Saibaba Satcharitra 25 Adyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైఅయిదవ అధ్యాయం

దాము అన్నా కాసార్ (అహమదునగరు) - జట్టీ వ్యాపారము - మామిడి పండ్ల లీల

భగవంతుడి అవతారాన్ని, పరబ్రహ్మ స్వరూపుడూ, మహా యోగీస్వరుడూ, కరుణాసాగారుడూ అయిన శ్రీ సాయినాథుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తాము. యోగి చూడామణి అయిన శ్రీసాయినాథ మహారాజుకి జయం అగుగాక! సమస్త శుభాలకు నిలయం, మన ఆత్మారాముడు, భక్తులపాలిట ఆశ్రయదాత అయిన సాయికి జయం అగుగాక. జీవితాశయాన్ని, పరమావధిని చూసిన బాబాకు ప్రణామాలు.

సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసింది వారిలో మనఃపూర్వకమైన భక్తి. భక్తుడికి స్థిరమైన నమ్మకం పూర్ణభక్తి ఉన్నప్పుడు వారి కోరికలు అన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి. హేమాడ్ పంతు మనస్సులో బాబా జీవితలీలలను వ్రాయాలనే కోరిక పుట్టగానే, బాబా వెంటనే అతనితో వ్రాయించారు. సంగ్రహంగా సంగతులు అన్నీ వ్రాసుకోమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యం కలిగి దాన్ని ముగించారు. దాన్ని వ్రాసే యోగ్యత మొదట అతనికి లేకపోయింది. కాని బాబా దయాపూరితమైన ఆశీర్వచనాలతో దాన్ని అతడు పూర్తిచేయగలిగాడు. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైంది. అది ఒక చంద్రకాంతామణి వంటిది. దానినుండి సాయిలీలనే అమృతం స్రవించింది. దాన్ని చదివేవారు మనసారా త్రాగవచ్చు. భక్తుడికి సాయిలో పరిపూర్ణమైన, హృదయపూర్వకమైన భక్తి కలిగినప్పుడు దుఃఖాలనుండి, అపాయాల నుండి బాబా కాపాడి రక్షిస్తూ ఉంటాడు. వారి యోగక్షేమాలు బాబా చూస్తూ ఉంటాడు. అహమద్ నగరు నివాసి అయిన (ప్రస్తుతము పూణా వాసి)దామోదర్ సావల్ రామ్ రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్నా కథ పైన పేర్కొన్న వాక్యానికి ఉదాహరణగా క్రింద ఇవ్వబడింది.

దాము అన్నా (దామోదర్ సావల్ రామ్ రాసనే) 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భంలో ఇతని గురించి చెప్పాము. చదివేవారు దాన్ని జ్ఞాపకం ఉంచుకునే ఉంటారు. అతడు 1897వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి వెళ్ళాడు. అప్పటినుండి ఇప్పటివరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇస్తూ ఉన్నాడు. అదీ గాక ఉత్సవానికి వచ్చే బీదలకు అన్నదానం చేసున్నాడు.

అతని జట్టీ వ్యాపారములు : ప్రత్తి

బొంబాయి స్నేహితుడు ఒకడు దాము అన్నాకు, ప్రత్తిలో జట్టీ వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభం సంపాదించాలని వ్రాసాడు. వ్యాపారం లాభదాయకమైనది అనీ, ఎంతమాత్రం ప్రమాదకరం కాదనీ, కాబట్టి అవకాశం పోగొట్టుకోవద్దు అని అతడు వ్రాసాడు. దాము అన్నా ఆ బేరాన్ని చేయాలా? మానాలా? అనే ఆందోళనలో పడ్డాడు జట్టీ వ్యాపారం చేయడానికి వెంటనే నిశ్చయించుకోలేక పోయాడు. దాని గురించి బాగా ఆలోచించి తాను బాబా భక్తుడు కావడంతో శ్యామాకి ఒక జాబు రాసి బాబాని అడిగి వారి సలహా తెలుసుకోమని కోరాడు. ఆ మరుసటి రోజు ఆ ఉత్తరం శ్యామాకు చేరింది. శ్యామా దాన్ని తీసుకుని మసీదుకు వెళ్ళాడు. బాబా ముందర పెట్టాడు. బాబా ఆ కాగితం ఏమిటి అని అడిగారు. సమాచారం ఏమిటి అన్నారు? శ్యామా అహమద్ నగరు నుండి దాము అన్నా ఎదో కనుక్కోవడానికి వ్రాసాడు అన్నాడు. బాబా ఇలా అన్నారు 'ఏమి వ్రాసి ఉన్నాడు?’ ఏమి ఎత్తు వేస్తున్నాడు? భగవంతుడు ఇచ్చినదాంతో సంతృప్తి చెందక ఆకాశానికి ఎగిరే ప్రయత్నం చేస్తున్నట్టు వుంది. వాని ఉత్తరం చదువు.’ బాబా చెప్పిందే ఆ ఉత్తరంలో ఉన్న సమాచారం అని, శ్యామా 'దేవా! నీవిక్కడే ప్రశాంతంగా కూర్చుని, భక్తులను ఆందోళనపాలు చేస్తావు. వారు వ్యాకులు కావడంతో, వారిని ఇక్కడికి ఈడ్చుకుని వస్తావు. కొందరిని ప్రత్యేకంగాను, కొందరిని లేఖల రూపంగా తెస్తావు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్ను ఎందుకు చదవమని బలవంత పెడుతున్నావు?’ అన్నాడు. బాబా 'ఓ శ్యామా! దయచేసి చదువు. నా నోటికి వచ్చింది నేను మాట్లాడతాను. నన్ను విశ్వసించే వారెవ్వరు?’

