మహాశివ రాత్రి పూజా విధానం

మహాశివ రాత్రి పూజా విధానం

మహాశివ రాత్రి పూజా విధానం .

జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.


ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ !

    ఉష ఋణేన యాతయ !!


మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూట జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్థశి రోజు వచ్చిన రాత్రికి ఒక ప్రత్యేకత వుంది. చతుర్థశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో ఆ రాత్రి జాగారం చేస్తారో వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం రాదు (మరుజన్మ ఉండడు).

శివతంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం !

    మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన !!

గరుడ, పద్మ, స్కంద, అగ్ని మొదలైన పురాణాలలో దీనిని ప్రశంసించడం జరిగింది. మనుషులు ఎవరైతే శివరాత్రి రోజున ఉపవాసం చేసి, బిల్వపత్రాలతో శివపూజ, రాత్రి జాగరణ చేస్తారో వారిని పరమశివుడు నరకాన్నుండి రక్షిస్తాడు, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసేవారు శివమయంలో లీనమైపోతాడు. దానం, తపం, యజ్ఞం, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివి ఎన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. 

వరాహోపనిషత్తు లో ఈ విధంగా చెప్పబడింది.

ఉప సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మ నోః

    ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్ః

భవిష్యపురాణంలో కూడా ఈ విధంగా చెప్పబడింది.

ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా

    ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్ః


మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము, వ్రతానికి యోగ్యమైన కాలం రాత్రి, ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయం అన్నమాట. చతుర్థశి రాత్రి ఆయనను పూజించి అభిషేకించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఈ విధంగా స్పష్టంగా చెప్పాడు. 'సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రికాలంలో మేల్కొని తిరుగుతూ ఉంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.


శివరాత్రి పర్వదినానికి ఎంతటి మహాత్మ్యం ఉందో తెలియచెప్పే కథ ఇది. శక్తి ఉన్నవారు, పండితులు శాస్త్రబద్ధంగా వ్రతాలు, పూజలు శివరాత్రినాడు చేసి పుణ్యఫలం పొందుతుంటారు. మరి అలాంటివేవీ లేని సామాన్యుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం కూడా ఈ కథాంశంలో దొరుకుతుంది. బిల్వ దళార్చన, జలాభిషేకం అంటే శివుడికి ఎంత ప్రీతో కూడా ఇక్కడ అవగతమవుతుంది. ఇంకా విచిత్రమేమిటంటే ఈ కథంతా ఓ ఆటవికుడు, ఓ మూడు లేళ్ళ నడుమ జరిగింది కావటం. శివపురాణం కోటి రుద్రసహిత నలభయ్యో అధ్యాయంలో ఈ కథ ఉంది.


పూర్వం ఓ అడవిలో ఓ వేటగాడు ఉండేవాడు. అడవిలో ఉన్న జంతువులను సంహరిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవటమే అతని పని. అతను చిన్నప్పటి నుంచి ఒక్క పుణ్యకార్యమూ చేయలేదు. దాదాపు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ తన కుటుంబ పోషణ కోసమే బలిపెట్టాడు ఆ భిల్లుడు. ఇలా ఉండగా ఓ రోజున అతడి తల్లి,తండ్రి, భార్య ఇంట్లో తినటానికి ఏమీ లేదని, ఆహారంగా ఏ జంతువునైనా చంపి తెమ్మనమని కోరారు. తన కుటుంబ సభ్యుల ఆకలిని తీర్చటం కోసం విల్లు, అమ్ములు తీసుకొని అడవిలోకి బయలుదేరి వెళ్ళాడు ఆ భిల్లుడు. ఆ రోజున ఎంతసేపు వెతికినా ఒక్క జంతువూ అతని కంట పడలేదు. అలా సూర్యాస్తమయం కావటం, ఇంకా చీకటి పడటం జరిగింది. ఎలాగైనా సరే ఒక్క మృగాన్నైనా వేటాడి కానీ ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఓ పక్క ఆకలి, మరో పక్క ఏ జంతువూ దొరకలేదన్న కోపమూ, బాధ వెంటాడసాగాయి. ఇంతలో అతనికి ఒక మారేడు చెట్టు కనిపించింది. ఆ చెట్టు సమీపంలోనే ఒక నీటి మడుగు కూడా ఉంది.


