Saibaba Satcharitra 22 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైరెండవ అధ్యాయం

ప్రస్తావన : 1. బాలాసాహెబు మిరీకర్ 2. బాపూసాహెబు బూటీ 3. అమీర్ శక్కర్, తేలు - పాము, బాబా అభిప్రాయము

బాబాను ధ్యానించడం ఎలా?భగవంతుడి నైజం గాని, స్వరూపం గాని అగాదాలు. వేదలుగాని, వెయ్యి నాలుకలు కలిగిన ఆదిశేషుడు గాని వాటిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుడి రూపాన్ని చూసి కనుక్కొని తీరాలి. ఎందుకంటే, తమ ఆనందానికి భగవంతుడి పాదాలే ముఖ్యమార్గం అని వారికి తెలుసు. జీవిత పరమార్థాన్ని పొందడానికి గురువు పాదాలనే ధ్యానించాలి కానీ యింకోక మార్గం లేదని వారికి తెలుసు. హేమాడ్ పంత్ ఒక సులభమైన మార్గాన్ని ఉపదేశ రూపంగా చెప్పుచున్నాడు. అది ధ్యానాన్ని, భక్తికి కూడా అనుకూలిస్తుంది. నెలలో కృష్ణపక్షంలో రానురాను వెన్నెల క్రమంగా క్షీణిస్తుంది. చివరికి అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు. వెన్నెల కూడా రాదు. శుక్లపక్షం ప్రారంభం అవగానే ప్రజలు చంద్రుడిని చూడటానికి ఆతృతపడతారు. మొదటిరోజు చంద్రుడు కనిపించడు. రెండవరోజు సరిగ్గా కనిపించడు. అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య నుంచి చూడమని చెపుతారు. ఆతృతతో, ధ్యానంతో ఆ సందుద్వారా చూసినప్పుడు దూరంగా వున్న చంద్రుడి ఆకారం ఒక గీతలా కనిపిస్తుంది. వారు అప్పుడు సంతోషపడతారు. ఈ సూత్రాన్ని అనుసరించి బాబా తేజాన్ని చూద్దాము. బాబా కూర్చున్న విధానం చూడండి. అది ఎంత సుందరంగా వుంది! వారు కాళ్ళను ఒకదానిపైన ఇంకొకటి వేసుకుని ఉన్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడిపాదంపై వేసుకునివున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలు వున్న మధ్య వ్రేలు ఉన్నాయి. ఈ కూర్చున్న విధానాన్ని బట్టి చూస్తే బాబా మనకి దిగువ విషయం చెప్పడానికి నిశ్చయించుకున్నట్టుంది. ‘నా ప్రకాశాన్ని చూడాలని వుంటే, అహంకారాన్ని విడిచి అత్యంత అణుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్య వున్న బొటన వ్రేలుపై దృష్టిని సారిస్తే నా ప్రకాశాన్ని చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గం.’

ఒక్క క్షణం బాబా జీవితాన్ని గమనిద్దాము. బాబా నివాసం వలన షిరిడీ ఒక యాత్రాస్థలం అయ్యింది. అన్ని మూలాలనుండి ప్రజలు అక్కడ గుమిగూడుతూ ఉండేవారు. బీదవారు గొప్పవారు కూడా అనేక విధాలుగా మేలు పొందుతూ ఉండేవారు. బాబా యొక్క అనంతమైన ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానాన్ని, వారి సర్వాంతర్యామి తత్త్వాన్ని వర్ణించగల వారెవరు? వీటిలో ఏదైనా ఒకదాన్ని గాని, అన్నింటినీగాని అనుభవించినవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనాన్ని పాటించేవారు. అది వారి యొక్క బ్రహ్మబోధం, ఇంకొక్కప్పుడు చైతన్య ఘనులుగా ఉండేవారు. ఆనందంలో అవతారంగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొక్కప్పుడు హాస్యం, తమాషా చేయడంలో మునిగి ఉండేవారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు. ఒక్కొక్కపుడు కోపోద్దీపితుడా అని తోచేవారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్తుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోకి దింపేవారు. అనేకసార్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వారు. ఈ ప్రకారంగా సందర్భావసరాలను బట్టి వారి ప్రబోధం అనేక విధాలుగా అనేకమందికి కలుగుతూ ఉండేది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేథాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖారవిందాన్ని చూడడంలో ఆసక్తిగాని, వారితో సంభాషించటంలోగాని, వారి లీలలు వినటంలోగాని తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగుతూ ఉండేవారు. వర్ష బిందువులను లెక్కించగలం, తోలుసంచిలో గాలిని మూయగలం. కానీ బాబా లీలలను లెక్కించలేము. వాటిలో ఒక్కదాన్ని గురించి చెబుతాము. భక్తుల ఆపదలను కనుగొని, భక్తులను వాటి బారినుండి సకాలంలో బాబా ఎలా తప్పిస్తూ ఉండేవారో ఇక్కడ చెబుతాము.

