Karthika Masam Day 2 Parayanam

కార్తీక పురాణము - రెండవరోజు పారాయణము 
                  

తృతీయ అధ్యాయము 

బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. 'రాజా! స్నాన, దాన, జపతాపాలలో ఏది కానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయ వంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖాలకు, శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు. 
శ్లో     పౌర్ణమ్యాం కార్తికమాసి స్నానదానాంతు నాచరేత్ !
    కోటిజన్మసు చండాలయోనౌ సంజాయతే నృప !!
శ్లో     క్రమాద్యోనే సముత్పన్నో భావహి బ్రహ్మరాక్షసః !
    అత్యై వోదాహరంతీ మ మితిహాసం పురాతనం !!

భావం:

కార్తీక పౌర్ణమినాడు, స్నానదానా జపోపవాసాలలో ఏ ఒక్కటీ కూడా ఆచరించనివాళ్ళు కోటి పర్యాయాలు ఛండాలపు యోనులలో జన్మించి, తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను. 
                 
తత్త్వ నిష్ణో పాఖ్యానము 

అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్త్వ నిష్టుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకలశాస్త్ర పారంగతుడు, అసత్యములు పలుకని వాడూ, అన్ని భూతములలో దయవలవాడు, తీర్థాటనా ప్రియుడూ అయిన ఆ విప్రుడు ఒక తీర్థయాత్ర సందర్భంగా గోదావరీ తీరంలో ఉన్న ఒక ఎత్తైన మర్రిచెట్టుమీద కారునలుపు  కలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రాలు, గెడ్డాలు కలవాళ్ళూ, గుచ్చబడిన ఇనుపతీగలలాగా పైకి నిక్కబొడుచుకున్న తలవెంట్రుకలతో, వికృత ముఖాలతో, కత్తులూ కపాలాలు ధరించి, సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల భయంవల్ల ఆ మర్రిచెట్టు నాలుగువైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణసంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్త్వనిష్టుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు. 

     తత్త్వనిష్టుని శరణాగతి

శ్లో     త్రాహి దేవేశ లోకేష ! త్రాహి నారాయ ణావ్యయ 
    సమస్త భయవిధ్వంసినే ! త్రాహిమాం శరణాగతం !
    నాన్యం పశ్యామి దేవేశి ! త్వ త్తోహం జగదీశ్వర !!

అంటే ... 'దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివయినవాడా! నారాయణా ! అవ్యయా! నన్ను కాపాడు. అన్ని రకాల భయాలనూ అంతము చేసేవాడా ! నిన్నే శరణుకోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు తెలియనివాడిని. నన్ను కాపాడు రక్షించు!' అని ఎలుగెత్తి స్మరించుతూ రాక్షస భయంతో అక్కడనుండి పారిపోసాగాడు. అతనిని పట్టి చంపాలనే తలంపుతో ఆ రాక్షసత్రయం అతడి వెనుకనే పరుగెత్తసాగింది. రాక్షసులు అలా బ్రాహ్మణుడికి చేరువ అవుతున్న కొద్దీ, సాత్వికమైన విపృని తేజస్సు కంట పడటం వలన తెరిపిలేకుండా అతనిచే స్మరించబడుతున్న హరి నామం చెవుల పడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయ్యింది. అదే అదునుగా ఆ బ్రాహ్మణుని ఎదురుగా చేరుకొని దండప్రణామాలు ఆచరించి, అతనికి తమ వలన కీడు కలగబోదని నచ్చ చెప్పి, 'ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి'అని మళ్ళీ మళ్ళీ నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్త్వనిష్టుడు 'మీరు ఎవరు? చేయరాని పనులు ఏమి చేయడం వలన యిలా అయిపోయారు? మీ మాటలు వింటూ ఉంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలు ఏమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయం, బాధలు తీరిపోయే దారి చెబుతాను' అన్నాడు.              
                  

ద్రావిడుని కథ

బ్రాహ్మణుడి మాటలపై ఆ రాక్షసులలో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు. 'విప్రోత్తమా! నేను ద్రావిడుని ద్రావిడ దేశంలో మంధర అనే గ్రామాధికారిని అయిన  నేను, కులానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలుడిని. నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేకమంది విప్రుల ధనాన్ని హరించాను. బంధువులకు కానీ, బ్రాహ్మణులకు కానీ ఏనాడూ పట్టెడు అన్నం అయినా పెట్టి ఎరుగను. నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వల్ల నా కుటుంబం నాతొ సహా ఏడుతరాల వాళ్ళు అధోగతిపాలయిపోయారు. మరణం తరువాత సహనం లేని ఎన్నో నరకయాతనలను అనుభవించి, చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను. దయతలచి నీ కృపా చిత్తంతో నాకు ముక్తిని ఇచ్చే యుక్తిని చెప్పు' అన్నాడు.

