Varaha Jayanthi

వరాహ జయంతి

వరాహ జయంతి లేదా వరాహ ద్వాదశి,వరాహం అంటే పంది. శ్రీమహావిష్ణువు లోక కళ్యాణార్థం ఎన్నో అవతారాలలో ప్రతి యుగంలోనూ అవతరించాడు. అలాంటి అవతారాలలో ముఖ్యమైన 21 అవతారాలను ఏకవింశతి అవతారాలు అని పిలుస్తారు. వాటిలో అతి ముఖ్యమైనవి దశావతారాలు. ఆ దశావతారాలలో మూడవ అవతారమే వరాహ అవతారం. ఆదివరహ మూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహా సూకరం, వరాహస్వామి వంటి పేర్లతో పిలువబడుతున్నాడు.

హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమినంతటినీ చాపలా చుట్టి పాతాళలోకంలో దాక్కున్నాడు. హిరణ్యాక్షుడి బారినుండి భూమిని కాపాడమని దేవతలు, భూదేవి శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. వారి ప్రార్థనలు మన్నించి శ్రీమహావిష్ణువు తన భార్య అయిన భూదేవిని రక్షించడానికి వరాహావతారం ఎత్తాడు. పాతాళ లోకానికి చేరుకోవడానికి వరాహావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు సముద్రంలోకి దిగి హిరణ్యాక్షుడిని సంహరించి చుట్టగా ఉన్న భూమిని తన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ప్రతిష్టించాడు.

 

పూర్వం ఒకరోజు స్వాయంభువ మనువు వినయంగా చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు … 'తండ్రీ! మీరు సమస్త జీవులకు జన్మదాతలు, జీవం పోశారు, మీకు నా నమస్కారాలు, నేను మిమ్మల్ని ఏ విధంగా సేవించాలో ఆజ్ఞ ఇవ్వండి' అని వేడుకున్నాడు. మనువు మాటలు విన్న బ్రహ్మ 'పుత్రా! నీకు శుభం కలుగుగాక. నిన్ను చూసి నేను ప్రసన్నుడిని అయ్యాను. నువ్వు నా ఆజ్ఞను కోరుకున్నావు. ఆత్మసమర్పణ చేశావు. పుత్రులు తమ తండ్రిని ఈ విధంగానే పూజించాలి. వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరంతో పాలించాలి. నీవు ధర్మపూర్వకంగా పృథ్విని పాలించు. యజ్ఞాలతో శ్రీహరిని ఆరాధించు. ప్రజలను పాలించడమే నన్ను సేవించినట్లు అవుతుంది' అని బదులిచ్చాడు.

మళ్ళీ మనువు 'పూజ్యపాదా! మీ ఆజ్ఞను తప్పకుండా పాలిస్తాను. అయినా సర్వజీవాలకు నివాసస్థానం అయిన భూమి ప్రళయజలంలో మునిగి వుంది. కాబట్టి నేను ఎలా భూమిని పరిపాలించగలను?' అని అడిగాడు. దానికి బ్రహ్మ, పృథ్విని గురించి చింతిస్తూ, భూమిని ఉద్దరించడానికి ఆలోచించసాగాడు. అప్పుడు అకస్మాత్తుగా ముక్కునుండి బొటనవ్రేలు ఆకారం అంత ఒక వరాహ శిశువు బయటికి వచ్చాడు. చూస్తుండగానే అది పర్వతాకారం దాల్చి గర్జించసాగింది.

బ్రహ్మదేవుడు భగవంతుడి ఘరఘరలు విని స్తుతించడం ప్రారంభించాడు. బ్రహ్మ స్తుతించడంతో వరాహస్వామి ప్రసన్నుడయ్యాడు. తరువాత వరాహస్వామి జగత్కళ్యాణం కోసం సముద్రంలోకి ప్రవేశించి, జలంలో మునిగి ఉన్న పృథ్విని తన కోరలపై తీసుకుని రసాతలం నుండి పైకి వస్తుండగా పరాక్రవంతుడైన హిరణ్యాక్షుడు జలంలోనే గదతో వరాహస్వామితో తలపడ్డాడు. సింహము, ఏనుగును వధించినట్లు వరాహస్వామి క్రోధంతో హిరణ్యాక్షుడిని సంహరించాడు. జలం నుండి బయటకు వస్తున్న వరాహస్వామిని బ్రహ్మాది దేవతలు చూసి చేతులు జోడించి స్తుతించసాగారు.

