Saibaba Satcharitra 9 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

తొమ్మిదవ అధ్యాయం

షిరిడీ సందర్శనలోని ఒక ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే, బాబా అనుమతి లేనిదే ఎవరూ షిరిడీ విడిచిపెట్టేవారు కాదు. బాబా అనుమతి లేకుండా ఎవరైనా షిరిడీ విడిచిపెట్టి వెళితే, వారు ఊహించని కష్టాలను కొనితెచ్చుకునేవారు. బాబా ఎవరినైనా బయలుదేరమని శెలవిచ్చిన తరువాత ఇక షిరిడీలో ఉండకూడదు. శెలవు తీసుకోవడానికి బాబా దగ్గరికి భక్తులు వెళ్ళినప్పుడు బాబా వారికి స్పష్టంగానో లేక సూచనప్రాయంగానో కొన్ని సలహాలను ఇస్తూ ఉండేవారు. బాబా ఆదేశానుసారం నడవవలసిందే. వ్యతిరేకంగా వెళితే ప్రమాదాలు ఏవో ఎదురు అయ్యేవి. దీనికి సంబంధించి ఉదాహరణలు కొన్ని ఇస్తున్నాను.

తాత్యాకోతె పాటీల్

తాత్యాకోతె పాటిల్ ఒకరోజు కోపర్ గావ్ లో జరిగే సంతకు బయలుదేరాడు. హడావుడిగా మసీదుకు వచ్చి, బాబాకు నమస్కరించి కోపర్ గావ్ సంతకు వెళుతున్నాను అని చెప్పాడు. బాబా అతనితో 'తొందర పడవద్దు! కొంచెం ఆగు, సంత సంగతి అలా ఉండనివ్వు! ఊరు విడిచి అసలు బయటికి ఎక్కడికీ వెళ్ళరాదు' అని చెప్పారు. సంతకు వెళ్ళాలనే తాత్యా ఆతృతను చూసి కనీసం శ్యామాని (మాధవరావు దేశ్ పాండే)అయినా వెంట తీసుకుని వెళ్ళమని బాబా చెప్పారు. బాబా మాటలను లెక్కచేయకుండా తాత్యా హుటాహుటిన టాంగా ఎక్కి కోపర్ గావ్ బయలుదేరాడు. టాంగాకు కట్టిన రెండు గుఱ్ఱాలలో ఒకటి మూడు వందల రూపాయల ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. చాలా చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది అమిత వేగంగా పరుగెత్తసాగింది. కొంతదూరం వెళ్ళిన తరువాత కాలు మడతపడి అది కూలబడింది. తాత్యాకు పెద్ద దెబ్బలేవీ తగలలేదు కానీ, తల్లిలా ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞాపకానికి వచ్చింది. మరొక్కప్పుడు కూడా, ఇలాగే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామానికి ప్రయాణమై, దారిలో టాంగా ప్రమాదానికి గురయ్యాడు.

ఐరోపా దేశస్థుని ఉదంతము

బొంబాయి నుండి ఐరోపాదేశస్థుడు ఒకడు ఎదో ఉద్దేశ్యంతో బాబా దర్శనార్థం షిరిడీ వచ్చాడు. తనతో నానాసాహెబు ఛాందొర్కర్ దగ్గరనుంచి తనను గురించి ఒక పరిచయ పత్రాన్ని కూడా తీసుకునివచ్చాడు. అతని కోసం ఒక ప్రత్యేక గుడారాన్ని వేసి, అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేశారు. బాబా ముందు మోకరిల్లి, వారి చేతిని ముద్దాడాలనే కోరికతో అతను మూడుసార్లు మసీదులో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కాని బాబా అతన్ని మసీదులో ప్రవేశించడాన్ని నిషేధించారు. క్రింద మసీదు ముందు ఉన్న బహిరంగ ఆవరణలో కూర్చునే తనను దర్శించుకోవచ్చు అని చెప్పారు. అతను తనకు జరిగిన మర్యాదకు అసంతృప్తి చెంది వెంటనే షిరిడీ వదిలి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. బాబా సెలవు పొందడానికి వచ్చాడు. తొందరపకడక మరుసటి రోజు వెళ్ళమని బాబా చెప్పారు. ఆ సలహాలను ఖాతరు చేయకుండా అతను టాంగా ఎక్కి షిరిడీ నుండి బయలుదేరాడు. మొదట గుఱ్ఱాలు బాగానే పరిగెత్తాయి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసమయానికి ఒక సైకిలు అతని టాంగాకి ఎదురువచ్చింది. దాన్ని చూసి గుఱ్ఱాలు బెదిరిపోయాయి. టాంగా తలక్రిందులయ్యింది. ఫలితంగా గాయాలను మాన్చుకోవడానికి కోపర్ గావ్ లో ఆసుపత్రి పాలయ్యాడు. ఇటువంటి అనేక సంఘటనల మూలంగా బాబా ఆజ్ఞను ధిక్కరించినవారు ప్రమాదాలకు గురవుతారని, బాబా ఆజ్ఞానుసారం వెళ్ళేవారు సురక్షితంగా ఉంటారని ప్రజలు గ్రహించారు.

