Bhagavad Sri Ramanuja Acharya Jayanti

భగవద్రామానుజ జయంతి

'ఇళయ పెరుమాళ్' పింగళ వర్షం, చైత్రమాసం, తిరువాదిరై రాశి (ఆరుద్ర నక్షత్రం), శుక్లపక్ష పంచమి, శుక్రవారం, క్రీ. శ. 1017, ఏప్రిల్ 13న మదరాసు పట్టణానికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరుంబుదూర్ లో కేశవా సోమయాజి దీక్షితార్, కాంతిమతి అనే పుణ్యదంపతులకు జన్మించాడు. సోమయాజి దీక్షితార్, కాంతిమతిలకు ఎంత కాలానికీ సంతానం కలగకపోవడంతో వీరిద్దరూ కలిసి తిరుళ్ళిక్కేణి ఒడ్డున ఉన్న పార్థసారథి స్వామి దేవాలయంలో యజ్ఞాల ద్వారా ఆ స్వామిని మెప్పించి సంతానం పొందే ఉద్దేశ్యంతో శ్రీపెరుంబుదూర్ ను వదిలి వెళ్ళారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల వీరికి ఒక సంవత్సరం తరువాత జన్మించిన శిశువే రామానుజాచార్యుడు. శిశువు యొక్క జనన మాసం రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మరాశులతో సరితూగటంతో, శిశువు మేనమామ పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు) ఆ శిశువు ఆదిశేషు అవతారం అని భావించి 'ఇళయ పెరుమాళ్' అనే పేరును నిర్థారించాడు. శిశువు శరీరంపై ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నమ్బికి, నమ్మాళ్వార్ తన 'తిరువోయ్ మోళ్ళి' అనే గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయ అభివృద్ధికి పాతుపడగల గొప్ప సన్యాసి, గురువు ఈ శిశువే అన్న నమ్మకం కుదిరింది. ఇళయ పెరుమాళ్ కాలాంతరంలో రామానుజుడుగా మారారు. రామానుజాచార్య విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యులు త్రిమతాచార్యులలో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవాలిన ధైర్యానికి, దేవునిపై చూపించవలసిన అనన్యసామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుల జీవితం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

 

