Sankranthi Festival

భోగి

నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజున తెల్లవారు ఝామునే భోగిమంటలు వేయడం ఆచారం. నిన్నటిదాకా దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు నేడు ఉత్తరాయణానికి వస్తాడు. కొత్త సూర్యుడు అని లోకానికంతటికీ తెలియజెప్పేందుకు పెద్దమంటల (భోగిమంటలు)ను ఈ రోజు వేస్తారు. అంటే వేడి ముద్దని తన గర్భంలో ఉంచుకున్నవాడు అని అర్థం. అటువంటి ఆ స్వామికి ఆ వేడిముద్దతో స్వాగతం పలకటం ఈ భోగిమంటల నిగూఢమైన అర్థం. ఇందులో ఇంట్లోని పాతవస్తువులను, పనికిరానివి వేస్తారు. కొన్ని ప్రాంతాలలో భోగిమంటలపై బిందె, కుండలతో నీళ్ళు కాచుకుని స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల శని దూరం అవుతుందని ప్రగాఢ విశ్వాసం. తరువాత తలారా స్నానం చేసి ఇంద్రుడిని, ఇష్టదైవాలను పూజించాలి. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవికి, శ్రీరంగనాథుడికి వివాహం జరిగిన రోజు కాబట్టి శ్రీమహావిష్ణువును, ఆండాళ్ అమ్మవారిని పూజించడం శ్రేష్ఠం. ఈ రోజు సాయంత్రం పెరంటాళ్ళను పిలుచుకుని ఇంట్లోని పిల్లలను 'భోగిపళ్ళు' పోస్తారు. చిన్నపిల్లలను పీటపై కూర్చోబెట్టి రేగుపళ్ళు, చెరుకుముక్కలు, పూలరేకులు, చిల్లరనాణేలు కలిపి తలపై పోసేముందు తల చుట్టూ మూడుసార్లు త్రిప్పి పోయాలి. పండ్లు బోసెను యశోద కృష్ణునకుపుదు శశిముఖులార రారె! మా పసిబాలులకు భోగిపండ్లు పోయుదామా ! అద్దంపు చెక్కిళ్ళూ ముద్దూ లోలుకూ చుండె మూడేసి దోసిళ్ళు మరియుచూ శిరముపై వేడుకతో పోయుదము … రేగిని సంస్కృతంలో బదరి అని అంటారు. శ్రీమన్నారాయణుడి మరోపేరు కూడా బదరీనారాయణుడు. బదరికా ఆశ్రమంలో నరనారాయణులు తపస్సు చేసే సందర్భంలో ఆ స్వామి కేవలం రేగిపళ్ళను మాత్రమే తిన్నాడట. రేగిపళ్ళు పోయడం వలన ఆ శ్రీమన్నారాయణుడి శుభదృష్టి ప్రసరించడంతోపాటు పిల్లల భవిష్యత్తు భోగభాగ్యాలతో నిండి సుఖంగా ఉంటుందని శాస్త్రవచనం. భోగిపండుగ రోజున పశువులను అలంకరించి, పొంగళ్ళను పెట్టి పశుపూజ చేస్తారు. ఈ రోజున కొత్తగా పండిన వరికంకుల నుండి ధాన్యం సేకరించి దానితో పొంగలి తయారుచేస్తారు. ఇది మంచి పౌష్టిక ఆహారం కూడా. భోగి రోజున కొన్ని ప్రాంతాలలో గొచ్చి గౌరీవ్రతం ప్రారంభిస్తారు. భోగిరోజు సాయంకాలం ఇంట్లో ఒక మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరుకు గెడలు ఉపయోగిస్తారు. అలా నిర్మించిన మంటపం మధ్యలో బియ్యం పోసి దానిమీద బంకమట్టితో చేసిన గౌరీదేవి విగ్రహాన్ని ఉంచుతారు. పూజ పూర్తి అయిన తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి ఆరాత్రి శయనోత్సవాన్ని నిర్వహిస్తారు.. ఆ మరుసటి రోజైన మకర సంక్రాంతి రోజున ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొలుపుతారు. ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుచుకుంటారు. నాలుగవ రోజున గౌరీదేవికి పూజ చేసిన తరువాత ఉద్వాసన చెబుతారు. మంటపానికి అలంకరించిన కూరగాయలను నాలుగవ రోజున కూర వండుకుంటారు. ఇలా తయారుచేసిన కూరనే గొచ్చికూర అని అంటారు. పిమ్మట గౌరీదేవి విగ్రహాన్ని బావిలోకానీ, చెరువులోకానీ, కాలువలలో కానీ, నదిలోకానీ, నిమజ్జనం చేస్తారు. భోగి రోజునే బొమ్మల కొలువు పెట్టడం కూడా చేస్తుంటారు.

