Saibaba Satcharitra 28 Adyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైఎనిమిదవ అధ్యాయం

బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట

1. లక్ష్మీచంద్ 2. బురహాన్ పూరు మహిళ 3. మేఘశ్యాముడు - మొదలగు వారి అనుభవములు

శ్రీసాయి అనంతుడు, చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్వంతం సకలజీవులలో ఉన్నారు. వారు సర్వాంతర్యామి, వేదజ్ఞానంలో ఆత్మసాక్షాత్కార విద్యలో వారు పారంగతులు.

ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండటంతో వారు సద్గురువులు అనిపించుకోవడానికి సమర్థులు. పండితులు అయినప్పటికీ శిష్యులను ఎవరు అయితే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు అవలేరు. సాధారణంగా తండ్రి శరీరాన్ని పుట్టిస్తారు, తరువాత చావు జీవితాన్ని వెంబడిస్తుంది. కాని సద్గురువు చావుపుట్టుకలను రెండింటినీ దాటిస్తారు. కాబట్టి వారు అందరికంటే దయార్థ్రహృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇలా అనేవారు 'నా మనుష్యుడు ఎంత దూరంలో ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ, పిచ్చుక కాళ్ళకు దారం కట్టి ఈడ్చినట్లుగా అతనిని షిరిడీకి లాగుతాను' అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం.

లాలా లక్ష్మీచంద్ 

లాలా లక్ష్మీచంద్ మొట్టమొదటిగా రైల్వేలోనూ, ఆపైన బొంబాయిలోని శ్రీ వేంకటేశ్వర ముద్రణాలుయంలోనూ, తరువాత ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేశారు. 1910వ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యం లభించింది. శాంతాక్రాజ్ లో, క్రిస్ మస్ పండుగకు ఒకటి రెండు మాసాలకు పూర్వం స్వప్నంలో గడ్డంతో ఉన్న ఒక ముసలివాడిని, చుట్టూ భక్తులు గుంపులుగా ఉన్నట్లు చూశారు. కొన్నాళ్ళ తరువాత దాసగుణు కీర్తన వినడానికి తన స్నేహితుడు అయిన దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళారు. కీర్తన చేసేటప్పుడు దాసగుణు బాబా పటాన్ని సభలో పెట్టడం ఆచారం. స్వప్నంలో చూసిన ముసలివాడిని ముఖలక్షణాలు ఈ పటంలో ఉన్నవారికి పోలిక సరిపోయింది. కాబట్టి తాను స్వప్నంలో సాయిబాబాను చూసినట్లు గ్రహించారు. పటం దాసగుణు కీర్తన, తుకారాం జీవితం (అప్పుడు దాసగుణు చెపుతున్న హరికథ) ఇవి అన్నీ మనస్సులో నాటి, లక్ష్మీచంద్ షిరిడీకి వెళ్ళడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. సద్గురువుని వెదకడంలోను అధ్యాత్మిక్జ కృషి పట్ల దేవుడు భక్తులకు సహాయపడతారు అనేది భక్తుల అనుభవమే. ఆ రోజు రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడు అయిన శంకరరావు వచ్చి తలపు తట్టి షిరిడీకి వస్తావా అని అడిగాడు. అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. షిరిడీకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. పినతండ్రి కొడుకు దగ్గర 15 రూపాయలు అప్పు పుచ్చుకుని కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్న తరువాత షిరిడీకి ప్రయాణం అయ్యాడు. రైలులో అతనూ, స్నేహితుడు శంకరరావు భజన చేశారు. సాయిబాబా గురించి తోటి ప్రయాణికులు అడిగారు. చాల సంవత్సరాలనుంచి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగిపుంగవులు అని వారు చెప్పారు. కోపర్ గాం రాగానే అతను బాబా కోసం జామపళ్ళను కొనాలని అనుకున్నాడు. కాని ఆ గ్రామ పరిసరాలను, ప్రకృతి అందాలను చూసి ఆనందించి ఆ విషయం మరచిపోయాడు. షిరిడీ సమీపిస్తుండగా వారికి ఈ సంగతి జ్ఞాపకం వచ్చింది. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపుబండి వెంట పరిగెత్తుకుని వస్తున్నది. అతడు బండిని ఆపి కొన్ని జామపాళ్ళను మాత్రమే కొన్నాడు. అప్పుడు అ ముసలమ్మ మిగిలిన పళ్ళను కూడా తీసుకుని తన తరపున బాబాకి అర్పితం చేయమని కోరింది. జామపళ్ళను కొనాలి అని అనుకోవడం, ఆ విషయం మరచిపోవడం, ముసలమ్మను కలుసుకోవడం, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాడి బంధువై ఉండవచ్చు అనుకున్నారు. అంతలో బండి షిరిడీ చేరుకుంది. వారు మసీదుపై జెండాలను చూసి నమస్కరించారు. పూజా సామాగ్రితో మసీదుకి వెళ్ళి బాబాను ఉచితరీతిలో పూజించారు. లక్ష్మీచంద్ మనస్సు కరిగింది. బాబాను చూసి చాలా సంతోషించాడు. సువాసన గల తామరపువ్వును భ్రమరం చూసి సంతోషించినట్లు బాబా పాదాలను చూసి సంతోషించాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు. ‘టక్కరివాడు! దారిలో భజన చేస్తాడు. నా గురించి ఇతరులను విచారిస్తూ ఉంటాడు. ఇతరులని అడగడం ఎందుకు? మన కళ్ళతో సమస్తం చూడాలి. ఇతరులను అడగవలసిన అవసరం ఏమిటి? నీ స్వప్నం నిజం అయిందా లేదా అనేది ఆలోచించు. మార్వాడీ దగ్గర 15 రూపాలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరం ఏమిటి? హృదయంలోని కోరిక ఇప్పుడు అయిన నెరవేరిందా?.’ ఈ మాటలు విని బాబా సర్వజ్ఞాతానికి ఆశ్చర్యపడ్డాడు. బాబాకి ఈ సంగతులు అన్నీ ఎలా తెలిశాయి అని అతడు ఆశ్చర్యపడ్డాడు. అందులో ముఖ్యంగా గమనించదగినది బాబా దర్శనం కోసం కాని, శెలవు రోజు అంటే పండుగ రోజు గడపడం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళడానికి కానీ అప్పు చేయకూడదు అని బాబా అభిప్రాయం.

