saibaba-satcharitra-32-chapter

శ్రీసాయిసచ్చరిత్ర

ముప్పైరెండవ అధ్యాయం

ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు రెండు విషయాలను వర్ణించారు. 1. బాబా తన గురువును అడవిలో ఎలా కలిశారు. వారి ద్వారా దైవాన్ని ఎలా కనుగొన్నారు. 2. గోఖలేగారి భార్య మూడు రోజుల ఉపవాసం ఉండాలని నిశ్చయించుకుంటే ఆమెతో బాబా ఎలా ఉపవాసదీక్ష మానిపించారు?

ప్రారంభంలో హేమాడ్ పంతు, సంసారాన్ని అశ్వత్థవృక్షంతో పోల్చుతూ గీతలో చెప్పిన ప్రకారం దాని వేర్లు పైన కొమ్మలు కింద ఉన్నాయి అన్నారు. దాని కొమ్మలు క్రిందివైపు, మీద వైపు కూడా వ్యాపించి ఉన్నాయి. అవి గుణాలతో పోషింపబడుతున్నాయి. దాని అంకురాలు ఇంద్రియ విషయాలు. దాని వేర్లు కర్మను చేయిస్తూ మానవప్రపంచం వరకు వ్యాపించి ఉన్నాయి. దాని స్వరూపంగాని, దాని ఆధారంగాని, దాని ఆద్యంతాలుగాని ఈ లోకానికి తెలియవు. వైరాగ్యం అనే పదునైన కత్తితో ఈ బలమైన వేర్లుగల అశ్వత్థవృక్షాన్ని నరికి, ఏ అతీతమైన మార్గాన్ని అనుసరిస్తే తిరిగి జన్మలేదో అటువంటి దాన్ని అనుసరించాలి.

అలాంటి దారిలో నడవడానికి, దారి చూపించే మంచి గురువు సహాయం అత్యంత అవసరం. ఒకడు ఎంత పండితుడు అయినప్పటికీ వేదవేదాంగాలను బాగా చదివినప్పటికీ, తన గమ్యస్థానానికి సురక్షితంగా వెళ్ళలేడు. మార్గదర్శే వుండి సహాయపడి సరి అయిన దారి చూపించినట్లు అయితే మార్గంలో ఉన్న గోతులనుండి, అడవి మృగాలనుండి తప్పించుకుని సునాయసంగా పయనిస్తాడు.

ఈ విషయంలో బాబా అనుభవాన్ని బాబాయే స్వయంగా తెలిపారు. ఇది అత్యంత చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే నమ్మకం, భక్తి, మోక్షం ప్రాప్తిస్తాయి.

అన్వేషణం :

ఒకానొకప్పుడు మేము నలుగురుం మతగ్రంథాలు చదువుతూ ఆ జ్ఞానంతో బ్రహ్మం, నైజం గురించి తర్కించడం మొదలుపెట్టాము. మాలో ఒకడు ఆత్మను ఆత్మతో ఉద్ధరించాలి కాని ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనంలో వుంచున్నవాడే ధన్యుడు అని మనం ఆలోచనల నుండి భావాల నుంచి ముక్తులం అయినట్లయితే మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు అని చెప్పాడు. మూడవవాడు దృశ్యప్రపంచం సదా పరిణామ శీలం అయినది అని, నిరాకారమే శాశ్వతమైనది కాబట్టి సత్యాసత్య విచక్షణ అవసరం అని చెప్పాడు. నాలుగవ వారు (బాబా) ‘పుస్తకజ్ఞానం ఎందుకూ పనికిరాదు.మనకు విధింపబడిన కర్మను మనం పూర్తిచేసి, తనువును, మనసును, పంచప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణు వేడుకోవాలి. గురువే దైవం, సర్వంలో వ్యాపించినవాడు. ఇలాంటి ప్రత్యామ్నాయం ఏర్పడటానికి, దృఢమైన అంతులేని నమ్మకం అవసరం' అన్నారు.