సంక్రాంతి

'సంక్రాంతి' లేదా 'సంక్రమణం' అంటే చేరుట అని అర్థం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో 'సంక్రాంతి'ని ఇలా నిర్వచించారు … తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి. భారతీయ పండుగులు అన్నీ కూడా చాంద్రమానం అనుసరించి తిథుల ప్రకారం జరుపుకుంటాము కానీ, సంక్రాంతి పండుగ ఒక్కటే తిథుల ప్రకారం కాకుండా సూర్యమానం ప్రకారం జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన జరుపుకుంటాము. ఎప్పుడైతే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజున మనం మకర సంక్రాంతి జరుపుకుంటాము. దాదాపు పదిహేను పద్దెనిమిది శతాబ్దాలలో డిసెంబరు 22వ తేదీన సంక్రాంతి పండుగ జరుపుకునేవారు కానీ కాలానుగుణంగా ప్రతి డెబ్బై నుండి ఎనబై ఏళ్ళకి ఒకసారి ఒకోక్కరోజు మకరసంక్రాంతి ముందుకు జరుగుతూ వస్తుంది. 1883 జనవరి 12వ తేదీన మకర సంక్రాంతి వచ్చింది. ప్రస్తుతం సంక్రాంతి జనవరి 14, 15వ తేదీలలో జరుపుకుంటున్నాం రాబోయే సంవత్సరాలలో జనవరి 16వ తేదీలలో జరుపుకుంటాము. ఉత్తరాయణం అంటే సూర్యుడు మకరరాశి నుండి మిథునరాశి వరకు ఉత్తర దిశగా పయనిస్తాడు అందుకే ఈ ఆరు మాసాల సమయంలో వెలుగు ఎక్కువగా, చీకటి తక్కువగా ఉంటుంది. ఉత్తరాయణ సమయంలో దేవతలు మెలుకువగా ఉంటారు ఈ సమయంలోనే శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారాలు తెరచుకుని ఉంటాయి. అదే విధంగా సూర్యుడు కర్కాటక రాశి నుండి ధనురాశి వరకు దక్షిణ దిశగా పయనిస్తాడు. కాబట్టి ఆ ఆరు మాసాలు దక్షిణాయనం అని అంటారు. ఈ ఆరు నెలల కాలంలో దేవతలు నిద్రించే సమయం అని అంటారు. ఉత్తరాయణంలో దేవతలు మెలకువగా ఉండే ఆరు మాసాలు అత్యంత శుభప్రదమైనవని, కోరికలు తీరే కాలం కూడా ఇదే అని, ఈ కాలంలో చనిపోయినవారికి మరుజన్మ ఉండదని కూడా శాస్త్రాలలో వివరించబడింది. ఈ మాసాలలో శ్రీమహావిష్ణువు అవతారం అయిన సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. మకర రాశికి అధిపడి అయిన సూర్యపుత్రుడు శని కానీ సూర్యుడికి శనికి అసలు పడదు. కాని మకర సంక్రమణం సమయానికి సూర్యుడు తన క్రోధాన్ని వదిలి శనికి ప్రేమతో వచ్చే సమయం కూడా ఇదే అని అంటారు. శనికి ప్రీతికేరమైన ఈ సమయంలో నువ్వులు, బెల్లంతో తయారుచేసిన వంటకాలు, పిండివంటలు నలుగురికి పంచుకోవాలి. ఈ కాలంలో విష్ణు సహస్రనామాలు వల్లించడం శ్రేష్ఠం. దేవ, పితృ దేవతలను ఉద్దేశించి చేసే తర్పణాలు, దానాలు పుణ్యప్రదం. సంక్రాంతి రోజు దేవతలకు, పితృదేవతలకు ఎటువంటి దానాలు చేస్తామో అవి జన్మజన్మలకు అత్యధికంగా పుణ్యఫలాలు లభిస్తాయని ప్రతీతి. ఈ పుణు కాలంలో నువ్వులు, బియ్యం కలిపి శివారాధన చేయడం, ఆవునేతితో అభిషేకం చేయడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేష్టమైనది. నల్ల నువ్వులతో పితృతర్పణాలు ముఖ్యంగా ఆచరించవలసిన విధి. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండ పితృ తర్పణాలు ఇస్తారు. దక్షిణ భారతదేశంలో మకర సంక్రాంతిని పొంగల్ అని జరుపుకుంటారు. ఈ రోజు కొత్త మట్టితో కుండ, ఇంటిముందు పొయ్యి తయారుచేసుకుని రంగురంగుల ముగ్గులు వేసి దానిపై కొత్తపొయ్యి పెట్టి బియ్యం, పెసరపప్పు, చెరుకురసంతో పొంగల్ చసి, పసుపువెళ్ళు, చెరకుతో శ్రీ సూర్యనారాయణస్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఇంట్లో పెద్దలకు కొత్త పంచె, చీర సమర్పిస్తారు. మకరసంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే నువుల పిండితో శరీరానికి నలుగుపెట్టి తలంటు పోసుకోవాలి. నువ్వులు దానం ఇవ్వాలి. శీతాకాలం బాధలు తగ్గడానికి స్నానం చేసే నీళ్ళలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, నుట్టులతో దైవపూజ చేయాలి. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం కాబట్టి ఈ సమయంలో పూజలు, యజ్ఞాలు చేసి దేవతలను తృప్తి పరచాలి. అలాగే బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి నువ్వులు, బెల్లం, దక్షిణ ఇవ్వాలి. స్త్రీలు మాంగళ్య వృద్ధి కోసం పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, వస్త్రాలు మొదలైనవి దానం ఇవ్వాలని పురాణాలు చెబుతున్నారు. సంక్రాంతి రోజున చేసిన దానాలు అన్ని పీడలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సంవత్సరంలో మిగిలిన రోజులలో సాధారణంగా నల్లనువ్వులు వాడరు కానీ సంక్రాంతి రోజున నల్లనువ్వులతో మరణించిన పితృదేవతలు అందరికీ తర్పణాలు వదలడం చేస్తారు. సంక్రాంతి రోజున దేవ, పితృపూజలకు మంచిరోజు, ఈ రోజున చేసే దానానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. దీనికి మహాభారతంలో కథనే ఉదాహరణగా చెబుతూ ఉంటారు. పూర్వం ద్రోణుడు, ఆయన భార్య కృపి ఆశ్రమంలో ఉంటూ దైవచింతనలో గడుపుతూ వుండేవారు. ఒకరోజు ద్రోణాచార్యుడు బయటకి వెళ్ళగా, ఆశ్రమంలో కృపి మాత్రమే వుంది. ఆ సమయంలో సమిథుల కోసం వెదుక్కుంటూ దూర్వాసమహాముని అక్కడికి వచ్చాడు. తమ ఆశ్రమానికి విచ్చేసిన దూర్వాసుడిని సాదరంగా ఆహ్వానించిన కృపి, ఆయనకు సేవలు చేసి, తమ పేదరికాన్ని గురించి చెబుతూ, ఒక ముసలి ఆవు తప్ప ఇక ఎటువంటి ఆస్తీ లేదని, చివరకు పిల్లలు కూడా లేరని ఇందుకు ఏదైనా మార్గం సూచించమని వేడుకుంది. ఆమె కష్టాలను విన్న దూర్వాసుడు సమాధానం చెబుతూ పూర్వం యశోదాదేవి సంక్రాంతి పండుగ రోజున స్నానం చేసి బ్రాహ్మణుడికి పెరుగు దానం చేసి శ్రీకృష్ణుని కొడుకుగా పొందింది అని కాబట్టి నీవు కూడా అలాగే చేయమని తెలిపాడు. ఈ రోజు సంక్రాంతి కాబట్టి కృపిని వెంటనే దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి నువ్వులపిండి రాసుకుని స్నానం చేసి రమ్మని, వచ్చిన తరువాత తనకు పెరుగు దానం చేయమని అలా చేస్తే ఫలితం ఉంటుందని తెలిపాడు. కృపి దూర్వాసుడు చెప్పినట్లే చేసింది. కొంతకాలానికి కృపికి అశ్వత్థామ పుట్టాడు. అందుకే ఈ రోజున ధాన్యం, పళ్ళు, విసనకర్ర, వస్త్రాలు, బంగారం, కాయగూరలు, దుంపలు, చెరుకు, నువ్వులు, గోవు మొదలైన వాటిని దానం చేయాలని అంటారు. ఈ రోజున పరమశివుడి ముందు నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం, నువ్వులూ, బియ్యం కలిపి శివుడిని పూజించడం చేయాలి. ఈ రోజున శివుడికి ఆవునేతితో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజుల కలగలుపు కూర వండడం శ్రేష్ఠం.

