Saibaba Satcharitra 13 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

పదమూడవ అధ్యాయం

మరికొన్ని సయిలీలలు, జబ్బులు నయమవటం : 1 భీమాజీ పాటీలు, 2 బాలాషింపి, 3 బాపుసాహెబు, 4 అళందిస్వామి, 5 కాకామహాజని, 6 హర్థా నివాసి దత్తోపంతు

మాయ యొక్క అనంత శక్తి 

బాబా మాటలు క్లుప్తంగాను, భావగర్భితంగాను, అర్థపూర్వకంగాను, శక్తివంతంగాను, సమతూకంతోనూ ఉండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా, నిశ్చింతగా ఉండేవారు. బాబా ఇలా అన్నారు 'నేను ఫకీరును అయినప్పటికీ, ఇళ్ళూ వాకిలీ, భార్యాబిడ్డలు, తదితర బాదరబందీ లేవీ లేకండా, ఎక్కడికీ కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ, తప్పించుకోలేని మాయ నన్నూ బాధిస్తున్నది. నేను నన్ను మరిచినా ఆమెను మరవలేకపోతున్నాను. ఎప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చిరాకు పరుస్తుండగా, నావంటి దుర్భలుడయిన ఫకీరంటే ఎంత? హరి ప్రసన్నుడు అయినప్పుడే ఆ మాయ నుండి తప్పించుకోవడం సాధ్యం. నిరంతర హరిభజనే దానికి మార్గం' మాయాశక్తిని గురించి బాబా ఆ విధంగా పలికారు. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపాలని ఉద్దవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలుకోసం బాబా యింకా ఏమి చెప్పారో వినండి 'ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపాలు క్షీణించాయో వారే నన్ను భజన చేసేదానిలో తత్పరులై నన్ను ఎరుగగలరు. ఎల్లప్పుడూ 'సాయి సాయి' అని స్మరిస్తూ ఉంటే సప్తసముద్రాలు దాటిస్తాను. ఈ మాటలను విశ్వసించండి. తప్పక మేలు పొందుతావు. పూజా తంతులో నాకు పనిలేదు. షోడశోపచారాలు గాని అష్టాంగ యోగాలు గాని నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటే నా నివాసం' ఇక, తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కోసం బాబా ఏమి చేశారో వినండి.

