Saibaba Saccharitra 50 Adhyaayam

శ్రీసాయిసచ్చరిత్ర

యాభైవ అధ్యాయం

శ్రీసాయిసచ్చరిత్ర మూలంలోని 50వ అధ్యాయం 39వ అధ్యాయంలో చేర్చడం జరిగింది. కారణం అందులోని ఇతివృత్తం కూడా ఇదే కాబట్టి. సచ్చరిత్రలో 51వ అధ్యాయాన్ని ఇవ్వడం 50వ అధ్యాయంగా పరిగణలోకి తీసుకోవాలి.

భక్తులకు ఆశ్రయమైన శ్రీసాయికి జయం అగుగాక! వారు సద్గురువులు. వారు మనకి గీతార్థాన్ని భోధిస్తారు. మనకు సర్వశక్తులను కలగజేస్తారు. ఓ సాయీ! మాపట్ల కనికరించు. మమ్మల్ని కటాక్షించు. చందన వృక్షాలు మలయపర్వతంపై పెరిగి వేడిని పోగొడతాయి. మేఘాలు వర్షాన్ని కురిపించి చల్లదనం కలిగిస్తున్నాయి. వసంత ఋతువులో పుష్పాలు వికసించి అవి దేవుడి పూజ చేయడానికి వీలు కలిగిస్తున్నాయి. అలాగే సాయిబాబా కథలు మనకి ఊరట, సుఖశాంతులు కలిగిస్తున్నాయి. సాయిబాబా కథలు చెప్పేవారూ వినేవారూ ధన్యులు, పావనులు. చెప్పేవారి నోరూ, వినేవారి చెవులూ పవిత్రాలు.

కాకాసాహెబు దీక్షిత్ (1864-1926) :

మధ్య పరిగణాలలోని ఖాండ్వా గ్రామంలో వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారామ్ ఉరఫ్ కాకాసాహెబు దీక్షిత్ జన్మించారు. ప్రాథమిక విద్యను ఖండ్వా, హింగాన్ ఘాట్ లలో పూర్తిచేశారు. నాగపూర్ లో మెట్రిక్ వరకు చదివారు. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్ స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడు అయ్యారు. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. చివరికి తన సొంత న్యాయవాదులతో కంపెనీ పెట్టుకున్నారు.

1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్ కు తెలియదు. ఆ తరువాత వారు బాబాకు గొప్ప భక్తులు అయ్యారు. ఒకానొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడైన నానాసాహెబు ఛాందోర్కర్ ను చూశాడు. ఇద్దరూ కలిసి ఏవో విషయాలు మాట్లాడుకున్నారు. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుతుండగా కాలుజారి పడిన అపాయాన్ని గురించి వర్ణించాడు. వందలకొద్దీ ఔషదాలు దాన్ని నయం చేయలేకపోయాయి. కాలు నొప్పీ, కుంటితనం పోవాలంటే అతను సద్గురువు అయిన సాయి దగ్గరికి వెళ్ళాలని నానాసాహెబు సలహా ఇచ్చారు. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతం వివరించాడు. సాయిబాబా 'నా భక్తుడిని సప్తసముద్రాల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారం కట్టి ఈడ్చినట్లు లాక్కొని వస్తాను అనే వాగ్దానాన్ని, ఒకవేళ వాడు తనవాడు కానట్లయితే వాడు తనచే ఆకర్షించబడడు అని, వాడు తన దర్శనమే చేయలేడని బాబా చెప్పిన సంగతి తెలియజేశాడు. ఇదంతా విని కాకాసాహెబు సంతోషించి, ‘సాయిబాబా దగ్గరికి వెళ్ళి, వారిని దర్శించుకుని కాలు యొక్క కుంటితనం కంటే నా మనస్సు యొక్క కుంటితనాన్ని బాగుచేసి శాశ్వతమైన ఆనందాన్ని కలగజేయమని వేడుకుంటా'నని నానాసాహెబుతో చెప్పాడు.