సాంజా (ఉప్మా) :

మధ్యాహ్న భోజనానికి కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్ కి ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చాడు. అది తిని లక్ష్మీచంద్ సంతోషించాడు. ఆ మరుసటితోజు కూడా దాన్ని ఆశించాడు. కాని ఎవరూ సాంజా తీసుకుని రాలేదు. అతడు సాంజా కోసం వేచిఉన్నాడు. మూడవరోజు హారతి సమయంలో బాపూసాహెబు జోగ్ ఏ నైవేద్యం తీసుకుని రావాలని బాబాను అడిగారు. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పారు. భక్తులు రెండు కుండల నిండా సాంజా టీసుకుని వచ్చారు. లక్ష్మీచంద్ చాలా ఆకలితో ఉన్నాడు, అతని వీపు నొప్పిగా వుంది. బాబా ఇలా అన్నారు 'నీవు ఆకలితో ఉండటం మేలైనది. కావలసినంత సాంజా తిను. నీ వీపు నొప్పికి ఏదయినా ఔషధం తీసుకో.’ బాబా తన మనస్సును కనిపెట్టారని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడ్డాడు. బాబా ఎంత సర్వజ్ఞుడు!

దోష దృష్టి : ఆ సమయంలోనే లక్ష్మీచంద్ చావడి ఉత్సవాన్ని చూసాడు. అప్పుడు బాబా దగ్గుతో బాధపడుతున్నారు. ఎవరిదో దోషదృష్టి ప్రసరించడంతో బాబాకి బాధ కలిగింది అనుకున్నారు. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకి వెళ్ళగా బాబా శ్యామాతో ఇలా అన్నారు 'ఎవరిదో దోషదృష్టి నాపై పడటంతో నేను బాధపడుతున్నాను'. ఇలా లక్ష్మీచంద్ మనస్సులో ఏమి భావిస్తున్నాడో అది అంతా బాబా వెల్లడి చేస్తున్నారు. ఈ విధంగా సర్వజ్ఞతకు, కారుణ్యానికి కావలసినన్ని నిదర్శనాలను చూసి లక్ష్మీచందు బాబా పాదాలపై పడి 'మీ దర్శనం వలన నేను ఎంతో సంతోషించాను. ఎల్లప్పుడూ నా పట్ల దయాదాక్షిణ్యాలను చూపించి నన్ను రక్షించు. నాకు ఈ ప్రపంచంలో మీ పాదాలు తప్ప ఇతర దైవం లేదు, నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజలో, మీ భజనలో తృప్తి చెందునుగాక! మీ కటాక్షంతో నన్ను ప్రపంచ బాధలనుండి కాపాడుదురుగాక! నేను ఎప్పుడూ మీ నామాన్నే జపిస్తూ సంతోషంతో ఉందునుగాక!’ అని ప్రార్థించాడు,

బాబా ఆశీర్వాదాన్ని, ఊదీ ప్రసాదాలను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషంతో, తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగివచ్చాడు. దారిలో బాబా మహిమలను కీర్తిస్తూ ఉన్నాడు. సదా బాబాకు నిజమైన భక్తుడిగా ఉన్నాడు. షిరిడీకి వెళ్ళే పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరాన్ని, దక్షిణను పంపిస్తూ ఉండేవాడు.

