Saibaba Satcharitra 11 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

పదకొండవ అధ్యాయం

భగవంతుడు లేదా బ్రహ్మం రెండు విధాలుగా అవతరింప వచ్చు. (1) నిర్గుణస్వరూపం (2) సగుణ స్వరూపం. నిర్గుణస్వరూపానికి ఆకారం లేదు. సగుణస్వరూపానికి ఆకారం ఉంటుంది. రెండూ పరబ్రహ్మం యొక్క స్వరూపాలే. మొదటిదాన్ని కొందరు ధ్యానిస్తారు, రెండవదాన్ని కొందరు పూజిస్తారు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణస్వరూపాన్ని పూజించడమే సులభమని ఉంది. కాబట్టి దానినే అనుసరించవచ్చునని చెప్పారు. మనుష్యులు ఆకారం కలిగి ఉన్నాడు. కాబట్టి సహజంగా భగవంతుణ్ణి కూడా ఆకారంతో సగుణస్వరూపునిగా భావించి పూజించడం సులభం. కొంతకాలం వరకు సగుణ స్వరూపమైన బ్రహ్మాన్ని పూజించిగానీ మన భక్తిప్రేమలు వృద్ధిచెందవు. క్రమంగా ఆ భక్తి నిర్గుణస్వరూపమైన పరబ్రహ్మ ఉపాసనకు దారి తీస్తుంది. విగ్రహం, యజ్ఞవేదిక, ఆగని వెళుతురూ, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ ఏడూ పూజనీయాలు. కాని సద్గురువు వీటి అన్నింటికంటే ఉత్కృష్టుడు. అలాంటి సద్గురువైన సాయినాథుని మనస్సులో ధ్యానిద్దాం! వారు రూపుదాల్చిన వైరాగ్యం, నిజభక్తులకు విశ్రాంతి ధామం. వారి వాక్కులలో భక్తే ఆసనంగా, మన కోరికలు అన్నీ విసర్జించటమే పూజా సంకల్పంగా చేసి వారిని ఉపాసిద్ధాం. కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడు అంటారు, కొందరు మహాభాగవతుడు అంటారు. కాని మాకు మాత్రం బాబా సాక్షాత్తూ భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, ఋజువర్తులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్యసంతుష్టులు. శ్రీసాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవానికి వారు నిరాకారస్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది చల్లదనాన్ని యిస్తూ, చెట్లు చేమలకు జీవాన్ని ఇస్తూ, ఎందరో దాహంతో ఉన్నవారికి దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్లే, సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవనగమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదిస్తూ జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, మహాత్ములు తన ఆత్మ అని, తన సజీవ ప్రతిమ అని, తానే వారు అని, వారే తాను అని ఉన్నాడు. వర్ణింపడానికి వీలుకాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపంలో అవతరించారు. శత్రువులు బ్రహ్మాన్ని ఆనందస్వరూపంగా వర్ణించుచున్నాయి (తైతరీయ ఉపనిషత్తు). ఈ సంగతి పుస్తకంలో చదువుతున్నాము. కాని భక్తులు ఈ ఆనందస్వరూపాన్ని షిరిడీలో అనుభవించారు. సర్వానికి ఆధారభూతమైన బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనం కోసం ఒక గోనెసంచి ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపువేసి, ఆనుకోవడానికి చిన్న బాలేసును సమకూర్చారు. బాబా తన భక్తుల కోరికను మన్నించి, వారివారి భావాన్ని అనుసరించి తనను పూజించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కొందరు చమరాలతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసురుతూ ఉండేవారు. కొందరు సంగీత వాయిద్యాలను ఉపయోగించేవారు. కొందరు వారికి అర్ఘ్యపాదాలు సమర్పించేవారు. కొందరు వారికి చందనం, అత్తరు పూస్తూ  ఉండేవారు. కొందరు తాంబూలాలు సమర్పిస్తూ ఉండేవారు. కొందరు నైవేద్యం సమర్పించేవారు. షిరిడీలో నివసిస్తున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూసినా వారే ఉండేవారు. భక్తులు బాబా యొక్క సర్వంతర్యామి తత్త్వాన్ని ప్రతిరోజూ అనుభవిస్తూ ఉండేవారు. సర్వాంతర్యామి అయినా ఆ సద్గుణమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగనమస్కారాలు.