భిక్ష యొక్క ఆవశ్యకత

బాబాయే భగవంతుడు అయితే వారు భిక్షాటనతో ఎందుకు జీవితం అంతా గడపాలి? అనే సందేహం చాలా మందికి కలగవచ్చు. దీనికి (1) భిక్షాటన చేసి జీవించే హక్కు ఎవరికి ఉంటుంది? (2) పంచసూనములు, వాటిని పోగొట్టుకునే మార్గం ఏది? అనే ప్రశ్నలకు వచ్చే సమాధానంతో సమాధానపడుతుంది. సంతానం, ధనం కీర్తి సంపాదించడంలో అపేక్ష వదలుకొని సన్యసించేవారు భిక్షాటనతో జీవించవచ్చు అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వారు ఇంటి దగ్గర వంట ప్రయత్నాలు చేసుకుని తినలేరు. వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థులపై ఉంది. సాయిబాబా గృహస్థుడు కాదు, వానప్రస్థుడు కూడా కారు, వారు అస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యం నుంచి బ్రహ్మచర్యాన్నే అవలంభిస్తూ ఉన్నారు. ఈ సకల జగత్తు అంతా ఆధారపడి ఉంది. వారు పరబ్రహ్మస్వరూపులు. కాబట్టి భిక్షాటన చేసే హక్కు సంపూర్ణంగా ఉంది. పంచాసూనాములు, వాటిని తప్పించుకునే మార్గం గరించి ఆలోచిద్దాము. భోజపదార్థాలు తయారు చేసుకోవడానికి గృహస్థులకు అయిదు పనులు తప్పకుండా చేయాలి. అవి ఏమిటంటే (1) దంచడం, రుబ్బడం (2) విసరడం (3) పాత్రలను తోమడం (4) ఇళ్ళు ఊడ్చడం, తుడవడం  (5) పొయ్యి అంటించడం. ఈ అయిదు పనులు చేసే సమయంలో అనేక క్రిమికీటకాదులు మరణించడం తప్పదు. గృహస్థులు ఈ పాపాన్ని అనుభవించాలి. ఈ పాపపరిహారానికి మన శాస్త్రాలు ఆరు మార్గాలు ప్రబోధిస్తున్నాయి. (1) బ్రహ్మ యజ్ఞం (2) వేదాధ్యయనం (3) పితృ యజ్ఞం (4) దేవ యజ్ఞం (5) భూత యజ్ఞం (6) అతిథి యజ్ఞం. శాస్త్రాలు విధించిన ఈ యజ్ఞాలు నిర్వర్తిస్తే గృహస్థుల మనస్సులు పాపరహితాలు అవుతాయి. మోక్షసాధనానికి, ఆత్మసాక్షాత్కారానికి ఇవి తోడ్పడతాయి. బాబా ఇంటింటికీ వెళ్ళి భిక్ష అడగటంలో, ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞాపకానికి తెచ్చినట్లు అయింది. తమ ఇంటి గుమ్మం దగ్గర యింత గొప్ప ప్రబోధాన్ని పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు!

