కాశీయాత్ర - కాలభైరవుడు

కాశీయాత్ర -  కాలభైరవుడు

కాశీయాత్రకు కాలభైరవుని అనుమతి కావలి. అందుచేత కాశీని దర్శించుకునేవారు తప్పని సరిగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని దర్శించుకోవాలి., లేకపోతె కాశీయాత్ర ఫలితము దక్కదు.

అందుచేత ముందు కాలభైరవుని గురించి తెలుసుకుందాము. కాలభైరవుడు అంటే కాశీ నగరానికి కొత్వాల్ లాంటివాడు. అంటే శాంతి భద్రతలను రక్షించేవాడు. సాధారణముగా అందరు కాశీలో శివుడిని దర్శించుకొని వస్తారు.


అలాకాకుండా కాశీలోని కాలభైరవ ఆలయము, అష్ట భైరవ ఆలయాలను దర్శించుకుంటే కాశీ యాత్ర పరి పూర్ణమవుతుంది.త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అన్న సందేహము వారికి వచ్చింది. సందేహ నివృత్తి కోసము వేదాలను ఆశ్రయిస్తే వేదాలు మహేశ్వరుడే గొప్ప వాడని తేల్చి చెప్పాయి. కానీ బ్రహ్మ విష్ణువులు ఈ విషయాన్ని తేలికగా తీసుకొని మహేశ్వరుడిని అవహేళన చేయసాగారు.


ఉగ్రుడైన మహేశ్వరుడు ఉగ్రస్వరూపుడైన కాలభైరవుని సృష్టించాడు. కాలభైరవుని ఉగ్రరూపానికి పరిస్థితిని గమనించిన విష్ణువు మహేశ్వరుని ఆధిపత్యానికి అంగీకరించాడు.

కానీ బ్రహ్మ తన ధోరణిని మార్చుకోక మహేశ్వరుడిని హేళన చేయసాగాడు.అందుచేత కాలభైరవుడు బ్రహ్మకు ఉన్న ఐదు తలలో ఒక తలను నరికేశాడు. ఆ తల కాలభైరవుడు చేతికి అంటుకుని ఊడి రాలేదు. అప్పుడు కాలభైరవుడు మహేశ్వరుడిని పరిష్కారము కొరకు ప్రార్ధిస్తే., మహేశ్వరుడు అన్ని పుణ్యక్షేత్రాలను, నదులను దర్శించమని చెప్పాడు.


ఆ క్రమములో కాల భైరవుడు కాశీ నగరానికి వచ్చినప్పుడు బ్రహ్మ శిరస్సు ఊడిపడుతుంది. అప్పుడు శివుడు కాలభైరవుడిని కాశీ నగరంలోనే ఉండి నగరాన్ని సంరక్షిస్తూ ఉండమని ఆదేశిస్తాడు.

కాలభైరవుని విగ్రహము మానవాకృతిలో ఉండి మానవ కపాలాల హారాన్ని మెడలో ధరించి కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు. కాల అనే మాటకు అర్ధము విధి లేదా మృత్యువు అంటే మృత్యువు కూడా కాలభైరవునికి భయపడుతుంది.


ఈ కాలభైరవుని ఆలయము 17వ శతాబ్దములో నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఈ విధముగా కాశీలో కాలభైరవ ప్రతిష జరిగింది

 

కాశీ ఖండములోని 72 వ అధ్యాయములో చెప్పినట్లుగా దుర్గామాత అసుర సంహారము చేసినాక, దుష్ట శక్తుల నుండి కాశీ నగరాన్ని రక్షించటానికి కాశీలోని వివిధ ప్రదేశాలలో ఎనిమిది భైరవ మూర్తులను ప్రతిష్టించింది.వీరినే అష్ట భైరవులు అంటారు. వీటిని చూడాలి అంటే స్థానికంగా ఉండే వారి సహాయము అవసరము ఈ అష్ట భైరవ దేవాలయాల గురించి క్లుప్తముగా తెలుసుకుందాము.


1. భీషణ భైరవ్:- ఈ భైరవుడినే భూత్ భైరవ్ అని కూడా అంటారు ఈ దేవాలయము జెస్ట్ శ్వర్ కు దగ్గరగా ఉంటుంది.

2. సంహార భైరవ్:-కాశీ ఖండము 69 వ అధ్యాయములో సంహార భైరవ్ ప్రస్తావన ఉంది. సంహార భైరవ్ ,భైరవక్షేత్రము నుండి వచ్చినట్లు ఆయనను ప్రార్ధిస్తే పాపలు హరిస్తాయని భక్తుల నమ్మకము.

ఈ మందిరము గాయ్ ఘాట్ లో గల పఠాన్ దర్వాజా కు దగ్గరలో ఉంటుంది. అంటే కాశీకి ఉత్తరాన ఉంటుంది.

3. ఉన్మత్త భైరవ్:- ఈ మందిరము పంచ క్రోసి యాత్ర మార్గములో దియోరా గ్రామములో అంటే కాశీకి 10 కి మీ ల దూరములో ఉంటుంది.

4. క్రోధన్ భైరవ్:- ఈయనను అది భైరవ్ అని కూడా అంటారు.బతుకు భైరవ్ మందిర ప్రాంతములో ఉంటుంది ఈ మందిరములో రాహు శాంతి కాల సర్ప దోష నివారణ కోసము భక్తులు పూజలు చేయించుకుంటారు.

5. కపాల భైరవ్ లేదా లాట్ భైరవ్ :-ఈ మందిరము కాశీకి ఈశాన్యముగా అలాల్పూర్ గ్రామములో ఉంటుంది ఈ మందిరము ఆనుకొనే మసీదు ఉంటుంది.

ఈ ప్రాంతము వివాదాస్పద ప్రాంతమే. ఈ మందిరములోని భైరవ మూర్తి విగ్రహానికి పైన ఆచ్చాదన ఏమి ఉండదు. ఈ మందిరానికి ఎదురుగా లాట్ సరోవర్(కపాల విమోచన తీర్ధము) ఉంటుంది.

6. అసితాంగ భైరవ్ :- వృద్ద కాళేశ్వర్ లో మహా మృత్యుంజయ గుడికి దగ్గరలో ఈ మందిరము ఉంటుంది.

7. చాంద్ భైరవ్:- దుర్గ కుండ్ ప్రాంతములోని దుర్గ దేవి మందిరానికి దగ్గరలో ఈ మందిరము ఉంటుంది.

8. రురు భైరవ్ :- రురు భైరవ్ ను ఆనంద్ భైరవ్ అని కూడా పిలుస్తారు. ఈ మందిరము హనుమాన్ ఘాట్ కు దగ్గరలో ఉంటుంది. రురు భైరవ్ మందిరానికి దగ్గరలోనే హనుమాన్ మందిరము,హరిశ్చంద్ర ఘాట్ ఉంటాయి.


మన దేశములో కాశీలోని కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా ప్రసిద్ధి చెందిన కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఉజ్జయినిలో కాలభైరవ మందిరము ఇక్కడ కాలభైరవునికి భక్తులు సారాయిని దేవుడికి నైవేద్యములో ఉంచి భక్తులు తీసుకుంటారు.


కర్ణాటక లోని కాలభైరెవేశ్వర ఆలయము, తమిళనాడులోని కాలభైరవ ఆలయము ఓడిశాలోని అజై కాపాడ భైరవ్ దేవాలయము మొదలైనవి..స్వస్తి..