Saibaba Satcharitra 29 Adyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైతొమ్మిదవ అధ్యాయం

 

1. మద్రాసు భజనసమాజము 2. టెండూల్కర్ (తండ్రి-కొడుకులు) 3. డాక్టర్ కాప్టెన్ హాటే 4. వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు

ఈ అధ్యాయంలో రుచికరమైన, ఆశ్చర్యకరమైన మరికొన్ని సాయి కథలు ఉన్నాయి.

1. మద్రాసు భజన సమాజం : 1916వ సంవత్సరంలో రామదాసి పంథాకి చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకి బయలుదేరింది. అందులో ఒక పురుషుడు అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన ఉన్నారు. వారి పేర్లు తెలియవు, మార్గమధ్యంలో వారు అహమదునగరు జిల్లా కోపర్ గాం తాలూకాలో షిరిడీ అనే గ్రామంలో సాయి అనే ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నారని, వారు పరబ్రహ్మస్వరూపులు అనీ, ప్రశాంతులు అనీ, ఉదారస్వభావులు అనీ, భక్తులకు ప్రతిరోజూ ద్రవ్యం పంచిపెడతారని, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితంగా సత్కరిస్తారు అనీ విన్నారు. ప్రతిరోజూ దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి, దాన్ని భక్త కొండాజి కూతురు 3ఏళ్ల ఆమనికి ఒక రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, ఆమని తల్లికి 10 రూపాలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇస్తుండేవారు. ఇదంతా విని సమాజం షిరిడీకి వచ్చి అక్కడ ఆగి మంచి భోజనం చేశారు. వారు మంచి పాటలు పాడారు. కాని లోలోన ద్రవ్యాన్ని ఆశిస్తూ ఉన్నారు. వారిలో ముగ్గురు పేరాశ గలవారు. యజమానురాలు మాత్రం అలాంటి స్వభావం లేనిది. ఆమె బాబా పట్ల పరమ గౌరవాలు కలది. ఒకరోజు మధ్యాహ్న హారతి జరుగుతుండగా బాబా ఆమె భక్తివిశ్వాసాలకు ప్రీతి చెంది ఆమె యిష్ట దైవం యొక్క దృశ్యాన్ని ప్రసాదించారు. ఆమెకు బాబా శ్రీరాముడిలా కనిపించారు. తన ఇష్టదైవాన్ని చూసి ఆమె మనస్సు కరిగింది. కళ్ళనుండి ఆనందభాష్పాలు కారుతుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టింది. ఆమె ఆనంద వైఖరికి మిగిలినవారు ఆశ్చర్యపోయారు. కాని కారణం ఏమిటో తెలుసుకోలేకపోయారు. జరిగినది అంతా ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పింది. ఆమె సాయిబాబాలో శ్రీరాముడిని చూశాను అని చెప్పింది. ఆమె అమాయక భక్తురాలు కావడంతో, శ్రీరాముడిని చూడటం ఆమె పడిన భ్రమ అని భర్త అనుకున్నాడు. అది అంతా పచ్చి ఛాదస్తం అని వెక్కిరించాడు. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముడిని చూడటం అసంభవం అని అన్నాడు. ఆమె ఆ ఆక్షేపణకు కోప్పడలేదు. ఆమెకు శ్రీరాముడి దర్శనం అప్పుడప్పుడూ తన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, దురాశలు లేనప్పుడు లభిస్తూనే ఉన్నాయి.

