Saibaba Satcharitra 5 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఐదవ అధ్యాయం

పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట

ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం ఉంది. అక్కడ ధనవంతుడైన మహమ్మదీయుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు వెళుతున్నప్పుడు అతని గుఱ్ఱం తప్పిపోయింది. రెండు మాసాలు వెదికినా దాని జాడ తెలియకుండా పోయింది. అతను నిరాశ చెంది తన భుజంపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామానికి వెళుతుండగా సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన తరువాత ఒక మామిడిచెట్టు దగ్గరికి వచ్చాడు. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని కనిపించాడు. అతను తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉన్నాడు. చంకలో సటకా పట్టుకుని చిలుము త్రాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దారి వెంట వెళుతున్న చాంద్ పాటీలును చూసి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత సమయం విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. జీను గురించి ప్రశ్నించాడు. అది తాను పోగొట్టుకున్న గుఱ్ఱానిది అని చాంద్ పాటీల్ బదులిచ్చాడు. ఆ దగ్గరలో ఉన్న కాలువ ప్రక్కన వెతుకు అని ఫకీరు చెప్పాడు. చాంద్ పాటీలు అక్కడికి వెళ్ళగా గడ్డి మేస్తున్న గుఱ్ఱాన్ని చూసి అత్యంత ఆశ్చర్యపడ్డాడు. ఈ ఫకీరు సాధారణ మనిషి కాదు అని, గొప్ప ఔలియా (సిద్ధపురుషుడు) అయి ఉండవచ్చు అని అనుకున్నాడు. గుఱ్ఱాన్ని తీసుకుని ఫకీరు దగ్గరకి వచ్చాడు. చిలుము తయారుగా వుంది. కాని చిలుము వెలిగించడానికి నిప్పు, గుడ్డను తడపడానికి నీరు కావలసి వుంది. ఫకీరు సటకాను భూమిలోకి గుచ్చిన వెంటనే నిప్పు వచ్చింది. మళ్ళీ అక్కడే సటకాతో నేలపై కొట్టగా నీరు వచ్చింది. ఫకీరు చ్చాపీ (గుడ్డముక్క)ను నీటితో తడిపి, నిప్పుతో చిలుము వెలిగించాడు. అలా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి, తరువాత చాంద్ పాటీల్ కి అందించాడు. ఇదంతా చూసిన చాంద్ పాటీల్ ఆశ్చర్యపోయాడు. ఫకీరును తన గృహానికి అతిథిగా రావసిందిగా చాంద్ పటేల్ వేడుకున్నాడు. ఆ మరుసటి రోజే ఫకీరు, పాటీల్ ఇంటికి వెళ్ళి అక్కడ కొంత కాలం ఉన్నాడు. ఆ పాటీలు గ్రామానికి మునసుబు. అతని భార్య తమ్ముని కొడుకు పెళ్ళి సమీపించింది. పెండ్లి కూతురుది షిరిడీ గ్రామం. అందుకే కావలసిన సన్నాహాలు అన్నీ తయారుచేసుకుని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యాడు. పెళ్ళివారితో కలిసి ఫకీరు కూడా బయలుదీరాడు. ఎలాంటి చిక్కులు లేకుండా వివాహం జరిగిపోయింది, పెళ్ళివారు ధూప్ గ్రామానికి తిరిగి వెళ్ళారు కానీ ఫకీరు మాత్రం షిరిడీలోనే ఆగి అక్కడే స్థిరంగా ఉండిపోయాడు.

ఫకీరుకు 'సాయి' నామము ఎలా వచ్చింది

పెళ్ళివారు షిరిడీ చేరుకోగానే ఖండోబా మందిరానికి సమీపంలో ఉన్న భక్త మహాల్సాపతిగారి పొలములో ఉన్న మఱ్ఱిచెట్టు క్రింద బస చేశారు. ఖండోబా మందిరానికి ఆనుకుని వున్న ఖాళీ స్థలంలో బళ్ళు విడిచిపెట్టారు. బళ్ళలో ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు దిగారు. ఫకీరు కూడా దిగాడు. బండి దిగుతున్న యువ ఫకీరును చూసి మహాల్సాపతి 'రండి సాయీ!' అని స్వాగతించాడు. తక్కినవారు కూడా ఆయనను 'సాయి' అని పిలవడం ప్రారంభించారు. అది మొదలు వారు 'సాయిబాబా'గా ప్రఖ్యాతి పొందారు.