కొంతకాలం తరువాత కాకాసాహెబు అహమద్ నగర్ వెళ్ళారు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఓట్లకోసం సర్దార్ కాకాసాహెబు మిరీకర్ ఇంట్లో దిగారు. కాకాసాహెబు మిరీకర్ కొడుకు బాలాసాహెబు మిరీకర్. వీరు కోపర్ గావ్ మామలతదారు. వీరు కూడా గుఱ్ఱపు ప్రదర్శన సందర్భంలో అహమద్ నగర్ వచ్చారు. ఎలక్షన్లు పూర్తైన తరువాత కాకాసాహెబు షిరిడీకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపించాలని ఆలోచిస్తున్నారు. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నారు. అహమద్ నగర్ లో ఉన్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదనీ, శ్యామాను తన భార్యతో రావలసిందనీ టెలిగ్రాం ఇచ్చారు. బాబా ఆజ్ఞను పొంది శ్యామా అహమద్ నగర్ చేరుకుని తన అత్తగారికి కొంచెం నయంగా ఉందని తెలుసుకున్నారు. మార్గంలో గుఱ్ఱపు ప్రదర్శనకు వెళుతున్ననానాసాహెబు పాన్సే. అప్పాసాహెబు గద్రే, శ్యామాను కలిసి మిరీకర్ ఇంటికి వెళ్ళి కాకాసాహెబు దీక్షిత్ ని కలిసి, వారిని షిరిడీ తీసుకుని వెళ్ళమన్నారు. కాకాసాహెబు దీక్షిత్ కు మిరీకర్ లకు శ్యామా అహమద్ నగర్ వచ్చిన విషయం తెలియజేశారు. సాయంకాలం శ్యామా మిరీకర్ ల దగ్గరికి వెళ్ళారు. వారు శ్యామాకు కాకాసాహెబు దీక్షిత్ తో పరిచయం కలిగించారు. శ్యామా కాకాసాహెబు దీక్షిత్ తో కోపర్ గావ్ కి ఆరోజు రాత్రి 10 గంటల రైలులో వెళ్లాలని నిశ్చయించారు. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగింది. బాబా యొక్క పెద్ద పటం మీద తెరను బాలాసాహెబు మిరీకర్ తీసి దాన్ని కాకాసాహెబు దీక్షిత్ కి చూపించారు. కాకాసాహెబు షిరిడీకి వెళ్ళి ఎవరినైతే దర్శించుకోవాలని నిశ్చయించుకున్నారో, వారే పటం రూపంలో అక్కడ తనను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసి అతడు ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. ఈ పెద్ద పటం మేఘశ్యాముడిది. దానిపై అద్దం పగిలిపోవడం వల్ల అతడు దానికి ఇంకొక అద్దం వేయడానికి మిరీకర్ దగ్గరికి పంపించారు. చేయవలసిన మరమ్మత్తు పూర్తిచేసి ఆ పటాన్ని కాకాసాహెబు, శ్యామాల ద్వారా షిరిడీకి పంపించాలని నిశ్చయించారు. 10గంటల లోపల స్టేషన్ కు వెళ్ళి టికెట్టు కొన్నారు. బండి రాగానే సెకెండు క్లాసు కిక్కిరిసి ఉండడంతో వారికి చోటు లేకపోయింది. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టుక్లాసులో కూర్చోబెట్టారు. వారు సౌకర్యంగా ప్రయాణం చేసి కోపర్ గావ్ లో దిగారు. బండి దిగగానే షిరిడీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న నానాసాహెబు ఛాందోర్కర్ ను చూసి ఎంతగానే ఆనందించారు. కాకాసాహెబు, నానాసాహెబు కౌగిలించుకున్నారు. వారు గోదావరిలో స్నానం చేసిన తరువాత శిరిదేకి బయలుదేరారు. షిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకోగా, కాకాసాహెబు మనస్సు కరిగింది. కళ్ళు ఆనందభాష్పాలతో నిండుకున్నాయి. అతడు ఆనందంతో పొంగిపొరలుతున్నాడు. బాబా కూడా వారి కోసం తము ఎదురుచూచూస్తున్నట్లుగా వారిని తీసుకుని రావడానికి శ్యామాను పంపించినట్లు తెలియజేశారు.

