Buddha Purnima

బుద్ధ పూర్ణిమ

సిద్ధార్థ గౌతముడు నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు, బుద్ధ ధర్మానికి మూల కారకులు. బుద్దుడు 20వ శతాబ్దపు చారిత్రకారులు క్రీ.పూ. 563 నుండి 483 మధ్యలో జననం, 410-400  మధ్యలో పరమపదించి ఉండవచ్చు అని భావిస్తున్నారు కానీ ఎవరూ దానిని ఆమోదించలేదు. సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. గౌతమ అనేది సిద్ధార్థుడి ఇంటిపేరు కాదు, సిద్దార్థుడిని పెంచిన తల్లి గౌతమి పేరు అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. గౌతముడి తండ్రి పేరు శుద్దోధనుడు, తల్లి మహామాయ, సిద్ధార్థుడు గర్భంలో ఉన్న సమయంలో మాయాదేవికి ఒక కల వచ్చింది అందులో ఒక ఆరు దంతాల ఏనుగు తన గర్భంలోకి కుడివైపు నుండి ప్రవేశించినట్లుగా వచ్చింది. అది జరిగిన పది చంద్రమానముల తరువాత మహామాయాదేవి తన తండ్రిగారి ఇంటికి బయలుదేరింది, కానీ మార్గమధ్యంలో లుంబిని ప్రాంతంలో ఒక సాలవృక్షం క్రింద సిద్ధార్థుడు జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని అన్నట్టుగా సిద్ధార్థుడు పుట్టిన వెంటనే ఏడు అడుగుల దూరం నడిచి జనన మరణాల వల్ల లోకంలో సంభవిస్తున్న దుఃఖాన్ని నిర్మూలం చేస్తాను అని పలికాడట. ఆ సమయంలో ఆకాశంలో ఒక దివ్యజ్యోతి వెలిగింది అనీ, చెవిటివారు మాటలు వినగలిగారనీ, మూగవారు మాట్లాడారని, కుంటివారు నడిచారని చెబుతారు. మాయాదేవి సిద్ధార్థుడు జన్మించిన ఏడవ రోజున మరణించింది. ఆ రోజు నుండి శుద్దోధనుడి రెండవ భార్య గౌతమి సిద్ధార్థుడిని తన కడుపులో పెట్టుకుని పెంచింది. గౌతమి తన బిడ్డడిని బయటకు పంపించకుండా రాజప్రసాదంలోనే ఉంచి అతనికి వినోదం కలిగించడం కోసం నలభైవేలమంది నటులను నియమించింది. సిద్ధార్థుడు యుక్త వయస్కుడు కాగానే అతనికి వివాహం చేయాలని నిశ్చయించారు శుద్దోధనుడు, గౌతమి. అందుకు కాను దేశంలోని అయిదు వందల క్షత్రియ కన్యలను రప్పించగా సిద్ధార్థుడు తాను మహామంత్రి మహానాముని కుమార్తె యశోధరను వరించాడు. కానీ మహామంత్రి శాక్యధర్మం ప్రకారం వీరవిక్రమ విహారంలో సర్వరాజకుమారులను జయించిన వారికే తన కుమార్తెను పెళ్ళి చేసుకోవడానికి అనుమతి ఇస్తాను అని చెప్పడంతో. సిద్ధార్థుడు వివిధ క్షత్రియ విద్యలలో తనకు గల ప్రావిణ్యం ప్రదర్శించి యశోధరను పరిణయమాడాడు. సిద్ధార్థుడికి రాహులుడు అని ఒక కుమారడు కలిగాడు. ఎటువంటి కష్టాలు ఎదుర్కోని సిద్ధార్థుడు ఒకరోజు వ్యాహ్యాళి కోసం రాజప్రాసాదం నుండి బయటికి వచ్చి ఒక వృద్ధుని చూశాడు, మరోకరోజున ఒక రోగిని, ఇంకొక రోజున మృతకళేబరాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రథసారథి ఛన్న ద్వారా ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెందాడు. ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు. సిద్ధార్థుడు సామాన్య జీవితం గడపడం కోసం  తన రథసారథి  ఛన్న సహాయంతో ఒకరోజు రాజభవనం నుంచి కంటక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. సిద్ధార్థుడు తన సన్యాసి జీవితాన్ని మగధ సామ్రాజ్యంలోని రాజగుహ అనే ప్రాంతంలో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. బింబిసార మహారాజ సేవకులు సిద్ధార్థుడిని గుర్తించి బింబిసారుడుకి తెలపడంతో బింబిసారుడు తన రాజ్యాన్ని బహూకరిస్తానని సిద్ధార్థుడితో తెలుపగా, సిద్ధార్థుడు తిరస్కరించి తన జ్ఞానసముపార్జన పూర్తయిన తరువాత మొదటగా మగధ సామ్రాజ్యానికి వస్తానని మాట ఇచ్చాడు. తరువాత సిద్ధార్థుడు రాజగుహను విడిచిపెట్టి అలరకలమ అనే సన్యాసి దగ్గర శిష్యరికం చేశాడు. అలరకలమ తన బోధనలలో సిద్ధార్థుడి ప్రావిణ్యాన్ని చూసి తన వారసుడిగా ఉండమని కోరాడు. కాని ఆ బోధనల వల్ల సిద్ధార్థుడి జ్ఞానతృష్ణ తీరకపోవడంతో నిరాకరించాడు. తరువాత సిద్ధార్థుడు ఉదకరామపుత్త అనే యోగి దగ్గర శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షున్నంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్థుడి జ్ఞానతృష్ణని తీర్చకపోవడంతో తన వారసుడిగా ఉండమని కోరిన ఉదకరామపుత్త కోరికను కూడా తిరస్కరించాడు. వీరిద్దరి శిష్యరికం నుంచి తొలగిన సిద్ధార్థుడు కౌండిన్య అనే యోగి దగ్గర మరొక ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్య బృందం అంతా జ్ఞానసముపార్జన కోసం, బాహ్య శరీర అవసరాలను (ఆహారంతో సహా) పూర్తిగా విడిచిపెట్టడం సాధన చేసేవారు. ఈ విధంగా సిద్ధార్థుడు రోజుకు ఒక పత్రాన్ని కానీ, ఒక గింజను కానీ ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకుని ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్థుడు తాను ఎంచుకున్న మార్గం సరైనది కాదని నిర్థారించుకున్నాడు. తరువాత సిద్ధార్థుడు ధ్యానం, అనాపనసతి (ఉచ్చ్వాస నిశ్వాసాలు)ద్వారా మధ్యమ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను త్యజించడం ద్వారా). ఈ సమయంలోనే సుజాత అనే పల్లెపడుచు తెచ్చే కొద్ది ఆహారాన్ని, పాలను ఆహారంగా సేవిస్తూ ఉండేవాడు. దాని తరువాత సిద్ధార్థుడు బుద్ధ గయలో ఒక బోధి వృక్షం నీడకి పరమసత్యం తెలుసుకోవడం కోసం భగవంతుడి ధ్యానం చేశాడు. కానీ కౌండిన్య గురువుకు అతని శిష్యులకు సిద్ధార్థుడు జ్ఞానసముపార్జన సాధన విరమించినట్లుగా, క్రమశిక్షణా రహితుడిగా భావించారు. చివరకు సిద్ధార్థుడు తన 35వ యేట 49రోజుల ధ్యానం తరువాత జ్ఞానోదయం అయ్యింది. సిద్ధార్థుడికి బాద్రపద మాసంలో జ్ఞానోదయం అయిందని కొందరు, ఫాల్గుణ మాసంలో జ్ఞానోదయం అయ్యిందని కొందరు చెపుతారు. ఆనాటి నుండి గౌతమ సిద్ధార్థుడు, గౌతమ బుద్ధిడిగా మారాడు, బౌద్ధ మతంలో సిద్ధార్థుడిని శాక్యముని బుద్ధుడని భావిస్తారు. బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం అయిన బుద్దుడు మానవుడి అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకున్నాడు, వీటిని నాలుగు పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణం అంటారు.