ఇతర యోగులతో సహవాసము

సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నారు. బాబా షిరిడీకి రాకపూర్వమే దేవీదాసు అనే యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరాల నుండి నివశిస్తూ ఉండేవాడు. బాబా అతనితో సాంగత్యాన్ని ఇష్టపడేవారు. అతనితో కలిసి మారుతీ మందిరంలోనూ, చావడిలోను ఉండేవారు. కొంతకాలం ఒంటరిగా ఉన్నారు. అంతలో జానకీదాసు గోసావి అనే మరోక యోగి అక్కడికి వచ్చారు. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుతూ ఉండేవారు లేదా బాబా ఉన్న ప్రదేశాని జానకీదాసు వెళ్ళేవారు. అలాగే, పుణతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వస్తుండేవాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకరోజు, బాబా స్వయంగా కుండలతో నీళ్ళు తెచ్చి పూలచెట్లకు నీళ్ళు పోస్తుండటం చూసి అతను షిరిడీ గ్రామస్థులతో ఇలా అన్నాడు 'ఈ మణి ఇక్కడ ఉండటం వల్లనే షిరిడీ పుణ్యక్షేతం అయింది. ఈయన ఈనాడు కుండలతో నీళ్ళు మోస్తున్నాడు. కాని యితడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల నిజంగా పుణ్యం చేసుకుంది. కాబట్టే సాయిబాబా అనే ఈ మణిని రాబట్టుకోగలిగింది.' ఏవలా గ్రామంలో ఉన్న మఠంలో ఆనందనాథుడు అనే యోగిపుంగవుడు ఉండేవాడు. అతడు అక్కల్ కోటకర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒకరోజు షిరిడీ గ్రామా నివాసులతో బాబాను చూడడానికి వచ్చాడు. అతను సాయిబాబాను చూసి ఇలా అన్నాడు 'ఈయన ఒక అమూల్యమైన రత్నం. సామాన్య మానవుడిలా కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయివంటి వాడు కాదు. ఈయనొక అమూల్యమైన వజ్రం. ముందు ముందు ఈ సంగతి మీకే తెలుస్తుంది' అలా అంటూ ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళిపోయాడు. ఇది శ్రీసాయిబాబా యవ్వనంలో జరిగిన సంగతి.

బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు

యవ్వనంలో బాబా తమ తలవెంట్రుకలను కత్తిరించుకోకుండా జుట్టు పెంచుకుంటూ ఉండేవారు. పహిల్వాను లాగా దుస్తులు వేసుకొనేవారు. షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు వెళ్ళినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదునుచేసి, వాటిని నాటి, నీళ్ళు పోస్తూ ఉండేవారు. ప్రతిరోజూ వామన్ తాత్యా అనే కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను యిస్తూ ఉండేవాడు. బాబా స్వయంగా బావినుండి నీళ్ళు ఛేది, ఆ నీటిని ఆ పచ్చి కుండల్లో తోడి, భుజంపై పెట్టుకుని మోస్తూ తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలం ఆ కుండలను వేపచెట్టు మొదట్లో బోర్లిస్తూ ఉండేవారు. కాల్చనవి కావడంతో అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అవుతుండేవి. ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి. సాయిబాబా కృషివలన అక్కడ ఒక పూలతోట పెరిగింది. ఆ స్థలంలో యిప్పుడు బాబా సమాధి ఉంది. దానినే సమాధిమందిరం అంటారు. దాన్ని దర్శించడం కోసమే అనేకమంది భక్తులు విశేషంగావెళుతున్నారు.

వేపచెట్టు క్రిందనున్న పాదుకాల వృత్తాంతము

అక్కల్ కోటకర్ మహారాజ్ గారి భక్తుడు భాయికృష్ణాజీ ఆలీబాగ్ కర్. ఇతను అక్కల్ కోటకర్ మహారాజ్ గారి చిత్రపటాన్ని పూజిస్తూ ఉండేవారు. అతను ఒకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కల్ కోట గ్రామానికి వెళ్ళి, మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించుకోవాలని అనుకున్నాడు. అతను అక్కడికి వెళ్ళకముందే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనం యిచ్చి ఇలా చెప్పారు 'ప్రస్తుతం షిరిడీ నా నివాసస్థలం. అక్కడికి వెళ్ళి నీ పూజ జరుపుకో’'. అందుకే అక్కల్ కోట వెళ్ళాలనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకుని భాయికృష్ణాజీ షిరిడీ చేరుకొని, బాబాను పూజించి, అక్కడే ఆరు మాసాలు ఆనందంతో గడిపారు. దీని జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణమాసంలో ఒక శుభ దినాన వేపచెట్టుక్రింద ప్రతిష్ఠ చేయించారు. ఇది 1834వ సంవత్సరం, శ్రావణ మాసంలో (అనగా క్రీ.శ. 1912)లో జరిగింది. దాదా కేల్కర్, ఉపాసనీబాబా అనేవారు పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. దీక్షిత్ అనే బ్రాహ్మణుడు పాదుకలకు నిత్య పూజ చేయడానికి నియమించబడ్డాడు. దీనిని పర్యవేక్షించే బాధ్యతను భక్త సగుణ్ మేరు నాయక్ కు అప్పగించబడింది.