 అన్నారు.

అప్పుడు శ్యామా ఉత్తరాన్ని చదివారు. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇలా అన్నారు 'సేటుకీ పిచ్చిపట్టింది. అతని గృహంలో ఎలాంటి లోటు లేదని వ్రాయి. తనకున్న సగం రొట్టెతో సంతృప్తి చెందమని వ్రాయి. లక్షలు ఆర్జించడానికి ఆయాస పడద్దని చెప్పు.’ శ్యామా జవాబు పంపారు. దాని కోసం ఆతృతతో దాము అన్నా ఎదురుచూస్తున్నాడు. జాబు చదువుకుని అతడు తన ఆశ అంతా అడియాస అయింది అనుకున్నాడు. కాని స్వయంగా వచ్చి మాట్లాడడానికి, ఉత్తరం వ్రాయడానికి భేదం ఉందని శ్యామా వ్రాయటంతో స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడాలని అనుకున్నాడు. అందుకే షిరిడీకి వెళ్ళాడు. బాబాకు నమస్కరించాడు. బాబా పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు. అతనికి బాబాను బహిరంగంగా జట్టీ వ్యాపారం గురించి అడగడానికి ధైర్యం చాలలేకపోయింది. బాబా సహాయపడితే వ్యాపారంలో కొంత లాభం బాబాకి ఇస్తే బాగుండును అనుకున్నాడు. ఇలా రహస్యంగా దాము అన్నా తన మనసులో అనుకున్నాడు. బాబాకు తెలియనిది ఏమీ లేదు. అరచేతిలో ఉన్న ఉసిరికాయల వలె భూతభవిష్యత్ వర్తమానాలు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావాలని, కానీ తల్లి చేదుమాత్ర ఇస్తుంది. తీపి వస్తువులు ఆరోగ్యాన్నీ పాడుచేస్తుంది. చేదుమాత్ర ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రాలే ఇస్తుంది. బాబా దయగల తల్లివంటి వారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానాలలో లాభాల గురించి బాగా తెలిసినవారు. దాము అన్నా మనస్సును కనిపెట్టి బాబా యిలా అన్నారు 'ప్రపంచ విషయాలలో తగుల్కొనటం నాకు ఇష్టం లేదు' బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్నా ఆ పనిని మానుకున్నాడు.

ధాన్యములు బేరము : తరువాత దాము అన్నా ధాన్యం వ్యాపారం చేయాలని అనుకున్నాడు. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి 'నీవు 5 శేర్ల చొప్పున కొని 7 శేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది కాబట్టి ఈ వ్యాపారం కూడా మానుకో' అన్నారు. కొన్నాళ్ళ వరకు ధాన్యం ధర ఎక్కువగానే ఉంది. కానీ ఒక మాసం రెండు మాసాలు వర్షాలు అధికంగా కురిశాయి. ధరలు హఠాత్తుగా పడిపోయాయి. ధాన్యాలు నిలువచేసిన వారందరూ నష్టపోయారు. ఈ దురదృష్టం నుండి దాము అన్నా కాపాడబడ్డాడు. ప్రతి జట్టీ వ్యాపారం కూడా కూలిపోయింది. అ దళారి ఇంకొక వర్తకుడి సహాయంతో వ్యాపారం చేశాడు. మదుపు పెట్టినవారికి అధిక నష్టం వచ్చింది. బాబా తనను రెండుసార్లు విశేష నష్టాలనుండి తప్పించారని, దాము అన్నాకు బాబాలో గల నమ్మకం పెరిగింది. బాబా మహాసమాధి చెందేవరకు వారికి నిజమైన భక్తుడిగా ఉన్నాడు. వారి మహాసమాధి తరువాత కూడా ఇప్పటివరకు భక్తితో ఉన్నాడు.