డాక్టరు పండితుని పూజ

తాత్యాసాహేబు నూల్కరు మిత్రుడు అయిన డాక్టర్ పండిత్ ఒకసారి దర్శనం కోసం షిరిడీ వచ్చారు. బాబాకు నమస్కరించిన తరువాత మసీదులో కొంతసేపు కూర్చున్నారు. అతనిని దాదా భట్ కేల్కర్ దగ్గరికి వెళ్ళమని బాబా చెప్పారు. డాక్టరు పండిత్ అలాగే దాదా భట్ దగ్గరికి వెళ్ళారు. దాదా భట్ అతనిని సగౌరవంగా ఆహ్వానించారు. బాబాను పూజించడానికి పళ్ళెంతో దాదా భట్ మసీదుకు వచ్చారు. డాక్టర్ పండిత్ కూడా అతన్ని అనుసరించారు. దాదా భట్ బాబాను పూజించారు. అంతకు ముందు ఎవ్వరూ బాబా నుదుటిపై చందనం  పూయడానికి సాహసించలేదు. ఒక్క మహాల్సాపతి మాత్రమే బాబా కంఠానికి చందనం పూస్తూ ఉండేవారు. కాని ఆ అమాయక భక్తుడైన డాక్టరు పండిత్ దాదా భట్ పూజా పళ్ళెంలో నుండి చందనాన్ని తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండాకారంలో వ్రాశారు. అందరికీ ఆశ్చర్యం కలిగేలా బాబా ఒక్క మాట అయినా అనకుండా ఊరుకున్నారు. ఆరోజు సాయంత్రం దాదా భట్ బాబాను ఇలా అడిగారు 'బాబా! మేమెవరయినా మీ నుదుటిపై చందనం పూస్తాము అంటే నిరాకరించేవారే! డాక్టరు పండిత్ వ్రాస్తూ ఉంటే ఈ రోజు ఎలా ఊరుకున్నారు?' అన్నారు. దానికి బాబా ప్రసన్నంగా ఇలా సమాధానం చెప్పారు 'నేనొక ముస్లీంని, అతడు సద్భ్రాహ్మణడననీ, ఒక మహమ్మదీయుని పూజించడం ద్వారా తాను మైలపడిపోతాననే దురభిమానం లేకుండా, అతను నాలో తన గురువును భావించుకుని, అలా చేశాడు. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడేసింది. అతనికి నేను ఎలా అడ్డు చెప్పగలను?' దాదా భట్ ఆ తరువాత డాక్టరు పండిత్ ని ప్రశ్నించగా అతను బాబాను తన గురువుగా భావించి తన గురువుకి చేసినట్లే బాబా నుదుటిపై త్రిపుండాకారంలో వ్రాశాను అని చెప్పారు. భక్తులు వారి వారి భావానుసారం తమను ఆరాధించడానికి బాబా సమ్మతించినా ఒక్కొక్కసారి వారు అత్యంత వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యాల పళ్ళాలను విసిరివేస్తూ ఉగ్ర అవతారం దాల్చేవారు. అలాంటి సమయంలో బాబాను సమీపించడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలేది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిడుతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు మైనంకంటే మెత్తగా కనిపిస్తూ ఉండేవారు. అప్పుడు వారు శాంతి, క్షమలకు ప్రతిరూపాలుగా కనిపిస్తూ ఉండేవారు. బయటికి కోపంతో ఊగిపోతూ కళ్ళెర్ర చేసినప్పటికీ, వారి హృదయం మాత్రం మాతృహృదయంలా అనురాగమయం. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసుకుని 'నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేస్తుంద? సముద్రం తనను చేరుకునే నదులను ఎప్పుడైనా తిరగ్గొడుతుందా? నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరిస్తాను? నేనెప్పుడూ మీ యోగక్షేమాలనే ఆపేక్షిస్తాను? నేను మీ సేవకుడిని. నేనెప్పుడూ మీ వెంటే వుండి, పిలిచినా పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే' అనేవారు.

