Karthika Masam Day 8 Parayanam

కార్తీక పురాణము - ఎనిమిదవ రోజు పారాయణం                   

పదిహేనవ అధ్యాయము


వశిష్ట ఉవాచ : ఓ జనక నరేంద్రా! కార్తీకమాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో, వాళ్ళు శ్రీహరి మందిర వాసులు ఆవుతారు. కార్తీక ద్వాదశినాడు హరికి దీపమాల అర్పించే వారు వైకుంఠంలో  సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలలో విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు. ఈ నెలరోజులూ నియమంగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకూ ఒక్కొక్క అశ్వమేథ యజ్ఞఫలాన్ని పొందుతారు. కార్తీకమాసంలో అసలు విష్ణుమూర్తి గుడికే వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో, కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీకశుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కర్మా అక్షయ పుణ్యాన్నీ, ప్రతీ దుష్కర్మా అక్షయపాపాన్నీ కలిగిస్తాయి. శుక్ల ద్వాదశినాడు బ్రాహ్మణసాహితుడి భక్తియుతుడై గంధపుష్పాక్షత దీపధూపాజ్యభక్ష్య నివేదనలతో విష్ణువును పూజించేవారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు శివాలయంలోగాని, కేశవ ఆలయంలోగాని లక్షదీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు పుష్పవిమానం అధిరోహించి దేవతలచేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరుకొని సుఖిస్తారు. కార్తీకం నెల్లాళ్ళూ దీపం పెట్టలేనివాళ్ళు శుద్ధ ద్వాదశీ, చతుర్థశీ, పూర్ణిమ ఈ మూడు రోజులు అయినా దీపం పెట్టాలి. ఆవునుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా, దైవసన్నిధిలో దీపం వెలిగించనివాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రబోధింప చేసినవాళ్ళు పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే, దాన్ని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాలనుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. 


                    ఎలుక దివ్యపురుషుడు అవడం


సరస్వతీ నదీతీరంలో అనాదికాలంగా పూజాపునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువు ఆలయం ఒకటి ఉండేది. కార్తీకస్నానం కోసం నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి, తన తపోధ్యానాల కోసం ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి, ఆ గుడిని తుడిచాడు, నీళ్ళు జల్లాడు. దగ్గరలోని గ్రామానికి వెళ్ళి ప్రత్తి, నూనె, పన్నెండు ప్రమిదలూ తెచ్చి దీపాలు వెలిగించి 'నారాయణార్పణమస్తు' అనుకుని తాను ధ్యానం చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉండగా, కార్తీకశుద్ధ ద్వాదశినాటి రాత్రి, బైట ఎక్కడా ఆహరం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలకలు పరుగెడుతున్న ఒక ఎలుక ఆ గుళ్ళోకి వచ్చి, ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి, మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే వుంది. తడిగా వున్న ఆ పత్తినుండి వచ్చే నూనెవాసనకు భ్రమపడిన] ఎలుక, అదేదో ఆహారంగానే భావించి - ఆ పత్తిని నోటకరచుకుని పక్కనే వెలుగుతున్న మరొక దీపం దగ్గరకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసివున్న ఆ ఆరిపోయిన వత్తికోన వెలుగుతూ ఉన్న పత్తి అగ్నితో కలిసి ఉండడంతో ఎలుక దాన్ని వదిలేసింది. అది ప్రమిదలోపడి రెండు వత్తులూ చక్కగా వెలగసాగాయి. రాజా! కార్తీకశుద్ధ ద్వాదశినాడు విష్ణుసన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా, అదీ విధంగా ఎలుక వలన తిరిగి ప్రజ్వలితమై - తన పూర్వ పుణ్యవశాన, ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగతజీవియై దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలోనుండి లేచిన యతి ఆ పూర్వపురుషుణ్ణి చూసి 'ఎవరివి నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?' అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు 'ఓ యతీంద్రా! నేను ఒక ఎలుకను. కేవలం గడ్డిపరకలవంటి ఆహారంతో జీవించేవాడిని ... అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడంలేదు. పూర్వజన్మలో నేను ఎవర్ని? ఏ పాపం వలన అలా ఎలుకను అయ్యాను? ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను? తపస్సంపన్నుడివి అయిన నువ్వే నాకు వివరించు. నేను నీ శిష్యుణ్ణి, దాసుణ్ణి' అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞానేత్రంతో అంతా దర్శించి ఇలా చెప్పసాగాడు.    
                  