కనుమ

కనుమ రైతులకు ముఖ్యమైన పండుగ, ఈ రోజును పశువుల పండుగగా వ్యవహరిస్తారు. సంవత్సరం అంతా పడిన శ్రమకు ఫలితంగా ఇంట్లో ధాన్యరాశులు చేరుతాయి. పంటలు తమ చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. పక్షుల కోసం రైతులు తమ ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. మద్దిమాను, నేరెడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ … ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొని వచ్చి వాటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటికి ఎక్కువ మోతాదులో ఉప్పుచేర్చి రోట్లో వేసి మొత్తగా పొడిగా దంచుతారు. ఆ పొడిని ఉప్పుచెక్క అని అంటారు. ఉప్పు చెక్కను పశువులకు తినిపించాలి. పశువులు వీటిని తినవు కానీ వాటి నోరు తెరచి అందులో ఈ ఉప్పు చెక్కను పోసి దాని నోరు మూసేస్తారు. ఇలా రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు. ఇది పశువులకు సర్వరోగ నివారిణి అని రైతుల నమ్మకం. పశువులను బావి వద్దకు తీసుకువెళ్ళి స్నానం చేయించి వాటి కొమ్ములను, పడునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూసి, వాటి కొమ్ములకు ఇత్తడి కొప్పులు తొడిగి మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. సాయంకాలం ఊరు ముందున్న నుకాతమరాజు ప్రతిష్టించి ఊరిలోని ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడతారు. పొంగలిని కొత్త కుండలో, కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండుతారు. కాటమరాజు ముందు 'చిట్టా కుప్ప' అంటే నెలరోజుల ముందు నుండే ఆ దారిలో వెళ్ళే వాళ్ళు ఏదో ఒక కర్ర్ర, కంప అక్కడ వేస్తారు. చీకటి పడే సమయానికి ఊరి చాకలి కాటమరాజు పూజా కార్యక్రమం ప్రారంభించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. పూజ పూర్తయిన తరువాత మొక్కుబడులు ఉన్న వారు చాకలి చేత కోళ్ళను బలి ఇస్తారు. పూజారి తరువాత తళిగ కుప్పను పెద్ద ముద్దగా చేసి అందులో సగం పశువుల కాపరులకు తినమని చెప్పి, తరువాత అక్కడ ఉన్న చిట్టాకుప్పకు నిప్పు పెడతారు. మంటలు ఆకాశానికి మిన్నుముట్టిన తరువాత పశువుల కాపరులు పశువులను బెదర కొడతారు. పశువులు బెదిరి చేల వంట పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదర కొడుతున్న పశువుల కాపరి వీపుపై మిగిలిన సగం పొంగలి ముద్దను కొడతారు. దాన్ని పిడుగు ముద్దా అంటారు. ఈ రోజున పద్మం ముగ్గులు వేయడం సాంప్రదాయంగా వస్తోంది. సిరిసంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని ఆహ్వానించడమే ఈ ముగ్గుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. భోగి రోజున చంద్రహారం ముగ్గు, సంక్రాంతి రోజున అష్టదళ పద్మం ముగ్గు, కనుమ రోజున రథం ముగ్గు వెయ్యాలి. ముగ్గు వేసిన వాళ్ళకే కాదు, వాళ్ళ ఇంటికి ఎవరు వెళతారో వాళ్ళకూ లక్ష్మీకటాక్షం లభిస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. రథం ముగ్గు విశిష్టత ఏమిటంటే … ప్రతి మనిషి శరీరం ఒక రథం అని, ఆ రథం నడిపేవాడు పరమాత్మ అని భావిస్తూ, ఈ నా శరీరమనే రథాన్ని సరైన దారిలో నడిపించవలసిందిగా ఆ పరమాత్ముడిని వేడుకోవడమే ముగ్గులోని అసలు రహస్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు తమకి అన్నీ శుభాలని కలిగించాలని కోరుకుంటూ ఇంటిముందు రథం ముగ్గు వేసి, పళ్ళు, పువ్వులు, పసుపు కుంకుమ అన్నీ ముగ్గు మధ్యలో వేసి గౌరవంగా సాగనంపుతారు. ఒక ఇంటి ముందర రథం ముగ్గు తాడు (గీత)ను పక్కింటి రథం ముగ్గు గీతతో కలిపి, ఆ విధంగా ప్రతి ఇంటిముందు గీసిన గీతాలు అన్నీ ఊరి పొలిమేరవరకు సాగుతాయి. రథం ముగ్గు వేయడంలో మరొక ఆధ్యాత్మిక కథనం ప్రకారం బలిచక్రవర్తి పాతాళం నుండి ఈ మూడు రోజులూ భూలోకానికి వస్తాడని, పండుగ పూర్తయిన తరువాత అతనిని సాగనంపడానికి ఇలా రథం ముగ్గు వేస్తారని అంటారు.

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

$7.00

Job Joining Muhurtham

Job Joining Muhurtham

Job Joining Muhurtham ..

$45.00

0 Comments To "Sankranthi Festival"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!