హాజీ సిద్ధీఖ్ ఫాల్కే

బాబా ఎప్పుడూ ఏ భక్తుని ఎలా ఆశీర్వదిస్తారో ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్చపై ఆధారపడి ఉండేది. హాజీ సిద్ధీఖ్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ. సిద్ధీఖ్ ఫాల్కే అనే మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన తరువాత షిరిడీ చేరుకున్నారు. అతను చావడి ఉత్తరభాగంలో బస చేశారు. తొమ్మిదినెలలు షిరిడీలో ఉన్నా, బాబా అతన్ని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ స్థలంలో కూర్చునేవారు. ఫాల్కే అత్యంత నిరాశానిస్పృహలకు లోనయ్యాడు. ఏమీ చేయడానికి అతనికి తోచేదికాడు. నిరాశ చెందవద్దని, నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడు అయినట్లు, మాధవరావు దేశ్ పాండే (షామా)ద్వారా బాబా దగ్గరికి వెళ్ళి అతని మనోరథం సిద్ధిస్తుందని కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చారు. అలాగే అని, తన తరపున బాబాతో మాట్లాడమని షామాను ఫాల్కే వేడుకున్నాడు. షామా దానికి అంగీకరించి, ఒకరోజు సమయం కనిపెట్టి బాబాతో ఇలా అన్నారు 'బాబా! ఆ ముసలి హాజీని మసీదులో కాలు పెట్టనివ్వడం లేదు ఎందుకు? ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించుకుని వెళ్తున్నారు. అ హాజీని మత్రమే ఎందుకు ఆశీర్వదించవు?' దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు 'షామా! ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడివి. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకోకుంటే నేనేం చేయగలను? అల్లామియా కటాక్షం లేకపోతే ఈ మసీదులో అడుగు పెట్టగలిగేవారు ఎవరు? సరే, నీవు అతని దగ్గరికి వెళ్ళి వాణ్ణి బారవీ బావి దగ్గర ఉన్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగు'. షామా వెళ్ళి హజీని ఆ విషయం అడిగి, తిరిగి బాబా దగ్గరికి వచ్చి హాజీ అందుకు ఒప్పుకున్నాడని చెప్పాడు. నలభై అయిదు వేల రూపాయలు నాలుగు వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కుని రా అని తిరిగి బాబా అడిగారు. షామా వెంటనే వెళ్ళి, హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని జవాబు తీసుకుని వచ్చాడు. సరే మళ్ళీ వెళ్ళి వాడిని ఇలా అడుగు 'మసీదులో ఈ రోజు మేకను కోద్దాం, వాడిని దాని మాంసం కావాలో, వృషణాలు కావాలో కనుక్కో'. బాబావారి కొళంబా (మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థాలు ఉంచే మట్టిపాత్ర)లో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతుష్టి చెందుతాను అని షామా ద్వారా హాజీ బదులు చెప్పాడు. ఇది వినగానే బాబా అత్యంత కోపంతో మసీదులోని కొళంబా, నీటికుండలను బయటికి విసిరివేసి, తిన్నగా చావిడీలో ఉన్న హాజీ దగ్గరకు వెళ్ళి తన కఫ్నీని పైకెత్తు పట్టుకుని తీవ్రమైన స్వరంతో 'నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవు ఎదో గొప్పవాడివనీ, పెద్ద హాజీవని గొప్పలు పోతూ, ఏమిటేమిటో వదులుతున్నావే? నా దగ్గరా నీ ఆటలు? ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కామదీనా యాత్రలు చేశాననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేక పోతున్నావు?' అంటూ ఏమేమో ఇంకా అతన్ని తిట్టి, మసీదుకు తిరిగి వెళ్ళిపోయారు. బాబా ఆగ్రహావేశాలను చూసి హాజీ గాబరా పడ్డాడు. ఆ తరువాత బాబా కొన్ని గంపల మామిడి పళ్ళు కొని వాటిని హాజీకి పంపారు. తిరిగి హాజీ దగ్గరికి వచ్చి తన జేబులో నుండి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టారు. అప్పటినుంచి హజీని బాబా ప్రేమాదారాలతో చూస్తూ, భోజనానికి పిలుస్తుండేవారు. హాజీ ఆనాటి నుండి తనకు ఇష్టం వచినప్పుడల్లా మసీదులోకి వచ్చి వెళుతూ ఉండేవాడు. బాబా ఒక్కొక్కప్పుడు వాడికి డబ్బులు ఇస్తుండేవారు. బాబా దర్బారులో అతను కూడా ఒకడు అయ్యారు.