  బాహ్లికొపాఖ్యానమునాయనా! పూర్వం నువ్వు జైమినోగోత్ర సంజాతుడవైన బాహ్లికుడు అనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడి అయిన నువ్వు నిరంతరం సంసార పోషణకోసం స్నానసంధ్యలు విసర్జించి, వ్యవసాయం చేపట్టి, వైదిక కర్మానుష్టానులైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి. దేవతార్చనలను అన్నింటినీ విడిచిపెట్టి సంభావనలపై ఆశతో శ్రాద్ధ భోజనాలు చేస్తూ, నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులూ, పిశాచబలులు కూడా భోంచేస్తూ వేదమార్గాన్ని తప్పి తిరిగావు, అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా, ఇంటిపనులలో సహాయార్థం ఒక దాసీదాన్ని తాకుతూ, దానితో మాట్లాడుతూ, హాస్యాలు ఆడుతూ, నీ పిల్లలకు దానిచేతే భోజనం వగైరా పెట్టిస్తూ, నువ్వు కూడా దాని చేతికూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువవారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేగాదు, ధనానికి ఆశపడి నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి. ఎవరికో విక్రయించేశావు. ఆ విధంగా కూడబెట్టినది అంతా భూమిలో దాచిపెట్టి, అర్థాంతరంగా మరణించావు. ఆయా పాపాల వలన నరకాన్ని అనుభవించి, పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈ రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగానూ నీ ఎలుక రూపం పోయి ఈ నరరూపం సిద్ధించింది'
పై విధంగా యతి చెప్పింది విని తాను గతజన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంతో ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటినుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్థశి పౌర్ణములు మూడు రోజులూ సరస్వతీనదిలో ప్రాతఃస్నానాన్ని ఆచరించి, ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంత కాలమూ ప్రతీ సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ, మంచివాడిగా మసులుతూ, అంత్యంలో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశినాడు భగవత్పరాయణుడై స్నాన, దాన, పూజా దీపమాలార్పనలు మొదలైనవి ఆచరించేవాడు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, పాపవిముక్తుడు అయి సాయుజ్యపదాన్ని పొందుతాడు అని విశ్వసించు.


                    పదిహేనవ అధ్యాయం సమాప్తం


                    పదహారవ అధ్యాయం ప్రారంభం.  


జనక మహారాజా! దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకం నెలరోజులూ నియమంగా తాంబూల దానం చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకి ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించేవాళ్ళు వైకుంఠవాసులు అవుతారు. సంతానం కోరుకునేవాడు కార్తీక పౌర్ణమినాడు కోరిక సంకల్ప పూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నానదానాలు చేయడం వలన సంతానవంతులు అవుతారు. విష్ణు సన్నిధిలో కొబ్బరికాయ, దక్షిణ, తాంబూలాలతో సహా దానం ఇచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు. దుర్మరణాలు కానీ, సంతాన విచ్చేదాలు కాని జరగవు.


                    స్థూపదీపము


పూర్ణిమనాడు విష్ణు సన్నిధిలో స్థూపదీపం వెలిగించడం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితోగాని, కొయ్యతోగాని స్థంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముందు పాతి, ఆ తరువాత శాలిధ్యానం, వ్రీహిధ్యానం, నువ్వులు పోసి, దానిపై నేటితో దీపం పెట్టినవాళ్ళు హరిప్రియులు అవుతారు. ఈ స్థూపదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలూ నశించిపోతాయి. ఈ దీపం పెట్టినవాళ్ళు వైకుంఠంలో స్థానం పొందుతారు. ఇక దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నావల్ల అయ్యే పనికాదు. అని చెప్పసాగాడు వశిష్టుడు.                    