అమ్రలీల (మామిడిపండ్ల చమత్కారము)

ఒకరోజు 300 మామిడిపండ్లు పార్శిల్ లో వచ్చాయి. రాళే అనే మామల్తదారు గోవా నుంచి శ్యామా పేరు మీదా పండ్లను బాబాకు పంపించారు. అది తెరచినప్పుడు పళ్ళు బాగానే ఉన్నాయి. అది శ్యామా ఆధీనంలో పెట్టారు. అందులో 4 పళ్ళు మాత్రమే బాబా కొలంబలో (కుండలో) పెట్టారు. బాబా 'ఈ నాలుగు దాము అన్నాకు, అవి అక్కడే ఉండాలి' అని అన్నారు. దాము అన్నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. కాని అతనికి సంతానం లేకపోయింది. అనేక జ్యోతిష్కులను సంప్రదించారు. అతడు కూడా జ్యోతిష్యాన్ని కొంతవరకు చదివాడు. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటంతో అతనికి సంతానం కలిగే అవకాశం లేదనుకున్నాడు. కాని అతనికి బాబా పట్ల అత్యంత నమ్మకం ఉంది. మామిడిపండ్లు అందిన రెండుగంటలకు అతడు షిరిడీకి చేరుకొని బాబాకు నమస్కరించడానికి వెళ్ళగా బాబా ఇలా అన్నారు 'అందరూ మామిడిపండ్ల వైపు చూస్తున్నారు.కానీ అవి దాము కోసం ఉంచినవి, కాబట్టి దాము తిని చావాల్సిందే.’ దాము ఆ మాటలు విని భయపడ్డాడు. కాని మహాల్సాపతి (బాబా ముఖ్యభక్తుడు)దాన్ని ఇలా సమర్థించారు 'చావడమనెడి అహంకారాన్ని గురించి, దాన్ని బాబా పట్ల చంపటం ఒక ఆశీర్వాదం.’ బాబా అతనితో ఇలా అన్నారు 'నీవు తినకు నీ చిన్నభార్యకి ఇవ్వు. ఈ అమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను, నలుగురు కుమార్తెలను ప్రసాదిస్తుంది.’ దాము అ ప్రకారమే చేశాడు. కొంతకాలానికి బాబా మాటలు నిజం అయ్యాయి. జ్యోతిష్కుని మాటలు వట్టిపోయాయి. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాకుండా ఇప్పుడు కూడా వారి మహత్యాన్ని స్థాపిస్తున్నారు.

బాబా ఇలా అన్నారు 'సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడతాయి. అవి మీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాయి. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడుతుంది. వారి వెన్నంటి కదలను, నేను మీవద్ద ఉండను ఏమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడతూ మీ యొక్క క్షేమాన్ని కనుక్కుంటూ ఉంటాయి. ఎల్లప్పుడూ నన్నే జ్ఞాపకంలో ఉంచుకోండి. అప్పుడే మీరు అత్యంత మేలు పొందుతారు.’. హేమాడ్ పంతు ఈ అధ్యాయం ఒక ప్రార్థనతో ముగిస్తున్నాడు. 

ప్రార్థన :

