saibaba-satcharitra-34-chapter

 

శ్రీసాయిసచ్చరిత్ర

ముప్పైనాలుగవ అధ్యాయం

ఊదీ మహిమ: డాక్టరు మేనల్లుడు, డాక్టరు పిళ్ళై, శ్యామా మరదలు, ఇరానీ బాలిక, హార్దా పెద్దమనిషి, బొంబాయి మహిళ

డాక్టరుగారి మేనల్లుడు

నాసిక్ జిల్లాలోని మాలేగావ్ లో ఒక డాక్టరు ఉండేవారు. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయంకాని రాచకురుపుతో బాధపడుతూ ఉండేవాడు. డాక్టరుగారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆపరేషను చేశారు కానీ ఎటువంటి మేలు జరగలేదు. కుర్రవాడు విపరీతంగా బాధపడుతూ ఉన్నాడు. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను భగవంతుడి సహాయం కోరుకోమని చెప్పారు. షిరిడీ సాయిబాబాను చూడమని చెప్పారు. వారి దృష్టితో అనేక కఠినమైన రోగాలు నయం అయ్యాయని బోధించారు. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చారు. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. కుర్రవాణ్ణి బాబా ముందు నిలబెట్టారు. తమ బిడ్డను కాపాడమని ఎంతో వినయంతో, గౌరవంతో వేడుకున్నారు. దయార్థ్ర హ్రుదయుడైన బాబా వారిని ఓదార్చి ఇలా అన్నారు 'ఎవరు అయితే ఈ మసీదుకు వస్తారో వారు ఎప్పుడూ ఈ జన్మలో ఎటువంటి వ్యాధిచేత బాధపడరు, కాబట్టి హాయిగా ఉండండి. కురుపుపై ఊదీని పూయండి. ఒక వారం రోజులలో నయం అవుతుంది. దేవుడి పట్ల నమ్మకం ఉంచండి, ఇది మసీదు కాదు ద్వారవతి. ఎవరు అయితే ఇందులో కాలు పెడతారో వారు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతారు, వారి కష్టాలు గట్టెక్కుతాయి.’ వారు కుర్రవాణ్ణి బాబా ముందు కూర్చోబెట్టారు. బాబా ఆ కురుపుపై తమ చేతిని త్రిప్పారు, ప్రమాస్పదమైన చూపులు సారింపజేశారు. రోగి సంతృప్తి చెందాడు, ఊదీ రాయగా కురుపు నెమ్మదించింది. కొద్ది రోజుల తరువాత పూర్తిగా మానిపోయింది. తల్లిదండ్రులు కుర్రవాడితో బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిపెట్టారు. బాబా ఊదీ ప్రసాదం వలన వారి దయా దృష్టి వల్ల రాచకురుపు మానిపోయినందుకు వారు ఎంతో సంతోషించారు.

ఈ సంగతి విని కుర్రవాడి మామగారు అయిన డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి వెళుతూ మార్గమధ్యలో బాబాను చూడాలని కోరుకున్నారు. కానీ మాలేగాంలోను మన్ మాడ్ లోను ఎవరో బాబాకి వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచారు, కాబట్టి అతడు షిరిడీకి వెళ్ళటం మానుకుని తిన్నగా బొంబాయి చేరుకున్నారు, తనకు మిగిలి ఉన్న సెలవులు ఆలిబాగులో గడపాలి అనుకున్నారు, బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని 'ఇంకా నన్ను నమ్మవా?’ అని వినిపించింది. వెంటనే డాక్టరు తమ మనస్సు మార్చుకుని షిరిడీకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరానికి చికిత్స చేస్తున్నారు. రోగికి నయం కాకుండాపోయింది. కాబట్టి షిరిడీ ప్రయాణం వాయిదా పడుతుందని అనుకున్నారు. కాని, తన మనస్సులో బాబాను పరీక్షించదలచి 'రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరితే, రేపే షిరిడీకి వెళతాను' అని అనుకున్నారు. జరిగిన చిత్రం ఏమిటంటే సరిగ్గా మనస్సులో నిశ్చయం చేసుకున్నప్పటి నుండి జ్వరం తగ్గడం ప్రారంభించింది. త్వరలోనే సామాన్య ఉష్ణోగ్రతకి దిగింది. డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళారు., బాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు, బాబా అతనికి గొప్ప అనుభవం కలగచేయడంతో అతడు బాబా భక్తుడు అయ్యాడు. అక్కడ 4 రోజులు వుండి, బాబా ఊదీతోనూ, ఆశీర్వచనాలతో ఇంటికి చేరుకున్నారు. ఒక పక్షం రోజులలో అతన్ని బీజాపూర్ కు ఎక్కువ జీతంపై బదలీ చేశారు. అతని మేనల్లుడు రోగం ఆ డాక్టరుకు బాబా దర్శనానికి తోడ్పడింది. అప్పటినుండి అతనికి బాబా పట్ల భక్తి కుదిరింది.

