Importance of Ugadi

ఉగాది

సంస్కృత పదం నుండి వచ్చినదే ఉగాది అన్న తెలుగు మాట. బ్రహ్మదేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. దీనికి ఆధారం 'సూర్య సిద్ధాంతం' అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని ఈ శ్లోకం ద్వారా తేటతెల్లం అవుతుంది.

శ్లో         చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని !

            వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తదై  వచ !!

అంటే బ్రహ్మ కల్పం ఆరంభమయ్యే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ)లో మొదటి ఋతువులో మొదటి మాసం (చైత్రమాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభావింప చేశాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి 'ప్రభవ' అని పేరు, ఆఖరి అరవైయవ సంవత్సరం పేరు 'క్షయ' అంటే నాశనం అని అర్థం.

కల్పాంతంలో సృష్టి నాశనం అయ్యేది 'క్షయ' సంవత్సరంలోనే. అందుకే చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయించబడింది. 'మాసానాం మార్గశీర్షోహం, ఋతూనాం కుసుమాకరః' అని భగవద్గీతలో విభూతి యోగంలో శ్రీకృష్ణుడు తెలిపాడు. మాసాలలో ఉత్తమమైన మాసం మార్గశిర మాసం.

ఋతువులలో ఉత్తమమైనది వసంతఋతువు అని తెలిపాడు. మన పండుగలన్నీ ఋతువులపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే సృష్టి ఆరంభమైన రోజు 'ఉగాది' చైత్ర శుద్ధ పాడ్యమి వసంతకాలంలో వస్తుంది, తెలుగువారి మొదటి పండుగ ఉగాది.

ఉగాది పండుగ చైత్రమాసంలో మొదలవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం మొదటి రోజుగా పరిగణిస్తారు. మత్స్య అవతారం ధరించిన శ్రీమహావిష్ణువు సోమకుడిని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అప్పగించాడని పురాణాలలో తెలుపబడింది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం చైత్రమాస శుక్లపక్ష ప్రథమ రోజున సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించడం ప్రారంభించాడని ప్రగాఢ విశ్వాసం.

అంటే కాలగమనాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను ఈ రోజున బ్రహ్మ ప్రవర్తింప చేశాడు.  ఉగ అంటే నక్షత్ర గమనం, నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది' అంటే రెండు లేదా జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాలు ద్వయ సంయుతం (సంవత్సరం) కాగా ఆ యుగానికి ఆది (సంవత్సరాది) ఉగాది అయింది. కాలమానంలోని అంశాలు అన్నింటినీ పూర్తిగా ఖగోళ శాస్త్రరీత్యా ఏర్పాటు  చేసుకున్న ప్రపంచంలోనే ఏకైక జాతి 'హిందూ జాతి'  కాలమాన అంశాలు అయిన రోజు, వారం, పక్షం, కార్తె మాసం, ఋతువు, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ హిందువులు ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఏర్పాటు చేశారు.

ఖగోళ శాస్త్ర బద్ధమైన కాలమానాన్ని పురాణకాలంనుండీ కలిగివున్న ఘనత హిందువులది! మరి నేడు ఎంతమందికి ఈ విషయాలు తెలుసు? నేటి యువతరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఒకటవ రోజున 'హ్యాపీ న్యూ ఇయర్' అని శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకుంటున్నారు. ఉగాది అంటే వేపపువ్వుతో చేసిన పచ్చడి తినే పండగ అనే వ్యవహరించ బడుతుంది తప్ప వీటి ప్రాశస్త్యం గురించి ఎంతమందికి తెలుసు?