భీమాజీ పాటీలు

పూణా జిల్లా, జున్నరు తాలూకా, నారాయణ గాంవ్ వాస్తవ్యుడు భీమాపాటీలు 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల అనారోగ్యానికి గురయ్యారు. చివరికి అది క్షయ వ్యాధిగా పరిణమించింది. అన్ని రకాల ఔషధాలు వాడారు కానీ ప్రయోజనం లేకపోయింది. ఇక ఆశలు అన్నీ వదులుకొని 'ఓ భగవంతుడా! ఇక నీవే నాకిక దిక్కు! నన్ను కాపాడు!' అని ప్రార్థించారు. మన పరిస్థితులు బాగున్నంత వరకు మనం భగవంతుడిని తలచుకోము అనే సంగతి అందరికీ తెలిసిందే. కష్టాలు మనలని ఆవరించినప్పుడు భగవంతుడిని జ్ఞాపకానికి తెచ్చుకుంటాము. అలాగే భీమాజీ కూడా భగవంతుణ్ణి స్మరించాడు. ఆ తరువాత, తన అనారోగ్యం విషయమై బాబా భక్తుడైన నానాసాహెబు ఛాందొర్కర్ తో సలహా తీసుకోవాలనే ఆలోచన కలిగింది. వెంటనే తన జబ్బు యొక్క వివరాలు అన్నీ తెలుపుతూ ఆయనకు ఒక లేఖ రాసి అతని అభిప్రాయం అడిగారు. బాబా పాదాలపై పడి బాబాను శరణు వేడుకోవడం ఒక్కటే ఆరోగ్యానికి సాధనమని నానాసాహెబు ఛాందొర్కర్ జవాబు వ్రాశారు. అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిరిడీకి వెళ్ళడానికి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చోబెట్టారు. నానాసాహెబు, శ్యామా కూడా అక్కడే ఉన్నారు. ఆ జబ్బు వాడి గతజన్మలోని పాపకర్మల ఫలితమనీ, అతని విషయంలో తను జోక్యం చేసుకోదలచుకోలేదని బాబా చెప్పారు. కానీ రోగి తనకు వేరే దిక్కులేదనీ అందుకే చివరికి వారి పాదాలను ఆశ్రయించానని మొరపెట్టుకుని వారి కటాక్షం కోసం వేడుకున్నారు. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగింది. అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు 'ఊరుకో! నీ ఆతృత పారద్రోలు, నీ కష్టాలు అన్నీ గట్టెక్కాయి. ఎంతటి పీడా, బాధలు ఉన్న వారు ఎవరైనా ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుతారో వారి కష్టాలు అన్నీ నిష్క్రమించి సంతోషానికి దారి తీస్తాయి. ఇక్కడ ఫకీరు మిక్కిలి దయార్థ్రహృదయుడు. వారీ రోగాన్ని తప్పకుండా బాగు చేస్తారు. ఆ ఫకీరు అందరినీ ప్రేమతోను, దయతోను కాపాడుతారు.' ప్రతి ఐదు నిముషాలకు రక్తం కక్కుతున్న ఆ రోగి బాబా సమక్షంలో ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు! బాబా వాణ్ణి దయతో కాపాడుతానని అభయం యిచ్చిన వెంటనే నయమవడం ప్రారంభించింది. వాణ్ణి భీమాబాయి ఇంట్లో అంత సదుపాయమైనది కానీ, ఆరోగ్యకరమైనది కాని కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండేటప్పుడు బాబా అతనికి రెండు స్వప్న అనుభవాలను యిచ్చి, వారి రోగాన్ని కుదిర్చారు. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల  విద్యార్థిగా పద్యాలు కంఠోపాయం చేయకపోవడంతో క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించారు. రెండవ స్వప్నంలో  వారి భాతీపై పెద్ద బండను వేసి కిందికి మీదికి తోయటంతో అత్యంత బాధను అనుభవించారు. స్వప్నంలో పడిన ఈ బాధలతో వారి జబ్బు నమయైపోయి వారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తరువాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చి వెళ్ళేవారు. బాబా తనకు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకుని బాబా పాదాలపై సాష్టాంగ నమస్కారాలు చేస్తుండేవారు. బాబా తన భక్తుల దగ్గరనుంచి ఏమీ కాంక్షించేవారు కాదు. వారికి కావలసింది ఏమిటంటే భక్తులు తము పొందిన మేలును జ్ఞాపకం వుంచుకొని, అచంచలమైన నమ్మకాన్ని, భక్తినీ కలిగి ఉండడమే. మహారాష్ట్ర దేశంలో నెలకి ఒకసారి కాని, పక్షానికి ఒకసారి కాని ఇళ్ళల్లో సత్యనారాయణ వ్రతం చేయడం సాంప్రదాయం. కానీ భీమాజీ పాటీలు ఆ సత్యనారాయణ వ్రతానికి బదులుగా సాయి సత్యవ్రతాన్ని తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించారు.

బాలగణపతి షింపీ

బాలాగణపతి అనేవాడు బాబా భక్తుడు. ఒకసారి అతను మలేరియా జబ్బుతో బాధపడసాగాడు. అన్ని రకాల ఔషధాలు, కాషాయాలు తీసుకున్నారు. కానీ నిష్ప్రయోజనం అయ్యాయి. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరుగెత్తాడు. బాబా పాదాలపై పడ్డాడు. బాబా వాడికి లక్ష్మీ మందిరం ముందు వున్న నల్లకుక్కకి పెరుగు అన్నం కలిపి పెట్టమని చెప్పారు. ఈ వింత రోగ నివారణోపాయాన్ని ఎలా నెరవేర్చాలో బాలాకు తెలియకుండా పోయింది. ఇంటికి వెళ్ళగా అక్కడ అన్నం, పెరుగు సిద్ధంగా ఉండటం చూశాడు. రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరం దగ్గరికి తీసుకుని వచ్చాడు. అక్కడ ఒక నల్లని కుక్క తోక ఆడించుకుంటూ కనిపించింది. పెరుగు అన్నం కుక్క ముందు పెట్టాడు. కుక్క దాన్ని తినేసింది. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయింది.

