saibaba-satcharitra-40-chapter

శ్రీసాయిసచ్చరిత్ర

నలభైయవ అధ్యాయము

ఈ అధ్యాయంలో రెండు కథలు చెపుతాము. 1. దహనులో బి.వి. దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతానికి బాబా వెళ్ళడం. 2. బాంద్రాలోని హేమాడ్ పంత్ ఇంటికి హోళీ పండుగరోజు భోజనానికి వెళ్ళడం.

తొలిపలుకు:

శ్రీసాయి సమర్థుడు, పావనమూర్తి. తన భక్తుల ఇహపర విషయాలలో తగిన సూచనలు ఇచ్చి జీవిత పరమావధిని పొందేలా చేసి వారిని సంతోషపెట్టడం. సాయి తన హస్తాన్ని భైక్తుల తలపై తమ శక్తులను వారిలోనికి పంపించి భేదాభావాన్ని నశింపచేసి, పొందలేనివి ప్రాప్తింప చేస్తారు. వారు తమ భక్తుల పట్ల భేదం లేకుండా, తమకు నమస్కరించిన వారిని ఆదరంతో అక్కున చేర్చుకునేవారు. వర్షాకాలంలో నదులు కలిసే సముద్రంలా బాబా భక్తులతో కలిసి తమ శక్తిని, స్థాయిని శిష్యులకు ఇస్తారు. దీన్ని బట్టి ఎవరైతే భగవంతుని భక్తుల లీలలను పాడతారో వారు భగవంతుని లీలలను పాడినవారి కంటే గాని, అంతకంటే ఎక్కువ కాని దేవుని ప్రేమకు పాత్రులు అవుతారని తెలియాలి. ఇక ఈ అధ్యాయంలో కథలవైపు కదులుదాం.

దేవుగారింట ఉద్యాపన వ్రతం :

దహనులో బి.వి.రావుగారు మామలతదారుగా ఉండేవారు. వారి తల్లి 25, 30 నోములు నోచుకుంది. వాటి ఉద్యాపన చేయవలసి ఉంది. ఈ కార్యక్రమంలో 100, 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాల్సి ఉంది. ఈ శుభాకార్యక్రమానికి ముహూర్తం నిశ్చయమైంది. దేవుగారు బాపూసాహెబు జోగ్ గారికి ఒక లేఖ వ్రాశారు. అందులో బాబా ఈ శుభకార్యానికి దయచేయాలని, వారు రాకపోతే అసంతృప్తికరంగా ఉంటుంది అని వ్రాశారు. జోగ్ ఆ ఉత్తరాన్ని చదివి బాబాకు వినిపించారు. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇలా అన్నారు. ‘నన్నే గుర్తుంచుకునే వారిని నేను మరవను. నాకు బండికాని, టాంగాగాని, రైలుగాని, విమానంగాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచేవారి దగ్గరికి నేను పరుగెత్తుకుంటూ వెళ్ళి ప్రత్యక్ష్హమవుతాను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయి. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వస్తామని జవాబు వ్రాయి.’ జోగ్ బాబా చేప్పింది దేవుకు వ్రాశారు. దేవుగారు ఎంతో సంతోషించారు. కాని బాబా రహతా, రుయీ, నీమ్ గావ్ దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి వెళ్ళరని ఆయనకు తెలుసు. బాబాకి ఆవశ్యకమైనది ఏమీలేదు. వారు సర్వాంతర్యామి కావడంతో హఠాత్తుగా ఏ రూపంలో అయినా వచ్చి, తమ వాగ్థానాన్ని పాలించవచ్చు అనుకున్నారు. ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా బెంగాళీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకరు గోసంరక్షణ కోసం సేవచేస్తూ దహను స్టేషన్ మాస్టార్ దగ్గరికి చందా వసూలుచేసే నెపంతో వచ్చారు. స్టేషన్ మాస్టారు సన్యాసిని ఊరి లోపలికి వెళ్ళి మామలతదారుని కలుసుకుని వారి సహాయంతో చందాలు వస్తూలు చేయమని చెప్పారు. అంతలో మామలతదారే అక్కడికి వచ్చారు. స్టేషనుమాస్టర్ సన్యాసిని దేవుగారికి పరిచయం చేశారు. ఇద్దరూ ప్లాట్ ఫారం మీద కూర్చుని మాట్లాడుకున్నారు. దేవు ఊరిలో ఎదో వేరొక చందా పట్టుకుని రావుసాహేబు సర్వోత్తమ శెట్టి నడుపుతుండటంతో, ఇంకొకరిని ఇప్పుడే తయారు చేయడం బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసాల తరువాత రమ్మని చెప్పారు. ఈ మాటలు విని సన్యాసి అక్కడినుండి వెళ్ళిపోయారు. ఒక నెల తరువాత ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటిముందు ఆగారు, ఛందాల కోసం వచ్చారేమో అని దేవు అనుకున్నారు. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నమై ఉండటం చూసి, తాను ఛందాల కోసం రాలేదని భోజనానికి వచ్చానని సన్యాసి చెప్పారు. అందుకు దేవుగారు 'మంచిది! చాలా మంచిది! మీకు స్వాగతం. ఈ ఇళ్ళు మీదే' అన్నారు. అప్పుడు సన్యాసి 'ఇద్దరు కుర్రవాళ్ళు నాతొ ఉన్నారు' అన్నారు. దేవు 'మంచిది వారితో కూడా రండి' అన్నారు. ఇంకా రెండుగంటల సమయం ఉండటంతో, వారికోసం ఎక్కడికి పంపించాలి అని అడిగారు. సన్యాసి ఎవరినీ పంపించవలసిన అవసరం లేదని తానే స్వయంగా వస్తానని చెప్పారు. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పారు. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన తరువాత వెళ్ళిపోయారు.