గౌతమ బుద్ధుడు ప్రతి బుద్ధుడికి ఉండవలసిన తొమ్మిది లక్షణాలను ప్రతిపాదించాడు. గౌతమబుద్ధుడు తపుస్సా, భల్లక అనే ఇద్దరు వర్తకులను తన ప్రథమ శిష్యులుగా చేసుకున్నాడు. వారికి గౌతమబుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడనీ, వాటిని ఇప్పటికీ రంగూన్ లో ఉన్న ఘ్యూ డాగన్ ఆలయంలో భద్రపరిచారానీ ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. గౌతమబుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉన్న వారణాశిలో ఒక లేళ్ళ ఉద్యానవనంలో, కౌడిన్య దగ్గర తనతో పాటు శిష్యరికం చేసిన మిగతా ఐదుగురు సన్యాసులకు తాను తెలుసుకున్న పరమసత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. వీరు అందరూ కలిసి మొదటి బౌద్ధ భిక్షవుల సంఘాన్ని ఏర్పరచి బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధమత సంఘం ఏర్పడింది. తరువాత యాసుడు అతని 54 మంది మిత్రుల చేరికతో బౌద్ధమత సంఘం 60 సంఖ్యను దాటింది. తరువాత ముగ్గురు కశ్యప సోదరులు వారి 200, 300, 500 మంది శిష్యుల చేరికతో బౌద్ధమత సంఘంలోని వ్యక్తుల సంఖ్య 1000 దాటింది. గౌతమబుద్ధుడు గంగా పరివాహక ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు దక్షిణనేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన బోధనలు. సిద్ధాంతాలను బోధించాడు. బుద్దుడికి జ్ఞానోదయం అయిన విషయం తెలుసుకున్న శుద్దోధకుడు బుద్ధుడిని కపిలవస్తుకు తిరిగి రమ్మని రాజదూతలతో కబురు పంపించగా తొమ్మిది మంది కూడా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగా మారిపోయారు.