భక్తుల అనుభవాలు

శ్రీకృష్ణుడు భగవద్గీత (9 అంకం 26 శ్లోకం) లో 'శ్రద్ధాభక్తులతో ఎవ్వరైనా పత్రన్నిగాని, పుష్పాన్నిగాని, ఫలాన్నిగాని లేదా నీళ్ళుగాని సమర్పిస్తే దానిని నేను గ్రహిస్తాను' అని చెప్పారు. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమైన విషయం ఏమిటంటే, తమ భక్తుడు ఏదైనా తనకు సమర్పించాలని అనుకుని, ఏ కారణం చేతనైనా ఆ విషయాన్ని మరచిపోతే, అలాంటివాడికి బాబా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించేవారు. అలాంటి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోతున్నాను.

తర్ఖడ్ కుటుంబము

రామచంద్ర ఆత్మారామ్ ఉరఫ్ బాబా సాహెబు తర్ఖడ్ ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడు అయినా, తరువాత బాబా ప్రియభక్తుడు అయ్యాడు. వారి భార్యాపుత్రులు కూడా బాబాను అమితంగా ప్రేమిస్తూ ఉండేవారు. ఒకసారి తల్లీ, కొడుకులు షిరిడీకి చేరుకొని అక్కడ వేసవి సెలవులు గడపాలని నిర్ణయించుకున్నారు. షిరిడీ వెళ్ళడానికి సంతోషదాయకమైనా, కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణం ఏమిటి అని తండ్రి ప్రార్థన సమాజానికి చెడినవాడు కావడంతో ఇంటి దగ్గర బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాడు. కానీ బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగా చేస్తానని తండ్రికి వాగ్థానం చేయడంతో బయలుదేరాడు. శుక్రవారం రాత్రి తల్లీ, కొడుకు బయలుదేరి షిరిడీ చేసుకున్నారు. ఆ మరుసటి శనివారం రోజు తండ్రి అయిన తర్ఖడ్ పెందలాడక ముందే నిద్రలేచి స్నానం చేసి, పూజను ప్రారంభించడానికి ముందు బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి, ఎదో లాంచనంగా కాకుండా, తన కుమారుడు చేసేలాగా పూజని శ్రద్ధగా తనతో చేయించవలసిందిగా ప్రార్థించాడు. ఆనాటి పూజను సమాప్తం చేసి నైవేద్యంగా కలకండను అర్పించాడు. భోజన సమయంలో దాన్ని పంచిపెట్టాడు. ఆ రోజు సాయంత్రం, ఆ మరుసటి రోజున అంటే ఆదివారం రోజు, పూజ అంతా సవ్యంగా జరిగింది. సోమవారం కూడా చక్కగా గడిచింది. వాగ్థానం చేసినట్లు సరిగ్గా జరుగుతున్నందుకు సంతోషించాడు. మంగళవారం రోజు పూజను ఎప్పటిలా చేసి కచేరికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకపోవడం గ్రహించాడు. నౌకరుని అడిగితే ఆనాడు నైవేద్యం ఇవ్వడం మరచిపోవడంతో ప్రసాదం లేదని బదులు చెప్పాడు. ఆ సంగతి వినగానే భోజనానికి కూర్చున్న ఆత్మారామ్ వెంటనే లేచి, బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి, బాబాను క్షమాపణ కోరుకున్నాడు. బాబా తనకు ఆ విషయం జ్ఞాపకానికి తీసుకుని రానందుకు నిందించాడు. ఈ సంగతులన్నీ షిరిడీలో ఉన్న తన కొడుకుకి వ్రాసి, బాబాను క్షమాపణ వేడుకోమన్నాడు. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగింది. అదే సమయంలో షిరిడీలో, మధ్యాహ్న హారతి ప్రారంభించడానికి ముందు, ఆత్మారాముని భార్యతో బాబా ఇలా అన్నారు 'తల్లీ! ఏమయినా తినాలనే ఉద్దేశ్యంతో బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళాను, తలుపుకి తాళం వేసి వుంది, ఎలాగోలా లోపలికి ప్రవేశించాను. కాని అక్కడ తినడానికి ఏమీ లేకపోవడంతో తిరిగి వచ్చాను' అన్నారు. బాబా మాటలు ఆమెకి ఏమీ బోధపడలేదు. కాని ప్రక్కనే వున్న కుమారుడు మాత్రం ఇంటి దగ్గర పూజలో ఎదో లోటుపాట్లు జరిగాయని గ్రహించి, యింటికి వెళ్ళడానికి సెలవు యివ్వమని బాబాను వేడుకున్నాడు. అందుకు బాబా పూజను అక్కడే చేయమనీ, యింటికి వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పారు. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయాన్నంతా వివరంగా తండ్రికి ఉత్తరం వ్రాసి ,బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకున్నాడు. ఈ రెండు ఉత్తరాలు ఒకదానికొకటి మార్గమధ్యంలో తటస్థపడి తమ తమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి. ఇది ఆశ్చర్యం కదా!