భిల్లుడి మనస్సులో తళుక్కున ఆలోచన ఒకటి మెదిలింది. మడుగులో ఉన్న నీళ్ళు తాగటానికి ఏదో ఒక జంతువు అటు వచ్చి తీరుతుంది కనుక వెంటనే మారేడు చెట్టు పైకెక్కి ఓ కొమ్మ మీద నక్కి కూర్చొని అటొచ్చిన జంతువును వేటాడవచ్చని అనుకొన్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న తాబేటి కాయ (మంచినీరు తెచ్చుకొనే పాత్ర)లోమడుగులో ఉన్న నీరు నింపుకొని మారేడు చెట్టు కొమ్మ పైకి ఎక్కి కూర్చొన్నాడు. దైవలీలగానో, విచిత్రంగానో ఆ చెట్టు కిందే అంతకు ముందు ఎవరో ఉంచిన ఓ శివలింగం ఉంది. ఆ రాత్రి తొలిజాము గడుస్తుండగా అతని నిరీక్షణ ఫలించింది. ఒక లేడి మడుగులో నీరు తాగటానికి వచ్చింది. లేడి కన్పించిదన్న ఆనందంలో విల్లును, బాణాన్ని సిద్ధం చేస్తుండగా చెట్టుకున్న నాలుగు మారేడు దళాలు, తాబేటి కాయలో ఉన్న నీరు చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి.


ఆ రోజు శివరాత్రి అని అతనికి తెలియకపోయినా అనుకోకుండానైనా శివలింగం మీద మారేడు దళాలను ఉంచి పూజించిన ఫలితం, శివలింగానికి జలాభిషేకం చేసిన పుణ్యఫలితం వెంటనే వేటగాడికి ప్రాప్తించాయి. దాంతో తెలియకుండానే అతనిలో ఉన్న క్రూరత్వం చాలా వరకు నశించింది. తనపై బాణాన్ని సంధించబోతున్న ఆ బోయతో ఆ ఆడ లేడి ఏమి చెయ్యబోతున్నాడో చెప్పమని బోయవాడిని అడిగింది. ఆ బోయ కూడా అసత్యమాడకుండా లేడిన చంపి తనకు, తన కుటుంబానికి ఆహారంగా వినియోగించబోతున్నట్లు చెప్పాడు. అప్పుడు ఆ లేడి ఇతరులకు ఉపయోగపడబోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని, అయితే ఇంటి దగ్గర తన పసిపిల్లలున్నారని, వారిని తన సోదరికి, తన భర్తకు అప్పగించి వస్తానని అంది.


బోయవాడు ముందు ఆ మాటలు వినలేదు కానీ ఆ తర్వాత లేడి చేసిన శపథాలను విని దాన్ని వెళ్ళి రమ్మనమని చెప్పాడు. ఇదంతా జరిగేసరికి శివరాత్రి నాడు మొదటి జాము ముగిసింది. బోయ మళ్ళీ చెట్టెక్కి అంతకు ముందు లాగానే జంతువుల కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో మరొక ఆడ లేడి వచ్చింది. దాన్ని వేటాడబోతుండగా మళ్ళీ కాసిని మారేడు ఆకులు, చంకకు తగిలించుకున్న తాబేటి కాయ నుండి కాసిని నీళ్ళు చెట్టుకింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. రెండో లేడి కూడా వేటగాడిని నన్నేం చేయబోతున్నావు అని అడిగింది. అతను మొదటి లేడికి చెప్పినట్టే చెప్పాడు. అప్పుడు ఆ లేడి కూడా ఇంటి దగ్గర తన భర్త, పిల్లలు ఉన్నారని, అంతకు ముందే తన సోదరి బయటకు వచ్చి ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమెను వెతుకుతూ తాను వచ్చానని అంది. పిల్లలను భర్తకు, సోదరికి అప్పగించి తాను వస్తానని అప్పుడు ఆహారంగా స్వీకరించమని చెప్పింది. నమ్మకమేమిటి అని లేడిని అతను ప్రశించాడు. అది కూడా సత్య శపథాలు చేసింది.


శివలింగానికి మారేడు దళాలు, జలాభిషేకంతో అతని క్రూరత్వం అంతా నశించినందు వల్ల లేడిని వెళ్ళి రమ్మన్నాడు. అప్పటికి రెండో జాము ముగిసింది. మూడో జాములో ఒక మగ లేడి అటుగా వచ్చింది. దాన్ని వేటాడాలని అనుకున్నంతలో అతని కదలికలకు కాసిని మారేడు దళాలు, కాసిని నీరు మళ్లీ శివలింగం మీద పడ్డాయి. 