ఈ విధంగా తర్కించుకుంటూ మేము నలుగురం పండితులం భగవంతుడిని వెదకడానికి అడవులలో తిరగడం ప్రారంభించాము. మిగిలిన ముగ్గురూ వారి స్వతంత్రబుద్ధిని ఉపయోగించి వెదకడానికి నిశ్చయించుకున్నారు. దారిలో ఒక వర్తకుడు (బంజారా) మమ్మల్ని కలిసి 'ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది. ఎంతదూరం వెళుతున్నారు? ఎక్కడికి వెళుతున్నారు?’ అని అడిగాడు. అడవులు వెదకడానికి అని మేము జవాబు ఇచ్చాము. ఏమి వెదకడానికి అని అతడు తిరిగి అడిగాడు. ఎదో సందిగ్ధమైన యుక్తి జవాబు ఇచ్చాము. దయరహితంగా మేము తిరగడం చూసి అతడు కనికరించి ఇలా అన్నాడు 'అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకూడదు అడవులలో సంచరించాలి అంటే మీ వెంట ఒక మార్గదర్శి ఉండితీరాలి. అనవసరంగా ఈ ఎండవేళ ప్రయాస పడతారెందుకు? మీ రహస్యన్వేషణ నాకు చెప్పక్కరలేదు. అయినా మీరు కూర్చుని భోజనం చేసి, నీళ్ళు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని తరువాత వెళ్ళవచ్చు, ఓపికతో ఉండండి' అన్నాడు. అతడు అంత మృదువుగా మాట్లాడినా, వాణ్ణి నిరాకరించి నడవడం సాగించాం. మాకు అన్ని సంగతులు తెలుసు కాబట్టి ఇతరుల సహాయం అక్కరలేదు అనుకున్నాము.

అడవులు పెద్దవి, మార్గాలు లేనివి, చెట్లు దగ్గరగా, ఎత్తుగా ఉండటంతో సూర్యరశ్మి లోపలికి ప్రవేశించలేక పోయింది. కాబట్టి దారి తప్పి అటూ ఇటూ చాలాసేపు తిరిగాం. చిట్టచివరికి ఎక్కడనుండి బయలుదేరామో అక్కడికే అదృష్టవశాత్తు తిరిగివచ్చాం. బంజారా తిరిగి కలుసుకుని ఇలా అన్నాడు 'మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పారు. చిన్నదానికిగాని, పెద్దదానికిగాని సరైన మార్గం చూపించడానికి ఒక మార్గదర్శి వుండి తీరాల్సిందే. ఉత్తకడుపుతో ఎలాంటి అన్వేషణ జయప్రదం కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరూ కలవారు. పెట్టిన భోజనం వద్దనకండి, వడ్డించిన విస్తరిని తోసివేయకండి, భోజన పదార్ధం అర్పించడం శుభసూచకం' ఇలా అంటూ తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బ్రతిమిలాడాడు. నా మిత్రులు ముగ్గురూ ఆ మాటలను లక్ష్యపెట్టకుండా, భోజనం చేయకుండా ప్రయాణం సాగించారు. వారి హఠం ఆ విధంగా ఉంది. నేను మాత్రం ఆకలితోనూ, దాహంతోనూ ఉన్నాను. బంజారా చూపించిన అసామాన్య ప్రేమకు లొంగిపోయాను. మేము ఎంతో తెలివైన వారిమని అనుకున్నాం. కాని దయాదాక్షిణ్యాలకు దూరం అయ్యాము. బంజారా చదువుకున్నవాడు కాదు, యోగ్యతలు లేనివాడు, తక్కువజాతివాడు, కాని అతని హృదయం ప్రేమమయం. భోజనం చేయమని మమ్మల్ని వేడుకున్నాడు.ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరు అయితే ఇతరులను ప్రేమిస్తారో వారు నిజంగా నాగరికులని తలచి వాడి ఆతిథ్యాన్ని ఆమోదించడమే జ్ఞానానికి ప్రథమసోపానం అని అనుకున్నాను. అత్యంత మర్యాదతో అతను పెట్టిన భోజనం నేను తిని (బాబా) నీళ్ళు త్రాగాను.