 ఆత్మారాముని భార్య

ఇక ఆత్మారాముని భార్య విషయం. ఒకసారి ఆమె మూడు పదార్థాలను బాబాకు నైవేద్యం పెడతానని సంకల్పించుకుంది. అవి (1)  వంకాయ పెరుగుపచ్చడి  (2) వంకాయ వేపుడు కూర (3) పేడా. బాబా వీటిని ఎలా గ్రహించారో చూద్దాం.

బాంద్రా నివాసి అయిన రఘువీర భాస్కర పురంధరే బాబాకు అత్యంత భక్తుడు. అతను ఒకసారి భార్యతో షిరిడీకి బయలుదేరుతున్నాడు. ఆత్మారాముని భార్య పెద్దవంకాయలు రెండింటిని అత్యంత ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికి యిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడి, రెండవ దానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని వేడుకుంది. షిరిడీ చేరుకున్న వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రమే చేసి బాబా భోజనానికి కూర్చున్న సమయంలో తీసుకుని వెళ్ళింది. బాబాకి ఆ పచ్చడి చాలా రుచిగా వుంది. కాబట్టి దాన్ని అందరికీ పంచిపెట్టారు. వెంటనే, తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగారు. ఈ సంగతి భక్తులు రాధాకృషమాయికి తెలియపరిచారు. అది వంకాయాల కాలం కాదు కాబట్టి ఆమెకి ఏం తోచకుండా అయ్యింది. వంకాయలు సంపాదించడం అనేది ఆమెకు సమస్యగా మారింది. వంకాయ పచ్చడి తెచ్చింది ఎవరని కనుక్కుంటే పురంధరుని భార్య అని తెలియడంతో వంకాయ వేపుడు కూడా ఆమె చేసి పెట్టాలని ఆమెకు కబురు పంపారు. అప్పుడందరికీ వంకాయ వేపుడుని బాబా ఎందుకు కోరుకున్నారో తెలిసింది. బాబా సర్వజ్ఞతకు ఆనందాశ్చర్య పడ్డారు.

1915 డిసెంబరులో గోవింద బలరాంమాన్ కర్ అనే అతను షిరిడీకి వెళ్ళి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయాలని అనుకున్నాడు. ప్రయాణానికి పూర్వం ఆత్మారాముని దగ్గరకి వచ్చాడు. ఆత్మారాం భార్య బాబా కోసం ఏమైనా పంపించాలి అనుకుని ఇల్లంతా వెదికింది. కాని ఒక్క పేడా తప్ప ఏమీ కన్పించలేదు. ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి వుంది. తండ్రి మరణించటంతో గోవిందుడు విచారగ్రస్థుడై ఉన్నాడు కానీ బాబా అంటే ఉన్న భక్తీప్రమలతో ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపించింది. బాబా దాన్ని పుచ్చుకుని తింటారని నమ్మకం వుంది. గోవిందుడు షిరిడీ చేరాడు. బాబాను దర్శించుకున్నాడు. కానీ, పేడా తీసుకొని వెళ్ళడం మరచిపోయాడు. బాబా అప్పటికి ఊరుకున్నారు. సాయంత్రం బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అతను పేడా తీసుకొని వెళ్ళడం మరచిపోయాడు. అప్పుడు బాబా ఓపిక పట్టకుండా తనకోసం ఏం తెచ్చావు అని అడిగారు. ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబు ఇచ్చాడు. వెంటనే బాబా 'నీవు ఇంటి దగ్గర బయలుదేరుతున్న సమయంలో ఆత్మారాముని భార్య నాకోసం నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా?' అని అడిగారు. కుర్రవాడికి అదంతా జ్ఞాపకం తెచ్చుకుని సిగ్గుపడ్డాడు. బాబాను క్షమాపణ కోరాడు. బసకు పరుగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికి ఇచ్చాడు. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కున మింగేశారు. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించారు. 'నా భక్తులు నన్ను ఎలా భావిస్తారో, నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను' అనే గీతావాక్యం (4-11) నిరూపించారు.