కథయొక్క పూర్తి వివరము

ఠాణేవాస్తవ్యుడు అయిన శ్రీ బి.వి.రావు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేశారు. వేపచెట్టు క్రింద ప్రతిష్టింపబడిన పాదుకలకు సంబంధించిన వివరాలు అన్నీ సగుణ్ మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షిత్ ల నుండి సేకరించి, పాదుకల పూర్తి వృత్తాంతం, శ్రీసాయిలీల మాసపత్రిక రెండవ సంపుటం, మొదటి సంచిక, 25వ పేజీలో ఈ విధంగా ప్రచురించారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టరు రామారావు కొఠారేయను అనే అతను షిరిడీ వచ్చాడు. వారితో పాటు అతని కాంపౌండర్, మరియు అతని మిత్రుడైన భాయికృష్ణాజీ ఆలీబాగ్ కర్ అనే అతను వెంట వచ్చారు. షిరిడీలో వారు సగుణ్ మేరు నాయక్ కు, జి.కె. దీక్షిత్ కు సన్నిహితులయ్యారు. అనేక విషయాలు తమలో తాము చర్చంచుకుంటున్న సమయంలో సంభాషణ క్రమంలో బాబా ప్రప్రథమంలో షిరిడీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా పాదుకలు ఆ వేపచెట్టు క్రింద ప్రతిష్టించాలి అని నిశ్చయించుకున్నారు. పాదుకలను రాతితో చెక్కించడానికి నిర్ణయించుకున్నారు. ఈ సంగతి డాక్టరు రామారావు తెలిపితే ఆయన చక్కని పాదుకలు చెక్కిస్తారని భాయికృషజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా యిచ్చారు. అందరూ ఈ సలహాకి తమ సమ్మతి తెలిపారు. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టరుగారికి ఈ విషయం తెలిపారు. వారు వెంటనే మళ్ళీ షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించారు. ఖండోబా మందిరంలో ఉన్న ఉపాసనీ మహారాజ్ దగ్గరికి వెళ్ళి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపించారు. శ్రీ ఉపాసినీ దానిలో కొన్ని మార్పులను చేసి, పద్మం, శంఖం, చక్రం మొదలైనవి చేర్చి బాబా యోగశక్తిని వేపచెట్టు గొప్పతనాన్ని తెలిపే ఈ క్రింద శ్లోకాన్ని కూడా చెక్కించారు.

            సదా నింబవృక్షస్య మూలాధివాసాత్

          సుధా స్రావిణం తిక్తమష్యప్రియం తమ్ !

          తరుం కల్పవృక్షాధికం సాధయంతం

          నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ !!

ఉపాసినీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి, కాంపౌండర్ ద్వారా పంపించారు. శ్రావణ పౌర్ణమి రోజు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించారు. ఆనాడు 11 గంటలకు జి.కె. దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చారు. బాబా ఆ పాదుకలను స్పృశించి, అవి భగవంతుని పాదుకలని తెలిపారు. వాటిని వేపచెట్టు ముదట్లో ప్రతిష్టించమని ఆదేశించారు.

