karthika puranam day 25 parayanam

కార్తీక పురాణము - ఇరవై ఐదవ రోజు పారాయణ 


పృథువు అడుగుతున్నాడు: 'నారదా! నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహత్యాన్ని విని ధన్యుడినైనాను. అదే విధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే, గతంలో ఈ వ్రతం ఎవరెవరిచేత ఎలా ఎలా ఆచరించబడిందో తెలియజేయి' అని కోరగానే, నారదుడు వినిపించసాగాడు.


                    ధర్మదత్త ఉపాఖ్యానము


చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని, కరవీరమనే ఊరు ఉండేది. ఆ వూళ్ళో ధర్మవేత్త, నిరంతర హరి పూజా ఆశక్తికలవాడు, నిత్యం ద్వాదాక్షరీ జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు, ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక కార్తీకమాసంలో ఆ విపృడు విష్ణు జాగరణ చేయతలచిన వాడై తెల్లవారుఝామునే లేచి పూజకు కావలసిన సామానులు సమకూర్చుకుని విష్ణువు ఆలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగిన ఘోరదంష్ట్రలు, తాటిస్తున్న నాలుకా, ఎర్రటికళ్ళు, దళసరి పాటి పెదాలు, మాంసరహితమైన శరీరము గలదీ పందివలె ఘుర్ఘురిస్తూనది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది. దానిని చూసి భీతావహుడైన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలంతోసహా తన వద్ద గల పూజాద్రవ్యాలతో దానిని కొట్టాడు. హరిస్మరణంతో తులసీభరితమైన జలతాడనం చేయడంవలన, ఆ నీళ్ళు సోకగానే దాని పాపాలు అన్నీ పటాపంచలైపోయాయి. దానిద్వారా ఏర్పడిన జ్ఞానంవలన 'కలహా' అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగంగా ప్రణమిల్లి, తన పూర్వజన్మ కర్మలను విన్నవించసాగింది 'కలహా' చెబుతుంది. పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా! పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశంలో భిక్షుడు అనే బ్రాహ్మణుడి భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలినై ఉంటూ 'కలహ' అనే పేరుతొ పిలువబడే దానిని. నేను ఏనాడూ నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను. ఆయన హితవును ఆలకించేదానిని కాదు, కనీసము ఆయనకు సరిగా అన్నము కూడా పెట్టేదానిని కాదు. నేను అలా నిత్య కలహకారిణై అహంకరించి వుండడంవలన కొన్నాళ్ళకు, నాథుని మనసు విరిగి మారుమనువు ఆడాలనే కోరికతో ఉండేవాడు. ఆయనను సుఖపెట్టలేక పోయినా, మారు మనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి, భరించలేక విషం త్రాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడిముందు నిలబెట్టారు. యముడు, చిత్రగుప్తుడిని చూసి, 'చిత్రగుప్తా! దీని కర్మకాండలను తెలియజేయి. శుభమైనా ఆశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసినదే' అన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు 'ఓ ధర్మరాజా! ఇది ఒక మంచిపని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నము పెట్టేదికాదు. అందువల్ల మేక జన్మమెత్తి బాధపడుతూ ఉండుగాక! నిత్యమూ భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకుగాను పందియోనిని పురుగై పుట్టుగాక! వండిన వంటను తాను ఒక్కతే తిన్న పాపానికిగాను పిల్లి యోనిని పుట్టి తన పిల్లలను తనే తినుగాక! భర్త ద్వేషియై ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేతశరీరాన్ని పొందునుగాక! ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో వుండి, అనంతరం, యోనిత్రయాన జన్మించి అప్పటికైనా సత్కార్యములు ఆచరించుగాక!' అని తీర్మానించాడు.
అది మొదలు ఓ ధర్మదత్తా! నేను అయిదు వందల సంవత్సరాలపాటు ఈ ప్రేతశరీరం ధరించి ఆకలిదప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణా సరస్వతీ సంగమస్థానమైన దక్షిణదేశానికి రాగ, అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను. పరమపావనమైన తులసిజలాలతో నీవు తాడించడంవలన ఈపాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్య తేజస్వివైన నీ దర్శనం లభించింది. కాబట్టి కళంకరహితుడవై భూసురుడా! ఈ ప్రేత శరీరంనుంచీ, దీని తదుపరి ఎత్తవలసిన వివిధ యోనులలోని జన్మత్రయాన్నుంచీ నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు' అని ప్రాధేయపడింది. కలహ చెప్పినది అంతా విని, కలతపడిన మనస్సు కలవాడిన ఆ విపృడు సుదీర్ఘ సమయం ఆలోచించి, ఆలోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు.


