Antarvedi Lakshmi Narasimha Swamy Kalyanam February 2023

Antarvedi Lakshmi Narasimha Swamy Kalyanam  February 2023



కళ్యాణం కమనీయం శ్రీలక్ష్మీనరసింహుని వైభోగం. నేత్రపర్వంగా అంతర్వేది నరసింహుని కల్యాణం. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు. 


అలవైకుంఠ ఇలకు వచ్చిందా అన్నట్లు సాగింది నరసింహుని కళ్యాణం. సాగర తీరాన కెరటాలతో పోటీపడుతూ భక్త తరంగాలు అంతర్వేదికి పోటెత్తాయి. ఈ పావన భాగ్యాన్ని చూసిన భక్తులు ఆనంద డోలికలలో మునిగితేలారు.

అశేష భక్తుల మధ్య సాగిన దివ్య ఘట్టం న్ని చూసిన వారి మది తన్మయత్వంతో పులకించింది. సర్వజగన్నియామకుడైన ఆ దేవదేవుని కల్యాణ వేళ.. అంతర్వేది పుణ్యక్షేత్రం దివ్యధామంగా శోభిల్లింది. 


రంగురంగుల విద్యుద్దీపాలు.. పరిమళాలు వెదజల్లే పూలమాలల అలంకరణలతో తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై.. సర్వాభరణభూషితుడై కొలువుదీరిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం నయనానందకరంగా జరిగింది. బుధవారం  రాత్రి 12:46 గంటలకు రోహిణి నక్షత్రయుక్త తులా లగ్నామందు సుముహూర్తానికి జరిగిన ఈ పరిణయ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు.


 వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేదికపై పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాల అలంకరణతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. విష్వక్సేన పూజతో మొదలై,వైఖానస ఆగమశాస్త్రం, శ్రీవైష్ణవ సంప్రదాయ పద్ధతిలో సాగిన ఈ వివాహ వేడుకను భక్తులు తన్మయత్వంతో చూసి తరించారు.

తొలుత పంచముఖ, కంచుగరుడ వాహనాలపై విహరించిన స్వామి రాత్రి 9 గంటలకు 16కాళ్ళ మండపానికి స్వామి చేరడం తో కల్యాణ ఘట్టం మొదలౌతుంది. 


 ఎదురు సన్నాహంతో శ్రీకారం. సాంప్రదాయం ప్రకారం స్వామి వారి తరపున మెగల్తూరుకు చెందిన  రాజా రామ్ గోపాల రాజా బహద్దూర్, అమ్మవారి తరుపున ఆలయ అర్చకులు  వ్యవహరించి కుంకుమ కలిపిన అక్షంతలు ఒకరిపై ఒకరు విసురుకోవడమే ఎదురు సన్నాహం. అనంతరం స్వామి, అమ్మవార్లను కల్యాణ వేదిక పై సింహాసనం అదిష్టింప చేసారు. 


 బ్రహ్మ కడిగిన పాదము. కల్యాణ తంతులో విష్వక్సేన పూజ, పుణ్యహవచనం నిర్వహించిన అనంతరం స్వామి వారి పాదుకలను పాలతో కడిగి పాదప్రక్షాలన చేశారు.  ఆ పవిత్ర జలాలను భక్తుల తలపై జల్లారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ,మంత్రులు,  స్థానిక ఎంపీ వారు,స్థానిక ఎమ్మెల్యే వారు, కలెక్టర్ వారు, ఆర్డీఓ వారు, సబ్ కలెక్టర్ వారు, పలువురు అధికారులు,రాజకీయ  ప్రముఖులు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అన్నవరం దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ వారు , ఎస్పీ,దేవాదాయశాఖ ఆర్.జేసి వారు , ఉప కమిషనర్ వారు  ఆలయ ఏసీ వారు  స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 


 ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యుల పర్యవేక్షణలో ఆస్థాన వేదపండితులు చింతా వేంకటశాస్త్రి, అర్చక బృందం కల్యాణ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 12:46 గంటలు అవ్వగానే సుముహూర్తానికి జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామివారి శిరస్సుపై ప్రధాన అర్చకుడు కిరణ్, శ్రీదేవీ, భూదేవీ అమ్మవార్ల శిరస్సులపై అర్చకులు ఉంచారు.. అనంతరం పొలమూరు రాజులు వంశపార పర్యంగా వస్తోన్న ఆచారం ప్రకారం స్వామికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 

స్వామి వారు అమ్మవారి మెడలో మంగళ సూత్రం కట్టడం, తలంబ్రాలు, బ్రహ్మముడి నిర్వహించడంతో కల్యాణ తంతు ముగిసింది. 


కల్యాణం ఆద్యంతం భక్తుల గోవింద నామస్మరణతో కల్యాణ ప్రాంగణం మార్మోగింది. కల్యాణ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.