బాపూసాహెబు బూటీ

ఒకానొకప్పుడు బాపుసాహెబు బూటీ జిగట విరేచనాలతోనూ, వమనములతోనూ బాధపడుతూ ఉండేవాడు. అతని అలమార నిండా మంచి మంచి మందులు ఉండేవి. కానీ అవి ఏవీ గుణం ఇవ్వలేదు. విరేచనాల, వమనములతోనూ బాపుసాహెబు నీరసించిపోయాడు. అందుకే బాబా దర్శనం కోసం మసీదుకు కూడా వెళ్ళలేక పోయాడు. బాబా అతన్ని మసీదుకు రమ్మని కబురు పంపి, అతను రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకుని, తమ చూపుడు వ్రేలు ఆడిస్తూ 'జాగ్రత్త! నీవిక విరేచనము చేయకూడదు! వమనము కూడా ఆగిపోవాలి!' అన్నారు. బాబా మాటల సత్తువను గమనించండి. వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయాయి. బూటీ జబ్బ కుదిరింది. మరొక్కసారి బూటీకి కలరా సోకింది. తీవ్రమైన దాహంతో బాధపడుతుండేవాడు. డాక్టరు పిళ్ళై అనే వైద్యుడు అన్ని ఔషధాలను ప్రయత్నించారు. కానీ రోగం కుదరలేదు. బాపుసాహెబు బూటీ అపుడు బాబా దగ్గరికి వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకుంటే తన దాహం తీరిపోయి, జబ్బు కుదురుతుందని సలహా అడిగారు. బాదంపప్పు, పిస్తా, అక్రోటు నానపెట్టి, పాలు చెక్కరలో ఉడికించి పుచ్చుకుంటే రోగం కుదురుతుందని బాబా చెప్పారు. ఇది జబ్బుని మరింత పెంచుతుందని, ఏ డాక్టరు అయినా చెపుతారు. కాని బాపుసాహెబు బాబా ఆజ్ఞని శిరసావహించారు. పాలతో తయారుచేసిన దాన్ని సేవించారు. విచిత్రంగా రోగం వెంటనే కుదిరిపోయింది.

అళంది స్వామి

 అళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనం కోసం షిరిడీకి వచ్చారు. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్రపట్టలేదు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా ఉండేది. ఏమీ చేయడానికి తోచకుండా ఉండేది. తిరిగి వెళ్ళిపోయే సమయంలో బాబా దర్శనం కోసం వచ్చారు. అతని చెవిపోటు తగ్గడానికి ఏదైనా చేయమని శ్యామా ఆ సన్యాసి తరపున బాబాను వేడుకున్నారు. బాబా అతన్ని ఇలా ఆశీర్వదించారు. 'అల్లా అచ్చా కారేగా' (భగవంతుడు నీకు మేలు చేస్తాడు). ఆ సన్యాసి పూణా చేరి, ఒక వారంరోజుల తరువాత షిరిడీకి ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిపోయిందని, కానీ ఇంకా వాపు తగ్గలేదని వ్రాశారు. వాపు పోగొట్టుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని బొంబాయి వెళ్ళారు. డాక్టరు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరంలేదని చెప్పారు. బాబా వాక్కుకు ఉన్న శక్తి అంత అద్భుతమైనది.