ఆంధ్రదేశీయుని గాథ 

రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు. 'ఓ పవిత్రుడా! నేను ఈ ఆంధ్రదేశానికి చెందిన వాడినే. నిత్యమూ నేను నా తల్లిదండ్రులతో గొడవపడుతూ, వారిని తిడుతూ ఉండేవాడిని. నేను నా భార్యాపిల్లలతో శుభ్రమైన అన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది కూడు పడేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడూ ఒక పూట అయినా భోజనము పెట్టకుండా విపరీతంగా ధనం ఆర్జించి  అ కావరంతో బ్రతికేవాడిని. ఆ శరీరం కాలం చేశాక (చనిపోయిన తరువాత). నరకంలో ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇక్కడ ఇలా రాక్షసుడిగా పరిణమించాను. ఆ ద్రావిడులా నాకు కూడా ముక్తి కలిగే దారి భోధించు' అన్నాడు.

పూజారి కథ 

తరువాత మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు 'ఓ సదాచార సంపన్నుడా!నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడిని. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడినీ, అహంభావిని, కఠినమైనవాడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలు అన్నిటినీ నా వేశ్యలకు అందచేసి, విష్ణు సేవలు సక్రమంగా చేయకుండా గర్వంతో తిరిగేవాడిని. చివరకి గుడి దీపాలలోని నూనెను కూడా అపహరించి, వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభావించుతూ పాపపుణ్య విచక్షణరహితుడిగా ప్రవర్తించేవాడిని. నేను చేసిన దోషాలకు ప్రతిఫలంగా నరకం చవిచూసి, తరువాత ఈ భూమిని నానావిధ హీన యోనుల లోపలా, నానా జన్మలనూ ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను. ఓ సహృదయుడా! నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు' అని ప్రార్థించాడు.

బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట 

తమతమ పూర్వ జన్మల వృత్తాంతాలకు ఎంతగానో పశ్చాత్తాప పడుతున్న ఆ రాక్షసులకు అభయం ఇచ్చి 'భయపడకండి, నాతొ కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలూ నశించిపోతాయి' అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీనదిని చేరుకున్నారు. అక్కడ తత్త్వనిష్టుడు, బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి, తరువాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. తరువాత

శ్లో     అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం -    
    అస్యాం కావేర్యాం - ప్రాతఃస్నాన మహం కరిష్యే !!

అనే సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులూ, దివ్య మేఘాలూ అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. 

విదేహ రాజా! అజ్ఞానం వలన కానీ, మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణం చేతనయినా కాని కార్తీకమాస సూర్యోదయ కాలంలో కావేరి నదిలో స్నానం ఆచరించి, విష్ణువును పూజించిన వాళ్ళకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఎదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో సాధ్యం కాకపొతే గోదావరిలో అయినా, మరెక్కడ అయినా సరే ప్రాతఃస్నానం మాత్రం చేసితీరాలి. అలా ఎవరయితే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతఃస్నానం చేయరో, వాళ్ళు పదిజన్మలు ఛండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా! కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ, పురుషులు కానీ కార్తీకమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలి. 
                      

తృతీయ అధ్యాయం సమాప్తం

  చతుర్ధ అధ్యాయం

జనకుడు అడుగుతున్నాడు 'హే బ్రహ్మర్షీ! నువ్వింతవరకూ కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే, ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏయే దానాలు చేయాలో కూడా తెలియజేయి.'

వశిష్ట ఉవాచ:

అన్ని పాపాలనూ మన్ను చేసేదీ, పుణ్యాలను ఆగణ్యాలుగా మర్చేదీ అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా 'సంకల్పం' అనేది హాస్యాస్పదం అయిన విషయం. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల, వ్రతధర్మాలనూ, తత్ఫలాలనూ చెబుతాను విను

కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది. శివాలయ గోపుర ద్వారా, శిఖరాలలోగానీ, శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలూ అంతరించపోతాయి. ఎవరయితే కార్తీక మాసంలో శివాలయంలో ఆవునేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నారింజ నూనెలతో కానీ దీపసమర్పణం చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించినవాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు. కనీసం, కాంక్షతో కానీ నలుగురి మధ్య బడాయికోసం కానీ దీపాన్ని ఇచ్చేవాళ్ళు శివప్రియులు అవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను.


                        కార్తీక దీపారాధన మహిమ

పూర్వం, పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు, కుబేరుడిని మించిన సంపద సమకూర్చుకున్నా, కుమారులు లేని కారణంగా కృంగిపోయినవాడై, వంశోద్దారకుడి కోసం తపస్సుకు కూర్చున్నాడు. మధ్యేకాలంలో అటుగా వచ్చిన పైప్పులుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని 'ఓ రాజా! ఈమాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీకమాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి, బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పకుండా పుత్రసంతానం పుడతారని' చెప్పాడు. ఋషి వాక్యం శిరోధార్యంగా ఆ పాంచాలుడు తన పట్టణం చేరి, కార్తీక వ్రతం ఆచరించి, శివప్రీతి కోసం బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు. తత్ఫలితంగా మహారాణి నెలతప్పి, యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశివుకు 'శత్రుజి' అని పేరుపెట్టారు. 

