Adi Shankaracharya Jayanti

ఆది శంకరాచార్య జయంతి

శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతంపై ఉన్న శివుడిని ప్రార్థించగా ప్రసన్నుడైన పరమేశ్వరుడు పుత్ర సంతానాన్ని ప్రసాదించాడు. పార్వతీదేవి, సుబ్రహ్మణ్యస్వామికి ఏ విధంగా జన్మ యిచ్చిందో అదే విధంగా ఆర్యమాంబ శంకరులకు జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అని అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్యకాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలు ఉన్నాయి. శంకరులు సాక్షాత్తు శివుని అవతారం అని నమ్మకం ఉంది. కంచి మఠం ప్రకారం శంకరులు రెండు వేల సంవత్సరాలకు పూర్వం అంటే క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.

            దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే

            ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః

దుష్టాచారాలను నశింప చేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు (శివరహస్యం)

            కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః

            శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా

శ్రౌత,స్మార్త  క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం).

శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కుమారుడైన శంకరుల పోషణ బాధ్యతలను స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించారు. శంకరులు ఏకసంథాగ్రాహి కావడంతో బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకనాడు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగారు. పేదరాలైన ఆ ఇల్లాలు ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన శ్రీలక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు వర్షింప చేసింది. ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణానది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారడంతో గ్రామప్రజలు శంకరులు జరిపిన ఈ కార్యానికి ఆశ్చర్యచికితులయ్యారు. సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరిది అయిపోతానన్న కారణంతో ఒప్పుకోలేదు. శంకరులు ఒకరోజు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలో అయినా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరారు. దానికి అంగీకరించింది ఆర్యమాంబ. దాన్ని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా మొసలి శంకరులను వదిలివేసింది. శంకరులు గురువు కోసం అన్వేషణ చేస్తూ ఉత్తర భారత యాత్ర చేసే ఆలోచనలో తల్లి అనుమతి కోరుతూ 'ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యాసమయాలలో ఏ సమయంలో అయినా, స్పృహలో ఉన్నప్పుడూ, స్పృహ లేనప్పుడూ నన్ను తలచుకోగానే నీ దగ్గరికి వస్తాను అని తల్లి ఆర్యమాంబకు మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాను' అని చెప్పారు. తల్లి దగ్గర అంగీకారం తీసుకుని శంకరులు కాలినడకన గురువు కోసం అన్వేషణలో నర్మదా నది దగ్గరికి వెళ్ళారు. నర్మదా ఒడ్డున గౌడపాదుల శిష్యుడు అయిన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడు అయిన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరునికి అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయి గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చేయగా గోవింద భగవత్పాదులు ఎవరు నువ్వు అని అడిగారు. శంకరులు దశస్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.

            భూమిర్నతోయం తేజో నవాయుర్మఖంనేంద్రియం వా తేషాం సమూహః

            అనైకాంతి కత్వా త్సుశుష్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివః కేవలోహం

నేను నింగిని కాదు, భూమిని కాదు, నీటిని కాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తంగాని లేనివాడిని. నేను శివుడను, విభజనలేని జ్ఞాన సారాన్ని అటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవింద భగవత్పాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు …

            ' ప్రాహ శంకర శంకర ఏవ సాక్షాత్' (సాక్షాత్తు భూమికి దిగివచ్చిన పరమశివుడే ఈ శంకరుడు).

