Karkataka Rasi ( Cancer )

Karkataka Rasi  ( Cancer )

రాశి: కర్కాటకరాశి, సింహరాశి గురుగ్రహం ఉత్తరదిక్కు

రాశిలింగము: శ్రీబాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరస్వామి వెల్ల

 ఈ క్షేత్రము రామచంద్రాపురం పట్టణానికి సుమారు మూడుకిలోమీటర్ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం కలదు. రామచంద్రాపురం నుండి ప్రైవేటు వాహనముల ద్వారా కూడా చేరవచ్చును.సుప్రసిద్ధ చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వరాలయాలలో ఒకటైన ఈ బృహదలయం కర్కాటకం మరియు సింహరాశులలో జన్మించిన (18 నక్షత్ర పాదశివాలయాలు) జాతకులకు సంబంధించిన రాశిలింగం కావడం విశేషం. అతి పురాతనమైన ఈ ఆలయం సుమారు అరవై సంవత్సరముల క్రితం పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. అత్యంత విశేషమైన ఈ ప్రాంగణం శివ విష్ణు స్వరూపాలు వరుస మందిరాలలో కొలువైవుండడం అద్భుతం. వరుసగా గణపతి, వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరులు, సోమేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరి అమ్మవారు, అంక సీతారామస్వామి, శ్రీరుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కొలువై వున్నారు.ఇవి కాక చండీశ్వరాలయం, నవగ్రహ మంటపం కూడా కలవు. ఈ గ్రామంనందు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి, వృద్ధ సోమేశ్వరాలయం, వినాయక ఆలయములు కలవు. కర్కాటక, సింహరాశి యందు జన్మించిన వారు వారి వారి నక్షత్ర పాద శివాలయాలతో పాటు ఈ క్షేత్రంలో కోలువైయున్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరస్వామి వారిని కూడా దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించిన ఎడల విశేష ఫలితములు పొందవచ్చునని భక్తుల విశ్వాసము.

స్వామివారి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి సోమేశ్వరస్వామి వారికి, వేణుగోపాలస్వామివారికి, వెంకటేశ్వరస్వామిగారికి ఏకకాలంలో పాంచాహ్నికంగా నిర్వహించబడతాయి. ఇది క్షేత్ర విశేషం. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి వైభవోపేతంగా జరుగుతాయి. శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించబడతాయి.