Karthika Masam Day 12 Parayanam

కార్తీక పురాణము - పన్నెండవ రోజు పారాయణం 


                    ఇరవై నాలుగవ అధ్యాయము


అత్రిమహముని చెబుతున్నాడు:- అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిబోధిని' అని అంటారు. ఆ ఒక్క పర్వతిథీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, ఏకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది. అంటే - ఈ ద్వాదశినాడు ఒకరికి అన్నదానం చేసినా కోటిమందికి అన్నదానం చేసిన పుణ్యమూ, ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగలించిన పాపమూ కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనాద్వాదశీ ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో - ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ, ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నిమయాన్నయినా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశీ తిథినాడు ఉపవాసం ఉండి, మరుసటినాడు ద్వాదశీ తిథి దాటిపోకుండా పారణ చేయాలి. దానిద్వారా కలిగే శ్రేయస్సును శేషశాయి చెప్పలేగాని- శుధుడు చెప్పలేడు. ఇందుకు అంబరీషుడు కథే ఉదాహరణ.


                    అంబరీష ఉపాఖ్యానము


ద్వాదశీ వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవోత్తముడు అయిన అంబరీష అనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాశం చేసి, మరుసటి రోజు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా, తిథి దాటకుండానే పారణ చేయాలని అనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆతిథ్యమిషతో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశీ పారాయణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నానం చేయడం కోసం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంత సేపటికీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాల అతిక్రమణ కాకుండా పారణ చేసి తీరాల్సింది. అతిథి వచ్చేవరకూ ఆగడం గృహస్థ ధర్మం. దాంతో వదలలేడు, ద్వాదశీ దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం. దీనినీ వదులుకోలేడు అదీగాక -


శ్లో     హరిభక్తి పరిత్యాగో ద్వాదశీత్యాగతో భవేత్ 
    యతోమ భయా త్క్రు త్వాసమ్య గుపొణం !
    పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరినాసరే  
    పాపముల్లంఘనేపాత్ నైవయజ్యం మనిషిణా !!


"ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించినవాడు, విష్ణుభక్తి విసర్జించిన వాడవుతారు. ఏకాదశినాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో - ద్వాదశీనాడు పారణ చేయకపోతే, అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు - ఒక్క ద్వాదశీ పారణ అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే, అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీపారణం మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణానికి అపాయం అయినా సరే, ద్వాదశీ పారణ చేయడమే కర్తవ్యం. దానిద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపంవల్ల కల్పాంత దుఖమే కలుగునుగాక! దూర్వాస వచ్చిన తరువాత కన్నా, ద్వాదశీ తిథి ముగిసేలోపునే పారణం చేసి - హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు'' ఇలా అని మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా, ధర్మవర్తనుడు అయిన ఆ అంబరీషుడు, ద్వాదశీ పారణ కోసం తనను పర్యవేక్షిస్తూ ఉన్న వేదవిదులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు.


అంబరీషుడి సమస్య విన్న వేదస్వరూపులైన ఆ బ్రాహ్మణులు, క్షణాల మీద శృతి స్మ్రుతి శాస్తపురాణాలు అన్నింటినీ మననం చేసుకుని "మహారాజా! సర్వేశ్వరుడు అయిన ఆ భగవంతుడు సమస్త జీవులలో జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై వుంటున్నాడు. ఆ జఠరాగ్ని, ప్రాణ వాయువుచేత ప్రజ్వలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతుంది. దాని తాపమే క్షుత్పిపాసా భాధగా చెప్పబడుతూ వుంది. కాబట్టి, యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరింపబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ వున్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే ..


శ్లో     అత శ్వపాకం శూద్రం వా స్వన్య స ద్మాగతం శుకం !
    అతి క్రమ్య న భుంజీత గృహమే థ్యతిధిం నిజం !!


తన యింటికి వచ్చినవాడు శూద్రుడైనా-ఛండాలుడైనా సరే, ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చెయ్యకూడదు. అటువంటిది బ్రాహ్మణుడే అతిథిగా వస్తే - అతనిని విసర్జించడం అధమాధమమని వేరే చెప్పనక్కరలేదు గదా! పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుడికంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది. భూవరా! భూసురవమానం వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనో సంకల్పాలు సైతం తిరోహితాలై పోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవత స్వరూపుడిగా చెప్పబడి ఉండటం వలన, బ్రాహ్మణ అవమానం సర్వదేవతలనూ అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతా తుల్యుడు అయి ఉండగా - కేవలం జన్మవలననే కాక, జ్ఞానం వలనా, తపో మహిమవలనా, శుద్ధ రుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుడువంటి ఋషిని భోజనానికి పిలిచి, ఆయనకంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి సహిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసినా ...


శ్లో     వయం న నిశ్చయం క్వాపిగచ్చామో నరపుంగవ !
    తథాపి ప్రథమం విప్రా ద్భోజనం న ప్ర కిర్తితం !!


బ్రాహ్మణా తిథి కంటే ముందుగా భుజించటం కీర్తికరమైనది మాత్రం కాదు.
ధరణీపాలా! ద్వాదశీ పారణా పరిత్యాగం వలన, అంతకు పూర్వ దినం అయిన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది, ఆ ఏకాదశీ త్యాగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఇటు - బ్రాహ్మణాతిథి అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే వున్నాయి.


                    ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం


                    ఇరవై అయిదవ అధ్యాయం ప్రారంభం


"అంబరీషా! పూర్వకర్మ అనుసారియై నీకు ఇప్పుడు రెండు ప్రక్కల నుంచీ కంఠపాశరజ్జువులా ఈ ధర్మసంకటం ప్రాప్తించింది, దూర్వాసుడు వచ్చేవరకూ ఆగాలో, లేదా - ద్వాదశీ ఘడియలు దాటకుండా పారణ చేయాలో ఏదీ నిశ్చయించి చెప్పడానికి ...


శ్లో     స్వాబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం 
మేము ఆశక్తులమై పోతున్నాం. కాబట్టి "ఆత్మబుద్ధి స్సుఖంచైవ'' అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచినదానిని నువ్వు ఆచరించు'' అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు 'ఓ బ్రాహ్మణులారా! బ్రాహ్మణ శాపంకన్నా విష్ణుభక్తిని విడిచి పెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను.


శ్లో     కర్తుం సాధ్యం యదాకాలం ద్వాదశ్యద్బిస్తు పారయేత్ !
    కృతావకాశ వత్సశ్చాత్ భూమ జీత్యేత్యవరేజగః !!


అనే శ్రుత్యర్థబోధక ప్రమాణం చేత, ప్రస్తుతం నేను కాసిన్ని మంచినీళ్ళను త్రాగుతాను. అందువల్ల, అతిథి కంటే ముందు అన్నం తిన్న దోషం రాదు. ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితమూ వుంటుంది. ఇందువలన దూర్వాసుడు కోపించి శపించే అవకాశమూ ఉండదు. నా జన్మాంతర పాపమూ నశిస్తుంది. ఇదే నా నిర్ణయం'' అన్నాడు. అలా అంటూ, వారి ఎదుటనే రవ్వంత జలపానం చేశాడు. నోటిదగ్గరి నీటిపాత్రని ఇంకా నేల మీద పెట్టనయినా లేదు - అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు దూర్వాసుడు. చేతిలో జలపాత్రతో వున్న రాజును చూడగానే జరిగింది ఏమిటో గ్రహించేశాడు. 'చూపులతోనే కాల్చేస్తాడు' అన్నట్లు చురచురా చూశాడు. మాటలతోనే మారణహోమం చేస్తాడా అన్నట్లు ... "రేరే దురహంకార పూరిత రాజాధమా! అతిథినైన నేను లేకుండానే ద్వాదశీ పారణం చేస్తావా?


శ్లో     అస్నాత్వాతుమలం భుంక్తే  -అదత్వాఘంతు కేవలం
    యో నిమంత్రితాతిధి: పూర్వం మోహాద్భుంక్తే తతోధమః 
    మాలాశేసతు విజ్ఞేయః క్రిమిదిష్టాగాతో యధా 
    భుంజతేతేత్వఘం పాపాయే ఏవచ త్యాత్మకారణాత్  
    ఆతిథర్థ్యంచ పక్వం యే భుంజతే తేత్వ ఘాదఘం !!