బుద్ధుడి బాల్య స్నేహితుడు కులుదాయి మాత్రం రాజ్య ఆహ్వానాన్ని బుద్ధుడికి చెప్పి బౌద్ద సంఘంలో చేరిపోయాడు. బుద్ధుడు రెండు సంవత్సరాల తరువాత తన తండ్రి శుద్దోదకుడి ఆజ్ఞను అనుసరించి కాళి నడకన కపిలవస్తుకు ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యంలో ధర్మబోధ చేస్తూ రెండు మాసాలలో కపిలవస్తుకు చేరుకుని రాజభవనంలో బౌద్ధ సంఘానికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాడు. కానీ బౌద్ధ సంఘానికి ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో వారంతా బుద్ధుడితో కలిసి భిక్షాటనకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న శుద్దోధకుడు 'మనది మహామస్సాట రాజవంశం, మన వంశంలో ఎవరూ భిక్షాటన చేయలేదు' అని సిద్ధార్థుడితో అన్నాడు. దానికి సిద్ధార్థుడు 'భిక్షాటన మీ రాజ వంశ ఆచారం కాదు. అది బుద్ధ వంశ ఆచారం. ఇంతకుముందు వేలకొద్దీ బుద్ధులు భిక్షాటన చేశారు' అని తెలిపాడు. దీనితో శుద్దోదకుడు మరలా బౌద్ధ సంఘాన్ని భోజనం కోసం రాజభవనానికి ఆహ్వానించాడు. భోజనం పూర్తయిన తరువాత జరిగిన చర్చలో శుద్దోధకుడు బౌద్ధ సంఘంలో చేరి శోతపన్నుగా మారాడు. శుద్దోదకుడితో పాటు అతని మిగిలిన కుమారులు ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు రాజ కుటుంబీకులు కూడా బౌద్ధ సంఘంలో చేరారు. ఏడు సంవత్సరాల వయస్సున్న సిద్ధార్థుడి కుమారుడు రాహులుడు కూడా బౌద్ధ సంఘంలో చేరాడు. బుద్ధుడి శిష్యులలో సరిపుత్త, మహా మొగ్గల్లన, మహా కశ్యప, ఆనంద, అనిరుద్ధ ఐదుగురు ముఖ్యులు. వీరితో పాటు ఉపాలి, సుభోతి, రాహుల, మహా కక్కన సంగీత విద్వాంసులు కూడా బౌద్ధ సంఘంలో చేరారు. దేవదత్తుడు అనే బుద్దుడికి వరుసకు సోదరుడైన మొదటి బౌద్ధ భిక్షువుగా మారినా, బుద్ధుడి శత్రువుగా మారి చంపాలని ప్రయత్నించాడు. బౌద్ధ గ్రంథాల ప్రకారం  బుద్ధుడు మొదట స్త్రీలను సన్యాసినిలుగా తీసుకోవడానికి నిరాకరించాడు. బుద్ధుడి పినతల్లి మహా ప్రజాపతి, బుద్ధుడిని బౌద్ధసన్యాస దీక్షను ప్రసాదించమని వేడుకుంది. కానీ బుద్ధుడు నిరాకరించి కపిలవస్తును వీడి రాజగుహకు ప్రయాణమయ్యాడు. పట్టువదలని మహాప్రజాపతి నిరాశ చెందకుండా కొందరు శాక్య, కొళియ వంశాలకు చెందిన స్త్రీలతో ఒక చిన్న గుంపుగా బుయలుదేరి, బౌద్ధ భిక్షవులను అనుసరిస్తూ రాజాగుహకు చేరుకొని కొంత కాలానికి ఐదు సంవత్సరాల తరువాత ఆనందుడి మధ్యవర్తిత్వంతో స్తీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి, వారికి కూడా బౌద్ధ సంఘంలో స్థానం కల్పించాడు. కానీ బుద్ధుడు సంఘానికి ఉన్న నియమాలతో పాటు, వినయమనే కొత్త నియమాన్ని స్త్రీలకు ప్రత్యేకంగా జతపరిచాడు. దీనితో సిద్ధార్థుడి భార్య యశోధరా కూడా బౌద్ధ సన్యాసిగా మారింది. మహా పరనిభాన సూక్తం ప్రకారం, బుద్ధుడు తన 80వ యేట తాను కొద్ది రోజులలో నిర్యాణం పొందుతానని ప్రకటించాడు. తరువాత బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని (పంది మాంసం అని కొందరు అంటారు) తిన్నాడు. అది తిన్న తరువాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో బుద్ధుడు తన ముఖ్య అనుచరుడు అయిన ఆనందుడిని పిలిచి, తన అస్వస్థతకు కుందు ఇచ్చిన ఆహారం కాదు తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుందు చాలా గొప్పవాడని చెప్పాడు. కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు సంసార సాగరంలో కొట్టు మిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణం గురించి తెలియజేయడానికి, కావాలనే నిర్యాణం చెందాడని ఒక వాదన వుంది.

0 Comments To "Buddha Purnima"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!