ఇళయ పెరుమాళ్ చిన్నతనంలో 'కంచిపూర్ణుడు' అనే భక్తుడు రోజూ కాంజీవరం (కంచి) నుండి శ్రీపెరుంబుదూర్ మీదుగా 'పూణమ్మెల్లే' అనే గ్రామంలో ఉన్న దేవాలయానికి పూజకోసం వెళ్ళేవాడు. కంచిపూర్ణుడి శ్రద్ధాభక్తులు ఇళయ పెరుమాళ్ ను ఎంతగానో ఆకర్షించాయి. ఒక రోజు పూజ పూర్తిచేసుకుని వెనుదిరిగిన కంచిపూర్ణుడిని ఇళయ పెరుమాళ్ తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టాడు. కాంచిపూర్ణుడి భోజనం పూర్తయిన తరువాత అతడి కాళ్ళు వత్తడానికి ఉద్యుక్తుడయ్యాడు కానీ కాంచిపూర్ణుదు దీనికి అంగీకరించలేదు, తత్తరపాటుతో వెనక్కు తగ్గి ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఇళయ పెరుమాళ్ సేవలను నిరాకరించాడు. బహ్గావంతునిపై ఉన్న అతడి భక్తిశ్రద్ధలు కేవలం అలంకారప్రాయమైన జంధ్యాన్ని కంటే ఉన్నతమైనవని, అందుచేత కాంచిపూర్ణుడు తనకు గురువుతో సమానమని వాదించి, ఇళయ పెరుమాళ్ అతడిని ఆకతుకోవడంతో అప్పటి నుండి వారిరువురి మధ్య గౌరవమర్యాదలు, ప్రేమ ఏర్పడ్డాయి. భక్తిలోని మొదటి పాఠాలు కాంచిపూర్ణుదు దగ్గర నుండే ఇళయ పెరుమాళ్ అభ్యసించాడు అని చెప్పుకోవచ్చు. ఇళయ పెరుమాళ్ కు పదహారవ యేట రక్షమాంబ (తంజమ్మాళ్)తో వివాహం జరిగింది. వివాహం తరువాత తండ్రి కేశవ సోమయాజి చనిపోవడంతో కుటుంబ సమేతంగా కాంచీ నగరానికి చేరుకున్నాడు. నాటికి కంచిలో పేరు పొందిన ఆచార్య 'యాదవప్రకాష' దగ్గర విద్యాభ్యాసం చేయడం ప్రారంభించాడు.  తన భార్య అతిథులను గౌరవించకపోవడం, కులభేదాలు పాటించడం నచ్చని రామానుజులు ఆమెను పుట్టింటికి వెళ్ళిపొమ్మని ఆదేశించి తాను సన్యాసం స్వీకరించి 'యతిరాజు'గా ప్రసిద్ధులయ్యారు.యాదవప్రకాశుడు అద్వైతం, భేదాభేద వేదాంతాలలో పాండిత్యాన్ని గడించి అనేకమంది శిష్యులను ఆకర్షించి వారికి విద్యాబుద్ధులు చెబుతుండేవాడు. ఇళయ పెరుమాళ్ వంటి అసామాన్య ప్రతిభగల శిష్యుడు తనకు దొరికినందుకు యాదవప్రకాశుడు పరమానందభరితుడయ్యి అనతికాలంలోనే ఇళయ పెరుమాళ్ భక్తిపరమైన ఆలోచనా విధానాన్ని గమనించాడు. యాదవప్రకాషుడి ఉపనిశాద్వ్యాఖ్యలు ఆకర్మికము, అనాసికములుగా ఉండటం ఇళయ పెరుమాళ్ ను బాధించేది. దాని కారణంగా ఇళయ పెరుమాళ్ తరచూ తన గురువైన యాదవప్రకాషుడితో వాగ్వాదానికి దిగేవాడు. ఒకరోజు ఛాం దోగ్యోపనిషత్తు పై ఆదిశంకరుని వ్యాఖ్యానంలో 'కప్యాసం పున్డరీకమేవమక్షిణి' అనే వాక్యాన్ని ఆదిశంకరుడు 'ఎర్రనైన కోటి పిరుదులను పోలిన (కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడి అని అనువదించినట్లుగా యాదవప్రకాషుడు తన శిష్యులకు చెప్పాడు. అది విన్న ఇళయ పెరుమాళ్ కన్నులలో ధారగా నీరు కారసాగింది. యాదవప్రకాషుడు కారణం అడగ్గా అది సరి అయిన వ్యాఖ్యకాదని బదులిచ్చాడు. ఆగ్రహం చెందిన యాదవప్రకాషుడు వేరొక వ్యాఖ్యను చేయమని హేళన చేశాడు. దానికి ఇళయ పెరుమాళ్ 'కప్యాసం' అనే పదానికి కం జాలం పిబతి ఇతి కపిః' (నీటిని గ్రహించువాడు, అనగా సూర్యుడు) అని నూతనార్థాన్ని చెప్పి 'కప్యాసం పున్డరీకమేవమక్షిణి' అనే వ్యాక్యాన్ని 'నీటిని గ్రహించిన సూర్యుని కిరణాలతో పుష్పించిన (కప్యాసం) కమలాలవంటి కన్నులుగలవాడు' అని భావాదిక్యతనూ, అస్తికత్వాన్నీ ఊటంకించే అర్థాన్ని చెప్పాడు. మళ్ళీ ఒకసారి 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా' అనే మహావాక్యంపై జరుగుతున్న వాదంలో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మయొక్క గుణాలనీ. అవే బ్రహ్మ కాదని యాదవప్రకాషుడితో వాదించాడు. ఈ వాదోపవాదాలలో ఇళయ పెరుమాళ్ పాండిత్యం, అస్తికత్వంతో కూడిన ఆర్ధ్రతాభావం, మరియు భక్తిపూరితమైన వ్యాఖ్యానం యాదవప్రకాశుడికి కంటగింపు కాసాగింది. అహంకారపూరితమైన మనస్సుతో, ఈర్ష్యతో యాదవప్రకాషుడు ఇళయ పెరుమాళ్ ను హతమార్చడానికి పన్నాగం పన్నాడు. గోవిందుడు అనే శిష్యుని ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఇళయ పెరుమాళ్ చాకచక్యంగా సమయానికి తప్పించుకున్నాడు. సాంప్రదాయక గ్రంథాల ప్రకారం, ఈ సమయంలో కంచిలో వెలసిన వరదరాజ స్వామి దంపతులు మారు వేషంలో వచ్చి ఇళయ పెరుమాళ్ కు కంచి దారి చూపించి అతడిని రాఖ్శించారు అని తెలుస్తుంది. తరువాత కొంత కాలానికి ఇళయ పెరుమాళ్ వాదనలను అంగీకరించలేని యాదవప్రకాషుడు ఇళయ పెరుమాళ్ ను తన శిష్యరికం నుండి విముక్తుడిని చేశాడు. ఏమైనప్పటికీ, బ్రహ్మసూత్రాలను, ఉపనిషత్తులను, పురాణగ్రంథాలను ఎంత తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారో తెలుసుకోవడానికి యాదవప్రకాషుడి శిష్యరికం ఎంతగానో దోహద పడింది అనడంలో అతిశయోక్తి లేదు. వేదాంతానికి కొత్త అర్థం చెప్పవలసిన సమయం ఆసన్నమైనదని నిర్ణయించుకోవడానికి, ఇళయ పెరుమాళ్ కు యాదవప్రకాషుడి శిష్యరికం సహకరించింది.