డాక్టరు పిళ్ళై

డాక్టరు పిళ్ళై అనే అతడు బాబాకు ప్రియభక్తుడు, అతనిలో బాబా పట్ల అమితమైన ప్రేమ, బాబా అతన్ని 'బాపూ; (అన్నా) అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతి విషయం సంప్రదించేవారు. అతన్ని ఎప్పుడూ వెంట ఉంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులతో (నారిపుండు) బాధపడ్డాడు. అతడు కాకాసాహెబు దీక్షిత్ తో 'బాధ చాలా ఎక్కువగా ఉన్నది. నేను భరించలేకపోతున్నాను. దీనికంటే చావు మేలు అని అనిపిస్తున్నది. గతజన్మలో చేసిన పాపం పోగొట్టుకోవడానికే నేను ఈ బాధ అనుభవిస్తున్నాను. కాబట్టి బాబా దగ్గరికి వెళ్ళి ఈ బాధను ఆపుచేసి, దీన్ని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసింది అని వేడుకో' అన్నాడు. దీక్షితు బాబా దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్పారు. బాబా మనస్సు కరిగింది. బాబా దీక్షితుతో ఇలా అన్నారు 'నిర్భయుడుగా ఉండమని చెప్పు, అతడు ఎలా పదిజన్మల వరకు బాధ పడాలి? పది రోజులలో గతజన్మ పాపాన్ని హరింపచేయగలను. నేను ఇక్కడ వుండి ఇహపర సౌఖ్యాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా అతడు ఎలా చావును కోరుకోవాలి? అతన్ని ఎవరైనా వీపుపైన అయినా తీసుకుని రండి. అతని బాధను శాశ్వతంగా నిర్మూలిస్తాను.’

ఆ స్థితిలో డాక్టరును తీసుకుని వచ్చి బాబా కుడివైపున, ఫకీరు బాబా ఎప్పుడూ కూర్చునే చోట కూర్చోబెట్టారు. బాబా అతనికి బాలీసులు ఇచ్చి ఇలా అన్నారు 'ఇక్కడ నెమ్మదిగా పడుకొని విశ్రాంతి తీసుకో. అసలయిన విరుగుడు ఏమిటి అంటే గతజన్మలోని పాపాలను అనుభవించి, విమోచనం పొందాలి. మన కష్టసుఖాలకు మన కర్మమే కారణం, వచ్చినదాన్ని ఓర్చుకో, అల్లాయే ఆర్చి తీర్చేవాడు. అతన్ని ఎప్పుడూ ధ్యానించు, అతడే నీ క్షేమాన్ని చూస్తాడు. వారి పాదాలకు శరీరాన్ని, మనస్సు, ధనం, వాక్కు అన్నీ అర్పించు. అంతా సర్వస్యశరణాగతి వేడుకో. ఆ తరువాత వారు ఏం చేస్తారో చూద్దాం.’ నానా సాహెబు కట్టుకడతాను అని కానీ, గుణం ఇవ్వలేదని డాక్టరు పిళ్ళై చెప్పారు. బాబా ఇలా అన్నారు 'నానా తెలివితక్కువ వాడు. కట్టు విప్పు లేకపొతే చస్తావు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుస్తుంది. అప్పుడు నీ కురుపు నయమవుతుంది.

