ్వాలలా వెలిగే ఈ తోరణాన్ని 'జ్వాలా తోరణం' అని అంటారు.


మరొక కథ: త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించింది కార్తీకపౌర్ణమి రోజునే అని పురాణాలు తెలుపుతున్నాయి. అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు కూడా ఉంది. దుష్టులైన రాక్షసులను సంహరించి శివుడు కైలాసానికి చేరుకోగా, పార్వతీదేవి తన భర్తకు దృష్టిదోషం కలిగిందని భావించి దృష్టిదోష పరిహారార్థం జ్వాలాతోరణం జరిపించిందట.
ఈ జ్వాలాతోరణం దర్శించినంత మాత్రాన సమస్తపాపాలు హరింపబడతాయని, ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని కార్తీక పురాణం చెపుతుంది. కార్తీకపౌర్ణమి రోజు శివుడికి, మహావిష్ణువుకి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దేవాలయంలో దీపం వెలిగిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలు అన్నీ హరించుకుపోతాయి. పరమశివుడికి రుద్రాభిషేకం చేస్తారు. శివకేశవుల భక్తులు ఈ రోజు పగటిపూట అంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏడాది అంతా సూచిస్తాయి. కొందరు ఈ దీపాలను అరటి దొన్నెలపై వెలిగించి నదిలో, చెరువులలో, కాలువలలో వదిలిపెడతారు. నదులు, చెరువులు, కాలువలు లేని ప్రదేశాలలో తులసి కోట లేకపోతే దేవుడి ముందు వెలిగిస్తారు. కార్తీకపౌర్ణమి రోజున శివాలయంలోగాని, విష్ణు ఆలయంలో గాని దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలమే కాక అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. ఈ రోజున ఉసిరికాయలు దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. లలితాదేవిని సహస్ర నామాలతో పూజిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ పర్వదినాన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మహా శ్రేష్టం అని పండితులు తెలుపుతున్నారు.

కార్తీక దీపాలను వెలిగించే సమయంలో చెప్పుకోవలసిన స్తోత్రం


కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః భవన్తి త్వం శ్వపచాపి విప్రాః
అర్థం: ఈ దీపం చూసిన ప్రభావం చేత కీటకాలు, పక్షులు, దోమలు,చెట్లు, మొక్కలు, ఉభయచరాలు అన్ని కూడా, అవి ఏ ఏ రూపాలలో ఉన్నాయో, ఆ రూపాలలోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్థిస్తున్నా.
ఎంతో పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది. ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్లు బ్రతికి, జ్ఞానం పొంది మోక్షం పొందవచ్చు. కానీ మిగతా జీవులకు అటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన విధి, ధర్మం కూడా. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం మనలాగా అవి భగవంతుడిని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి.

 

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేయడం ఎంతో శ్రేష్టం ...

కేదారేశ్వర వ్రత విధానం....

Click Here To View Kedareswara Vratha Vidanam

 

Products related to this article

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)..

$27.69

Ashtadala Padmam Vattulu

Ashtadala Padmam Vattulu

Ashtadala Padmam Vattulu..

$1.00

0 Comments To "Significance of Kartika Pournami"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!