'ఆళవందార్' అనే పేరుతొ ప్రసిద్ధుడైన యమునాచార్యుడు, వైష్ణవ సాంప్రదాయంలో పేరుగాంచిన గురువు. ఆళవందార్ తిరుచిరాపల్లి (తిరుచ్చి)జిల్లాలోని శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో తన సేవలను అందించేవారు. యాదవప్రకాషుడి శిష్యరికంలో ఉన్న ఇళయ పెరుమాళ్ గొప్పతనాన్ని, తెలివితేటలను, భక్తిపరమైన వ్యాఖ్యలను చూసి, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. దీని కోసం ఇళయ పెరుమాళ్ ను కలుసుకోవాలని ఆళవందార్ కాంచీపురాన్ని సందర్శించాడు కూడా కనీ కారణాంతరాల వల్ల ఇళయ పెరుమాళ్ ను కలవలేక, నిరాశతో వెనుతిరిగాడు. యాదవప్రకాషుడు తన శిష్యరికం నుండి తొలిగించిన విషయం తెలుసుకుని అతడిని తన శిష్యునిగా చేసుకోవాలనే ఉద్దేశ్యాన్ని 'మహాపూర్ణుడు' అనే శిష్యుని ద్వారా తెలియచేశాడు. మహాపూర్ణుడు ఇళయ పెరుమాళ్ ను కలుసుకుని శ్రీరంగం తెసుకు వచ్చే సమయానికే యమునాచార్యుడు తన ఆఖరి శ్వాసను విడిచిపెట్టాడు, భౌతికకాయం అంత్యక్రియలకు సిద్ధపరచబడి ఉంది. కాని ఆయన కుడి చేతి మూడు వెళ్ళు ముడుచుకొని ఉండటం ఇళయ పెరుమాళ్ గమనించాడు. ఆ మూడు వేళ్ళూ తాను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన ఇళయ పెరుమాళ్ ఈ విధంగా మూడు శపథాలు చేశాడు. 

 

1 వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన పంచ సంస్కార కర్మ, నాలాయిర దివ్య ప్రబంధ, శరణాగతితో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం, అనే మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించాలి.

2 వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాలకు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయడం.

3 భాగవత, విష్ణుపురాణాలు రచించిన వేదవ్యాసం పరాశర మునుల అంశతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి వారికి ఆ నామదేయాలను ప్రసాదించి, వ్యాస పరాశరులకు నివాళులు అర్పించడం. రామానుజుల విస్తృత పర్యటనలు, వాడ ప్రతివాదాలు చేస్తూ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని బలంగా ప్రతిపాదించడం, పలు ఆలయాలలో మూర్తులను విష్ణు సంబంధమైన విగ్రహాలుగా నిరూపించడం, ఎన్నో ఆలయాలకు సుస్పష్టమైన ఆగ విధానాలు పరిపాలన పద్ధతులు ఏర్పరచడం చేశారు. రామానుజుదు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు అయినప్పటికీ, కొన్ని సాంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పద్దెనిమిది సార్లు తిప్పించుకుని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్టీపూర్ణులనే తిరుక్కోట్టియార్ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినబడేలా ప్రకటించారు. తిరుకొట్టియార్ నంబి యమునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించవద్దనీ, విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే 'నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుబహ్విస్తే ఏమి, అందరికీ ముక్తి కలుగుతుంది కదా' అనే ఉదార భావంతో ఆయన గుడిగోపురం ఎక్కి తిరుమంత్రాన్ని అందరికీ అందించారు. రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశవ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహాసనాధిపులను, జియ్యంగార్లను, పరమైకాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ, అయ్యంగార్లూ కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు. తిరుమలలోని మూల విరాట్టు (ధృవబేరం)  విష్ణుమూర్తి విగ్రహం కాదని, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చనే వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు దగ్గరికి శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శివారాధనలకు అవకాశం ఇవ్వమని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శైవులతో అజ్రిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను, శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపించి ఓడించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరుకున్నారానీ,, రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవ ఆయుధాలు, శైవ ఆయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి 'ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు' అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడపగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధృవబేరానికి శంఖచక్రాలు ఆయుధాలుగా కనిపించాయట. మొత్తానికి తిరుమలోని మూలవిరాట్టు శ్రీనివాసుడే అని వాదన ద్వారా నిర్థారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు. తరువాతి కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూడడానికి రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడే అని తెలిసిన రామానుజులు తన పాదాలను కొండపై మోపడానికి ఇష్టపడలేదు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం మోకాళ్ళపై కొండను ఎక్కి స్వామిని కటాక్షం చేసుకున్నారు. తరువాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపచేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయపూజారులకు అగ్రహారం ఇచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురాణగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖాసన ఆగమాన్ని కొనసాగించారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో, మూర్తి స్వరూప నిర్థారణలో, ఆగమ పద్ధతులలో తిరుమల-తిరుపతిపైన రామానుజా చార్యునిది చెరగని ముద్ర. తన జీవిత ద్వితీయార్థం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేయారు. 

0 Comments To "Bhagavad Sri Ramanuja Acharya Jayanti"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!