స్నానం చెయ్యకుండా భోంచేసేవాడు - మలభోజి అవుతాడు. పరుడికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తానాహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోంచేసేవాడు - ఆశుద్ధంతో పురుగువలే మలాశియే అవుతాడు. పక్వమైనది గాని, ఫలం గాని, పత్రంగాని, నీళ్ళుగాని - భోజనార్థంగా భావించి సేవించినది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన - నీచేత అంగీకృతుడనైన అతిథిని - నేను రాకుండానే, నాకంటే ముందుగా అన్న ప్రతివిధిగా జలపారణం చేశావు. బ్రాహ్మణ తిరస్కారివైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువుకు భక్తుడి ఎలా అవుతావు? "యథా పురోధనస్స్వస్య మదమోహాన్మహీపతే'' పురోహితుడు చెప్పినట్లు కాకుండా, మరోవిధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు'' అన్నాడు దూర్వాసుడు. ఆ ఆగ్రహానికి భయకంపితుడు అయిన అంబరీషుడు దోసిలి పట్టినవాడై "మునీంద్రా! నేను పాపినే! పరమ నీచుడనే! అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియున్ని గనుక - ఏ అభిజాత్యహంకారం వల్లనో తప్పు నేను చేశాను, కాని, నువ్వు బ్రాహ్మణుడివైన కారణంగా శాంతాన్ని వహించు. నన్ను రక్షించు. నీవంటి గొప్ప ఋషులు తప్ప విడిచి - మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరు ఉంటారు?'' అంటూ అతని పాదాలమీద పడి ప్రార్థించాడు. అయినా సరే, ఆ దూర్వాసుడి కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు. రవంత ఎడంగా వెళ్ళి "ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులు అవుతారు. కాని, నేను అలాంటివాడిని కాను. నాకు కోపంవస్తే, శాపం పెట్టకుండా ఉండను. చేపగానూ, తాబేలుగానూ, పందిగానూ, మరుగుజ్జు వాడిగానూ, వికృతమైన ముఖం కలవాడిగానూ, క్రూరుడైన బ్రాహ్మణుడిగానూ, జ్ఞానశూన్యుడైన క్షత్రియుడిగానూ, అధికారంలేని క్షత్రియుడిగానూ, దురాచార భూయిష్టమైన పాషండ మార్గవాదిగానూ, నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడివనై  బ్రాహ్మణుడిగానూ - పదిజన్మల (గర్భ నరకాల) అనుభవించు'' అని శపించాడు. అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కయి వున్నాడు అంబరీషుడు. అయినా అతని అంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీమహావిష్ణువు కల్పాంతరకాల లోకకళ్యానార్థమొ, బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతంవల్లా, ఆ పదిజన్మల శాపాన్ని తానే భరించదలచి - 'గృహ్ణామి' అని ఊరుకున్నాడు. "ఇన్ని శాపాలు ఇస్తే - గృహ్ణామి - అంటాడేమిటి రాజు? వీడికింకా పెద్ద శాపం ఇవ్వాలి' అని మరోసారి నోరు తెరవబోయాడు దూర్వాసుడు. కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దూర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే - భక్తుడైన అంబరీషుడి రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని వినియోగించడంతో, అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి - జగదేక శరణ్యమూ, జగదేక భీకరమూ అయిన సుదర్శనచక్రం రివ్వున దూర్వాసుడ్ని వంక కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి - జడమైన విష్ణుచక్రం, దివ్యకాంతి ప్రభాశోభితమై తనవంక కదలిరావాడాన్ని చూడగానే - దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రం అంతా కూడా క్షణాలమీద పరిభ్రమించాడు. అయినా 'సుదర్శనం' అతగాడిని తరుముతూనే వుంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు - వశిష్టాది బ్రహ్మర్షులనీ. ఇంద్రాది అష్టదిక్పాలకులనీ, చిట్టచివర శివ-బ్రహ్మలనీ కూడా శరణు కోరాడు. కాని, అతడి వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తూన్న విష్నుచక్రాన్ని చూసి ఎవరికీ వారే తప్పుకున్నారు తప్ప విడిచి, తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు.