బాలాసాహెబు మిరీకర్ :

సర్దారు కాకాసాహెబు మిరీకర్ కొడుకు అయిన బాలాసాహెబు మిరీకర్ కోపర్ గాంకు మామల్తదారుగా ఉండేవారు. అతను ఒకరోజు చితలీ గ్రామ పర్యటనకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో బాబాను చూడడానికి షిరిడీ వచ్చారు. మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించాడు. బాబా అతని యోగక్షేమాలు అడిగి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఇలా అడిగారు 'నీకు మన ద్వారకామాయి తెలుసా?’. బాలాసాహెబుకు ఆ ప్రశ్న బోధపడకపోవడంతో ఊరుకున్నాడు. ‘నీవు ఇప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కోర్చుంటారో వారిని ఆమె కష్టాలనుండి ఇతరాత్రా నుండి తప్పిస్తుంది. ఈ మసీదు తల్లి చాలా దయార్థ్రహృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదలనుండి తప్పిస్తుంది. ఆమె ఒడిని ఆశ్రయించినవారి కష్టాలు అన్నీ సమసిపోతాయి. ఎవరామే నీడని ఆశ్రయిస్తారో వారికి ఆనందం కలుగుతుంది' అన్నాడు. తరువాత బాబసాహెబుకు ఊదీ ప్రసాదం ఇచ్చి అతని శిరస్సుపై చేయి వేశారు. బాలాసాహెబు వెళ్తుండగా బాబా 'నీకు అ పొడువాటి వ్యక్తి తెలుసా? అదే సారపు!’ అన్నారు. బాబా తమ ఎడమచేతిని మూసి దాన్ని కుడిచేతి దగ్గరికి తెచ్చి పాముపడగలా వుంచి, ‘అతడు మిక్కిలి భయంకరమైన వాడు. కానీ ద్వారకామాయి బిడ్డలను అతను ఏమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుతుండగా, పాము ఏం చేయగలదు? అన్నారు.

అక్కడ ఉన్న వారందరూ దీని భావాన్ని తెలుసుకోవడానికి, దానికి మిరీకర్ కి గల సంబంధం తెలుసుకోవడానికి కుతూహల పడుతున్నారు. కానీ బాబాని ఈ విషయమై అడగడానికి ధైర్యం లేకపోయింది. బాలాసాహెబు బాబాకు నమస్కరించి, మసీదును విడిచి శ్యామాతో వెళ్ళారు. బాబా శ్యామాను పిలిచి, బాలాసాహెబుతో చితిలీ వెళ్ళి ఆనందించమన్నారు. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వస్తానని శ్యామా బాలాసాహెబుతో చెప్పారు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పారు. శ్యామా బాబాకి ఈ సంగతి తెలిపారు. బాబా ఇలా అన్నారు 'సరే వెళ్ళ వద్దు. అతని మంచి మనం కోరుకున్నాము. ఏది నుదుట రాసి ఉందొ అది జరుగక తప్పదు.’

ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మని చెప్పారు. శ్యామా బాబా దగ్గరికి వెళ్ళి సెలవు పుచ్చుకుని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరారు. వారు రాత్రి 9గంటలకు చితిలీ చేరుకున్నారు. ఆంజనేయ ఆలయంలో బస చేశారు. కచేరీలో పనిచేసే వారు ఎవరూ రాలేదు. కాబట్టి నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. చాప పైన కూర్చుని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుతున్నారు .అతను ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పం ఉంది. దాన్ని ఎవరూ చూడలేదు. అది బుసకొడుతూ కదులుతూ ఉంది. ఆ ధ్వని నౌకరు విన్నాడు. అతడు ఒక లాంతరు తెచ్చి, సర్పాన్ని చూసి పాము పాము అని అరిచాడు. బాలాసాహెబు భయపడ్డారు. వణకడం ప్రారంభించారు. శ్యామా కూడా ఆశ్చర్యపడ్డాడు. అందరూ మెల్లగా కర్రలను తీశారు బాలాసాహెబు నడుమునుండి పాము దిగటం ప్రారంభించింది. దాన్ని కొట్టి చంపేశారు. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించారు. బాబా యందు బాలాసాహెబుకు వున్న ప్రేమ ధృఢమయింది.