బురహాన్ వూరు మహిళ

ఇంకొక పిచ్చుక (భక్తురాలి) వృత్తాంతం చూద్దాం. బురహాన్ ఊరులో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనబడి గుమ్మం దగ్గరికి వచ్చి తినడానికి 'కిచిడీ' కావాలి అన్నారు. మేల్కొని చూడగా తన ద్వారం దగ్గర ఎవరూ కనిపించలేదు. చూసిన దృశ్యానికి చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేసింది. తన భర్తకు కూడా తెలిపింది. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తుండేవాడు. అతనికి అకోలాకు బదలీ చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ షిరిడీకి వెళ్లాలని నిశ్చయించుకుని ఒక శుభదినం షిరిడీకి బయలుదేరారు. మార్గమధ్యంలో గోమతీ తీర్థాన్ని దర్శించి షిరిడీ చేరుకొని, అక్కడ రెండు మాసాలు ఉన్నారు. ప్రతిరోజు మసీదుకు వెళ్ళి బాబాను దర్శించుకుని, పూజించి అమితమైన సంతోషంగా ఉన్నారు. వారు బాబాకు కిచిడీ ప్రసాదం సమర్పించాలని షిరిడీకి వచ్చారు. కానీ అది 14 రోజులవరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకపోయింది. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12గంటలకు వచ్చింది. మసీదులో అందరూ భోజనానికి కూర్చున్నారు. కాబట్టి తెరవేసి వుంది. తెరవేసి ఉన్నప్పుడు ఎవరూ లోపల ప్రవేశించడానికి సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయింది. ఒక చేతితో తెర పైకి ఎత్తి లోపలికి ప్రవేశించింది. బాబా ఆ రోజు కిచిడీ కోసం కనిపెట్టుకుని ఉన్నట్లు తోచింది. ఆమె కిచిడీ అక్కడ పెట్టగానే బాబా సంతోషంతో ముద్దమీద ముద్ద తినడం ప్రారంభించారు. బాబా ఆతృతను చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉన్నది అనడానికి విశ్వసించారు.

మేఘశ్యాముడు

ఇక అన్నింటికంటే పెద్దది అయిన మూడవ పిచ్చుక గురించి వినండి. విరమ్ గాం నివాసి అయిన మేఘశ్యాముడు హరి వినాయక సాఠే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదవురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి (ఓం నమఃశ్శివాయ) జపించేవాడు. అతనికి సంధ్యావందనంగాని, గాయత్రి మంత్రంగాని తెలియకపోయింది. సాఠేగారికి ఇతనిలోని శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రంతో సంధ్యావందనం నేర్పించారు. సాయిబాబా శివుని అవతారం అని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించారు. బ్రోచి సెషను దగ్గర సాయిబాబా మహమ్మదీయుడు అని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనని అక్కడికి పంపించవద్దని యజమానిని వేడుకున్నాడు. కాని ఆ యజమాని మేఘశ్యాముడిని షిరిడీకి వెళ్ళి తీరాలని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరం షిరిడీవాసి తన మామగారు అయిన దాదా కేల్కరు గారికి వ్రాసి సాయిబాబాతో పరిచయం కలగచేయాలని ఇచ్చారు. షిరిడీకి చేరుకొని మసీదుకు వెళ్ళగా బాబా కోపగించుకుని అతన్ని లోపలికి రానీయకుండా 'ఈ వెధవను తరిమేయండి!’ అని గర్జించి మేఘనుడితో ఇలా అన్నారు 'నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడివి, నేనా తక్కువజాతి మహామ్మదీయుడిని, నీవు ఇక్కడికి వచ్చినట్లయితే నీ కులం పోతుంది. కాబట్టి వెళ్ళిపో'. ఈ మాటలు విని మేఘశ్యాముడు వణకడం ప్రారంభించాడు.అతడు తన మనస్సులో ఉన్న విషయాలు బాబాకి ఎలా తెలిశాయి అని ఆశ్చర్యపోయాడు.