ఆశ్చర్యకరమైన దర్శనం : ఈ ప్రకారం జరుగుతుండగా ఒకరోజు రాత్రి అద్భుతమైన దృశ్యం ఈ విధంగా కనిపించింది. అతడు ఒక పెద్ద పట్టణంలో ఉన్నాడు, అక్కడి పోలీసులు అతన్ని బంధించారు. తాడుతో చేతులు కట్టి, ఒక పంజరంలో బంధించారు, పోలీసులు తాడుముడి మరింత బిగిస్తుండగా సాయిబాబా పంజరం దగ్గరే నిలబడి ఉండటం చూసి విచారంగా అతడు ఇలా అన్నాడు 'నీ కీర్తి విని నీ పాదాల దగ్గరికి వచ్చాను. నీవు స్వయంగా ఇక్కడ నిలబడి ఉండగా ఈ ఆపద నాపై ఎందుకు పడింది?.’ బాబా ఇలా అన్నారు 'నీవుచేసిన కర్మ ఫలితాన్ని నీవే అనుభవించాలి!’. అతను ఇలా అన్నాడు 'ఈ జన్మలో నాకు ఇలాంటి ఆపద రావడానికి నేను ఎలాంటి పాపం చేయలేదు.’ అందుకు బాబా ఇలా బదులు చెప్పారు 'ఈ జన్మలో కాకపొతే గతజన్మలో ఏమయినా పాపం చేసి ఉండవచ్చు.’ అతడు ఇలా అన్నాడు 'గతజన్మలో నేను ఏమైనా పాపం చేసి ఉన్నట్లయితే, నీ సమక్షంలో దాన్ని ఎలా నిప్పుముందు ఎండుగడ్డిలా దహనం చేయకూడదు?’. బాబా 'నీకు అలాంటి విశ్వాసం ఉన్నదా?’ అని అడిగారు దానికి అతను 'వుంది'. అన్నాడు. బాబా అప్పుడు కళ్ళు మూసుకో అన్నారు. అతను కళ్ళు మూసి తెరిచి చూడగా ఎదో క్రిందపడిన పెద్ద చప్పుడు అయింది. పోలీసువారు రక్తం కారుతూ పడిపోయి ఉన్నారు. తాను బంధవిముక్తుడై ఉన్నాడు. అతను భయపడి బాబా వైపు చూశాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు 'ఇప్పుడు నీవు బాగా పట్టుబడ్డావు. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధిస్తారు' అప్పుడు అతను ఇలా విన్నవించాడు 'నీవు తప్ప రక్షించే వారు ఎవరూ లేరు. నన్ను ఎలాగయినా కాపాడు.’ అప్పుడు బాబా అతన్ని కళ్ళు మూసుకోమని చెప్పారు. అతను అలాగే చేసి తిరిగి కళ్ళు తెరిచి చూడగా వాడు పంజరంలో నుండి విడుదల అయినట్లు, బాబా ప్రక్కన ఉన్నట్లు కనిపించింది. అతడు బాబా పాదాలపై పడ్డాడు. బాబా ఇలా అన్నారు 'ఈ నమస్కారాలకి ఇంతకుముందు నమస్కారాలకి ఏమైనా భేదం ఉందా? బాగా ఆలోచించి చెప్పు!.’ అతను ఇలా అన్నాడు 'కావలసినంత భేదం వుంది. ముందటి నమస్కారాలు నీ దగ్గర పైకం తీసుకోవడానికి చేసినవి. ఈ నమస్కారం నిన్ను దేవుడిగా భావించి చేసినది. ఇంకా నేను కోపంతో నీవు మహామ్మదీయుడివై వుండి హిందువులను పాడు చేస్తున్నావు అని అనుకునేవాడిని.’ బాబా 'నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా?’ అని ప్రశ్నిస్తే అతడు నమ్మను అన్నాడు. అప్పుడు బాబా 'నీ ఇంట్లో పంజా లేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయడం లేదా? ఇంకా మీ ఇంట్లో మహమ్మదీయ దేవత అయిన కాడ్బబీ లేదా? పెళ్ళి మొదలైన శుభకార్యాల సమయంలో ఆమెను మీరు శాంతింప చేయడం లేదా? అన్నారు. అతను దీనికంతటికీ ఒప్పుకున్నాడు. అప్పుడు బాబా 'నీకు ఇంకా ఏం కావలి?’ అని అడిగారు. అతను తన గురువు అయిన రామదాసును దర్శించాలని కోరిక ఉన్నది అని అన్నాడు. వెనక్కు తిరిగి చూడమని బాబా అన్నారు. అతను వెనక్కి తిరగ్గానే అతనికి ఆశ్చర్యం కలిగేలా రామాదాసుస్వామి తన ఎదుట ఉన్నారు. వారి పాదాలపై పడగానే, రామదాసు అదృశ్యం అయ్యాడు. జిజ్ఞాస కలవాడై అతను బాబాతో ఇలా అన్నాడు 'మీరు వృద్ధులుగా కనబడుతున్నారు. మీ వయస్సు మీకు తెలుసా?’ దానికి బాబా, ‘నేను ముసలివాడిని అంటున్నావా? నాతో పరుగెత్తి చూడు' అంటూ పరుగెత్తడం మొదలుపెట్టారు. అతను కూడా వెంబడించాడు. ఆ ధూళిలో బాబా అదృశ్యం అయ్యారు. అతను నిద్రలో నుండి మేల్కొన్నాడు. మేల్కున్న వెంటనే స్వప్నదర్శనం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతని మనోవైఖరి పూర్తిగా మారి, బాబా గొప్పదనం అని గ్రహించాడు. ఆపైన అతని సంశయవైఖరి పేరాశ పూర్తిగా తొలగిపోయింది. బాబా పాదాలపై అసలయిన భక్తి మనస్సులో జనించింది. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని, అందులో ఉన్న ప్రశ్నోత్తరాలు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. అ మరునాటి ఉదయం అందరూ మసీదులో హారతి కోసం గుంపుగా ఉండగా అతనికి బాబా రెండు రూపాయల విలువగల మిఠాయిని, రెండు రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించారు. అతన్ని మరికొన్ని రోజులు ఉండమని అన్నారు. అతన్ని బాబా ఆశ్వీర్వదించి ఇలా అన్నారు 'అల్లా నేకు కావలసినంత ఇస్తాడు. నీకు మేలు చేస్తాడు.’ అతనికి అక్కడ ఎక్కువ ధనం దొరకలేదు కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికింది. అదే బాబా ఆశీర్వాదం. తరువాత ఆ భజన సమాజానికి ఎంతో ధనం లభించింది. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగింది. వారికి ఎలాంటి కష్టాలు ప్రయాణంలో కలగలేదు. అందరూ క్షేమంగా వారి వారి ఇళ్ళకు చేరుకున్నారు. వారు బాబా పలుకులు, ఆశీర్వాదాలు, వారి కటాక్షాలతో కలిగిన ఆనందం గురించి మనస్సులో చింతిస్తున్నారు. తన భక్తులను అభివృద్ధి చేయడానికి, వారి మనస్సులను మార్చడానికి బాబా అవలంభించిన మార్గంలో ఒకటి చూపడానికి ఈ లీల ఒక ఉదాహరణ. ఇప్పటికీ ఇలాంటి మార్గాలను బాబా అవలంభిస్తునారు.