తరువాత కాకాసాహెబు బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడిపారు. షిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాసస్థలంగా చేసుకున్నారు. అతడు బాబా వల్ల పొందిన అనుభవాలు లేక్కలేనన్ని ఉన్నాయి. వాటన్నింటినీ ఇక్కడ వివరించలేము. ఈ కథను ఒక విషయంతో ముగిస్తాము. బాబా కాకాసాహెబుతో 'అంత్యకాలంలో నిన్ను విమానంలో తీసుకుని వెళతాను' అన్న వాగ్దానం సత్యమైనది. 1926వ సంవత్సరం జులై 5వ తేదీన అతడు హేమాడ్ పంత్ తో రైలు ప్రయాణం చేస్తూ బాబా విషయం మాట్లాడుతూ, సాయిబాబా పట్ల మనస్సు లీనం చేశాడు. ఉన్నట్లుంది తన శరీరం హేమాడ్ పంత్ భుజంపై వాల్చి ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి చికాకు పొందకుండా ప్రాణాలు విడిచారు.

శ్రీ టెంబె స్వామి :

యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుంటారు. ఒకానొకప్పుడు శ్రీవాసుదేవానంద సరస్వతి స్వాములవారు (టెంబె స్వామి) రాజమండ్రిలో మకాం వేశారు. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచారపరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుడి యోగిభక్తుడు నాందేడు ప్లీడరైన పుండలీకరావు వారిని చూడడానికి కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి వెళ్ళారు. వారు స్వాములవారితో మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చింది. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి, ఒక టెంకాయను తీసి పుండలీకరావుకు ఇచ్చి ఇలా అన్నారు. ‘దీన్ని నా సోదరుడైన సాయికి నా ప్రణామాలతో అర్పించు, నన్ను మరవద్దు అని వేడుకో. నాపట్ల ప్రేమ చూపమని చెప్పు'. ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరనీ కాని బాబా విషయంలో ఇది ఒక అపవాదు అనీ చెప్పారు. పుండలీకరావు ఆ టెంకాయను, సమాచారాన్ని షిరిడీకి తీసుకుని వెళ్ళడానికి అంగీకరించారు. బాబాను స్వామి సోదరుడు అనడం సమంజసంగా ఉండింది. ఎలా అంటే బాబాలా వారు కూడా రాత్రింబవళ్ళు అగ్నిహోత్రాన్ని వెలిగించే ఉంచారు. ఒక నెల తరువాత పుండలీకరావు ఇంకొందరు షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళారు. వారు మన్మాడు చేరుకున్నారు. దాహం వేయడంతో ఒక సెలయేరు దగ్గరకు వెళ్ళారు. పరగడుపున నీళ్ళు తాగకూడదని కారపు అటుకులు ఫలహారంగా చేశారు. అవి ఎంతో కారంగా ఉండడంతో టెంకాయను పగలగొట్టి దాని కోరు అందులో కలిపి అటుకులను రుచికరంగా చేశారు. దురదృష్టం కొద్దీ ఆ కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావుకి ఇచ్చింది. షిరిడీ చేరుకునే సమయానికి పుండలీకరావుకి విషయం జ్ఞాపకానికి వచ్చింది. అతడు ఎంతోగానో విచారించాడు. భయంతో వణుకుతూ సాయిబాబా దగ్గరికి వెళ్ళాడు. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడైన బాబా గ్రహించారు. బాబా వెంటనే తన సోదరుడైన టెంబెస్వామి పంపించిన టెంకాయను తీసుకుని రమ్మన్నారు. పుండలీకరావు బాబా పాదాలు గట్టిగా పట్టుకొని, తన తప్పను, నిర్లక్షాన్ని తెలియజేశాడు. పశ్చాత్తాపపడుతూ, బాబాను క్షమాపణ వేడుకున్నాడు. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పిస్తానని అన్నాడు. కాని బాబా అందుకు అంగీకరించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కన్నా ఎన్నో రెట్లు అని దాని విలువకు సరిపోయేది ఇంకొకటి లేదనీ చెపుతూ నిరాకరించారు. ఇంకా బాబా ఇలా అన్నారు 'ఆ విషయమై నువ్వు ఏమాత్రం చింతించాల్సిన అవసరంలేదు. అది నా సంకల్పం ప్రకారం నీకు ఇవ్వబడింది. చివరికి దారిలో పగలగొట్టబడింది. దానికి నీవే కర్తవని ఎందుకు అనుకుంటున్నావు? మంచిగాని చెడుగాని చేయడానికి నీవు కర్తవని అనుకోవద్దు. గర్వహంకార రహితుడివై ఉండు. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందుతుంది.’ ఎంత చక్కని వేదాంత విషయాన్ని బాబా బోధించారో చూడండి.!