ఉద్యాపన పూర్తవగానే దేవుగారు బాపూసాహెబు జోగ్ కి ఉత్తరం వ్రాశారు. అందులో బాబా తన మాట తప్పారని రాశారు. జోగ్ ఉత్తరం తీసుకుని బాబాదగ్గరికి వెళ్ళారు. దాన్ని విప్పకముందే బాబా ఇలా అన్నారు 'హా! వాగ్థానం చేసి, దగా చేశానని అంటున్నాడు. ఇద్దరితో కలిసి నేను సంతర్పణకు హాజరయ్యాను. కాని నన్ను పోల్చుకోలేకపోయాడని జవాబు రాయి. అలాంటివాడు నన్ను ఎందుకు పిలవాలి? సన్యాసి ఛందాల కోసం వచ్చానని అనుకున్నాడు. అతని సంశయాన్ని తొలగించడం కోసమే మరి ఇద్దరితో వస్తానని అన్నాను. ముగ్గురు సరిగ్గా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలైనా విడిచిపెడతాను. నా మాటను నేను ఎప్పుడూ పొల్లు పోనివ్వను.’ ఈ జవాబు జోగ్ హృదయంలో ఆనందం కలగచేసింది. బాబా సమాధానం అంతా దేవుగారికి రాశారు. దాన్ని చదవగానే దేవుకు ఆనందభాష్పాలు దొర్లాయి. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపపడ్డారు. సన్యాసి మొదటిసారి రావడంతో తాను ఎలా మోసపోయాడో, సన్యాసి చందాలకు రావడం, మరొక ఇద్దరితో కలిసి భోజనానికి వస్తాననే మాటలు తాను గ్రహించలేక పోసపోవడం మొదలైనవి అతనికి ఆశ్చర్యాన్ని కలగజేశాయి.

భక్తులు సంపూర్ణంగా సద్గురువును శరణు వేడుకుంటే, వారు తమ భక్తుల ఇళ్ళల్లో శుభాకార్యాలను సజావుగా నెరవేరేలా చూస్తారు అనేది ఈ కథ వల్ల స్పష్టమవుతుంది.

హేమాడ్ పంత్ ఇంట హోళీ పండుగ భోజనం :

ఇక బాబా తన ఫోటో రూపంలో సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెపుతాము.

1917వ సంవత్సరం హోళీ పండుగ రోజు తెల్లవారుఝామునే హేమాడ్ పంత్ కి ఒక దృశ్యం కనిపించింది. చక్కని దుస్తులు ధరించిన సన్యాసిలా బాబా కనిపించి, నిద్రనుండి లేపి ఆనాడు భోజనం కోసం వారి ఇంటికి వస్తానని చెప్పారు. ఇలా తనని నిద్రనుంచి లేపింది కూడా కలలో భాగమే. నిజంగా లేచి చూసేసరికి సన్యాసి కాని, బాబా కానీ కనిపించలేదు. కలని బాగా గుర్తుతెచ్చుకోగా, సన్యాసి చెప్పిన ప్రతిమాటా జ్ఞాపకం వచ్చింది. బాబాగారి సహవాసం ఏడుసంవత్సరాల నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానం ఎల్లప్పుడూ చేస్తున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేస్తారని అనుకోలేదు. బాబా మాటలకు ఎక్కువగా సంతోషించి తన భార్య దగ్గరికి వెళ్ళి ఒక సన్యాసి భోజనానికి వస్తారు కాబట్టి కొంచెం బియ్యం ఎక్కువ వెయ్యాలని చెప్పారు. అది హోళీ పండుగరోజు, వచ్చేవారు ఎవరిని ఎక్కడినుంచి వస్తున్నారని ఆమె అడిగింది. ఆమెని అనవసరంగా పక్కదారి పట్టించకుండా ఆమె ఇంకొక విధంగా భావించకుండా ఉండేలా, జరిగింది జరిగినట్లుగా చెప్పాలని అనుకుని తనకి వచ్చిన కల గురించి తెలియజేశారు. షిరిడీలో మంచి మంచి పిండివంటలు విడిచిపెట్టి బాబా తనవంటి వారి ఇంటికి బాంద్రాకి వస్తారా అని ఆమెకి అనుమానం కలిగింది. అందుకు హేమాడ్ పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపించవచ్చు కాబట్టి కొంచెం బియ్యం ఎక్కువ పోసినట్లయితే నష్టం లేదని అన్నారు.