మగ లేడి కూడా అతనితో పరులకు ఉపయోగపడటం కన్నా ఈ శరీరానికి కావలసినది ఏమిటి? అయితే ఇంటి దగ్గర ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారని, భార్యలకు పిల్లల బాధ్యతలను అప్పగించి తాను తిరిగొస్తానని చెప్పింది. ఆ వేటగాడు సత్యభూషణం మీద నమ్మకంతో వెళ్ళి రమ్మన్నాడు. మూడు లేళ్ళు ఒక చోట చేరి బోయవాడి సంగతి ముచ్చటించుకుంటున్నాయి. అవి నేనంటే నేనే ముందు వెళతానని బోయవాడికిచ్చిన మాటను తప్పడం బాగుండదని వాటిలో అవి వాదించుకున్నాయి. చివరకు మూడు లేళ్ళూ తమ పిల్లలను పొరుగు లేళ్ళకు అప్పగించి వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వేటగాడికిచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి బయులుదేరాయి. తమ తండ్రి, తల్లులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ప్రాణాలను సైతం లెక్కచేయక పోవటాన్ని చూసిన పిల్లలు అంతటి ఉత్తములైన ఆ పెద్దల బాటలోనే నడవాలని నిశ్చయించుకొని అవి కూడా బయులుదేరాయి. అలా ఆ లేళ్ళన్నీ మాట నిలుపుకోవటానికి పిల్లలతో సహా తరలి రావటాన్ని చూసిన వేటగాడికి మనస్సు చలించిపోయింది.


జంతు జన్మనెత్తిన వాటికి సత్యవాక్యాన్ని పాలించే అంత గొప్ప మనస్సుంటే మనిషిగా పుట్టిఇన్నాళ్ళూ తాను హింస చేస్తూ బతుకుతున్నందుకు వాడికి పశ్చాత్తాపం కలిగింది. వాటిని ఆదరించి తిరిగి వెళ్ళిపోమ్మని చెప్పాడు. బోయవాడిలో కలిగిన ఆ మంచి మార్పు, ఆ రాత్రి ప్రతి జాములోనూ చేసిన మారేడు దళాల పూజ, జలాభిషేకం, జాగారం, ఉపవాసం ఇవన్నీ శివుడికి ప్రీతి కలిగించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరుసటి జన్మలో ఆ భిల్లుడు గుహుడు అనే పేరున జన్మించి దశరథ మహారాజు కుమారుడైన శ్రీ రామచంద్రుడికి సేవ చేసే భాగ్యాన్ని పొందుతాడని శివుడు వరమిచ్చాడు. అలాగే బోయవాడికి కన్పించిన లేళ్ళు కూడా సత్యాన్ని పాలించినందుకు మోక్షాన్ని పొందుతాయని శివుడు చెప్పాడు. ఆనాడిక్కడ ప్రత్యక్షమైన శివుడే వ్యాదేశ్వరుడు అనే శివలింగంగా అవతరించాడు. సంస్కృతంలో వ్యాద శబ్దానికి తెలుగులో బోయ అని అర్థం.


ఈ కథలో శివరాత్రి మహాత్య్మం మారేడు దళాల పూజ, జలాభిషేకం వ్యాదేశ్వర అవతారం ఇవన్నీ అటుంచిన ఓ గొప్ప సందేశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఉన్న గొప్పతనం, తల్లిదండ్రులు ఎంత నీతి, నిజాయితీలతో ఉంటే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని చెప్పే సందేహాలు ఇమిడి ఉన్నాయి. వీటిని గమనించి ఆచరిస్తే గొప్ప పుణ్యఫలందక్కినట్టే అవుతుంది. అసలు మన పండుగలు, పర్వదినాలు, వ్రతాలు కథలలోని గొప్ప అంతరార్థం ఇదే.


Products related to this article

999 Silver Lingashtakam

999 Silver Lingashtakam

Experience the divine energy of the 999 silver Lingashtakam, a sacred symbol of Lord Shiva. This spiritual is a manifestation of devotion and inner connection. Enhance your spiritual practice with thi..

$4.00

999 Silver Ashta Lakshmi Stotram

999 Silver Ashta Lakshmi Stotram

Explore the elegance of the 999 Silver Ashta Lakshmi Stotram, a sacred prayer collection intricately crafted to invoke the blessings of the eight forms of Goddess Lakshmi. Discover the spiritual signi..

$4.00