బాలారామ్ దురంధర్ :

బొంబాయికి దగ్గరలో ఉన్న శాంతాక్రాజ్ పఠారేప్రభు జాతికి చెందిన బాలారామ్ దురంధర్ అనేవారు ఉండేవారు. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా ఉన్నారు. దురంధర్ కుటుంబంలోని వారు అందరు భక్తులు, పవిత్రులు. భగవంతుడిపై చింతన కలవారు. బాలారామ్ తన జాతికి సేవ చేశారు. ఆ విషయమై ఒక గ్రంథాన్ని రాశారు. ఆ తరువాత తన దృష్టిని మతం ఆధ్యాత్మిక విషయాలవైపు మళ్ళించారు. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథాలను, బ్రహ్మవిద్య మొదలైనవి చదివారు. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగింది. 6 నెలలకు పూర్వం తన సోదరులైన బాబుల్జీయు, వామనరావుల వెంట షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేశారు. ఇంటికి వచ్చి వారు అనుభవాలను బాలారాముకు ఇతరులకి చెప్పారు. అందరూ బాబాను చూడాలని నిశ్చయించారు. వారు షిరిడీకి రాకముందే బాబా ఇలా చెప్పారు. ‘ఈ రోజున నా దర్బారుకు జనులు వస్తున్నారు'. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయం చెందారు. మిగిలిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుతూ కూర్చున్నారు. బాబా వారితో ఇలా అన్నారు. ‘వీరే నా దర్బారు జనాలు. ఇంతకుముందు వీరి రాక గురించే మీకు చెప్పానని' బాబా దురంధర సోదరులతో ఇలా అన్నారు. ‘గత 60 తరాల నుండి మనమందరం పరిచయం ఉన్నవాళ్ళం’. సోదరులందరూ వినయవిధేయతలు కలవారు. వారు చేతులు జోడించుకుని నిలబడి, బాబా పాదాలవైపు దృష్టి సారించారు. సాత్విక భావాలు అంటే కళ్ళనీరు కారడం, వెంట్రుకలు నిలబడటం, వెక్కడం, గొంతుకు తడారిపోవడం మొదలైనవి వారి మనస్సులను కరిగించాయి. వారందరూ ఆనందించారు. భోజనం తరువాత కొంత సేపు పడుకుని తిరిగి మసీదుకు వచ్చారు. బాలారామ్ బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదాలను ఒత్తుతున్నారు. బాబా చిలుము త్రాగుతూ దాన్ని బాలారాముకు ఇచ్చి పీల్చమని అన్నారు. బాలారామ్ చిలుము పీల్చడానికి అలవాటు పడలేదు. అయినప్పటికీ దాన్ని అందుకుని కష్టంతో పీల్చారు. దాన్ని తిరిగి నమస్కారాలతో బాబాకి అందజేశారు. ఇదే బాలారాముడికి శుభసమయం. అతడు 6 సంవత్సరాల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసింది. అది అతనిని తిరిగి బాధపెట్టలేదు. 6 సంవత్సరాల తరువాత ఒకరోజు ఉబ్బసం మళ్ళీ వచ్చింది. అదేరోజు అదే సమయంలో బాబా మహాసమాధి చెందారు.

వారు షిరిడీకి వచ్చింది గురువారం. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవం చూసే భాగ్యం దురంధర సోదరులకు కలిగింది. చావడిలో హారతి సమయంలో బాలారాము బాబా ముఖంలో పాండురంగడి తేజస్సును ఆ మరుసటి ఉదయం కాకడహారతి సమయంలో అదే కాంతిని పాండురంగ విఠలుడి ప్రకాశం బాబా ముఖంలో కనిపించింది. బాలారామ్ దురంధర్ మరాఠీ భాషలో తుకారామ్ జీవితాన్ని రాశాడు. అది ప్రకటింపబడక ముందే అతడు చనిపోయాడు. 1928లో అతని సోదరులు దాన్ని ప్రచురించారు. అందులో బాలారామ్ జీవితం ప్రప్రధమంలో రాయబడింది. అందులో వారు షిరిడీకి వచ్చిన విషయం చెప్పబడి వుంది.

యాభైవయ అధ్యాయం సంపూర్ణం

0 Comments To "Saibaba Saccharitra 50 Adhyaayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!