కోని రోజులు అక్కడే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవిస్తూ ఉన్నాడు. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన యింటికి వెళ్ళాడు. అక్కడనుండి త్ర్యంబక్ (నాసిక్ జిల్లా) వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఆరు మాసాలు ఉన్నాడు. తిరిగి షిరిడీకి వచ్చాడు. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకోవడంతో అతను మసీదులోకి ప్రవేశించడానికి, షిరిడీలో ఉండటానికి బాబా అంగీకరించారు. మేఘశ్యాముడికి బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలగజేస్తూ చాలా మేలు చేశారు. అప్పటినుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావిస్తూ ఉండేవాడు. శివుడి  అర్చనకు బిల్వపత్రి కావాలి, మేఘశ్యాముడు ప్రతిరోజూ మైళ్ళ కొద్దీ నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజిస్తూ ఉండేవాడు. గ్రామంలో ఉన్న దేవతలు అందరినీ పూజించిన తరువాత మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి తరువాత బాబాను పూజిస్తూ ఉండేవాడు. కొంతసేపు వారి పాదాలు ఒత్తిన తరువాత బాబా పాద తీర్థం త్రాగుతూ ఉండేవాడు. ఒక రోజు ఖండోబా మందిరం వాకిలి మూసి ఉండటంతో ఖండోబాదేవుడిని పూజించకుండా మసీదుకు వచ్చాడు. బాబా అతని పూజను అంగీకరించకుండా తిరిగి పంపించేశారు. ఖండోబా మందిరం వాకిలి తెరిచి ఉందని చెప్పారు. మేఘశ్యాముడు మందిరానికి వెళ్ళాడు. వాకిలి తెరిచి ఉండటంతో ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాడు.

గంగాస్నానము : ఒక మకర సంక్రాంతి రోజు మేఘుడు బాబా శరీరానికి చందనం పూసి గంగానదీ జలంతో అభిషేకం చేయాలని అనుకున్నాడు. బాబాకు అది ఇష్టం లేకుండాపోయింది. కాని అతను అనేకసార్లు వేడుకొనగా బాబా అనుమతిని ఇచ్చారు. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరం నడిచి గోమతీనదీ తీర్థాన్ని తీసుకుని రావలసివుంది. అతడు తీర్థం తెచ్చి, ప్రయత్నాలు అన్నీ చేసుకుని, బాబా దగ్గరికి 12గంటలకు వచ్చి స్నానానికి సిద్ధంగా ఉండు అని చెప్పాడు. బాబా తనకు అభిషేకం వద్దు అనీ ఫకీరు అవడంతో గంగానదీ జలంతో ఎలాంటి సంబంధం లేదనీ చెప్పారు. కాని మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం కాబట్టి, తాను శివుడు అయిన బాబాకు అభిషేకం చేసితీరాలని పట్టుబట్టాడు. బాబా అంగీకరించి క్రిందకి దిగి పీఠంపై కూర్చుని తల ముందుకుసాచి ఇలా అన్నారు 'ఓ మేఘా! ఈ చిన్న ఉపకారం చేసిపెట్టు. శరీరానికి తల ముఖ్యం కాబట్టి తలపైన నీళ్ళు పోయి. శరీరం అంతా పోసినట్లు అవుతుంది.’ అలాగే అని మేఘశ్యాముడు ఒప్పుకుని, నీళ్ళకుండను పైకి ఎత్తి తలపై పోయడానికి ప్రయత్నించాడు. కానీ భక్తిపారవశ్యంతో 'హరగంగే, హరగంగే' అంటూ శరీరం అంతటా నీళ్ళు పోశాడు. కుండ ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూశాడు. వాడి ఆశ్చర్యానందలాకు అంతులేదు. బాబా తల మాత్రమే తడిచి శరీరం అంతా పొడిగా వుండిపోయింది. 