మధ్యాహ్నం భోజనం కోసం ప్రయత్నాలన్నీ చేశారు. మిట్టమధ్యాహ్న సమయానికి అంతా సిద్ధమయ్యాయి. హోళీ పూజ ముగిసింది. విస్తళ్ళు వేశారు, ముగ్గులు పెట్టారు, భోజనానికి రెండు వరసలు తీర్చారు. రెండింటి మధ్య ఒక పీట బాబా కోసం అమర్చారు. ఇంట్లోని వారందరూ కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుళ్ళు మొదలైనవారు అందరూ వచ్చి వారి వారి స్థానాలలో కూర్చున్నారు. వండిన పదార్థాలు వడ్డించారు, అందరూ అతిథి కోసం వేచి ఉన్నారు. 12గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొళ్ళెం పెట్టారు. అన్నశుద్ధి అయ్యింది. అంటే నెయ్యి వడ్డించారు. భోజనం ప్రారంభించడానికి ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రుడికి శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించారు. అందరూ భోజనం ప్రారంభించబోతుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించింది. హేమాడ్ పంత్ వెంటనే వెళ్ళి తలుపు తీయగా ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు. ఒకరు ఆలీ మహమ్మద్ వేరొకరు మౌలానా ఇస్ముముజావర్. ఆ ఇద్దరూ వడ్డన అంతా పూర్తై అందరూ భోజనం చేయడానికి సిద్ధంగా ఉండటం గమనించి హేమాడ్ పంత్ ను క్షమించమని కోరుకుని ఇలా చెప్పారు. ‘భోజన స్థలం విడిచిపెట్టి మా దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చారు. మిగిలినవారు నీకోసం చూస్తున్నారు. కాబట్టి ఇదిగో నీ వస్తువును నీవు తీసుకో. ఆ తరువాత తీరుబడిగా విషయం అంతా చెపుతాము' అలా అంటూ తమ చంకలోనుండి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటాన్ని విప్పి టేబుల్ పైన పెట్టారు.

హేమాడ్ పంత్ కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్దదైన చక్కని సాయిబాబా పటం ఉంది. అతడు ఆశ్చర్యపడ్డాడు. అతని మనస్సు కరిగింది, కళ్ళనుండి నీరు కారింది, శరీరం గగ్గుర్పాటుకు గురైంది. అతడు వంగి పటంలో ఉన్న బాబా పాదాలకు నమస్కరించారు. బాబా ఈ విధంగా తన లీలతో ఆశీర్వదించారని అనుకున్నారు. గొప్ప ఆసక్తితో నీకా పటం ఎలా వచ్చింది అని ఆలీమహమ్మద్ ని అడిగారు. అతడు ఆ పటం ఒక అంగడిలో కొన్నానని, దానికి సంబంధించిన వివరాలను అన్నీ తరువాత తెలియజేస్తానని అన్నాడు. మిగిలినవారు భోజనం కోసం వేచి ఉండడంతో త్వరగా తమ్మని అన్నారు. హేమాడ్ పంత్ వారికి అభినందనలు తెలియజేసి భోజనశాలలోకి వెళ్ళారు. ఆ పటం బాబా కోసం వేసిన పీటపై పెట్టి వండిన పదార్థాలను అన్నీ వడ్డించి, నైవేద్యం పెట్టిన తరువాత అందరూ భోజనం చేసి సరైన సమయంలో పూర్తి చేశారు. పటంలో ఉన్న బాబా యొక్క చక్కని రూపాన్ని చూసి అందరూ అమితానందం చెందారు. ఇది అంతా ఎలా జరిగిందని ఆశ్చర్యపోయారు.

ఈ విధంగా బాబా హేమాడ్ పంత్ కి స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఆ ఫోటో వివరాలు అనగా అది ఆలీమహమ్మద్ కి ఎలా దొరికింది? అతను ఎందుకు తెచ్చాడు? దాన్ని హేమాడ్ పంత్ కి ఎందుకు ఇచ్చాడు? అనేవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాం.

నలభయవ అధ్యాయం సంపూర్ణం

0 Comments To "saibaba-satcharitra-40-chapter"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!