ఈ సంబాషణ జరుగుతుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపాలు బాగు చేస్తుండగా, అతని కాలు సరిగ్గా డాక్టరు పిళ్ళై కురుపు మీద హఠాత్తుగా పడింది. కాలు వాచి వుంది, దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులోనుండి ఏడు పురుగులు నొక్కబడి బయటపడ్డాయి. బాధ భరింపరానిదిగా ఉండింది, డాక్టరు పిళ్ళై బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. కొంతసేపటికి మెల్లగా నెమ్మదించింది. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తరువాత ఇంకొకటి రావడం మొదలు పెట్టాయి. బాబా ఇలా అన్నారు 'చూడు! మన అన్న జబ్బు కుదిరి నవ్వుతున్నాడు.’ పిళ్ళై 'కాకి ఎప్పుడు వస్తుంద'ని అడిగారు. బాబా ఇలా జవాబు చెప్పారు 'నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు వెళ్ళి వాడలో విశ్రాంతి తీసుకో. నీవు త్వరలో బాగుపడతావు' ఊదీ పూయటం వలన, దాన్ని తినడం వలన ఏ చికిత్స పొందకుండానే, ఔషధం పుచ్చుకోకుండానే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారం మానిపోయింది.

శ్యామా మరదలు

శ్యామా తమ్ముడు బాపాజీ సాపూల్ విహిర్ దగ్గర ఉండేవాడు. ఒకరోజు అతని భార్యకు ప్లేగు అంటుకుంది. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. చంకలో రెండు బొబ్బలు లేచాయి. బాపాజీ శ్యామా దగ్గరికి పరుగెత్తి వచ్చి సహాయపడమన్నాడు. శ్యామా భయపడ్డాడు, కానీ యథాప్రకారం బాబా దగ్గరికి వెళ్ళాడు. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాడు, వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాడు. తన తమ్ముడి ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని కోరాడు. బాబా ఇలా అన్నారు 'ఈ రాత్రి సమయంలో వెళ్ళవద్దు. ఊదీ పంపించు, జ్వరం గాని, బొబ్బలు కాని లక్ష్యపెట్టవలసిన అవసరం లేదు. మన తండ్రీ, యజమాని ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయం అవుతుంది. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయం వెళ్ళు, వెంటనే తిరిగిరా.’

శ్యామాకి బాబా ఊదీ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది. బాపాజీ ద్వారా దాన్ని పంపించారు. బొబ్బాలపై దాన్ని పూసి కొంచెం నీళ్ళలో కలిపి త్రాగించారు. దాన్ని తీసుకున్న వెంటనే బాగా చెమట పట్టింది, జ్వరం తగ్గింది. రోగికి మంచి నిద్ర పట్టింది. మరుసటి రోజు ఉదయం తన భార్యకు నయం కావడం చూసి బాపాజీ ఆశ్చర్యపడ్డాడు, జ్వరం పోయింది, బొబ్బలు మానాయి. మరుసటి రోజు ఉదయం శ్యామా బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా, ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తమ్ముడిని అడగ్గా బాబా ఊదీ ఒక్క రాత్రిలోనే బొబ్బలను బాగు చేశాయని అన్నారు. అప్పుడు 'ఉదయం వెళ్ళు, త్వరగా రా' అనే బాబా మాటల భావం శ్యామా తెలుసుకోగలిగారు.

టీ తీసుకుని శ్యామా తిరిగి వచ్చారు. బాబాకు నమస్కరించి ఇలా అన్నాడు 'దేవా! ఏమి నీ ఆట! మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలగజేస్తావు. తిరిగి దాన్ని శాంతింప చేసి మాకు నెమ్మది ప్రసాదిస్తావు.’ బాబా ఇలా జవాబుచెప్పారు 'కర్మ యొక్క మార్గం చిత్రమైంది. నేనేమీ చేయకున్నా, నన్నే సర్వానికి కారణభూతుడిగా ఎంచుకుంటారు. అది అదృష్టాన్ని బట్టి వస్తుంది. నేను సాక్షిభూతుడిని మాత్రమే. చేసేవారు ప్రేరేపించేవాడు దేవుడే, వారు అత్యంత దయార్థ్రహృదయులు, నేను భగవంతుడిని కాదు. ప్రభువును కాదు, నేను వారి నమ్మినబంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను, ఎవరైతే తమ అహంకారాన్ని ప్రక్కకు తోసి భగవంతుడికి నమస్కరిస్తారో, ఎవరు వారిని పూర్తిగా నమ్ముతారో, వారి బంధనాలు ఊడి మోక్షాన్ని పొందుతారు.