త్రిశూలము లింగము : మేఘశ్యాముడు బాబాను రెండుచోట్లా పూజిస్తూ ఉండేవాడు. మసీదులో బాబాను స్వయంగా పూజిస్తూ ఉన్నాడు. వాడాలో నానాసాహెబు ఛాందోర్కరు ఇచ్చిన పటానికి పూజిస్తూ ఉండేవాడు. ఈ ప్రకారంగా 12 నెలలు చేశాడు. వాడి భక్తికి మెచ్చుకున్నానని తెలపడానికి బాబా అతనికి ఒక దృష్టాంతం చూపించారు. ఒక రోజు వేకువ ఝామున మేఘశ్యాముడు తన శయ్యపై పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ, లోపల ధ్యానం చేస్తూ బాబా రూపాన్ని చూశాడు. బాబా అతనిపై అక్షింతలు జల్లి 'మేఘా! తిశూలం గీయి' అని చెప్పి అదృశ్యం అయ్యారు. మేఘుడు బాబా మాటలు విని, ఆత్రుతగా కళ్ళు తెరిచాడు. బాబా కనిపించలేదు కానీ, అక్షింతలు అక్కడక్కడా పడి ఉన్నాయి. బాబా దగ్గరికి వెళ్ళి చూసిన దృశ్యం గురించి చెప్పి త్రిశూలాన్ని గీయడానికి ఆజ్ఞ ఇవ్వమని అడిగాడు. బాబా ఇలా అన్నారు 'నా మాటలు వినలేదా? త్రిశూలాన్ని గీయమన్నాను. అది దృశ్యం కాదు, స్వయంగా వచ్చి నేనే చెప్పాను. నామాటలు పోల్లుపోవు, అర్థవంతాలు', మేఘుడు ఇలా అన్నాడు 'మీరు నన్ను లేపినట్లు భావించాను. తలుపులు అన్నీ వేసి ఉండటంతో అది దృశ్యం అనుకున్నాను'. బాబా తిరిగి ఇలా జవాబు ఇచ్చారు 'ప్రవేశించడానికి నాకు వాకిలి అవసరం లేదు. నాకు రూపం లేదు. నేను అన్ని చోట్లా నివసిస్తున్నాను. ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానంలోనే మునిగి ఉంటారో వారి పనులు అన్నీ సూత్రధారిని అయి నేనే నడిపిస్తాను.’

మేఘుడు వాడాకు తిరిగి వచ్చి, బాబా పటం దగ్గర దొడగోడపై త్రిశూలాన్ని ఎర్రరంగుతో గీశాడు. ఆ మరుసటి రోజు ఒక రామదాసి భక్తుడు పూణా నుంచి వచ్చి బాబకి నమస్కరించి ఒక లింగాన్ని సమర్పించాడు. అప్పుడే మేఘుడు కూడా అక్కడికి వచ్చాడు. బాబా ఇలా అన్నారు 'చూడు శంకరుడు వచ్చాడు! జాగ్రత్తగా పూజించు'. మేఘుడు త్రిశూలం గీసిన వెంటనే లింగం రావడం చూసి ఆశ్చర్యపడ్డాడు. వాడాలో కాకాసాహెబు దీక్షిత్ స్నానం చేసి సాయిని తలుచుకుంటూ ఉండగా మేఘశ్యాముడు వచ్చి, బాబా తనకు లింగం కానుకగా ఇచ్చారని చూపించాడు. దీక్షిత్ దాన్ని చూసి సరిగ్గా అది తన ధ్యానంలో కనిపించిన దానిలా ఉన్నదని సంతోషించాడు. కొద్ది రోజులలో త్రిశూలాన్ని వ్రాయడం పూర్తికాగా బాబా మేఘశ్యాముడు పూజచేస్తున్న పెద్ద పటం దగ్గర లింగాన్ని ప్రతిష్ఠించారు. మేఘశ్యాముడికి శివుణ్ణి పూజించడం చాలా ఇష్టం కాబట్టి త్రిశూలాన్ని వ్రాయించి, లింగాన్ని ప్రతిష్టించడం ద్వారా బాబా వాడిలో ఉన్న నమ్మకం స్థిరపరిచారు. అనేక సంవత్సరాలు బాబా సేవ చేసి అంటే పూజ, మధ్యాహ్న, సాయంకాల హారతి సేవలు చేసి చివరికి 1912లో మేఘశ్యాముడు కాలం చేశాడు. బాబా వాడి మృతదేహంపై చేతులు చాచి 'యితడు నా నిజమైన భక్తుడు' అన్నారు. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజనం ఏర్పాటు చేయమన్నారు. కాకాసాహెబు దీక్షిత్ బాబా నెరవేర్చారు.

ఇరవైఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం 

Products related to this article

Oxidized Emerald with Studded Pearls

Oxidized Emerald with Studded Pearls

Oxidized Emerald with Studded Pearls Product Description:    Product: Ear rings  Colour: Green Metal: Emerald, Pearls Earring Length:1.8 Inchs  This Stud&nb..

$17.00

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter..

$13.00

0 Comments To "Saibaba Satcharitra 28 Adyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!