satyanarayana Swamy vrata 5th Story

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ

పంచమ అధ్యాయం

సూతమహర్షి ఇంకా ఇలా చెబుతున్నాడు, 'ఓ మునిశ్రేష్టులారా! మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం తుంగధ్వజుడు అనే రాజు అత్యంత ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తుండేవాడు. ఆ మహారాజు ఒకరోజు వేటకు అడవికి వెళ్ళి తిరిగి వచ్చే మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా  ఒక మారేడు చెట్టు క్రింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతో కలిసి వ్రతం చేసుకుంటూ ఉండగా చూసి స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తరువాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారిని స్వీకరించమని అన్నారు. గోపాలురు అందరూ ప్రసాదాన్నితిన్నారు కానీ రాజుకి అహంకారం అడ్డువచ్చి ఎవరు ఏది పెడితే అది తింటానా ఏమిటి అనుకుని ప్రసాదాన్ని అక్కడే వదిలిపెట్టి రాజ్యానికి వెళ్ళిపోయాడు. అప్పుడు స్వామివారికి రాజుపై కోపం వచ్చి ఆగ్రహించాడు. దాని ఫలితంగా రాజుగారి వందమంది కుమారులు చనిపోయారు, సర్వసంపదలు సర్వనాశనం అయిపోయి క్రమంగా దారిద్ర్యం సంభవించి అష్టకష్టాలపాలయ్యాడు. ఇదంతా చూసిన రాజు ఆలోచించి ఇలా అనుకున్నాడు 'ఆహా! ఆరోజు గొల్లలు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినటమేమిటి అని తిరస్కరించినందుకే స్వామి నాపై ఆగ్రహం చెంది నాకు ఇటువంటి శాస్తి చేశాడు' అనుకుని వెంటనే గొల్లలు ఉన్న చోటుకి వెళ్ళి నియమనిష్టలతో, భక్తిశ్రద్ధలతో సత్యదేవుడి వ్రతం ఆచరించాడు. అప్పుడు స్వామి దయతలచి మళ్ళీ ధనధాన్యాలు మొదలైన సంపదలను, 100 మంది పుత్రులను, రాజ్య సుఖాలను ఇచ్చి అనుగ్రహించాడు. రాజు సర్వసుఖాలను అనుభవిస్తూ క్రమం తప్పకుండా స్వామివారి వ్రతం చేస్తూ అంత్యకాలంలో సత్యలోకానికి చేరుకున్నాడు.

ఎంతో మహోన్నతమైన ఈ వ్రతరాజ్యాన్ని భక్తిశ్రద్ధలతో చేసినవారు, వ్రతం చూసినవారు, కథలను విన్నవారు శ్రీసత్యనారాయణస్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఆయన కృపతో ధనధాన్య సంపదలను, పుత్రపౌత్రాది సంతానం పొందుతారు. ఇహపరలోకాలలో సర్వసౌఖ్యాలను అనుభవిస్తూ మోక్షం పొందుతారు. ఈ వ్రతాన్ని భక్తితో చేసినట్లయితే దరిద్రులు ధనవంతులు అవుతారు. బంధవిముక్తి పొందుతారు, భయాలు తొలగిపోతాయి. అలాంటి భక్తులు నిశ్చయంగా సకలాభీష్టసిద్ధిని పొంది అంత్యంలో సర్వలోకానికి చేరుకుంటారు. కాబట్టి ఓ మునులారా! మానవులను సర్వదుఃఖాల నుండి విముక్తి చేసే మహిమగల శ్రీసత్యనారాయణస్వామి వ్రత విధానము, దాని ఫలితాలను ఆచరించి ముక్తిని పొందినవారి కథలను తెలిపాను. విశేషించి కలియుగంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాన్ని మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఈ కలియుగంలో సత్యనారాయణస్వామిని కొందరు సత్యదేవుడు అని, సత్యనారాయణ అని, సర్వేశ్వరుడు అని పిలుచుకుంటారు.

సత్యనారాయణస్వామి వ్రత విధానం

సత్యనారాయణస్వామి వ్రతానికి కావలసిన సామాగ్రి :

శ్రీసత్యనారాయణస్వామి అష్టోత్తర శతనామపూజ

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ  చతుర్థ అధ్యాయం