పంచభూతాలు బాబా స్వాధీనం

బాబాకు పంచాభూతాలూ స్వాధీనమని తెలపడానికి రెండు సంఘటనలను వర్ణించిన తరువాత ఈ అధ్యాయాన్ని ముగిస్తాను.

(1) ఒకరోజు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించింది. నల్లని మేఘాలు ఆకాశం నిండా పరుచుకున్నాయి. గాలి తీవ్రంగా వీస్తుంది. ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి కురిసింది. కొంతసేపటికి నేలంతా జలమయం అయ్యింది. పశుపక్షాది జీవకోటితో సహా జనాలు అందరూ భయపడ్డారు. షిరిడీగ్రామంలో కొలువై ఉన్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలు ఎవ్వరూ వారిని ఆదుకోలేదు. కాబట్టి వారందరూ మసీదుకు వచ్చి బాబా శరణుకోరారు. తుఫానుని ఆపివేయమని బాబాను వేడుకున్నారు. ఆపదలో ఉన్న ప్రజలను చూసి బాబా మనస్సు కరిగింది. వారు బయటికి వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా 'ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించ'మని గర్జించారు. కొన్ని నిముషాలలో వర్షం తగ్గిపోయి, గాలి వీచటం మానింది. తుఫాను ఆగిపోయింది. చంద్రుడు ఆకాశంలో కనిపించాడు. ప్రజలందరూ సంతోషపడి వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు.

(2) ఇంకొకప్పుడు మిట్టమధ్యాహ్నం ధునిలోని మంటలు అపరిమితంగా లేచాయి. మంటలు మసీదు కప్పుకు ఉన్న దూలాలను తాకుతున్నట్లుగా ఎగసిపడసాగాయి. మసీదులో కూర్చున్నవారికి ఏం చేయడానికి తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గించమనిగానీ, నీళ్ళు పోసి మంటలు చల్లార్చండి అని గానీ బాబాకు సలహా యివ్వడానికి వారు భయపడి పోతున్నారు. వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి, తమ సటకాతో పక్కనే ఉన్న స్తంభంపై కొడుతూ 'దిగు, దిగు, శాంతిచ'మని అన్నారు. ఒక్కొక్క సటకా దెబ్బకు, కొంచెం కొంచెం చప్పున మంటలు తగ్గిపోయి, ధుని యథాపూర్వంగా మితంగా మండసాగింది. భగవంతుని అవతారమైన శ్రీసాయినాథుడు అలాంటి వారు. వారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి, సర్వస్య శరణాగతి వేడుకున్న వారందరినీ వారు కాపాడుతారు. ఎవరైతే భక్తిప్రేమలతో ఈ అధ్యయంలోని కథలను నిత్యం పారాయణ చేస్తారో వారు కష్టాలన్నింటినుండీ విముక్తులు కాగలరు. అంతేకాక సాయిలోనే అభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్సాక్షాత్కారాన్ని పొందుతారు. వారి కోరికలు అన్నీ నెరవేరి, చివరికి కోరికలు లేనివారై ముక్తిని పొందుతారు.

పదకొండవ అధ్యాయం సంపూర్ణం 

పన్నెండవ అధ్యాయం

 

Products related to this article

Wooden Elephant Key Chain

Wooden Elephant Key Chain

Wooden Elephant Key Chain..

$1.00

0 Comments To "Saibaba Satcharitra 11 Adhyayam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!