DOKKA SEETHAMMA

DOKKA SEETHAMMA

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి  డొక్కా_సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతములోని డెల్టాగన్నవరం లేదా లంకల  గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టి ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానము జరిపిన మహాఇల్లాలు. 'అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు. 


ఈమె చదువుసంధ్యలు లేని సాధారణ స్త్రీ. ఆమె తాను అన్నదానంచేసి, విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి . భారతీయ సాంప్రదాయంలో  'అన్నం_పరబ్రహ్మ_స్వరూపమ్ ' అని పేర్కొనడం మనం వింటున్నాం. అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా 'అతిథి దేవోభవ' అన్నపదానికి ఉదాహరణగా నిలిచినవ్యక్తి ఆమె .


గన్నవరం గోదావరి నదిపై కల అక్విడెక్ట్ కు ఈమె పేరున డొక్కాసీతమ్మ అక్విడెక్ట్ అని నామకరణం చేసారు.


బ్రిటీష్ ప్రభుత్వం ఆమె దాతృత్వాన్ని గుర్తించింది, కింగ్డ్ ఎడ్వర్డ్ VII ఆమెను తన వార్షికోత్సవ వేడుకలకు భారతదేశంలోని ఇతర అతిథులతో కలిసి ఆహ్వానించారు. గౌరవంతో ఆమెను ఢిల్లీ  తీసుకురావాలని ఆయన మద్రాస్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు, ఆ ఆహ్వానానికి సీతమ్మ ‘క్షమించండి. నేను రాలేను’ అని బదులిచ్చింది. దీంతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, "నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టాభిషేకలు ఎందుకు, వద్దు" అన్నారు ఆవిడ. "అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు" అని ఆ కలెక్టరు గారు చెబితే, "నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి" అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం.


"ఈమె జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియచేయటం, ఆమె చేసిన నిస్స్వార్ధ సేవలను గుర్తుచేసి ఆమె చరిత్రనుండి స్ఫూర్తివంతులను చేయటమే ఆ మహానీయురాలికి మనం ఇచ్చుకునే ఘనమైన నివాళి"