                        శత్రుజి చరిత్ర

ఆ శత్రుజి దినదిన ప్రవర్ధంగా పెరిగి, యువకుడై, వీరుడై, వేశ్యాసంగలోలుడై, అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై, యుక్తాయుక్త విచక్షణా నాస్తికుడై, శాస్త్ర దిక్కారియై, వర్ణసంకర కారకుడై హితవు చెప్పడానికి వచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ, స్వేచ్చగా ప్రవర్తించసాగాడు. అటువంటి సందర్భంలో - సౌందర్యరాశీ, సింహమాధ్యమా, అరటి దోనెలవంటి తొడలు కలిగినదీ, పెద్ద పెద్ద పిరుదులు, కుచాలూ, కన్నులూ కలదీ, చిలుక వలే పలుకులు కలదీ అయిన ఒక బ్రాహ్మణపత్ని ఎదురుపడింది. శత్రుజి ఆమెపట్ల మొహితుడు అయ్యాడు. అనుపమాన సౌందర్య, శౌర్య, తేజోవిరాజితుడు అయిన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడింది. దాని కారణంగా ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే తాను ఒక సంకేత స్థలంలో రాకుమారుడిని కలిసి - సురత క్రీడలతో సుఖించేది. రంకూ-బొంకూ దాగవు కదా! ఎదో విధంగా ఈ సంగతి ఆ బాపనదాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకుజంటను ప్రత్యక్షంగా చూసి, వారి గొంతులు కత్తిరించాలని తిరుగుతున్నాడు. మహా కాముకులయిన ఈ జారణి కానీ, ఆ శత్రుజి కానీ ఈ సంగతి ఎరుగరు. 

రోజులు ఇలా గడుస్తుండగా ఒకానొక కార్తీకపూర్ణిమా సోమవారం నాటి రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడల కోసం ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా వుంది. ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడినుండో ఆముదం తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు.

ఈ విషయాన్ని ఆ బాపనిదాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు. కత్తిపట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజినీ, ఆనంతరం తన భార్యనూ తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురూ ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు అవగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములై శివదూతలూ ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుడినీ, రంకులాడినీ తమ విమానంలో కైలాసానికి తీసుకుని వెళ్ళసాగారు. యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకం వైపు లాక్కొని వెళ్ళసాగారు. అందుకు ఆశ్చర్యపడిన బ్రాహ్మణుడు 'ఓ శివదూతలారా! కాని పని చేసినవారికి కైలాస భోగం, నావంటి సదాచారుడికి నరకయోగమా?' అని ప్రశ్నించగా దానికి శివదూతలు 'వీరెంత పాపాత్ములు అయినా ఈ రోజు కార్తీక పూర్ణిమా సోమవారం కాబట్టి, శివాలయంలో అందులోనూ శిథిలాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు. కాబట్టి వారి పాపాలూ, నేరాలూ నశించి పుణ్యాత్ములు అయ్యారు. ఏ కారణం చేతనైన సరే కార్తీకమాసంలో అందునా పౌర్ణమిరోజు, పైగా సోమవారం రోజు దేవాలయంలో దీపార్పణం చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన ఈ పాపకర్ములని చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివీ, పాపాత్ముడివీ అయ్యావు. అందుకే, నీకు నరకం - వీరికి కైలాసం' అని చెప్పారు.

బ్రాహ్మణుడికి శివదూతలకూ జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజి తాను కలుగ చేసుకుని 'అయ్యలారా! దోషులం మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి, మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు. కార్తీకమాసం దొడ్డదయితే, అందునా పూర్ణిమ గొప్పది అయితే, సోమవారం మరీ ఘనమయినది అయితే, మాతోబాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుడికి కూడా కైలాసం ఇవ్వడం తప్పదు' అని వాదించడం జరిగింది. దాని ఫలితంగా శత్రుజి తానూ, తన ప్రియురాలూ ఆచరించిన వత్తి, తైలం పుణ్యం తాము ఉంచుకుని, ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి ధారపోయగా ... శివదూతలు బ్రాహ్మణుడిని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలసానికి తీసుకువెళ్ళారు. 
కాబట్టి, ఓ మిథిలా నగరాధీశ్వరా! కార్తీక మాసంలో తప్పని సరిగా శివాలయానికి కాని, విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెలపొడుగునా చేసినవాళ్ళు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందునా, శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి.'

                    ఏవం స్కాంద పురాణాంతర్గత మహాత్మ్యే 

                 

 చతుర్థ అధ్యాయం సమాప్తం 
                 

 రెండవరోజు పారాయణము సమాప్తం    

 

 

Products related to this article

Shell Lakshmi Devi (Big Size)

Shell Lakshmi Devi (Big Size)

Shell Lakshmi Devi(Big size)..

$10.00 $10.00

0 Comments To "Karthika Masam Day 2 Parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!