కాకామహాజని

కాకామహాజని అనే ఇంకొక భక్తుడు ఉన్నాడు. అతను నీళ్ళ విరేచనాలతో బాధపడుతున్నాడు. బాబా సేవకి ఆటంకం లేకుండా ఉండేలా ఒక చెంబు నిండా నీళ్ళు పోసుకుని, దాన్ని మసీదులో ఒక మూల పెట్టుకున్నారు. అవసరం వచ్చినప్పుడల్లా వెళ్తున్నాడు. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పవలసిన అవసరంలేదని, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూరుస్తారని కాకా నమ్మారు. మసీదు ముందు రాళ్ళు తాపన చేయడం కోసం బాబా సమ్మతించారు. కాబట్టి పని ప్రారంభమైంది. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా అరిచారు. అందరూ పరుగెత్తి పారిపోయారు. కాకా కూడా పరుగెత్తడం మొదలుపెట్టాడు. కాని బాబా అతన్ని పట్టుకుని అక్కడ కూర్చుండ బెట్టారు. ఈ సందడిలో ఎవరో వేరుశనగపప్పుతో చిన్న సంచీని అక్కడ విడిచి పారిపోయారు. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి, చేతులతో నలిపి పొట్టును వూదేసి, శుభ్రమైన పప్పును కాకాకి ఇచ్చి తినమన్నారు. తిట్టడం శుభ్రపరచడం తినడం ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. బాబా కూడా కొంత పప్పుని తిన్నారు. సంచి ఖాళీ కాగానే నీళ్ళు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించారు. కాకా కుండతో నీళ్ళు తీసుకుని వచ్చాడు. బాబా కొన్ని నీలు త్రాగి, కాకాను కూడా త్రాగమన్నారు. అప్పుడు బాబా యిలా అన్నారు 'నీ నీళ్ళ విరేచనాలు ఆగిపోయాయి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేసే పనిని చూసుకోవచ్చు.’ అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరుకున్నారు. పని ప్రారంభించబడింది. విరేచనాలు ఆగిపోవడంతో కాకా కూడా వారితో కలిశారు. నీళ్ళ విరేచనాలకు వేరుశెనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారం వేరుశెనగపప్పు విరేచానాలను పెంచుతుంది కానీ తగ్గించలేదు. ఇందులో నిజమైన ఔషధం బాబా యొక్క వాక్కే.

హార్ధా నివాసి దత్తోపంతు

దత్తోపంతు హర్ధగ్రామ నివాసి, అతడు కడుపునొప్పితో 14సంవత్సరాలపాటు బాధపడ్డాడు. ఏ ఔషధమూ వాడికి గుణం ఇవ్వలేదు. అతడు బాబా కీర్తి విన్నాడు. వారు జబ్బులను దృష్టితోనే బాగు చేస్తారని తెలుసుకుని షిరిడీకి వెళ్ళి బాబా పాదాలపై పడ్డాడు. బాబా అతన్ని దయాదృష్టితో ఆశీర్వదించారు. బాబా అతని తలపై తన హస్తాన్ని వుంచి, ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణం ఇచ్చింది. ఆ జబ్బువలన తిరిగి అతడు ఎప్పుడూ బాధపడలేదు

ఇంకొక మూడు వ్యాధులు

(1) మాధవరావు దేశ్ పాండే మూలవ్యాధితో బాధపడ్డాడు. సోనాముఖి కషాయాన్ని బాబా వారికి యిచ్చారు. ఇది వారికి గుణం ఇచ్చింది. రెండు సంవత్సరాల తరువాత జబ్బు తిరగదోడింది. మాధవరావు ఇదే కషాయాన్ని బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకున్నారు. కానీ వ్యాధి అధికం అయ్యింది. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయం అయింది.

(2) కాకామహాజని అన్నగారైన గంగాధరపంతు అనేక సంవత్సరాలు కడుపునొప్పితో బాధపడ్డాడు. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చాడు. కడుపునొప్పి బాగుచేయమని బాబాను వేడుకున్నాడు. బాబా వారి కడుపును తమ హస్తంతో స్పృశించి, భగవంతుడే బాగు చేయగలడు అని అన్నారు. అప్పటినుండి అతనికి కడుపునొప్పి తగ్గి, వ్యాధి పూర్తిగా నయం అయింది.

(3) ఒకప్పుడు నానాసాహెబు ఛాందొరకరు కడుపునొప్పితో బాగా బాధపడ్డాడు. ఒకరోజు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యారు. డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చారు. కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతను బాబా దగ్గరికి వచ్చాడు. బాబా ఆశీర్వదించారు. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయింది. ఈ కథలు అన్నీ నిరూపించేది ఏమిటంటే, అన్ని వ్యాధులు నయం కావడానికి అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదాలు మాత్రమే కానీ ఔషధాలు కాదు.

పదమూడవ అధ్యాయం సంపూర్ణం

పదనాలుగవ అధ్యాయం

 

0 Comments To "Saibaba Satcharitra 13 Adhyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!