ఆ ముందురోజు బొంబాయి నుండి పాస్తాసేట్ అనే పార్సీ భక్తుడు ఒకడు మనీఆర్డరు ద్వారా 25 రూపాయలు పంపించాడు. బాబా ఆ పైకం పాదుక ప్రతిష్ఠకు అయ్యే ఖర్చు నిమిత్త్తం ఇచ్చారు. మొత్తం 100 రూపాయలు ఖర్చు అయ్యాయి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు. మొదటి 5 సంవత్సరాలు జి.కె. దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశారు. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖ్ డె అనే బ్రాహ్మణుడు (నానుమామా పూజారి) పూజ చేస్తుండేవారు. మొదటి 5 సంవత్సరాలు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారె దీపపు ఖర్చు నిమిత్తం పంపేవారు. పాడుకల చుట్టూ కంచే కూడా పంపించారు. ఈ కంచెను, పైకప్పును కోపర్ గావ్ స్టేషన్ నుండి షిరిడీ తీసుకురావడానికి 7-8-0 ఖర్చు సగుణ్ మేరు నాయక్ ఇచ్చారు. (ప్రస్తుతం జాఖ్ డె పూజ చేస్తున్నాడు. సగుణుడు నైవేద్యం, దీపాన్ని పెడుతున్నాడు). మొట్టమొదట భాయికృష్ణాజీ, అక్కల్ కోటకర్ మహారాజ్ భక్తుడు. 1912వ సంవత్సరంలో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు వెళ్తూ దారిమధ్యలో షిరిడీలో దిగారు. బాబాను  దర్శనం చేసుకున్న తరువాత అక్కల్ కోట గ్రామానికి వెళ్లాలని అనుకుని బాబా వద్దకు వచ్చి అనుమతి ఇవ్వమని అడిగాడు. బాబా ఇలా అన్నారు 'అక్కల్ కోటలో ఏమున్నది? అక్కడికి ఎలా వెళ్తావు? అక్కడ వుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు, వారే నేను''. ఇది విని భాయికృష్ణాజీ అక్కల్ కోటకు వెళ్ళడం మానుకున్నారు. పాదుకల స్థాపన తరువాత అనేకసార్లు షిరిడీ యాత్ర చేశారు. హేమాడ్ పంత్ కు ఈ వివరాలు తెలిసి ఉండవు. తెలిసి ఉంటే సచ్చరిత్రలో వ్రాయడం మానేసేవారు.

మొహియుద్దీన్ తో కుస్తీ - జీవితములో మార్పు

షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టడం వాడుకలో ఉండేది. అక్కడ మొహియుద్దీన్ తాంబోలి అనే అతను తరచుగా కుస్తీలు పడుతుండేవాడు. వాడికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి కుస్తీ పట్టారు. అందులో బాబా ఓడిపోవడంతో విరక్తి కలిగి తన దుస్తులను, నివశించే తీరును మార్చుకున్నారు. లంగోటి బిగించుకుని (ఫకీరులు ధరించే) ఒక గొనె ముక్కపై కూర్చునేవారు. చింకిగుడ్డలతో సంతోషపడేవారు. రాజ్యభోగం కంటే దారిద్ర్యమే మేలు అని అంటుండేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీలలో ప్రేమ. ఒకరోజు కుస్తీ పట్టు పడుతుండగా అతనికి వైరాగ్యం కలిగింది. అదే సమయంలో 'దేహమును దమించి, దేవుని సహవాసం  చేయమని' ఒక అశరీరవాణి అతనికి వినిపించింది. అప్పటినుండి గంగాగీరు సంసారాన్ని విడిచిపెట్టారు. ఆత్మసాక్షాత్కారం కోసం పాటుపడ్డారు. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠాన్ని స్థాపించి తన శిష్యులతో నివసిస్తూ ఉండేవారు. సాయిబాబా ప్రజలతో కలిసిమెలసి తిరుగుతుండేవారు కాదు. ఎవ్వరితోనూ తానంతట తాను మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పేవారు. రోజులో ఎక్కువ భాగం వేపచెట్టు నీడలో, అప్పుడప్పుడు ఊరు అవతల ఉన్న కాలువ ఒడ్డున ఉన్న తుమ్మచెట్టు నీడలో కూర్చునేవారు. సాయంకాలం ఊరికే కొంతదూరం నడిచేవారు. ఒక్కొక్కసారి నీంగావ్ వెళ్తూ ఉండేవారు. నీంగావ్ లో బాబాసాహెబ్ త్ర్యంబక్ జీ డేంగలే అనే అతని ఇంటికి తరచుగా వెళుతుండేవారు. బాబాసాహెబ్ డేంగలే అంటే సాయిబాబాకు అత్యంత ప్రేమ. అతని తమ్ముడి పేరు నానాసాహెబు. అతను రెండు వివాహాలు చేసుకున్నా సంతానం కలగలేదు. బాబా సాహెబు డేంగలే తన సోదరుని సాయిబాబా దగ్గరికి పంపించాడు. బాబా అనుగ్రహంతో నానా సాహెబుకు పుత్రసంతానం కలిగింది. అప్పటినుండి బాబాను దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా తరలిరావడం మొదలయ్యింది. వారి కీర్తి అంతటా వెళ్ళడయింది. ఆహ్మదునగరు వరకు వ్యాపించింది. అక్కడనుండి నానాసాహెబు ఛాందొర్కర్, కేశవ్ చిదంబర్ మొదలైన అనేకమంది షిరిడీకి రావడం ప్రారంభించారు. రోజంతా బాబాను భక్తులు చుట్టూ కూర్చుని ఉండేవారు. రాత్రులలో బాబా పాడుపడిన పాతమసీదులో పడుకునేవారు, పొగపీల్చుకునే 'చిలిం' గొట్టం, కొంచెం పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్నీ, తలగుడ్డ ఎప్పుడూ దగ్గర పెట్టుకునే 'సటకా' (చిన్న చేతికర్ర) మాత్రమే అప్పటిలో ఆయన దగ్గర ఉన్న వస్తువులు. తలపై ఒక గుడ్డ చుట్టి, దాని అంచులను జడలాగా మెలిపెట్టి ముడివేసి, ఎడమచెవిపై నుంచి వెనక్కి వ్రేళాడేలా వేసుకునేవారు. తమ దుస్తులను వారాల తరబడి ఉతకకుండా వుంచుకునేవారు. చెప్పులను తోడిగేవారు కాదు. రోజంతా గోనెగుడ్డపై కూర్చుని ఉండేవారు (కఫ్నీ క్రింద) లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకోవడానికి ధునికి ఎదురుగా (మసీదు ఈశాన్య భాగంలో ఉన్న) కొయ చేపట్టుపై తమ ఎడమచేతిని ఆనించి, దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారాన్ని, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి 'అల్లాయే యజమాని' అని పలుకుతుండేవారు. మసీదులో రెండు గదుల స్థలం మాత్రమే ఉండేది. భక్తులందరూ అక్కడే బాబాను దర్శించుకునేవారు. 1912వ సంవత్సరం తరువాత మసీదుకు కొన్ని మార్పులు చేయబడ్డాయి. పాత మసీదును మరమత్తు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపడం చేశారు. బాబా ఈ మసీదుకు రాక పూర్వమే 'టాకియా' (రచ్చ)లో చాలాకాలం నివశించారు. బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జెలు కట్టుకొని సోగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడుతూ ఉండేవారు.