                    పందొమ్మిదవ అధ్యాయం సమాప్తం


                    ఇరవైవ అధ్యాయం


ధర్మదత్తుడు చెబుతున్నాడు: ఓ కలహా!తీర్థాలూ, దానాలూ, వ్రతాలు చేయడంవలన పాపాలు నశించిపోతాయి. కానీ, నీ ప్రేత శరీరంవలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక, మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మపరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్దెరిగిన నాటినుండీ ఆచరిస్తూ వున్న కార్తీకవ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. దానిద్వారా నీవు తరించి ముక్తిని పొందు' ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరీ మంత్రయుక్తంగా తులసీ తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీకవ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తరక్షణంలోనే కలహా ప్రేతశరీరాన్ని విడిచి, దివ్యరూపంతో, అగ్నిశిఖవలె లక్ష్మీకళతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతఙ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే, విష్ణుస్వరూపులైన పార్షాదులు ఆకాశంనుండి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానం అధిరోహింప చేయబడి, అప్సరగణాలచేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీలా పుణ్యశీలు ఇద్దరూ అతనిని లేవదీసి, సంతోషం కలిగించే విధంగా యిలా చెప్పసాగారు ...
'ఓ విష్ణుభక్తా! దీనులయందు దయాబుద్ధి కలవాడవూ అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రతపుణ్యాన్ని ఒక దీనురాలికోసం త్యాగం చేయడం వలన నీ యక్క నూరుజన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది. విష్ణుజాగరణ ఫలంగా విమానం తేబడింది. నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్నీ, తులసి పూజాదులవలన విష్ణుసాన్నిధ్యాన్నీ ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవసేవవలన కలగని మనోవాంచితమంటూ ఏదీ లేదు. విష్ణువ్రతం మహాఫలదాయకము. హరినామస్మరణం మోక్షమార్గం. విష్ణు ధ్యాస తత్పరుడవైన నీవు నీ యిద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేలసంవత్సరాల పాటు విష్ణుసాన్నిధ్యంలో వినోదించగలవు.'


                    ధర్మదత్తుడికి విష్ణు దూతల వరం


విష్ణుదూతలు చెబుతున్నారు: 'ఓ ధర్మదత్తుడా! వైకుంఠంలో నీ పుణ్యఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడు అనే మహారాజుగా పుడతావు, నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలు అవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తమైన ఈ 'కలహ'యే నీకా జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది. దివ్యకార్యార్థమై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టువులో నీ కుమారుడుగా జన్మిస్తాడు. ఓ ధాత్రీ సురవరేణ్యా! విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకవ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులుగాని, దానతీర్థాలుగాని లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనదీ, నీచే ఆచరించబడినదీ అయిన కార్తీకవ్రతంలోని కేవల సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణుసాలోక్యాన్ని పొందుతూ వుంది. ఆమెను ఉద్ధరించాలానే నీ సంకస్పం నెరవేరింది గనుక, నేవు దిగులుపడకు' అన్నారు విష్ణుదూతలు.


                    పందొమ్మిదీ, ఇరవై అధ్యాయాలు సమాప్తం


                    ఇరువై ఐదవ (బహుళ దశమి)రోజు పారాయణము సమాప్తం. 

Products related to this article

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)..

$27.69

0 Comments To "karthika puranam day 25 parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!