బాపూసాహెబు బూటీ :

నానా డెంగలే అనే గొప్ప జ్యోతిష్కుడు, బాపూసాహెబు బూటీ షిరిడీలో ఉండే సమయంలో ఒకరోజు ఇలా అన్నారు 'ఈ దినం నీకు అశుభం. నీకీ దినం ప్రాణగండం వుంది.’ ఇది బాపూసాహెబును ఆందోళనకు గురిచేసింది. అయన యథాప్రకారం మసీదుకు వెళ్ళగా, బాబా బాపూసాహెబుతో ఇలా అన్నారు 'ఈ నానా ఏమంటున్నాడు? నీకు మరణం వుందని చేపుతున్నాడు కదా? సరే! నీవు ఏమీ భయపడవలసిన పనిలేదు. ‘మృత్యువు ఎలా చంపుతుందో చూద్దాము గాక!’ అని అతనికి ధైర్యంతో జవాబుఇవ్వు.’ ఆరోజు సాయంకాలం బాపూసాహెబు బూటీ మరుగుదొడ్డికి వెళ్లారు. అక్కడ ఒక పామును చూశాడు. అతని నౌకరు దాన్ని చూశాడు. ఒక రాయిని ఎత్తి కొట్టబోయాడు. బాపూసాహెబు పెద్ద కర్రను తీసుకుని రమ్మన్నాడు. నౌకరు కర్రను తీసుకుని వచ్చే లోపలే పాము అక్కడినుండి వెళ్ళిపోయింది. ధైర్యంతో ఉండమని బాబా చెప్పిన పలుకులను బాపూసాహెబు జ్ఞాపకానికి తెచ్చుకుని సంతోషించారు.

అమీర్ శక్కర్ :

కోపర్ గాం తాలూకాలో కోరాలే గ్రామవాసి అమీరు శక్కర్. అతడు కసాయి కులానికి చెందినవాడు.అతడు బాంద్రాలో కమీషను వ్యాపారిగా పనిచేశాడు. అక్కడ అతనికి మంచి పలుకుబడి ఉండేది. అతడు కీళ్ళవాతంతో బాధపడుతూ ఉండటంతో, భగవంతున్ని జ్ఞాపకానికి తెచ్చుకుని వ్యాపారాన్ని విడిచిపెట్టి షిరిడీ చేరుకుని బాధ నుండి తప్పించమని బాబాను వేడుకున్నాడు. చావడిలో కూర్చోమని బాబా అతన్ని ఆజ్ఞాపించారు. అటువంటి రోగికి ఆ స్థలం సరైంది కాదు. అది ఎప్పుడూ తేమగా ఉంటుంది. గ్రామంలో ఇంకా ఏదైనా స్థలం బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధం, నిర్ణయ సూత్రం. మసీదుకు రావడానికి బాబా అతనికి అనుమతి ఇవ్వలేదు. చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించారు. అది అతనికి అత్యంత లాభకారి అయ్యింది. ఎందుకంటే బాబా ఉదయం, సాయంకాలం చావడివైపు వెళ్తుండేవారు. అదీ కాక రోజు విడిచి రోజు ఉత్సవంతో వెళ్ళి బాబా అక్కడ నిద్రిస్తూ ఉండేవారు. కొంతకాలం తరువాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగింది. ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్ గాం పారిపోయాడు. అక్కడొక ధర్మశాలలో దిగారు. అక్కడ ఒక ఫకీరు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫకీరు నీళ్ళు కావాలి అంటే అమీరు వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఆ నీళ్ళను త్రాగి ఫకీరు చనిపోయాడు. అమీరు చిక్కుల్లో పడ్డాడు. అతను పోలీసులకు తెలియజేస్తే మొట్టమొదట సమాచారం తెచ్చినవాడు అవడం వలన తనకి ఆ ఫకీరు విషయం ఏమైనా తెలిసి ఉంటుందని పట్టుకుంటారు. ఆ చావుకు కూడా అతను కారణభూతుడు అయ్యే అవకాశం ఉంటుందని అనుమానిస్తారు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టడం తనదే  తప్పని అతడు గ్రహించి, పాశ్చాత్తాప పడ్డాడు. షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకుని ఆ రాత్రే అక్కడినుండి షిరిడీకి వెళ్ళాడు. మార్గమధ్యంలో బాబా నామాన్ని జపం చేస్తూ ఉన్నాడు. సూర్యోదయానికి పూర్వమే షిరిడీ చేరుకొని ఆతృతనుండి రోగవిముక్తుడు అయ్యాడు. ఒకనాటి మధ్యరాత్రి బాబా 'ఓ అబ్దల్! నా పరుపువైపు ఏదో దుష్టప్రాణి వస్తున్నది' అని అరిచారు. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూశాడు కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెపుతూ నేలపై సటకాతో కొడుతున్నారు. అమీర్ శక్కర్ బాబా లీలను చూసి అక్కడికి పాము వచ్చిందని బాబా అనుమానించి ఉండి వుంటారు అనుకున్నాడు. బాబా సాంగత్యం వలన, బాబా ఆడే మాటల, చేసే క్రియల భావాన్ని అమీరు గ్రహిస్తూ ఉన్నాడు. అమీరు తన దిండుకు సమీపంలో ఎదో కదులుతూ ఉండటం గమనించి, అబ్దుల్ ను లాంతరు తీసుకుని రమ్మన్నాడు. అంతలో అక్కడొక పాము కనబడింది. అది తలను క్రిందికీ పైకీ ఆడిస్తూ ఉంది. వెంటనే దాన్ని చంపేశారు. ఇలా బాబా సకాలంలో హెచ్చరిక చేసి అమీరును కాపాడారు.

