Parasurama Jayanthi

పరశురామ జయంతి

పరశురాముడు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఆరవ అవతారం, పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ రోజున అవతరించాడని స్కంద, బ్రహ్మాండ పురాణాలలో తెలుపబడ్డాయి. పరశురాముడిని భార్గవరామ, జమదగ్ని అని కూడా పిలుస్తారు.

గాధి కుశ వంశపు రాజు, భృగు వంశపు చెందినా ఋచీక మహర్షి ఒకసారి గాధి వద్దకు వెళ్ళి గాధి కుమార్తె అయిన సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. అందుకు గాధి తనకు నున్నటి శరీరం, నల్లటి చెవులున్న వెయ్యి గుర్రాలను ఇవ్వమని అడిగాడు. ఋచీక మహర్షి వరుణ దేవుడిని ప్రార్థించి వెయ్యి గుర్రాలు మహారాజు గాధికి ఇచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకున్నాడు. ఒక రోజు సత్యవతి ఋచీక మహర్షి దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరుకుంది. అందుకు సిద్ధపడిన ఋచీక మహర్షి యాగం చేసి విప్రమంత్ర పూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్ర పూతం అయిన ఒక హవిస్సు సిద్ధంచేసి స్నానానికి నదికి వెళ్ళాడు. విషయం తెలియని సత్యకాతి రాజమంత్ర పూతం అయిన హవిస్సును తాను తీసుకుని విప్రమంత్ర పూతం అయిన హవిస్సును తల్లికి ఇస్తుంది. తిరిగి వచ్చిన ఋచీక మహర్షికి, సత్యవతి జరిగిన విషయం తెలిపి ప్రాధేయపడింది. ఋచీక మహర్షి తన కొడుకు సాత్వికుడిగా, మనవడు ఉగ్రుడిగా పుడతారు అని తెలిపాడు. ఋచీక మహర్షి కుమారుడు జమదగ్ని, జమదగ్ని కుమారుడు పురుషోత్తమ అంశతో జన్మించినవాడు పరశురాముడు. గాధి కుమారుడు విశ్వామిత్రుడు. జమదగ్నికి కూడా కోపం ఎక్కువే, ఆయన పత్ని రేణుకాదేవి, జమదగ్ని రేణుకల చిన్న కొడుకు పరశురాముడు.

హైహయ వంశస్థుడు అయిన కార్తవీర్యార్జునుడికి శాపవశాత్తున చేతులు లేకుండా జన్మించాడు. భక్తిశ్రద్ధలతో ఘోర తపస్సు చేసి, దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని వేయి చేతులు పొందుతాడు. ఒకసారి కార్తవీర్యార్జునుడు వేటకోసం వచ్చి, అలసిపోయి జమదగ్ని ఆశ్రమం చేరుకుంటాడు. జమదగ్ని మహారాజుతో పాటు అతని పరివారానికి కూడా పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. జమదగ్ని మహర్షి వైభవం చూసి ఆశ్చర్యపడిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యంగా దీనికి కారణం ఏమిటి ఇది ఎలా సాధ్యమయింది అని అడిగాడు. దానికి జమదగ్ని తన వద్ద కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకు ఇవ్వమని కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని కోరాడు. జమదగ్ని నిరాకరించడంతో కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తన వెంట తోలుకువెళ్ళాడు. ఇంటికి వచ్చిన పరశురాముడికి విషయం తెలిసి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతని వేయి చేతులు, తలను తన పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి తెలిపగా జమదగ్ని పరశురాముడిని పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మని తెలుపగా పరశురాముడు ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు. ఒకసారి రేణుక నీళ్ళ కోసం చెరువు దగ్గరికి చేరుకోగా అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండిపోయింది. ప్రతిరోజూ మట్టితో కుండను చేసి దానిలో నీళ్ళను ఆశ్రమానికి తీసుకుని వేలుతుండేది. కానీ ఆ రోజున పరధ్యానంగా ఉండడంతో కుండ తయారు చేయలేక ఉత్తి చేతులతో ఆశ్రమానికి తిరిగి వస్తుంది. అది గమనించిన జమదగ్ని తన దూరదృష్టితో అంతా తెలుసుకుని కోపంతో రేణుకను నరకమని తన కొడుకులకు చెప్పగా వారు ఎవరూ ముందుకు రారు. రేణుకను సంహరించమని పరశురాముడిని ఆజ్ఞాపించగా పితృవాక్కు జవదాటని పరశురాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారమే రేణుక తలను నరికేస్తాడు. సంతోషించిన జమదగ్ని ఏదైనా వరం కోరుకోమని పరశురాముడిని అడగగా పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని తండ్రిని వేడుకున్నాడు. జమదగ్ని రేణుకకు పునర్జన్మ ప్రసాదించాడు. తరువాత పరశురాముడు ఋచీక మహర్షి దగ్గరకి వెళ్ళగా అతని వైఖరి గమనించిన ఋచీక మహర్షి శివుడి గురించి తపస్సు చేయమని చెప్పాడు. తాత ఆజ్ఞ ప్రకారం పరశురాముడు శివుడి గురించి ఘోర తపస్సు చేయగా సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అన్నాడు. తనకు రౌద్రాస్తం ప్రసాదించమని పరశురాముడు వరం కోరుకున్నాడు. దానికి పరమశివుడు అంత అస్త్రాన్ని ధరింపగల శక్తి లేదని అన్నాడు. పరశురాముడు తిరిగి తపస్సు కొనసాగించాడు. అదే సమయంలో రాక్షసులు దేవలోకంపై దాడి చేయగా, దేవతలు తమను రక్షించమని పరమేశ్వరుడిని కోరారు. పరమేశ్వరుడు, పరశురాముడిని రప్పించి రాక్షసులను తరిమేయమని ఆజ్ఞాపించాడు. దానికి పరశురాముడు తన వద్ద ఆయుధం లేదని తెలుపగా పరమేశ్వరుడు ఒక పరుశువు (గొడ్డలి)ని బహుకరించాడు. పరశురాముడు రాక్షసులను తరిమివేసి తిరిగి తపస్సులో కూర్చున్నాడు. పరమేశ్వరుడు మరొకసారి ప్రత్యక్షమై పరశురాముడు కోరిన అస్త్రాలను ఇచ్చాడు. కార్తవీర్యార్జునుడి కుమారులు పరశురాముడు ఇంట్లో లేకుండటం చూసి జమదగ్ని తలను నరికి తమ వెంట రాజధానికి వెళ్ళిపోయారు. రేణుక జమదగ్ని శవంపై పడి రోదిస్తూ 21 సార్లు గుండెలు బాదుకుంది.  పరశురాముడికి ఈ విషయం తెలిసి కార్తవీర్యార్జనుడి కుమారులను సంహరించి తండ్రి జమదగ్ని తలను తీసుకువచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు. పరశురాముడు క్షత్రియ జాతిపై ఆగ్రహంతో వారిపై 21 సార్లు దండెత్తి క్షత్ర్రియ వంశాలను నాశనం చేశాడు. శ్యమంతక పంచకం అనే ఐదు సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు పరశురాముడు.  కొంత కాలం తరువాత పరశురాముడు భూమిని కశ్యపుడికి దానం ఇచ్చి తపస్సు చేసుకోవడానికి మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. అందుకే భూమికి 'కాశ్యపి' అని పేరు వచ్చిందట. పరశురాముడు చిరంజీవి, కల్కి అవతారానికి విద్యలు ఉపదేశిస్తాడనీ తరువాత మన్వంతరంలో సప్తర్షులలో ఒకడు అవుతాడు.

సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచిన విషయం తెలిసిన పరశురాముడు తన గురువైన శివుడి విల్లు విరిచినందుకు కోపంతో రాముడిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరథుడు చేసిన అభ్యర్థనలను కానీ, శ్రీరాముని శాంత వచనాలను కానీ పట్టించుకోకుండా చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రాముడికి ఇచ్చాడు. రాముడు దాన్ని కూడా అవలీలగా ఎక్కుపెట్టాడు. శ్రీరాముడు తాను ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు వదలాలి అని పరశురాముడిని అడిగగా తన తపోశక్తిని కొట్టేయమని చెప్పి తిరిగి మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.

భారతంలో పరశురాముడుపరశురాముడు మహాభారతంలో ముగ్గురు వీరులకు గురువయ్యాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్ముడికి అస్త్రశస్త్ర విద్యలు బోధించాడు. అంబికను వివాహం చేసుకోమని పరశురాముడు కోరగా, భీష్ముడు తాను ఆజన్మ బ్రహ్మచర్యవ్రతుడు అయినందుకు నిరాకరించాడు. దీంతో కోపగించిన పరశురాముడు భీష్ముడితో యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరూ సరిసమానంగా యుద్ధం చేస్తుండటంతో దేవతలు యుద్ధం ఆపమని అభ్యర్థించగా యుద్ధాన్ని నిలిపివేశారు.

కర్ణుడు తాను బ్రాహ్మణుడిని అసత్యం పలికి పరశురాముడి దగ్గర శిష్యునిగా చేరి అస్త్ర విద్యలు నేర్చుకుంటున్న సమయంలో నిజం తెలిసిన పరశురాముడు యుద్ధకాలంలో తెలిసిన విద్యలు గుర్తుకు రావు అని కర్ణుడిని శపించాడు.

ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గర దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా పరశురాముడిని దర్శించుకున్నాడు.

పరశురాముడు దత్తాత్రేయుడి దగ్గర శిష్యుడిగా చేరి అనేక విద్యలు నేర్చుకున్నాడని స్కాంద పురాణంలో వివరించబడింది.

ఒకసారి పరశురాముడు తన గురువైన పరమేశ్వరుడి దర్శనార్థం కైలాసంలో ద్వారం దగ్గర వినాయకుడు అడ్డగించాడు. పరశురాముడు కోపంతో తన పరశువు విసిరాడు. తన తండ్రి అయిన శివుడి ప్రసాదం అయిన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగే విరిచేసుకున్నాడు.

పరశురామజయంతి రోజున ఉపవాసం చేసి, పరశురాముడిని షోడశోపచారాలతో పూజించి,

'జమదగ్ని సుత ! వీర ! క్షత్రియాంతక ప్రభో ! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర !' అని అర్ఘ్య ప్రధానం చేయాలి.