ఉగాది రోజున సూర్యోదయానికి స్త్రీలు నిద్రలేచి ఇళ్ళు తుడిచి, శుభ్రంగా కడిగి, వాటిట్లో కల్లాపు జల్లి రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతారు. పురుషులు గుమ్మాలకు మామిడాకులతో అలంకరిస్తారు. తలారా స్నానం చేసుకునే సమయంలో నువ్వులనూనెతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని స్నానం చేయాలి. ఈ పండుగ ఏ ఒక్క దేవతలకో చెందినది కాదు. కాబట్టి తమ ఇష్టదైవానికి ఆడవారు వేపపువ్వుతో పచ్చడి చేసి పంచాంగానికి, దేవతలకు నైవేద్యం నివేదించిన తరువాత షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవిస్తారు. ఉగాది పచ్చడి తీసుకునే ముందు ఎటువంటి ఆహారపదార్థాలను తినకూడదు.

ఉగాది రోజున పండితులను ఆహ్వానించి వారిని సన్మానించి ఉదయం లేదా సాయంత్ర సమయాలలో పంచాంగ శ్రవణం చెప్పిస్తారు. పంచాంగ శ్రవణం అంటే అయిదు అంగాలు అని అర్థం. ఈ ఐదులో తిథి, వార, నక్షత్ర, యోగం, కరణం అనేవి అయిదు అంగాలు. ఈ అయిదు అంగాలు సంపద, ఆయుష్షు, పాప ప్రక్షాళన, వ్యాధినివారణ, గంగాస్నాన పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం.15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు, 11 కరణాలు వీటన్నిటినీ తెలిపేదే 'పంచాంగం'. పండితులు సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు, వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభ రోజు వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.

మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభ రోజు వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.

సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి

సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించేనాటి వారానికి అధిపతి. 

పండితులు పంచాంగం వినిపిస్తున్నప్పుడు ఉత్తరాభిముఖంగా కూర్చుని వింటె మంచిది. ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా, అష్టైశ్వర్యాలు ప్రసాదించమని భక్తులు కోరుకుంటారు. అలాగే ఈ రోజున రకరకాల పిండివంటలు కూడా చేస్తారు. ఉగాది పచ్చడిని కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపుపువ్వు, మామిడిముక్కలు, చెరుకు ముక్కలు కలిపి చేస్తారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో 'నింబకుసుమ భక్షణం' అని పేరు వుంది. ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమైనది అని ఆయుర్వేదశాస్త్రంలో పేర్కొనబడింది. ఉగాది పచ్చడి తీసుకునే ముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.

శ్లో         త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ !

            నిబామి శోక సంతస్తాం మమ శోకం సదా కురు !!

ఉగాది పచ్చడి ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన తినే పదార్ధం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన పచ్చడి. సంవత్సరం పొడువునా ఎదురయ్యే మంచి చెడులు, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది రోజున ఇష్టదైవాలకు పానకం, వడపప్పు కూడా నివేదిస్తారు. ఉగాదితో వేసవి ప్రారంభం అవుతుంది కాబట్టి వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నిరాహారం తినడం అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. అలాగే వడపప్పు కూడా ఎందుకంటే వడపప్పులో పెసరపప్పు చలవచేస్తుంది , వేసవిలో కలిగే అవస్థలను ఇది కొంత తగ్గిస్తుంది. 

ఉగాదిని తెలుగువారే కాకుండా దేశంలో కొన్ని ప్రాంతాలవారు వివిధ పేర్లతో జరుపుకుంటారు. తమిళులు  పుత్తాండు అని పిలుస్తారు, మరాఠీవారు గుడి పడ్వా అని పండగ చేసుకుంటారు. మలయాళీలు 'విషు' అని, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాళీలు 'పోయ్ లా బైశాఖ్' అని ప్రభాత భేరీ పేరుతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.  ఈ రోజున చేపట్టే కొత్త వ్యాపారాలు, కొత్త పనులు విజయవంతం అవుతాయని పండితులు తెలియజేస్తున్నారు.  

 

 

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

$7.00

Sruk Sruvalu

Sruk Sruvalu

Sruk Sruvalu ..

$8.46

0 Comments To "Importance of Ugadi "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!