ఏమి ఆశ్చర్యం! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచారు. వారు అడగటంతో జరిగిన వృత్తాంతం అంతా తెలియజేశాను. అప్పుడు వారు 'నాతొ రావడానికి ఇష్టపడతారా? మీకు కావలసినది ఎదో నేను చూపెడతాను. నాపట్ల విశ్వాసం వున్న వారికే జయం కలుగుతుంది' అన్నారు. మిగిలినవారు వారి మాటలకు సమ్మతించకుండా ఎక్కడికో వెళ్ళారు. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడ్డాను. అప్పుడు వారు నన్ను ఒక బావి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అక్కడ నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్ళకు మూడు అడుగుల మీద ఉండేలా నన్ను వ్రేలాడదీశారు. నా చేతులతో గాని నోటితోగాని నీళ్ళను అందుకోలేని పరిస్థితి. నన్ను ఈ విధంగా వ్రేలాడదీసి వారు ఎక్కడికో వెళ్ళారు. 4-5 గంటల తరువాత వారు తిరిగి వచ్చి నన్ను బావిలోనుండి బయటికి తీసి ఎలా వున్నావు అని అడిగారు. ‘ఆనందంలో మునిగి ఉన్నాను, నేను పొందిన ఆనందాన్ని నావంటి మూర్ఖుడు ఎలా వర్ణించగలడు?’ అని జవాబు చెప్పాను. దీన్ని విని గురువుగారు ఎంతగానోత సంతృప్తి చెందారు. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి దగ్గర ఉంచుకున్నారు. తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా చూసినట్లు నన్ను వారు కాపాడారు. నన్ను తమ ఒడిలో చేర్చుకున్నారు. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచిపోయాను. నా అభిమానం అంతా తొలగిపోయింది. నాకు సులభంగా విమోచనం కలిగింది. గురువుగారి మెడను కౌగలించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలని అనిపించింది. వారి ప్రతిబింబం నా కనుపాపలలో నిలవనప్పుడు నాకు కళ్ళు లేకుండా ఉండటమే మేలు అని అనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారు ఎవరూ ఒట్టిచేతులతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తంగా తోస్తూ ఉండేది. నా ఇళ్ళు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతా వేరే. నా ఇంద్రియాలు అన్నీ తమతమ స్థానాలు విడిచి, నా కళ్ళముందు కేంద్రీకృతం అయ్యాయి, నా దృష్టి గురువులోనే కేంద్రీకృతం అయ్యింది. నా ధ్యానం అంతా నా గురువుపైన నిలిపాను. నాకు ఇంకొక దానిలో స్పృహ లేకుండా పోయింది. వారిని ధ్యానం చేయనప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దం అవుతూ ఉండేది. నిశ్శబ్దంగా వారికి నమస్కరిస్తూ ఉన్నాను.

ఇతర పాఠశాలల్లో పూర్తిగా మరొక విధమైన దృశ్యాలు కనిపిస్తాయి. భక్తులు జ్ఞానం సంపాదించడానికి వెళ్ళి ధనాన్ని, కాలాన్ని, కష్టాన్ని ఖర్చు చేస్తారు. చిట్టచివరికి పశ్చాత్తాప పడతారు. అక్కడ ఉన్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన ఋజు వర్తనం గురించి పొగుడుకుంటూ తన ప్రావీణ్యం ప్రదర్శిస్తారు తప్ప, హృదయం మృదువుగా ఉండదు. అతను అనేక విషయాల గురించి మాట్లాడతాడు. తన మహిమను తానే పొగుడుకుంటాడు. కాని ఆ మాటలు భక్తుల హృదయంలో నాటుకోవు వారిని ఒప్పించలేవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకు ఏం మేలు చేస్తాయి? వారికి ఏమిటి లాభం? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షంతో ఎటువంటి శ్రమ లేకుండా ఆత్మజ్ఞానం దానిమటుకు అది నాలో ప్రకాశిస్తుంది, నేను కోరుకోవడానికి ఏమీ లేకపోయింది. సర్వం దాని మటుకు అదే పగటి ప్రకాశంలా బోధపడింది. తలక్రిందులుగా కాళ్ళు పైకి ఉంచడం వలన కలిగే ఆనందం గురువుకే తెలుసు.