శంకరులు మొట్టమొదటిసారిగా గోవిందభగవత్పాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తుంది. గురు సేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి చాటి చెప్పారు. గోవిందభగవత్పాదులు, శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహా వాక్యాలుగా బోధించారు. ఒక రోజు నర్మదా నదికి వరద వచ్చి పొంగి పొర్లుతూ గోవిందపాదుల తపస్సుకు భంగం కలిగించ బోతుండగా శంకరులు తన ఓంకార శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల దగ్గర విద్యను అభ్యసించిన తరువాత గురువాజ్ఞతో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానం చేసి, విశ్వేశ్వరుడి సన్నిధిలో కొంతకాలం గడిపారు. వేద సూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతం అయ్యాయి. శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన దగ్గరికి వచ్చి నేను బ్రాహ్మణుడిని, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ దగ్గర శిష్యుడిగా ఉండే వరం ప్రసాదించమని వేడుకున్నాడు. ఆ విధంగా శంకరులకు అత్యంత ఆత్మీయుడిగా మారడంతో మిగిలిన శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. ఇది గమనించిన శంకరులు వారిలో ఉన్న అసూయను పారద్రోలాలని నిర్ణయించుకుని ఒక రోజు గంగానదికి అవతల ప్రక్కన ఉన్న సదానందుడిని రమ్మని పిలిచారు. వెంటనే సదానందుడు నదిమీద నడుచుకుంటూ ఇవతల ప్రక్కకి వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు తీసి అడుగు వేసిన చోట్ల మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన సాటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటినుండి సదానందుడు 'పద్మపాదుడు' అయ్యాడు. పద్మపాదుడికి సంబంధించి మరొక కథ ప్రచారంలో ఉంది. శంకరులు శ్రీశైల పరిసరాలలో చాలా కాలం తపస్సు చేశారు. శంకరులు తపస్సు చేసుకుంటూ ఉన్న పరిసరాలలో హిందూ ధర్మప్రచారం చేస్తున్న కాలంలో శంకరుడు చేసే కార్యాలు నచ్చని కొందరు ఆయనని అంతమొందించాలనే ప్రయత్నంలో ఆ పరిసరాలలో భీభత్సం సృష్టిస్తున్న ఒక పెద్ద దొంగలముఠా నాయకుడిని రెచ్చగొట్టి కొంత ధనం ఇచ్చి పంపించారు. ఆ నాయకుడు పెద్ద కత్తితో మాటువేసి తపస్సు చేసుకుంటున్న శంకరుల వెనుకగా ఒక వేటుతో తల ఎగరగొట్టే ప్రయత్నంలో ముందుకు ఉరికాడు. ఆ సమయంలో పద్మపాదుడు మల్లిఖార్జునుడి దేవాలయంలో ఈశ్వరుడిని ధ్యానిస్తూ కూర్చుని ఉన్నాడు. ఈశ్వరుడినే మనసులో ఉంచి ధ్యానం చేస్తున్న అతనికి హఠాత్తుగా ఈ దృశ్యం కనిపించింది. వెంటనే అతడు మహో ఉగ్రుడై శ్రీలక్ష్మీనృశింహుడిని వేడుకోవడం ప్రారంభించాడు. అంతే ఎటువైపు నుండి వచ్చిందో ఒక సింహం దాడి చేసి దొంగలముఠానాయకుడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చి ఎలా వచ్చిందో అలాగే మాయమైంది. తరువాత మిగిలిన శిష్యులకు ఈ విషయం తెలిసి పద్మపాదుడి శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు. ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్న కాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగానది వైపు వెళుతుండగా మధ్య దారిలో నాలుగు కుక్కలతో ఒక ఛండాలుడు అడ్డుపడ్డాడు. అప్పుడు శంకరులు ఆయన శిష్యులు ప్రక్కకు తప్పుకోమని కోరగా ఆ ఛండాలుడు ఈ విధంగా అడిగాడు …

            అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమెవచైతన్యాత్

            ద్విజపర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గుచ్ఛ గచ్ఛతి 

సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడిలోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా లేక లోపల ఉన్న ఆత్మనా? ఆ విధంగా  అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు. అ మాటలు విన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరులకు పరమశివుడు తరువాతి కర్తవ్యాన్ని వివరించాడు. వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేలా ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేలా ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలుమూలలకు శిష్యులను పంపించాలి. కర్తవ్యాన్ని బోధించిన పరమశివుడు ఆ పనులు అయిన తరువాత నన్ను చేరుకుంటావు అని చెప్పి అంతర్థానం అయ్యాడు. శివుడి కర్తవ్య బోధనకు శంకరులు గంగానదిలో స్నానం చేసి కాశీ నుండి బదిరికి బయలుదేరారు. బదిరిలో ఉన్న పండితుల, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నప్పుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు.  దీనినే ప్రస్థానత్రయం అని అంటారు. తరువాత శంకరులతో విభేదించిన వారికి కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయోగపడ్డాయి. తరువాత బదిరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము, లలితా త్రిశతిలకు కూడా భాష్యాలు వ్రాశారు. ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన  భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా, శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ'మని వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు 'లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. శంకరుడు దేశం నాలుగు మూలలలో నాలుగు మఠాలను స్థాపించాడు. వీటిని చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుని వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకు తార్కాణం. అవి హిందూధర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి. సుస్థిరం చేయడానికి, వ్యాప్తిచేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి నుండి నేటివరకూ అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరుడు ఎంత పటిష్ఠంగా నిర్మించాడో తెలుస్తుంది. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలుగా పనిచేశాయి. శంకరులు మఠ నిర్వహణ కొరకు నియమించబడే సన్యాసుల నామాంతరము యోగపట్టము అనే దాన్ని ప్రవేశపెట్టాడు. హిందూ ధర్మం ప్రకారం సన్యాసం తీసుకున్న వ్యక్తి యొక్క పాతపేరు తీసేసి 'సన్యాసి' అని సూచించే కొత్తపేరును తీసుకుంటాడు. అటువంటి ప్రత్యేకమైన నామాన్ని యోగపట్టము అని అంటారు. అటువంటి పది పేర్లను శంకరులు నిర్దేశించాడు. అవి తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. శంకరుల మనోగతం బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బలప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు. ఆది శంకరుడు వివిధ శాఖలకు చెందిన పండితులను ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించాడు. భగవంతుడిని నమ్మే వారందరినీ షన్మత వ్యవస్థలోకి ఏకీకృతులను చేశాడు. వేదాలకు తరిగినగౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశాడు.

శంకరుని గురించిన ఒక సుప్రసిద్ధ శ్లోకం …

            శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం

            నమామి భగవత్పాద శంకరం లోక శంకరం.  

కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుని ప్రభావం హిందూమతంపై అనన్య సామాన్యమైనది కాదు నేటికీ సంతులు, స్మార్తులు శంకరులు నెలకొలిపిన సంప్రదాయాలను ఆచరిస్తారు. శంకరులు గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈ నాటికీ ఉపయోగపడుతున్నాయి. 

0 Comments To "Adi Shankaracharya Jayanti"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!