‘ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవృక్షమా! మీ పాదాలు మేము ఎన్నటికీ మరువకుందుము గాక. మీ పాదాలను ఎప్పుడూ చూసూ ఉండుదముగాక. ఈ సంసారంలో చావు పుట్టుకలతో మిక్కిలి బాధపడుతున్నాము. ఈ చావుపుట్టుకల నుంచి మమ్ములను తప్పించు. మా ఇంద్రియాలు విషయాలపై పోనీయకుండా అడ్డుకో. మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి గావించు. ఇంద్రియాలు, మనస్సు బయటకు వెళ్ళే నిజాన్ని ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారానికి అవకాశం లేదు. అంత్యకాలంలో కొడుకుగాని, భార్యగాని, స్నేహితుడుగాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందాన్ని, మోక్షాన్ని కలగచేసేవాడవు. వివాదాలలో దుర్మార్గపు పనులలో మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింప చేయి. నీ నామస్మరణ చేయడానికి జిహ్వ ఉత్సాహం చూపించు గాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమి వేయి. మా గృహాలను శరీరాన్ని మరిచిపోయేలా చేయుము. మా అహంకారాన్ని నిర్మూలించు. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉండేలా చేయి. తక్కిన వస్తువులు అన్నింటినీ మరచిపోయేలా చేయి. మనస్సు చంచాల్యాన్ని తీసివేయి. దాన్ని స్థిరంగా ప్రశాంతంగా ఉంచు. నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినట్లయితే ఆ అజ్ఞానందకారం నిష్క్రమిస్తుంది. నీ వెలుతురులో మేము సంతోషంగా ఉంటాము. మమ్మల్ని నిద్రనుండి లేపు. నీ లీలామృతం త్రాగే భాగ్యం నీ కటాక్షం చేత గతజన్మలో మేము చేసిన పుణ్యం వలన కలిగింది.’

నోటు:  దాము అన్నా ఇచ్చిన వాంగ్మూలం ఈ సందర్భంగా గమనించ దగినది. ఒకరోజు అనేకమందితో నేను కూడా బాబా పాదాల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సులో రెండు సంశయాలు కలిగాయి. ఆ రెండింటికీ బాబా ఇలా జవాబు ఇచ్చారు:

1. సాయిబాబా వద్ద అనేకమంది గుమిగూడుతున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందుతారా?

దీనికి బాబా ఇలా జవాబు ఇచ్చారు : ‘మామిడిచెట్లు పూత పూసి ఉన్నప్పుడు వాటి వైపు చూడు. పువ్వులు అన్నీ కూడా పండ్లు అయితే, ఎంత మంచి పంట అవుతంది? కానీ అలా జరుగుతుందా? పువ్వుగానే చాలామటుకు రాలిపోతుంది. గాలికి కొన్ని పిందెలు రాలిపోతాయి. కొన్ని మాత్రమే మిగులుతాయి.

2. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతికశరీరం విడిచిన తరువాత నా జీవితం అనే ఓడ ఎలా నడపగలను? అది ఎటో కొట్టుకొని పోతుందా? అలా అయితే నా గతి ఏమిటి?

దీనికి బాబా జవాబు ఇలా ఇచ్చారు : ‘ఎక్కడ అయినా, ఎప్పుడు అయినా నా గురించి చింతిస్తే నేను అక్కడే ఉంటాను'. 1918 ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేరుస్తూ ఉన్నారు. 1918 తరువాత కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపిస్తున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగింది. నా సోదరులు విడిపోయారు, నా సోదరి కాలధర్మం చేసింది, దొంగతనం జరిగింది. పోలీసు విచారణ  జరిగింది. ఇవన్నీనన్ను కల్లోలోపరిచాయి.

నా సోదరి చనిపోగా నా మనస్సు వికలం అయ్యింది. నేను జీవితాన్ని, సుఖాలను లక్ష్యపెట్టలేదు. నేను బాబా దగ్గరకు వెళ్ళగా వారు ఉపదేశంతో శాంతింప చేసి, అప్పా కులకర్ణి ఇంట్లో బొబ్బట్లతో విందు చేయించారు. నా నుదుట చందనం పూసారు. నా యింట్లో దొంగతనం జరిగింది. నాకు ముప్పై సంవత్సరాల నుండి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను నా భార్య యొక్క నగలపెట్టె దొంగలించాడు. అందులో శుభ్రమైన నత్తు (నాసికాభరణం) ఉండేది, బాబా ఫోటో ముందు ఏడ్చాను. ఆ మరుసటి రోజే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చేసి క్షమాపణ కోరాడు.

ఇరవై అయిదవ అధ్యాయం సంపూర్ణం. 

Products related to this article

Bilvam Vattulu

Bilvam Vattulu

Bilvam Vattulu (Big)..

$2.00

Tibetan Black & Red Stone Necklace Set

Tibetan Black & Red Stone Necklace Set

Tibetan Black & Red Stone Necklace SetProduct Description:  Product: Necklace Set with Ear rings Colour: Black & RedMetal: Tibetan Black & Red Stone Necklace Length: 36 cm..

$21.00

Wooden Elephant Key Chain

Wooden Elephant Key Chain

Wooden Elephant Key Chain..

$1.00

0 Comments To "Saibaba Satcharitra 25 Adyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!