నీళ్ళను నూనెగా మార్చుట

సాయిబాబాకు దీపాలు అంటే చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించే షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదులోపల రాత్రి అంతా దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. కొన్నాళ్ళు ఇలా జరిగింది. ఒకరోజు నూనె ఇచ్చే షావుకార్లు అందరూ కూడబలుక్కుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణాలకు ఎప్పటిలా వెళ్ళినప్పుడు దుకాణాదారులు నూనె లేదని చెప్పారు. బాబా కలత చెందకుండా వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచారు. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతా గమనిస్తూ ఉన్నారు. అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి వున్న తమ రేకుడబ్బాలో నీటిని పోసి కలియబెట్టి, ఆ నీటిని త్రాగేశారు. ఈ విధంగా ఆ రేకుడబ్బాలో నూనె అవశేశాన్ని పావనం చేసిన తరువాత, మళ్ళీ డబ్బాతో నీరు తీసుకుని, ఆ నీటిని ప్రమిదలలో నింపారు. దూరంగా వుండి దీన్ని పరీక్షిస్తున్న దుకాణాదారులు విస్మయం చెందేలా ప్రమిదలు అన్నీ తెల్లవారే వరకూ చక్కగా వెలుగుతూనే ఉన్నాయి. ఇదంతా చూసి ఆ షావుకార్లు పశ్చాత్తాప పడి బాబాని మన్నించమని కోరుకున్నారు. బాబా వారిని క్షమించి ఇకపై అయినా సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండమని హితవు చెప్పి పంపించేశారు.