ప్రసన్నుడైన వరాహస్వామి తన గిట్టలతో జలాన్ని అడ్డగించి దానిపై పృథ్విని స్థాపించాడు. హిరణ్యాక్షుడిని సంహరించిన తరువాత వరాహస్వామి భూమిమీద తిరిగిన ప్రదేశమే నేటి తిరుమల కొండ. తిరుమల కొండ మొదట వరాహక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. తిరుమల కొండపై ఉండడానికి కొంత స్థలం ప్రసాదించమని వేంకటేశ్వరస్వామి వరాహస్వామిని అడగగా అప్పుడు వరాహస్వామి తనకు మూల్యం చెల్లిస్తే తప్పకుండా స్థలం ఇస్తానని అన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు 'నా దగ్గర ధనం లేదు అందుకు ప్రతిగా మీరు ఇచ్చే స్థలానికి నా దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా మీ దర్శనం చేసుకుని, ప్రథమ నైవేద్యం మీకు చెందేట్లుగా చూస్తాను' అని బదులిచ్చాడు.

దానికి అంగీకరించిన వరాహస్వామి వేంకటేశ్వరుడికి 100 అడుగుల స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలలో తెలుపబడింది. తిరుమల కొండపై వేంకటేశ్వరుడికి ఉండడానికి అనుమతి ఇచ్చిన వరాహస్వామిని మూడు రూపాలలో కొలుస్తారు. ఆదివరాహస్వామి, ప్రళయవరాహస్వామి, యజ్ఞవరాహస్వామి. తిరుమలలో ఆదివరాహస్వామిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు శ్రీమహావిష్ణువు. అందుకే తిరుమల క్షేత్రంలో రెండు అవతారాలతో, రెండు మూర్తులతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు, భక్తుల కోరికలు తీరుస్తున్నారు. శ్రీమహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ రెండు అవతారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

శ్రీమహావిష్ణువు మరొక సందర్భంలో కూడా వరాహరూపం దాల్చాడు. అది అవతారం కాదు రూపం. కల్పాంతం ముగిసిన తరువాత కొత్త జగతికి ప్రారంభ సమయంలో జలమయమై ఉన్న బ్రహ్మాండాన్ని ఏడు పూర్ధ్వ భాగాలుగా, ఏడు అధో భాగాలుగా విభజించి ఆయా లోకాలలో అవసరమైన వనరులను సమకూరుస్తున్నాడు శ్రీ మహావిష్ణువు.

అందులో భాగంగా భూమిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలనే తలంపుతో అనేక పర్వతాలు, సముద్రాలు, నదులు సమకూర్చిన తరువాత ఆ భారాన్ని తాళలేక భూమి కుంగిపోసాగింది. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు మరొకసారి వరాహరూపం ధరించి తన కోరల మీద భూమిని ఉంచుకున్నాడు. ఆ స్థితిలో భూమిని స్థిరంగా నిలపడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరచి, వాటి తొండాలమీద భూమిని ప్రతిష్టించాడు. అప్పటినుండి ఆ అష్టదిగ్గజాలే భూమిని కాపాడుతూ

ఉన్నాయని పురాణ కథనం. అలా అవతరించిన వరాహరూపాన్ని యజ్ఞ వరాహరూపం అని అంటారు. రెండుసార్లు వరాహరూపం దాల్చడం వల్లనే వరాహ జయంతిని ఎప్పుడు జరపాలనే సందిగ్ధం ఏర్పడింది. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్టం చేయడానికి ఎత్తిన యజ్ఞవరాహ జయంతి చైత్ర బహుళ త్రయోదశి రోజు, వరాహస్వామి హిరణ్యాక్షుడి బారినుండి భూమిని రక్షించడానికి ఏర్పడిన వరాహరూప జయంతి బాద్రపద శుక్ల తృతీయ అని గ్రంథాల ఆధారంగా వెల్లడవుతుంది.

తిరుమలలో వారహ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

$7.00

Sruk Sruvalu

Sruk Sruvalu

Sruk Sruvalu ..

$8.46

0 Comments To "Varaha Jayanthi"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!