satyanarayana Swamy vrata 4th Story

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ

చతుర్థ అధ్యాయం

సూతమహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వైశ్యులు ఇద్దరూ బ్రాహ్మణులకు దానధర్మాలు ఇచ్చి తీర్థయాత్రలు చేస్తూ స్వంత నగరానికి బయలుదేరారు. సముద్రంలో వారు ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవుడికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపం ధరించి 'నాయనలారా! మీ పడవలో ఏముంది?' అని అడిగాడు. ధనవంతులైన ఆ వైశ్యులు, సన్యాసిని చూసి పరిహసిస్తూ మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు, అలములు తప్ప మరింక ఏమీ లేవు. వెళ్ళమని బదులు చెప్పారు. అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి 'అలాగే జరుగుగాక' అని అన్నాడు. అలా పలికిన ఆ సన్యాసి నదీతీరంలో కొంతదూరంలో నిలబడి చోద్యం చూడసాగాడు. సన్యాసి అటు వెళ్ళగానే సాధన వైశ్యుడు కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి, పడవలోకి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్ట్రుడయ్యాడు. దుఃఖంతో మూర్చపోయాడు. తెలివివచ్చిన తరువాత తమ ధనధాన్య రాశులు అన్నీ ఏమైపోయాయో అని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు వైశ్యుడి అల్లుడు మామను చూసి 'మామయ్యా! ఏడవడం వలన లాభం కానీ ప్రయోజనం కానీ లేదు. సాధుగునాత్ముడు అయిన సన్యాసిని పరిహసించినందువల్లనే మనకి ఈ దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాము. కాబట్టి ఆయననే వేడుకుందాం. ఆయననే శరణు కోరుకుందాం  ఆయన తప్పకుండా కరుణించి మన కోరికలు నెరవేరుస్తాడు' అన్నాడు. అల్లుడి మాటలు విన్న సాధువు పరుగుపరుగున ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి మనసారా నమస్కరించి 'స్వామీ! అజ్ఞానుడనై మిమ్మల్ని పరిహసించాను. నా తప్పను క్షమించి మన్నించి నాపై దయచూపండి' అని పరిపరివిధాలుగా ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి 'ఓయీ! నా వ్రతం చేస్తానని చెప్పి మరచిపోవడం భావ్యమా! దుర్భుద్ధితో, దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపం ఇచ్చాను. నా శాపం వల్లనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకున్నావా?' అని అన్నాడు. అప్పుడు వైశ్యుడు 'స్వామీ! లోకమంతా నీ మాయామోహంలో పడి కొట్టుమిట్టాడుతూ వుంది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కనుక్కోలేకపోయారు. నిన్ను తెలుసుకోలేకపోయారు. మానవమాత్రుడనైన నేను ఎంతటి వాడిని తండ్రీ! నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ ప్రాణిని  నీ అనుగ్రహానికి దూరమై తపిస్తున్న అభాగ్యుడిని నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామీ! నా అపరాధాన్ని మన్నించు. ఇక మీదట నిన్ను ఎప్పుడూ మరిచిపోకుండా పూజిస్తాను. శరణు అన్నవారిని రక్షించే కరుణా సముద్రుడివి, నన్ను అనుగ్రహించు నా ధనాన్ని నాకు ఇప్పించు' అని పరిపరివిధాలుగా ప్రార్థించాడు. సాధువు ప్రార్థన మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్థానమయ్యాడు.

తరువాత సాధువు తన పడవ దగ్గరికి వచ్చి చూడగా అది అంతా ధనరాశులతో నిండి ఉండటం గమనించి సంతోషపడి ఆ సత్యదేవుడి దయవల్లనే తన కోరిక తీరింది అనుకుని తన పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహాలకు ప్రయాణం సాగించారు. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లుడితో 'అల్లుడా! మనం మన రత్నపురానికి చేరుకున్నాము' అంటూ తమ రాకను తెలపడాని ఒక దూతను ఇంటికి పంపించాడు. ఆ దూత నగరానికి వెళ్ళి లీలావతితో 'అమ్మా! నమస్కారం, మన అయ్యగారు, అల్లుడుగారు వచ్చారు. బంధుమిత్రులతో కలిసి వస్తున్నారు. ఇప్పుడే పడవ వచ్చింద'నే వార్తను చెప్పాడు. అప్పుడు లీలావతి దూతమాటలు విని, సంబరపడి 'అమ్మాయి కళావతీ! సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రా అమ్మా నేను నావ దగ్గరికి వెళ్తున్నాను. నీ తండ్రి, భర్తను చూడటానికి త్వరగా రా' అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావుడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని తినడం మరచిపోయి పరుగుపరుగున తన పతిని చూడటానికి వెళ్ళింది. ప్రసాదాన్ని తిననందుకు సత్యదేవుడికి  కోపం  వచ్చి ధనాన్ని సంరక్షిస్తున్న అల్లుడితో సహా పడవ మునిగిపోయేలా చేశాడు. అది చూసి ఒడ్డున నిలబడి ఉన్న వారు హాహాకారాలు చేయడం ప్రారంభించారు. లీలావతి, కళావతి అమితంగా దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవటం చూసిన తల్లి నెత్తీనోరూ బాదుకుంటూ భర్తతో ఇలా అంది 'ఏమండీ! అల్లుడు అంత హఠాత్తుగా పడవతోసహా ఎలా మునిగిపోయాడు? ఇదంతా దేవుడి మాయ కాక మరేమిటి?' అంటూ రోధించసాగింది. కళావతి తన ఎదురుగానే తన భర్త మునిగిపోవడం చూసి పడిపడి ఏడవడం మొదలుపెట్టింది. తన భర్త పాదుకలను తీసుకుని, వాటితో సహా సహగమనం చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి దుఃఖిస్తూ ఆలోచించి, 'ఇదంతా ఆ స్వామి మహిమే అయి వుంటుంది అని' గ్రహించి తన శక్తికొలది స్వామిని పూజిస్తాను అని తలంచి అందరితో పాటు స్వామిని వేడుకోసాగాడు. అప్పుడు స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి ఇలా అన్నాడు ' ఓయీ! నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదాన్ని తినడం మరచిపోయింది. ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాదాని తిన్నట్లయితే అంతా శుభమే జరుగుతంది' అని చెప్పాడు ఆకాశవాణి పలుకులు విన్న కళావతి, వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించి తన తప్పును మన్నించమని వేడుకుని తిరిగి సముద్ర తీరానికి వచ్చింది. ఆశ్చర్యంగా తన భర్త నావతో సహా నీటిపై తేలడం చూసి సంతోషపడింది. అందరూ ఆనందించారు. అప్పుడు కళావతి తండ్రితో 'తండ్రీ! ఇక ఆలస్యం ఎందుకు? ఇంటికి వెళ్దాము రండి' అని పలికింది. అప్పుడు సాధువు అక్కడే అందరితో కలిసి శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తరువాత ఆ వైశ్యుడు తన జీవితకాలం అంతా ప్రతి పౌర్ణమి తిథిలో, రవిసంక్రమణ సమయంలో  శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ సర్వసుఖాలను పొంది అంత్యంలో అమరలోకం చేరుకున్నాడు.

 

సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి :

శ్రీసత్యనారాయణస్వామి అష్టోత్తర శతనామపూజ

సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి :

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ  చతుర్థ అధ్యాయం

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం 

 

0 Comments To "satyanarayana Swamy vrata 4th Story "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!