కొయ్యమొద్దుకు కైవల్యం కలగడం 

నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువు ఆలయం ఉండేది. ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి, కార్తీకవ్రతాలు అయిన ఆ నెల్లాళ్ళూ శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీకమాసంలో వ్రతస్థులలోని ఒక ముని 'కార్తీకంలో విష్ణుసన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈ రోజు కార్తీకపూర్ణిమ కాబట్టి, మనం కూడా విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం' అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులు అందరూ, ఆ గుడి ఎదుటనే కొమ్మలూ, కణువులూ లేని స్థూపాకరపు చెట్టును ఒకదాన్ని చూసి, దానినే స్తంభంగా నిమంత్రించి, శాలి, వీహ్రి, తిలా సమేతంలు దానిపై నేతితో దీపాన్నివేలిగించి, విష్ణువుకి అర్పణ చేసి, మళ్ళీ గుడిలోకి వెళ్ళి పురాణకాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి చటచ్చటా శబ్దాలు వినడంతో వెనుతిరిగి స్తంభదీపం వంక చూశారు. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ స్థూపం ఫటఫటా శబ్దాలతో నిలువునా పగిలి నేలపై పడిపోయింది, అందులోనుంచి ఒక పురుషాకారుడు వెలివడటంతో, విస్మయం చెందినవారైన ఆ ఋషులు 'ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి వున్నావు? నీ కథ ఏమిటో చెప్పు' అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు ' ఓ మునివరేణ్యులారా! నేను గతంలో ఒక బ్రాహ్మణుడిని అయినా వేదశాస్త్ర పఠనం కాని, హరికథా శ్రవణం కాని, క్షేత్ర పర్యటనలు కాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి - రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్దితో ప్రవర్తించేవాడిని. వేదపండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములూ అయిన బ్రాహ్మణులను నీచమైన ఆసనాలపై కూర్చుండబెట్టి, నేను ఉన్నతమైన ఆసనంపై కూర్చునేవాడిని. ఎవరికీ దానధర్మాలు చేసేవాణ్ణి కాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం 'ఇంతిస్తాను అంతిస్తాను' అని వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రం యిచ్చేవాడిని కాదు. దేవ, బ్రాహ్మణ డబ్బులను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని దాని ఫలితంగా మరణం తరువాత నరకంలో ఉండి, తరువాత 52 వేల సార్లు కుక్కగాను, పదివేలసార్లు కాకిగాను, మరొక పదివేల సార్లు పురుగులుగానూ, కోటిజన్మలు చెట్టుగానూ గత కోటి జన్మలుగా ఇలా మొద్దులా పరిణమించి కాలం గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు, ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి'.
ఆ అద్భుత పురుషుడి మాటలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు 'ఈ కార్తీక వ్రతఫలం యదార్థమైనది సుమా! ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా! అందునా కార్తీక పూర్ణిమనాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం, మనచే పెట్టబడిన దీపం వల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది. మొద్దయినా మ్రాను అయినా సరే కార్తీకంలో దైవసన్నిధిలో దేపాన్ని పెట్టడం వలన దామోదరుడి దయవల్ల మోక్షం పొందడం తథ్యం' ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న అద్భుత పురుషుడు 'అయ్యలారా! దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు - దేనిచేత బద్ధుడూ అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించరే' అని ప్రార్థించడంతో ఆ తాపసులలో వున్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు.

                    పదిహేను - పదహారు అధ్యాయాలు సమాప్తం 
                    ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తం 

0 Comments To "Karthika Masam Day 8 Parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!