నలుగురిలో ఒకడు కర్మఠుడు (అంటే కర్మలలో నమ్మకం ఉన్నవాడు). అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధాలు మాత్రమే తెలుసు. రెండవవాడు జ్ఞాని, అతడు తనకి ఉన్న జ్ఞానానికి గర్వించేవాడు. మూడవవాడు భక్తుడు, భగవంతుడికి సర్వస్యశరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వాన్ని చేసేవాడు అని అతని నమ్మకం. వారు ఇలా తర్కించుకుంటూ వివాదపడుతుండగా దేవుడి సమస్య వచ్చింది. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుడిని వెదకడానికి వెళ్ళారు. వివేకానికి, వైరాగ్యానికి అవతారమైన శ్రీసాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మస్వరూపులై కూడా వారు ఎందుచేతనో ఇతరులతో కలిసి తెలివితక్కువగా ప్రవర్తించారని ఎవరైనా అడగవచ్చు. ప్రజాభిప్రాయాన్ని, వారి మంచిని సంపాదించడానికి, వారికి ఒక ఉదాహరణ చూపించడానికి, వారు ఇలా చేశారు. వారు అవతార పురుషులు అయినప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి అతని ఆహారాన్ని ఆమోదించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వారి నమ్మకం. బంజారా ఆహారాన్ని నిరాకరించినవారు కష్టాలపాలయ్యారు. గురువు లేనిదే జ్ఞానం సంపాదించడం వీలుకాదని వారు బోధించారు. తైత్తిరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మతగ్రంథాలను అభ్యసించాలని చెపుతున్నది. ఇవే కాకుండా మన మనస్సును పావనం చేయడానికి మార్గాలు మనస్సును పావనం చేయనిదే ఆత్మసాక్షాత్కారం పొందలేము. ఇంద్రియాలనుగాని, మనస్సునుగాని, బుద్ధినిగాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షం, అనుమానం మొదలైన ప్రమాణాలు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడుతుంది. ధర్మ, అర్థం, కామం మన కృషివల్ల లభిస్తాయి, కానీ నాలుగవది అయిన మోక్షం గురువు సహాయం వల్లనే పొందగలం.

సాయి దర్బారులోకి అనేకమంది వచ్చి, వారికి తెలిసిన విద్యలను ప్రదర్శించి వెళ్ళేవారు. జ్యోతిష్కులు రాబోయే విషయాలు చెపుతూ ఉండేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటలు పాడేవారు మొదలైనవారు బాబా దర్శనానికి వచ్చేవారు. ఒక మహారు (మాలవాడు) వచ్చి జోహారు చేసి ఈ సాయి 'మాబాప్' (తల్లీదండ్రీ) అనీ, వారు మన చావుపుట్టుకలను తుడిచేస్తారని చెప్పాడు. గారడీవాళ్ళు, గుడ్డివాళ్ళు, చొట్టవారు, నర్తకులు, నాథసంప్రదాయం వారు, పగటి వేషాలవారు కూడా అక్కడ సమానంగా ఆదరింపబడుతూ ఉండేవారు. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించాడు. తన పాత్రను ముగించాడు, మనం ఇప్పుడు ఇంకొక కథను విందాము.

గోఖలేగారి భార్య - ఉపవాసము

బాబా ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు, ఇతరులను కూడా ఉపవాం చేయనిచ్చేవారు కాదు. ఉపవాసం చేసే వారి మనస్సు స్థిమితంగా వుండదు. అలాంటి వారు పరమార్థం ఎలా సాధిస్తాడు? ఉత్తకడుపుతో దేవుణ్ణి చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయాలి. కడుపులో తడి కలగచేసే ఆహారంగాని, పౌష్టికశక్తిగాని లేనప్పుడు భగవంతుణ్ణి ఏ కళ్ళతో చూడగలం? ఏ నాలుకతో పొగడగలం? ఏ చెవులతో వాటిని వినగలం? ఏ వేళ మన అవయవాలు అన్నీ వాటి శక్తిని మొదలైన సాధనాలను ఆచరించి దేవుణ్ణి చేరుకోగలం, కాబట్టి ఉపవాసంగాని మితిమీరిన భోజనంగాని మంచిది కాదు. ఆహారంలో అతి శరీరానికి మనస్సుకి కూడా మంచిది.