తేలు - పాము

1.  తేలు : బాబా ఆజ్ఞతో కాకాసాహెబు దీక్షిత్ నిత్యం శ్రీఏకనాథ మహారాజ్ రచించిన భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు. ఒకరోజు పురాణ కాలక్షేపం జరుగుతుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యారు. రామాయణంలో ఆంజనేయుడు తన ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించే భాగాన్ని చదువుతున్నాడు. వినేవారు అందరూ మైమరచి పోయి వున్నారు. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజంపై పడి వాడి ఉత్తరీయంపై కూర్చుంది. మొదట దాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణ శ్రవణం చేస్తారో వారిని భగవంతుడు రక్షిస్తాడు. ఇంతలో హేమాడ్ పంత్ తన కుడి భుజంపై ఉన్న తేలును చూశారు. అది చచ్చినదానిలా నిశబ్దంగా కదలకుండా వుంది. అది కూడా పురాణం వింటున్నట్లు గమనించాడు. భగవంతుడి కటాక్షం స్మరించి, పురాణ శ్రవణంలో ఉన్న ఇతరులకు భంగం కలగచేయకుండా ఉత్తరీయం రెండు చివరలను పట్టుకుని, దానిలో తేలు ఉండేలా చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో వదిలేశారు.

2. పాము : ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబు మేడమీద కొందరు కూర్చుని ఉన్నారు. ఒక సర్పం కిటికీలో వున్న చిన్న రంద్రం ద్వారా దూరి చుట్టుకుని కూర్చుంది. దీపాన్ని తెచ్చారు. మొదట అది వెలుతురుకు భయపడింది. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చుంది. తల మాత్రం క్రిందకీ మీదకీ ఆడిస్తూ ఉంది. అనేకమంది బడితెలు, కర్రలు తీసుకుని వేగంగా వచ్చారు. అది ఎటూ కానీ స్థలంలో ఉండటంతో దాన్ని చంపలేక పోతున్నారు. మనుష్యుల శబ్దం విని అ సర్పం వచ్చిన రంద్రంలోకి గబగబా దూరింది. అందరూ ఆపదనుండి తప్పించుకున్నారు.

బాబా అభిప్రాయము

ముక్తారామ్ అనే ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవడంతో మంచే జరిగింది అన్నాడు. హేమాడ్ పంత్ అందుకు ఒప్పుకోలేదు. అది సరియైన ఆలోచన కాదు అన్నాడు. పాములను చంపటమే మంచిది అన్నాడు. ఇద్దరికీ గొప్ప వాదం జరిగింది. ముక్తారామ్ సర్పాలు మొదలైన క్రూరజంతువులను చంపవలసిన అవసరం లేదన్నాడు. హేమాడ్ పంత్ వాటిని తప్పకుండ చంపాలని అన్నాడు. రాత్రి సమీపించింది. చర్చ సమాప్తం కాలేకపోయింది. ఆ మరుసటి రోజు ఆ ప్రశ్నను బాబాను అడిగారు. బాబా ఇలా జవాబు చెప్పారు 'భగవంతుడు సకలజీవులలో నివశిస్తూ వున్నాడు. అవి సర్పాలుగాని, తేళ్ళుగాని కానివ్వండి. ఈ ప్రపంచాన్ని నడిపించే సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు, తేళ్ళతో సహా సకల ప్రాణులు భగవంతుడి ఆజ్ఞను శిరసావహిస్తాయి. వారి అనుజ్ఞ అయితేగాని ఎవరూ ఎవరినీ ఏమీ చేయలేరు. ప్రపంచం అంతా వాటిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరూ స్వతంత్రులు కారు. కాబట్టి మనం కనికరించి అన్ని జీవులను ప్రేమించాలి. అనవసరమైన కలహాలలో, చంపటంలో పాల్గొనక ఓపికతో ఉండాలి. అందరినీ రక్షించేవాడు దైవమే.’

ఇరవైరెండవ అధ్యాయం సంపూర్ణం

మూడవరోజు పారాయణ సమాప్తం 

0 Comments To "Saibaba Satcharitra 22 Adhyayam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!