                    ఇరవై అయిదవ అధ్యాయం సమాప్తం


                    ఇరవై ఆరవ అధ్యాయం ప్రారంభం


 ఆ విధంగా ప్రాణభీతిపరుడైన దూర్వాసుడు సంభవిత లోకాలు అన్నీ సంచరించి, చిట్టచివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరుకున్నాడు. "హే జగన్నాథా! హే బ్రాహ్మణ ప్రియా! మాధవా! మధుసూధనా! కోటిసూర్యులతో సమానమైన కాంతినీ-వేడినీ కలిగిన నీ ధర్మచక్రం నన్ను చంపడం కోసం వస్తున్నది. బ్రాహ్మణపాదముద్రా సుశోభిత మహారస్కుడవైన నువ్వే నన్నీ ఆపదనుంచి కాపాడాలి'  అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహనే శరణుకోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు "దూర్వాసా! ప్రపంచానికి నేను దైవం అయినా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ, నువ్వు అద్బ్రాహ్మణుడివీ, రుద్రాంశసంభూతుడివీ అయి వుండీ కూడా అంబరీషుడిని అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిన నువ్వు, సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలచుకున్నవాడివి నీకోసం ఎదురు చూడకుండా, ద్వాదశి ఘడియలు గతించి పోకుండా పారణచేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యసద్బ్రాహ్మణుడివీ, రుద్రాంశ సంభూతుదివీ అయివుండీ కూడా అంబరీషుడిని శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానంకోసం వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలచుకున్నవాడివి నీకోసం ఎదురు చూడకుండా, ద్వాదశీ ఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి వున్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళను తీసుకున్నాడేగాని, ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. ' అనాహారేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వారినాఃసదా'' నిషిద్ద ఆహరాలకు కూడా, నీటిపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయా! నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కాని, కోపగించుకోలేదు! అయినా సరే, ముముక్షువైన అతగాడిని నువ్వు పదిదుర్భరజన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం, నీ శాపాన్ని నిముషంలో త్రిప్పివేయగలను. కాని, బ్రాహ్మణవాక్యం వట్టిపోయిందనే లోకాపవాదు నీకు కలగకుండా ఉండడం కోసం, ఆ భక్తుడి హృదయం చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించినవాడినీ, నీ శాపాన్ని అంగీకరిస్తూ 'గృహ్ణామి' అన్నవాడినీ నేనేగాని, ఆ అంబరీషుడు మాత్రంకాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషి ప్రభూ! నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురున్ని సంహరించేందుకూ, శిష్టుడైన మనువును ఉద్దరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ, మందరగిరిని మూపున ధరించి, దానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుడి (తాబేలు)ని అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు, హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకషిపున్ని సంహరించడం కోసం వికృతాసనం గల 'నరసింహ' రూపావతార దారుడిని అవుతాను. సర్వదేవతా సంరక్షణకోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక 'బలి' అనేవాడిని శిక్షించేందుకు వామనుడి నవుతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మదులైన రాజులను చంపుతాను. రావణసంహారం కోసం ఆత్మజ్ఞానశూన్యుడై, అంటే, నేనే భగవంతుడిని అనేది మరిచిపోయి మాయామానుష విగ్రహుడి అయిన దశరథరాముడిగా అవతరిస్తాను, ద్వాపరయుగంలో జ్ఞానినీ, బలిష్టినీ అయి వుండీ కూడా రాజ్యాధికారం లేకుండా రాజు (బలరాముడు)కు తమ్ముడిగా కృష్ణుడిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభంలో పాపమొహం కోసం పాషండమత ప్రచారకుడినై పుడతాను. ఆ యుగాంతంలో శత్రుఘాతుకుడైన బ్రాహ్మణుడిగా ప్రభవిస్తాను. దూర్వాసా! నా ఈ దశావతారాలనూ ఆయా అవతారాలలోని లీలలను ఎవరు విన్నా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలు అయిపోతాయి. 


శ్లో     ధర్మా నానావిధా వేదే విస్తృతా నరజన్మానాం !
    దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశః !!


దేశ, కాల, వయోవస్థలను బట్టి, వర్ణాశ్రమాలను అనుసరించి, 'ధర్మం' అనేక విధాలుగా వేదంచే ప్రవచించబడివుంది. అటువంటి వివిధవిధ ధర్మాలలోనూ కూడా 'ఏకాదశి'నాడు ఉపవాసం, ద్వాదశిదాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకుగాను, నువ్వు ఆ అంబరీషుడిని శపించింది చాలక, తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యం చేయడమూ భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడమూ రెండూ నా బాధ్యతలే కాబట్టి మళ్ళీ శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియంత్రించాను.


                    ఇరవైనాలుగు, ఇరవై ఐదు, ఇరవై ఆరు అధ్యాయాలు సమాప్తం.


                    పన్నెండవ రోజు పారాయణ సమాప్తం.

 

0 Comments To "Karthika Masam Day 12 Parayanam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!