ఇరానీ బాలిక

ఇక ఇరానీ అతని అనుభవాన్ని చదవండి. అతని కుమార్తెకు ప్రతిగంటకు మూర్ఛ వస్తుండేది, మూర్ఛ రాగానే ఆమె మాట్లాడలేక పోయేది. కళ్ళు, చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోతుండేది. ఏ మందులు ఆమెకు నయం చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీ ఉపయోగించమని చెప్పారు. విలేపార్లేలో ఉన్న కాకాసాహెబు దీక్షిత్ దగ్గర ఊదీ తీసుకుని రమ్మని అన్నారు. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజూ నీటిలో కలిపి త్రాగిస్తూ ఉన్నాడు. మొదట ప్రతిగంటకు వచ్చే మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగింది. కొద్ది రోజుల తరువాత పూర్తిగా నెమ్మదించింది.

హార్దా పెద్దమనిషి

హార్దా పుర (మధ్య పరగణాలు) నివాసి అయిన వృద్ధుడు ఒకరు మూత్రకోశంలో రాయితో బాధపడుతూ ఉండేవాడు. అలాంటి రాళ్ళు ఆపరేషను చేసి తీస్తారు కాబట్టి ఆపరేషను చేయించుకోమని సలహా ఇచ్చారు. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు, ఆపరేషనుకు ఒప్పుకోకుండా ఉన్నాడు. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి వుంది. ఆ గ్రామ ఇనాముదారు అక్కడికి రావడం, తటస్థించింది. అతడు బాబా భక్తుడు. అతని దగ్గర బాబా ఊదీ ఉంది. స్నేహితులు కొందరు చెప్పగా, వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దాన్ని నీళ్ళలో కలిపి తండ్రికి ఇచ్చాడు. 5 నిముషాలలో ఊదీ గుణాన్ని ఇచ్చింది, రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడింది, వృద్ధుడు శీఘ్రంగా బాగయ్యాడు.

బొంబాయి మహిళ

కాయస్థప్రభు కులానికి చెందిన బొంబాయి స్త్రీ ఒకామె ప్రసవించే సమయంలో ఎక్కువగా బాధపడుతూ ఉంది. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి ఎక్కువగా భయపడుతూ ఉంది. ఆమెకి ఏమీ తోచకుండా ఉంది. బాబా భక్తుడు కళ్యాణ్ వాస్తవ్యుడు అయిన శీరామమారుతి ఆమెను ప్రసవించే నాటికీ షిరిడీకి తీసుకుని వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చారు. కొన్ని మాసాలు అక్కడ ఉన్నారు. బాబాను పూజించారు. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలాన్ని పొందారు. కొన్నాళ్ళకు ప్రసవ సమయం వచ్చింది, మామూలుగానే యోనిలో అడ్డు కనిపించింది. ఆమె ఎక్కువగా బాధపడింది. ఏమీ చేయడానికి తోచకుండా ఉంది. బాబాను ధ్యానించారు. ఇరుగుపొరుగువారు వచ్చి బాబా ఊదీని నీళ్ళలో కలిపి ఇచ్చారు 5 నిముషాలలో ఆ స్త్రీ సురక్షితంగా, ఎలాంటి కష్టం లేకుండా ప్రసవించింది. దురదృష్టం కొద్దీ చనిపోయిన బిడ్డ పుట్టింది కాని తల్లి ఆందోళన, బాధ తప్పిపోయాయి. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలం జ్ఞాపకం ఉంచుకున్నారు.

ముప్పై నాలుగవ అధ్యాయం సంపూర్ణం

  

0 Comments To "saibaba-satcharitra-34-chapter"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!