టెండూల్కర్ కుటుంబం

బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండేది. ఆ కుటుంబం వారు అందరూ బాబా పట్ల భక్తి కలిగి ఉన్నారు. సావిత్రీబాయి టెండూల్కర్ 'శ్రీసాయినాథ భజనమాల' అనే మరాఠీ గ్రంథాన్ని 800 అభంగములు, పదాలతో ప్రచురించారు. దాన్లో సాయిలీలలు అన్నీ వర్ణించబడ్డాయి. బాబాపట్ల శ్రద్ధాభక్తులు గలవారు దాన్ని తప్పకుండా చదవాలి. వారి కుమారుడు బాబా టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చోవాలని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతున్నాడు. అతను కొందరు జ్యోతిష్కుల సలహా తీసుకున్నాడు. వారు అతని జాతకన్ని చూసి ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని చెప్పారు. కాబట్టి ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చోవాలని అలా చేస్తే తప్పకుండా ఉత్తీర్ణుడు అవుతాడని చెప్పారు. ఇది విని అతని మనస్సుకు విచారం, అశాంతి కలిగాయి. కొన్ని రోజుల తరువాత అతని తల్లి షిరిడీకి వెళ్ళి బాబను దర్శించుకున్నారు. ఆమె బాబాకి అనేక విషయాలతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడు అయిన విషయాన్ని కూడా చెప్పింది. ఇది విని బాబా ఆమెతో ఇలా అన్నారు 'నా పట్ల నమ్మకం ఉంచి జాతకాలు, వాటి ఫలితాలు,సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక ప్రక్కన పెట్టి, తన పాఠాలు చదవుకోమని చెప్పు. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమను. అతడు ఈ సంవత్సరం తప్పకుండా ఉత్తీర్ణుడు అవుతాడు. నా పట్ల నమ్మకం ఉంచుకోమను, నిరుత్సాహం చెందవద్ద'ని తల్లికి చెప్పారు. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశం కొడుకుకు చెప్పింది. అతను శ్రద్ధగా చదివాడు, పరీక్షకు కూర్చున్నాడు. వ్రాత పరీక్షలో బాగా వ్రాశాడు, కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడు కావడానికి కావలసిన మార్కులు రావు అనుకున్నాడు. కాబట్టి నోటి పరీక్షకు కూర్చోవడానికి సిద్ధపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటపడ్డారు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడని, కాబట్టి నోటి పరీక్షకు రావాలని పరీక్షా అధికారి కబురు పెట్టాడు. ఇలా ధైర్యవచనం విని అతను పరీక్షకు కూర్చుని రెండింటిలో ఉత్తీర్ణుడు అయ్యాడు. సంశయాలు, కష్టాలు మన భక్తిని స్థిరపరచడానికి మనలను చుట్టుముడతాయి. మనలని పరీక్షిస్తాయి, పూర్తి విశ్వాసంతో బాబాను కొలుస్తూ మన కృషి సాగించినట్లయితే మన ప్రయత్నాలు అన్నీ చివరకు విజయవంతం అవుతాయి. ఈ విద్యార్ధి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువై ఉన్నాడు. వృద్ధాప్యం వల్ల సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుతూ ఉన్నారు. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు, కాబట్టి సెలవు పొడిగించుకోవాలని అనుకున్నారు, లేదా ఉద్యోగం నుండి విరమించుకోవాలని అనుకున్నారు. కంపెనీ మేనేజరు అతనికి పించెను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించాలి అని నిశ్చయించుకున్నారు. అత్యంత నమ్మకంతో చాలాకాలం తమ దగ్గర ఉద్యోగం చేసినవాడు కాబట్టి ఎంత పించను ఇవ్వాలి అనే ఆలోచన చేస్తున్నారు. అతని వేతనం నెలకు 150 రూపాయలు. పించను అందులో సగం 75 రూపాయలు, కుటుంబం ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారు అందరూ ఆత్రుతగా ఉన్నారు. చివరి నిర్ణయానికి 15 రోజులముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి ‘100 రూపాయల పించను ఇచ్చినా బాగుంటుంది అని అనుకుంటాను. అది నీకు సంతృప్తికరమా?’ అన్నారు. ఆమె ఇలా జవాబు ఇచ్చింది 'బాబా నన్ను ఎందుకు అడుగుతున్నావు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము.’ బాబా 100 రూపాయలు అన్నా, అతనికి 10 రూపాయలు అధికంగా అంటే 110 రూపాయలు పించను లభించింది. తన భక్తులపై బాబా ఇలాంటి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించేవారు.

కాప్టెన్ హాటే

కాప్టెన్ హాటే బికానేరులో ఉండేవారు. అతను బాబాకి అత్యంత భక్తుడు. ఒకరోజు బాబా అతని స్వప్నంలో కనిపించి 'నన్ను మరచిపోయావా?’ అన్నారు. హాటే వెంటనే బాబా పాదాలు పట్టుకుని 'బిడ్డ తల్లిని మరచిపోతే ఎలా బ్రతుకుతుంది?’ అంటూ తోటలోకి వెళ్ళి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయంపాకాన్ని,దక్షిణం బాబాకి అర్పించబోగా, అతడు మేల్కొన్నాడు. ఇది అంతా స్వప్నం అనుకున్నాడు. ఈ వస్తువులు అన్నింటినీ షిరిడీ సాయిబాబా దగ్గరకి పంపించాలని నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత గ్వాలియర్ వెళ్ళాడు. అక్కడనుండి 12 రూపాయలు మనీఆర్డరు ద్వారా బొంబాయిలో ఉన్న తన స్నేహితుడికి పంపించి అందులో రెండు రూపాయలతో స్వయంపాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని, 10 రూపాయల దక్షిణ సమర్పించాలని రాశాడు. ఆ స్నేహితుడు షిరిడీకి వెళ్ళి కావలసిన సామాన్లు కొన్నాడు. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చింది. అతడు చిక్కుడుకాయలు కొని స్వయంపాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే తరపున దాన్ని బాబాకి అర్పించాడు. బాబా భోజనం చేస్తున్నప్పుడు అన్నం ఇతర పదార్థాలను మానివేసి చిక్కుడుకాయ కూరను తిన్నారు. ఈ సంగతి స్నేనితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషానికి అంతులేకపోయింది.