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టడం ఎలా?

ఒకప్పుడు ఆత్మారామ్ తర్ఖడ్ భార్య షిరిడీలో ఒక యింట్లో దిగింది. మధ్యాహ్న భోజనం తయారయ్యింది. అందరికీ వడ్డించారు. ఆకలితో ఉన్న ఒక కుక్క ఒకటి వచ్చి మొరగడం ప్రారంభించింది. వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టెముక్కను విసిరింది. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినేసింది. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు వెళ్ళగా బాబా ఆమెతో ఇలా అన్నారు 'తల్లీ! నాకు కడుపునిండా గొంతువరకూ భోజనం పెట్ట్టావు. నా జీవశక్తులు సంతృప్తి చెందాయి. ఎల్లప్పుడూ ఇలాగే చెయ్యి. ఇది నీకు సద్గతి కలిగిస్తుంది. ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడూ అసత్యం చెప్పను. నాయందు ఇలాగే దయ ఉంచు. మొదట ఆకలితోనున్న జీవికి భోజనం పెట్టిన తరువాత నీవు భుజించు. దీనిని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచు.' ఇదంతా ఆమెకు బోధపడలేదు. కాబట్టి ఆమె యిలా జవాబు ఇచ్చింది 'బాబా! నేను నీకు ఎలా భోజనం పెట్టగలను? నా భోజనం కోసమే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బులు యిచ్చి భోజనం చేస్తున్నాను.' దానికి బాబా ఇలా జవాబు ఇచ్చారు 'నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టెముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు తీస్తున్నాను. నీ భోజనానికి ముందే ఆ కుక్కను నీవు చూసి రొట్టె పెట్టావో అదీ నేను ఒక్కటే. అలాగే, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలైనవి అన్నీ నా అంశాలే. నేనే వాటి ఆకారంలో తిరుగుతున్నాను. కాబట్టి నేను వేరు తక్కువ జీవరాశి అంతా వేరు అనే ద్వంద్వభావమనే భేదం విడిచి నన్ను సేవించు' ఈ అమృత తుల్యమైన మాటలు ఆమె హృదయాన్ని ఎంతగానో కదిలించాయి. ఆమె నేత్రాలు అశ్రువులతో నిండాయి, గొంతు గద్గదమయ్యింది, ఆమె ఆనందానికి అంతులేకుండా పోయింది.

నీతి

జీవులన్నిటిలో భగవంతుడిని దర్శింపుము' అనేది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతం మొదలైనవి అన్నీ భగవంతుడిని ప్రతిజీవిలో చూడమని ప్రభోదిస్తున్నాయి. ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణ వల్ల, ఇతర అనేక భక్తుల అనుభవాల వలన సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధాలను, తమ ఆచరణ రూపంలో చూపించి, అనుభవపూర్వకంగా నిర్థారణ చేసి ఉన్నారని స్పష్టం అవుతుంది. ఉపనిషాధి గ్రంథాలలో ప్రతిపాదించబడిన తత్వాన్ని అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీసాయిబాబా.

తొమ్మిదవ అధ్యాయం పరిపూర్ణం 

 

0 Comments To "Saibaba Satcharitra 9 Adhyayam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!