జోహారు ఆలీ అనే కపట గురువు

పైన వివరించిన కుస్తీ జరిగిన అయిదేళ్ళ తరువాత అహమదునగరు నుండి జోహారు అలీ అనే ఫకీరు ఒకడు శిష్యులతో రహతా వచ్చాడు. వీరభద్ర మందిరానికి సమీపంలో ఉన్న స్థలంలో దిగాడు. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురాను అంతా వల్లించగలడు, మధురంగా మాట్లాడేవాడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి అతడిని సన్మానిస్తూ గౌరవంతో చూస్తుండేవారు. వారి సహాయంతో వీరభద్ర ఆలయానికి దగ్గరగా 'ఈద్ గా' అనే గోడను నిర్మించడానికి పూనుకున్నాడు. ఈదుల్ ఫితర్ అనే పండగరోజు మహమ్మదీయులు నిలుచుని ప్రార్థించే గోడనే 'ఈద్ గా'. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారి తీసింది. దానితో జోహారు అలీ రహతా విడిచి, షిరిడీ చేరుకొని, బాబాతో మసీదులో నివశించసాగాడు. ప్రజలు వాడి తీపి మాటలకు మోసపోయారు. అతను బాబాను తన శిష్యుడు అని చెప్పేవాడు. బాబా అందుకు అడ్డు చెప్పకుండా శిష్యుడిలాగా మెలిగేవారు. తరువాత గురుశిష్యులు ఇద్దరూ రహతాకు వెళ్ళి అక్కడ నివశించాలని నిశ్చయించుకున్నారు. గురువుకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండా వుండేది. శిష్యుడికి మాత్రం గురువుని ఎప్పుడూ అగౌరపరచకుండా, శిష్యధర్మాన్ని శ్రద్ధగా చేస్తుండేవారు. అప్పుడప్పుడు వారిద్దరూ షిరిడీకి వచ్చి వెళుతూ ఉండేవారు. కాని ఎక్కువగా రహతాలోనే నివశించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండటం ఎంతమాత్రం యిష్టం ఉండేది కాదు. అందుకే వారందరూ కలిసి సాయిబాబాను మళ్ళీ షిరిడీకి పిలుచుకుని రావడానికి రహతా వెళ్ళారు. వారు రహతాలో ఈద్ గా దగ్గర బాబాను ఒంటరిగా చూసి, వారిని తిరిగి షిరిడీ తీసుకుని వెళ్ళడానికి వచ్చామని చెప్పారు. జోహార్ ఆలీ ముక్కోపి అనీ, ఆయన తనను విడిచి పెట్టడనీ, అందువల్ల వారు తన కోసం ఆశ వదలుకొని, ఫకీరు అక్కడకు వచ్చేలోపునే షిరిడీకి వెనక్కి వెళ్ళటం మంచిదని బాబా వారికి సలహా యిచ్చారు. వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే జోహార్ ఆలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న షిరిడీ ప్రజలపై మండిపడ్డాడు. కొంత వాదోపవాదాలు జరిగిన తరువాత గురుశిష్యులు ఇద్దరూ తిరిగి షిరిడీ వెళ్ళడానికి నిర్ణయమైంది. వారు షిరిడీ చేరి అక్కడే నివశిస్తూ ఉండేవారు. కొన్ని రోజుల తరువాత దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయట పెట్టాడు. చాంద్ పాటిల్ పెళ్ళి బృందంతో బాబా షిరిడీ రావడానికి 12 సంవత్సరాల ముందే పదిపన్నెండేళ్ళ వయసులో దేవీదాసు షిరిడీ చేరారు. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్టవం, తేజోవంతమైన నేత్రాలు కలిగి, నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞానిలా కనపడుతుండేవారు. తాత్యా పాటీల్, కాశీనాథ్ షింపీ మొదలైన అనేకమంది దేవీదాసును తమ గురువుగా భావిస్తూ ఉండేవారు. వారు జోహార్ ఆలీని దేవీదాసు దగ్గరకు తీసుకుని వచ్చారు. వారి మధ్య జరిగిన వాదనలో జోహార్ అలీ చిత్తుగా ఓడిపోయి, షిరిడీ నుండి పారిపోయాడు. అపై అతడు వైజాపూరులో నుండి, చాలా ఎ తరువాత ఏళ్ల తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. తాను గురువు, సాయిబాబా శిష్యుడు అనే భ్రమ వాడి మనస్సులోనుండి తొలగిపోయి, తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందాడు. సాయిబాబా వాడిని యథారీతిగా గౌరవంగానే చూశారు. ఈ విధంగా శిష్యుడు గురువును ఎలా సేవించాలో, ఎలా అహంకార మమకారాలను విడిచి గురు శుశ్రూష చేసి చివరికి ఆత్మసాక్షాత్కారాన్ని ఎలా పొందాలో బాబా ఆచరణాత్మకంగా నిరూపించారు. ఈ కథ భక్త మహాల్సాపతి చెప్పిన వివరాల ఆధారంగా రాయబడింది.

అయిదవ అధ్యాయం సంపూర్ణం

ఆరవ అధ్యాయం

0 Comments To "Saibaba Satcharitra 5 Adhyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!