పవిత్రం చేసిన రూపాయి : ఇంకొకసారి హాటేకి తన ఇంట్లో బాబా తాకి (పట్టుకుని) పవిత్రం చేసిన రూపాయిని ఉంచుకోవాలనే కోరిక కలిగింది. షిరిడీకి వెళ్ళే స్నేహితుడు ఒకడు తటస్థపడగా వాడి ద్వారా హాటే రూపాయి పంపించాడు. ఆ స్నేహితుడు షిరిడీకి చేరుకున్నాడు. బాబాకి నమస్కరించిన తరువాత తన గురుదక్షిణ ఇవ్వగా బాబా దాన్ని జేబులో వేసుకున్నారు. తరువాత హాటే యిచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూసి, తన కుడిచేతి బొటన వ్రేలితో పైకి ఎగర వేసి, ఆ స్నేహితుడితో ఇలా అన్నారు 'దీన్ని దాని యజమానికి ఊదీ ప్రసాదంతో పాటు ఇవ్వు. నాకేమీ అక్కరలేదని చెప్పు. శాంతంగా, సంతోషంగా ఉండమను.’ ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాడు. హాటేకి బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినది అంతా చెప్పాడు. ఈసారి హాటే మరింత సంతృప్తి చెందాడు. బాబా సద్భుద్ది కలగజేస్తారని గ్రహించాడు. మనఃపూర్వకంగా కోరుకోవడంతో బాబా తన కోరికను యథాప్రకారం నెరవెర్చారని సంతోషించాడు.

వామన నార్వేకర్

చదివే వారు ఇంకొక కథ వినండి. వామన్ నార్వేకర్ అనే అతను బాబాను అమితంగా ప్రేమించేవాడు. ఒకరోజు అతను ఒక రూపాయి తెచ్చాడు. దానికి ఒక ప్రక్క సీతారామలక్ష్మణులను, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడు ఉన్నారు. అతడు దాన్నిబాబాకి ఇచ్చాడు. బాబా దాన్ని తాకి, పవిత్రం చేసి ఊదీ ప్రసాదంతో ఇవ్వాలని అతని కోరిక. కాని బాబా దాన్నివెంతనే జేబులో వేసుకున్నారు. శ్యామా, నార్వేకర్ ఉద్దేశ్యం తెలుపుతూ దాన్ని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడుకున్నాడు. బాబా ఇలా అన్నారు 'దీన్ని ఎందుకు అతనికి ఇవ్వాలి? దీన్ని మనమే ఉంచుకుందాం. అతడు 25 రూపాయలు ఇస్తే తిరిగి అతనికి ఇద్దాం’ . అ రూపాయి కోసం వామనరావు 25రూపాయలు వసూలు చేసి బాబా ముందు పెట్టాడు. బాబా ఇలా అన్నారు ‘ఆ నాణెం విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామా! ఈ రూపాయిని తీసుకో. మన కోశంలో దీన్ని ఉంచుదాం. దీన్ని పూజామందిరంలో పెట్టి పూజించుకో' బాబా ఎందుకు ఈ మార్గాన్ని అవలంభించారో అడగడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. ఎవరికి ఏది క్షేమమో బాబాకే తెలుసు.

ఇరవైతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం

Products related to this article

Ganesha Car Hanging (Blue)
Wooden Elephant Key Chain

Wooden Elephant Key Chain

Wooden Elephant Key Chain..

$1.00

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter..

$13.00

0 Comments To "Saibaba Satcharitra 29 Adyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!