గోఖలే భార్య, కనికర్ భార్య శ్రీమతి కాశీబాయి దగ్గరినుండి దాదా కేల్కరుకు జాబు తీసుకుని షిరిడీకి వచ్చారు. ఆమె బాబా పాదాల దగ్గర మూడురోజులు ఉపవాసంతో కూర్చోవాలనే నిశ్చయంతో వచ్చింది. బాబా అంతకు ముందురోజు కేల్కరుతో తన భక్తులను హోళీ పండుగ రోజు ఉపవాసం చేయనీయమని చెప్పారు. వారు ఉపవాసం ఉన్నట్లయితే బాబా (తన)యొక్క ఉపయోగమే అన్నారు. ఆ మరుసటి రోజు ఆమె దాదా కేల్కరుతో వెళ్ళి బాబా దగ్గర కూర్చుని ఉండగా బాబా వెంటనే ఆమెతో 'ఉపవాసం చేయవలసిన అవసరం ఏమిటి? దాదా భట్టు ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తిను' అన్నారు. హోళీపండుగ వచ్చింది. దాదా కేల్కరు భార్య బయట చేరింది. కేల్కరు ఇంట్లో వండటానికి ఎవరూ లేరు, కాబట్టి బాబా సలహా సమయోచితంగా ఉంది. గోఖలే గారి భార్య దాదా భట్టు ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసింది. ఆ రోజు అక్కడే వుంది. ఇతరులకు పెట్టింది, తాను తిన్నది. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి!

బాబా సర్కారు :

బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పారు 'నా చిన్నతనంలో భుక్తి కోసం వెదుకుతూ బీడ్ గాం వెళ్ళాను. అక్కడ నాకు బట్టలపై చేసే అల్లికపని దొరికింది. శ్రమ అనుకోకుండా కష్టపడి పనిచేశాను, యజమాని నా పనికి సంతృప్తి చెందాడు. నాకంటే ముందు ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో ఉన్నారు. మొదటివాడికి 50 రూపాయలు, రెండవవాడికి 100 రూపాయలు, మూడవవాడికి 150 రూపాయలు జీతం ఇచ్చాడు. నాకు ఈ మూడు మొత్తాలకు రెండింతలు అంటే 600 రూపాయలు జీతం ఇచ్చాడు. నా తెలివితేటలు చూసి, యజమాని నన్ను ప్రేమించి, మెచ్చుకుని, నిండు దుస్తులు ఇచ్చి నన్ను గౌరవించాడు (తలపాగా, శెల్లా) వీటిని వాడకుండా జాగ్రత్తగా దాచుకున్నాను. మానవుడు ఇచ్చింది త్వరలో సమసిపోతుంది కాని, దైవం ఇచ్చేది శాశ్వతంగా నిలుస్తుంది. ఇంకా ఇతరులు ఇచ్చింది దీంతో సరిపోల్చలేము. నా ప్రభువు 'తీసుకో, తీసుకో' అంటాడు కాని, ప్రతివాడూ నా దగ్గరికి వచ్చి 'తే, తే అంటున్నాడు' నేను ఏం చెపుతున్నానో గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడు. నా సర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనం) నిండుగా ఉన్నది. అది అంచువరకూ నిండిపోయి పొంగిపోతున్నది. 'త్రవ్వి ఈ ధనాన్ని బళ్ళతో తీసుకుని వెళ్ళండి. సుపుత్రుడు అయినవాడు ఈ ద్రవ్యాన్ని అంతా దాచుకోవాలి అంటున్నాను. నా ఫకీరు చతురత, నా భగవంతుడి చతురత, నా భగవంతుడి లీలలు, నా సర్కారు అభిరుచి అత్యంత అమోఘమైనవి. నా సంగతి ఏమిటి? శరీరం మట్టిలో కలుస్తుంది, ఊపిరి గాలిలో కలుస్తుంది, ఇలాంటి అవకాశం తిరిగిరాదు. నేను ఎక్కడికో వెళతాను, ఎక్కడో కూర్చుంటాను, మాయ నన్ను విపరీతంగా బాధిస్తూ ఉంది. అయినప్పటికీ నా వారి కోసం నేను ఆత్రపడతాను ఎవరయినా ఏమైనా సాధన చేసినట్లయితే తగిన ఫలితం పొందుతారు. ఎవరైతే నా పలుకులు జ్ఞాపకం ఉంచుకుంటారో, వారు అమూల్యమైన ఆనందాన్ని పొందుతారు.’

ముప్పైరెండవ అధ్యాయం సంపూర్ణం